హరిశ్చంద్రుడు ఆడి తప్పాడా ?
అవును అంటోంది దేవీ భాగవతం .ఏమాకత తెలుసుకొందాం.
సూర్య వంశం లో శ్రీరాముడికి ముందు హరిశ్చంద్రుడు అనే మహారాజు ఉండేవాడు .ఇతడు త్రిశంకుడి కొడుకు .సంతానం లేకపోతె మగపిల్లాడికోసం వరుణ యాగం చేస్తానని మొక్కుకున్నాడు . .అది నరమేధ యాగం. సంతోషించి వరుణుడు కరుణి౦చగా హరిశ్చంద్రుని భార్య కొద్దికాలానికే గర్భవతి అయి పండంటి కొడుకును కన్నది .ఆనందానికి అవధాలులేని తండ్రి హరిశ్చంద్రుడు జాతకర్మాదులు బ్రహ్మాండంగా జరిపి భూరి సంభావనలిచ్చి అందరికి సంతోషం కలిగించాడు .వరుణుడు బ్రాహ్మణ రూపం లో రాగా అర్ఘ్యపాద్యాదులతోసత్కరించి .ఏం కావాలని కోరాడు .’’నేను వరుణుడిని.నీకొడుకును బలియిచ్చి వరుణ యాగం చేస్తానని మొక్కుకున్నావుకదా యాగం చేయి మాట నిలబెట్టుకో ‘’అన్నాడు .
హరిశ్చంద్రుడి నెత్తిన పిడుగు పడినట్లై ,తేరుకొని ‘’స్వామీ !మొక్కాను కనుక తప్పక చేస్తా .పురుడుగడవగానే శుద్ధి అయ్యాక చేస్తా .’’అన్నాడు .సరె అని వెళ్ళిపోయాడు వరుణ్ .పురిటి శుద్ధి అవగానే మళ్లీ వచ్చి ‘’ఎప్పుడు మొదలు పెడతావు యాగం ?ఆని అడగగా ,హరిశ్చంద్ర ‘’స్వామీ !ఉపనయన సంస్కారం లేకుండా నాకొడుకును ఎలా బలి ఇవ్వను ?.శాస్త్రాలు ఒప్పుకోవు తండ్రిగా నాకు అర్హతా లేదు’’ఆని మళ్లీ దాట వేశాడు .హరిశ్చంద్రుని పుత్ర ప్రేమ బలీయం ఆని గ్రహించి బలి ఇవ్వటానికి జంకుతూ దాటేస్తున్నాడని వరుణుడు గ్రహించి ‘’ఇంకొక్క అవకాశం ఇస్తా .మళ్లీ ఎప్పుడు రమ్మంటావో చెప్పు వస్తాను.ఈసారి వాయిదాలు కుదరవు .ఆడి తప్పకూడదు ‘’అన్నాడు .’’సమా వర్తన సంస్కారం జరిపించి వెంటనే నా కొడుకును బలి పశువును చేసి నీ యజ్ఞం పూర్తి చేసి నా మాట నిలుపుకొంటాను నన్ను నమ్ము ‘.ఒక్క ఏడాదికి రా .’అన్నాడు హరిశ్చంద్రన్ .సరే ఆని వెళ్ళిపోయాడు వరుణ్ .ఇదంతా సత్యనారాయణస్వామి వ్రాత కధలో కధలాగా అనిపిస్తోందికదా.
కొడుక్కి రోహితుడు అనే నామకరణం చేశాడు కొడుకు దినదిన ప్రవర్ధమానమవుతూ లోకజ్ఞానం పొంది వివేకవంతుడై తండ్రి వరుణుడికి నరమేధం బాకీ పడ్డాడని గ్రహించాడు ..తనకు చావుగండం దగ్గర్లోనే ఉందని గ్రహించి భయంతో ఎవరికీ తెలియకుండా ఇంటినుంచి జంప్ జిలానీ అయి కొండాకోనలలో ఎవరికీ తెలియకుండా తిరుగుతున్నాడు .సరిగ్గా ఏడాదికి నక్షత్రకుడు లాగా మళ్లీ వరుణదేవుడు వచ్చి ‘’ఇంకా యజ్ఞం మ్మొదలు పెట్టలేదా ??ఆని అడిగితె ‘’ఇంకేం యాగం .నాకొడుకు నన్ను నట్టేట ముంచి పరారయ్యాడు .ఏం చేయను యాగం కాదు నాబతుకు ఆగమాగం అయింది’’అనగా .వరుణుడికి పిచ్చకోపం లేచింది అబద్ధమాడు తున్నాడు హరిశ్చంద్రన్ అనుకొని ‘’ అసత్యవాదీ.నన్నే మోసం చేస్తావా ?’’నీకు జలోదర రోగం వచ్చుగాక ‘’ఆని శపించాడు .
వెంటనే జలోదరం వచ్చి శాపం వల్ల వచ్చిన జబ్బు కనుక యే మందూ పనిచెయ్యక హరిశ్చంద్రమహారాజు మంచం పట్టాడు .కొంతకాలాని కొడుకు రోహితుడికి తండ్రి జబ్బు ఒక బాటసారి ద్వారా తెలిసి ,ఇంటికి వద్దామని అనుకోగా ఇంద్రుడు బ్రాహ్మణ రూపం లో వచ్చి వాది మీడి సానుభూతి ఒలకబోస్తూ రహస్యంగా హితోపదేశం చేశాడు .’’మూర్ఖుడిలా ఉన్నావు నీ తండ్రిచావు బ్రతుకుల్లో ఉన్నాడు నువ్వు వెడితే బలిఇచ్చి తన ప్రతిన నెరవేర్చుకొంటాడు .హాయిగా ఇక్కడే ఉండు ‘’అన్నాడు .సరే అన్నాడు.మళ్లీ వెళ్ళాలనుకోవటం ఇంద్రుడు వచ్చి వద్దని చెప్పటం జుగుతోంది .
ఒక రోజు హరిశ్చంద్రుడు కులగురువు వశిష్ట మహర్షి కి తనబాద అంతా చెప్పుకొని బావురుమన్నాడు .ఎవరైనా బ్రాహ్మణ బాలుడిని డబ్బుకు కొని యాగం చేసి బలివ్వు .నీ రోగం తగ్గుతుంది ‘’అన్నాడు .ఆప్రకారమే శునశ్శే ఫుడు అనే బాలుడి తండ్రికి డబ్బిచ్చి కొని యూపస్తంభానికి కట్టి బలివ్వబోతుంటే విశ్వామిత్రుడు వచ్చి ‘బలిఇవ్వద్దు ఆని నచ్చచెప్పటం. కాదు ఇస్తానని పట్టుబట్టటం ,విశ్వామిత్రన్ ఆబాలుడి చెవిలో వరుణమంత్రం ఉపదేశించటం అతడు ఆమంత్ర జపం చేయటం వరుణుడు ప్రత్యక్షమై జాలిపడి బాలుడిని విడిపించి హరిశ్చంద్రుడిని రోగవిముక్తుడిని చేయటం జరిగిపోయాయి చకచకా ..హరిశ్చంద్రుడు తన మాట లక్ష్యపెట్టలేదని రుసరుసలాడుతూ విశ్వామిత్రుడు వెళ్ళిపోయాడు .అప్పటినుంచి వశిష్ట విశ్వామిత్రులమధ్య ఉప్పు -నిప్పు గా మారిందని మనకు తెలుసు .సత్యహరిశ్చంద్రుడు ఆడిన మాట తప్పడు అనుకొంటాం మనం .ఈ కధలో ఆడిన మాట తప్పి ఇబ్బందులపాలైన హరిశ్చంద్రుని మనం చూశాం .కాలం కర్మా కలిసిరాకపోతే తాడే పామై కరుస్తుంది .
ఆధారం- ఆచార్య బేతవోలు రామబ్రహ్మం గారి శ్రీ దేవీ భాగవతం .
మీ- -గబ్బిట దుర్గా ప్రసాద్ -15-9-25-ఉయ్యూరు .

