అధోలోకాల అతులిత వైభవం -3(చివరిభాగం )

 అధోలోకాల అతులిత వైభవం -3(చివరిభాగం )

     పాతాళలోకం

రసాతలం కింద పాతాళలోకం ఉంటుంది ఇదే నాగలోకం .వాసుకి శంఖ ,కులిక.శ్వేత ధన౦జయ ,మహాశంఖ ,ధృతరాష్ట్ర ,శంఖ చూడ ,కంబళ , ఆశ్వతర ,దేవోపదత్తక ప్రముఖ నాగులంతా ఇక్కడే ఉంటారు .వీరంతా క్రోధం మూర్తీభవించి నట్లుంటారు .పెద్దపెద్ద పడగలతో నిలువెల్లా విషం గా ఉంటారు .అయిదు పడగలకు తక్కువ ఎవరికీ ఉండవు.వేయిపడగల వారూ ఉన్నారు పడగలమీద ధగధగ లాడే మణులున్నాయి.వాటికాంతి ఆలోకం లో చీకటిని రూపుమాపుతుంది .ఈలోకం లో 30యోజనాల అడుగున మూల ప్రదేశంలో తామసీ రూపం తో ‘’అనంత ‘’అనే సర్వ దేవ ప్రపూజిత భగవత్కళ ఉంటుంది .వెయ్యి తలల ఆది శేషుడు ఇక్కడే ఉండి భూగోళాన్ని భరిస్తూ ఉంటాడు ..ఆయన శక్తి అన౦త౦, అపారం.అహం అనేఅభిమానానికి లక్షణంగా ‘’సంకర్షణుడు ‘’అనే పేరుతొ విరాజిల్లుతాడు .ద్రష్టు దృశ్యాలను సంకర్షిస్తాడు .ఒకప్పుడు ఈతని భ్రూ మధ్యభాగం నుంచి ‘’సాంకర్షణుడు ‘’అనే రుద్రుడు ఏకాదశ వ్యూహాలతో  ఆవిర్భవించాడు .అతడు త్రిలోచనుడు, మహోగ్రమూర్తి .త్రిశూల ధారి .సర్పనాయకులందరూ అతనికి నిత్యం మొక్కి అర్చిస్తారు .అందమైన నాగకన్యలు తమ విలాస విభ్రమాలతో ఆరాధనగా చూస్తూ పరవశిస్తారు . 

 వృక్ష నదీ సముద్ర గిరులతో కూడిన సమస్త  భూభారం మోసే అనంతుడు సాక్షాత్తు భగవంతుడు .అనంత బలశాలి మహాశయుడు .అనంత గుణ సముద్రుడు ఆది దేవుడు .మహా సత్వానికి ప్రతినిధి .సర్వ జీవ ప్రపూజితుడు .వైజయంతీ మాలాధారి .నీలాంబర ధరుడు .ఏక కుండల విభూషితుడు .నాగలి మీద భుజం ఆనించి నిలబడి ఉంటాడు .ఉదార లీలా విలాసుడు . అనంతుని అనుభావాలను సనకసనందనాదులు బ్రహ్మ సభలో గానం చేస్తూ ఉంటారు .మహాకల్పాలు ,ఉత్పత్తి స్థితిలయాలకు కారణమైన సత్వ రజస్తమో గుణాలు అనంతుని చూపు నుంచి ఆవిర్భవిస్తాయి.ఆయన రూపం ధ్రువం .అది అక్రుతం .ఏకనాముడు .అనేక నామ ధారి  .కేవలం కరుణతో సత్వ గుణంతో భూ భారం మోస్తున్నాడు .ఆయన పేరు అన్నా విన్నా ,అనుకోకుండా పలికినా ఆర్తులను పతితులను ఉద్ధరిస్తాడు .ఆయన కంటే మరో దేవుడు లేడు .ఆయన శక్తి అమితం ,అనమితం అంటేమొక్కవోనిది .

‘’మూర్ధన్యర్పిత మణువత్సహస్ర మూర్ద్నోభూగోళం సగిరిసరిత్సముద్ర సత్వం-

 అనంత్యా దనమిత విక్రమస్య భూమ్నః కో వీర్యాణ్యధిగణ యే సహస్ర జిహ్వః ‘’

  ఈ అధోలోక విషయాలన్నీ నారద మహర్షికి నారాయణ మహర్షి వివరించి చెప్పాడు .

ఆధారం -ఆచార్య బేతవోలు రామబ్రహ్మం గారి శ్రీ దేవీ భాగవతం .  

మీ -గబ్బిట దుర్గాప్రసాద్ -5-10-25-ఉయ్యూరు.

Unknown's avatar

About gdurgaprasad

Rtd Head Master 2-405 Sivalayam Street Vuyyuru Krishna District Andhra Pradesh 521165 INDIA Wiki : https://te.wikipedia.org/wiki/%E0%B0%97%E0%B0%AC%E0%B1%8D%E0%B0%AC%E0%B0%BF%E0%B0%9F_%E0%B0%A6%E0%B1%81%E0%B0%B0%E0%B1%8D%E0%B0%97%E0%B0%BE%E0%B0%AA%E0%B1%8D%E0%B0%B0%E0%B0%B8%E0%B0%BE%E0%B0%A6%E0%B1%8D
This entry was posted in రచనలు. Bookmark the permalink.

Leave a comment

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.