అధోలోకాల అతులిత వైభవం -2
వితలలోకం
వితలం లో శివుడు హాటకేశ్వర పేరుతొ ప్రమథ గణం తో ఉంటాడు .బ్రహ్మ దేవుని సృష్టి వికాసానికి భవానీ సహితుడై విహరిస్తూ,దేవతల పూజలు అందుకొంటూ ఉంటాడు .ఇక్కడ శివుడి వీర్యంతో ఏర్పడిన హాటకీ నదిప్రవహిస్తుంది . గాలికి కదుల్తున్న మంటలాగా ఉంటుందిప్రవాహం .దీని నుంచి హాటకం అంటే బంగారం లభిస్తుంది .దీనితో ఆభరణాలు చేయించి దేవతలు ధరిస్తారు .
సుతలం
వితలానికి కింద సుతలం ఉన్నది .దీనికి విరోచనుడి కొడుకు బలిచక్రవర్తి అధిపతి .దేవేంద్రుడికి మేలు చేయాలని విష్ణువు వామన త్రివిక్రమ రూపం తో సుతలం లోకి అణగద్రొక్కి ,త్రైలోక్యాదిపత్యం ఇంద్రునికి కట్టబెట్టాడు .కానీ రాజ్యలక్ష్మి ఇంద్రుని వరించకుండా బలిచక్రవర్తి వద్దే ఉండి పోవటం తో ఆ శోభ సుతలం లోనే ఉంటోంది .నిర్భయంగా ఉంటున్నాడు .పాత్రుడైన శ్రీహరికి మూడడుగుల భూమి దానం చేయటం వలన లభించిన సత్ఫలితం ఇదీ .ఇంద్రుడు బృహస్పతి మంత్రిగా ఉన్నా ,శ్రీహరిని ముల్లోకాదిపత్యం కోరాడు .అంటే తుచ్ఛ మైన కోరికే కోరాడు .బలి సర్వం త్యాగం చేసి రాజ్యలక్ష్మీ శోభాయమానుడైనాడు .బలి తాత ప్రహ్లాదుడు హరిని దాస్యం చేసే అవకాశం ఇమ్మని కోరాడు .తండ్రి హిరణ్య కశిపుడి ఐశ్వర్యం కూడా వద్దన్న త్యాగి .అంతటి భక్తుడు మరొకడు లేడు లోకం లో .పరిపక్వం చెందిన వాడు ఇలాఉంటాడు .లేని వాడు అలా అడుగుతాడు .బలి చక్రవర్తి సుతలం లో అందరిపూజలు అ౦దుకొంటాడు .శ్రీహరి స్వయంగా బలి గుమ్మానికి కాపలా కాస్తుంటాడు .రావణుడు లోకాలన్నీ జయిస్తూ సుతలానికి వస్తే ద్వార పాలకుడు శ్రీహరి తనభక్తుడైన బలి చక్రవర్తి ని రక్షించటం కోసం కాలి బొటన వ్రేలితో వేల యోజనాల దూరం తన్ని తరిమేశాడు .ఇంతటి గొప్ప వ్యక్తిత్వం ఉన్న బలి చక్రవర్తి సకల సుఖాలు అనుభవిస్తూ ,అనుభవి౦పజేస్తూ సుతల రాజ్యాన్ని సర్వతో భద్రంగా పాలిస్తున్నాడు .ఇదిశ్రీహరి అనుగ్రహ విశేషమే .
తలాతలం
సుతలానికి కింద తలాతలం అనే బిలం ఉంది .దీని అధిపతి యముడు .త్రిపురా సుర సంహారం చేసిన శివుడు యముడిని అనుగ్రహించి ఈతలాతలలోకాధిపత్యం ప్రసాదించాడు .మాయావులందరికి అతడు గురువు .సకలమాయా విశారదుడు .సర్వ రాక్షస పూజితుడు యముడు .
మహాతలం
తలాతలానికి క్రింద మహాతలం ఉన్నది .క్రోధ వివశులైన కాద్రవేయ సర్పజాతులకు నిలయం .అనేక శిరస్సులుకల మహా సర్ప నాయకులు ఇక్కడ ఉంటారు .వారిలో కుహక, తక్షక ,సుషెణ,కాళీయుడు ముఖ్యులు .వాళ్ళంతా గరుత్మంతుడికి భయపడి భార్యాపిల్లలతో ఇక్కడ తలదాచుకొంటున్నారు. అనేక క్రీడా విశారదులు వీరు .
రసాతలం
మహాతలం క్రింద ఉన్నది రసాతలం .దైత్య దానవ నాగ జాతులు ,నివాత కవచులు ఇక్కడ సహవాసం చేస్తారు .కాళీయులూ ఇక్కడే ఉంటారు .వీరంతా హవిర్బోక్తలు.ఓజస్వంతులు . మహాసాహసులు .శ్రీహరి వీరిని ఎప్పుడూ అ దుపులో ఉంచుతాడు .అందుకని కలుగుల్లో పురుగుల్లా భయం భయంగా బతుకుతారు .ఇంద్రుడి దూతిక ‘’సరమ ‘’ మంత్రాక్షరాలతో వీరందరినీ కట్టి పడేసింది .
సశేషం
మీ -గబ్బిట దుర్గాప్రసాద్ -4-10-25-ఉయ్యూరు .

