డా.నాగులపల్లి భాస్కరరావు గారి ‘’లిటిల్ రిపబ్లిక్కులుగా గ్రామాలు ‘’
దేశ సౌభాగ్యం గ్రామ సీమలలో ప్రతిఫలిస్తుంది అన్నాడు మహాత్మా గాంధి .అలాంటి గ్రామీణ వ్యవస్థ ఎంత పకడ్బందీగా ఉండాలో తెలియ జేసే రచన ఇది .అహరహం అనుక్షణం ముందు చూపుతో నడుస్తూ ఎందరికో ఆదర్శ ప్రాయులై మార్గదర్శి యైన భాస్కరరావు గారి అమూల్య రచన .ప్రతి అక్షరం లో ఆయన ఆదర్శం ప్రతిఫలిస్తుంది .ఆశయం రూపు దాలుస్తుంది .ఈ పుస్తకం దేశ సుస్థిర భవితవ్యం కోసం రాశానని చెప్పారు. అదంతా ఈ అక్షర శ్రమలో కనిపిస్తుంది .గ్రామాలలో అభివృద్ధి వేగం మందగించిందని ఆవేదన చెందారు ,దాని ఉజ్వలభవిష్యత్తు కు ఇందులో మార్గదర్శకాలు చూపారు తమకున్న విస్తృత పరిజ్ఞానంతో అనుభవంతో .
ఇందులో 12అధ్యాయాలున్నాయి .గ్రామాలపునరుద్ధరణ జరిగితేనే భారత గణతంత్ర పునరుద్ధరణ జరుగుతుంది అనేది మొదటి అధ్యాయం .ప్రగతి దృష్టిలేనిదే యేదీసాధ్యం కాదన్నారు రెండవ అధ్యాయం లో .గ్రామాలు వికసిస్తేనే వికసిత భారత రిపబ్లిక్ సాధ్యమన్నారు. మూడు లో.గ్రామాల చైతన్యం ఇప్పుడు ఏమైపోయింది ఆని ప్రశ్నించారు. నాలుగులో .గామాలలో వ్యూహాత్మక పునరుజ్జీవనం మీద నే అభివృద్ధి సాధ్యమన్నారు .అయిదులో .దిశా నిర్దేశం చేసే ఎన్నికలు కక్షలకు కార్పణ్యాలకు నిలయమై పురోభి వృద్ధికి చేటు కలుగుతోందని ,గ్రామ భవిష్యత్తు ముఖ్యమని అందరూ ఆలోచించాలని ఆరులో ఉఫ్ఘోషించారు .ఏడులో గ్రామాలను సుస్థిర పరచటం లో పరిశోధన పాత్ర చాలా ఉంటుందని దాన్ని పట్టించుకోక పోవటమే ఈ అనర్ధాలకు కారణం అన్నారు ఏడవ అధ్యాయంలో.
మాధ్యమాలు వ్యవస్థ ఏర్పాట్లు పై చర్చించారు అధ్యాయం ఎనిమిదిలో .ఖబర్ లహరియా అద్వితీయ బలమైన గ్రామీణ ప్రతీక అనీ ఇదీ యుపి బీహార్ లలో చక్కగా అమలౌతోందనీ ,నీలేష్ మిశ్రా స్థాపించిన ‘’గావో కనెక్షన్ ‘’విశిష్ట గ్రామీణ మాధ్యమిక వేదిక ,అచ్చు దృశ్య శ్రవణ మాధ్యమం విస్తృతంగా పని చేస్తోందని ,తెలుగులో ‘’అన్నదాత ‘’పత్రిక సేవలు విశిష్టమైనవనీ ,చెప్పారు తొమ్మిదిలో వ్యవసాయం గిట్టుబాటైతేనే గ్రామాలు బతికి బట్టకడతాయి ఆని కుండబద్దలు కొట్టారు .దీని సాధ్యాసాధ్యాలు వివరించారు .గ్రామీణ భారతానికి వ్యవసాయం తోబాటు అనుబంధ వృత్తులు కూడా ముఖ్య పాత్ర వహిస్తాయని పదవ అధ్యాయంలో వివరించారు .పదకొండులో ప్రజల జీవన శైలి సామరస్యంతో ఉండాలని నొక్కి చెప్పారు .చివరి 12వ అధ్యాయంలో గ్రామ పునరుద్ధరణకు మార్గాలు చర్చించారు .ఆర్దికసామాజిక అసమానతలకు గ్రామం వేదిక కారాదు. వీటికి అతీతంగా ప్రజలు ఉండాలి .ఆ విశాల దృక్పధం కల్పించాలి .చివరగా మోడల్ విలేజ్ ఎలా ఉండాలో వివరించారు .
ప్రతి అంశం లోనూ భాస్కరరావు గారి ముందు చూపు ,లోచూపు కనిపిస్తుంది .అందరిబాగు మనబాగు అనే గొప్ప ఆదర్శం ఆయన చేత ఈ పుస్తకం రాయించింది .ఆయన చెప్పిన ప్రతిమాటకు ఆధారం చూపించారు. గాలిలో మేడలు కట్టలేదు .ఇటు రాష్ట్రప్రభుత్వం అటు భారత ప్రభుత్వం డా భాస్కరరావు గారి అమూల్య విద్వత్తును అనుభవాన్ని ఉపయోగించుకొని గ్రామీణ భారతాన్ని ఉజ్వలంగా ప్రకాశి౦పజేస్తూ భారత రిపబ్లిక్ ను మహోజ్వలంగా ప్రగతి పదంలో ప్రకాశింప జేయాలని కోరుకొందాం .
మీ -గబ్బిట దుర్గా ప్రసాద్ -11-9-25-ఉయ్యూరు

