సుమధుర పద పారిజాతాల బాటపై శత పద్య పూల రధం పై వాగ్దేవిని అర్చిస్తూ ఊరేగించిన భక్తకవి ‘’పూలబాల ‘’
సుమారు మూడేళ్ళ క్రితం సరసభారతి ఉగాది వేడుకలలో సరసభారతి పురస్కారం పొందిన మాతృభాషా సేవా శిరోమణి ,బహుభాషా ప్రవీణ, ప్రముఖకవి శ్రీ పూల బాల వెంకట్ నిన్న ఉదయం మమ్మల్ని చూడటానికి వస్తున్నట్లు ఫోన్ చేసి సంప్రదాయ వస్త్రదారణలో ‘’కవి బ్రహ్మ’’, ‘’సాహితీ సరస్వతి’’ జంటగా మా ఇంటికి వచ్చినట్లు ఫలాలతో పలకరించారు .పూల బాల గారు తాము రచించిన రెండు వాగ్దేవీ వైభవం-సరస్వతీ కీర్తనావళిఇచ్చి ఆభిప్రాయం రాయమనికోరారు .మా దంపతులం ఆ దంపతులకు శాలువాతో సత్కరించి సరసభారతి పుస్తకాలు కొన్ని అందించాం. దాదాపు ఒకగంట సత్కాలక్షేపం చేశాం . ,
సాయంత్రం శతకం చదివాను .అంతటి కవి గురించి నేనేమని రాయను ?జాతి పద్య కల్హార మాలిక ఈ శతకం .పోతన్న మాధుర్యం నారాయణ రెడ్ది పదలాలిత్యం ప్రతి పద్యం లో దర్శనమిస్తుంది .అనుగ్రహం కై ప్రార్ధన ,అనుగ్రహ ప్రాప్తి ,భక్తీ పారవశ్యం ,విన్నపం ,శుద్ధ కవితా పుష్పాలు ,శరణం ,అంకితం శీర్షికలతో శతకం విరాజిల్లింది .
‘’తరగని అక్షర లక్షలు -పేర్మితో బ్రహ్మ సతి నాకు పెరగమనిచ్చెన్ -వరముగ వివేక మిచ్చెను -వెరవక రచనలను జేయ వేడుక నిచ్చెన్ ‘’ఆని అమ్మతనకిచ్చినది అక్షర లక్షలని పొంగిపోయారుకవి .వాకిలిలో ఆమె రాకకోసం వేచి ఉన్నానన్నారు .’’కలిగే ఆలోచనలే ముందుకు నడిపిస్తాయి ఆని తెలిసిన వాడు ధన్యుడు .అందరూ మెచ్చే గుణాలు ,ఏకాగ్రతనిమ్మని ప్రార్ధించారు .’’ మనసుకు వెలుతురు ను దెచ్చునది విద్యే .ప్రతిభ తో స్మృతి ఉంటే శతకా౦తు డవటం తధ్యం . సుందరకావ్యాలలో సరస్వతీ మాత ను చూపిస్తా రమ్మంటున్నారు .పుస్తకాలుగా వికసించే పదాలను వాసన చూస్తె బుద్ధి పెరుగుతుంది .
భాగవతంలో స్వరసుధలు భావద్గీత భారతం వాణీ ముఖాలే .కాస్మిక్ కిరణాల శక్తి నుంచి పుట్టినదే సరస్వతీ దెవి.ఆని సైంటిఫిక్ యాస్పెక్ట్ జోడించారు . విశ్వ సృష్టికి మూలం ,అసలు విశ్వమే ఆమె .మాత దయవలన ఒక సన్నని కిరణం తాకి తలపులు పరిణతి చెంది ,తన ఆలోచనా సరళే మారిందని చెప్పుకొన్నారు ,’’అమ్మకు దయ కలిగినచో-కమ్మని తేనెల తలంపు కలమున బుట్టున్ – నెమ్మిక కలిగిన మదిలో -అమ్మయె కొలువయియుండునన్నియుతానై ‘’ కోటబుల్ కోట్ ‘’అయిన పద్యం .విద్దేలతల్లికి ఉపదగా పద్యాలు సమర్పిస్తానన్నారు భక్తిగా .ఊపిరి ఆగిపోయే వరకు తెలుగులో పద్య రచన చేస్తానని ప్రతిన పూనారు .ఆ తల్లి తలపు ఎంతో వేడుక .తరగని పెన్నిధి .కనుక చి౦తలేకుండా పరవశంతో కీర్తిస్తానన్నారు .తెలుగు భాషకు దాసులైన పూల బాలకవికి తల్లి కరుణతో పూల బాటలే దక్కాయి .శ్రీమంతులు వాణిని పూజించటానికి బంగారం ,పేదలు చేమంతులు తెస్తే ‘’దీమంతమున్న కవితలల్లి ‘’భక్తితో సమర్పిస్తారు కవులు .గాత్రానికి సూత్రం వాణి .ఆత్రంగా రావాలంటే అబ్బదుఅపాత్రులకు ,పాత్రులకు మాత్రం ‘’గాత్రము అబ్బును పవిత్ర గానము పారున్ ‘’
కవిగారికి చిత్రకళ లోనూ ప్రవేశం ఉంది.దాన్ని ముందుకు సాగెట్లు దీవించమని కోరుకున్నారు .వాగ్దేవి గీర్దేవి శబ్దస్వరూపిణి .శబ్ద లక్ష్మి .కథా రచనప్రవేశం కూడా ఉండటంతో ‘’తనకథ ముగిసే దాకా కలం దించకుండా కతలు రాస్తానన్నారు .చదువు ఉద్యోగాలకోసమే అయిపోయిందని బాధపడ్డాడు .భాష నేరిస్తే ఆత్మకు సంతృప్తి .’’స్పష్టమగు నాత్మకు భాష చందనం ‘’.విడ్యా వ్యవస్థలో తప్పుడు గాళ్ళు చేరితే వారిని ‘’ తూచి తక్కేట ‘’కు అంటే పాత ఇనపసామాన్లు కోనేవాడికి ఇచ్చినట్లివ్వాలి .’’ముత్యం లాంటి మన భాష ముక్కలయ్యిందని ‘’బాధపడ్డాడుకవి తల్లిభాషలోనే చదువు చెప్పాలని కేంద్రం చట్టం తెస్తుందని ‘’అప్పుడు చెయ్యెత్తి తెలుగుతల్లికి జై ‘’అంటారు ఆని తెలుగు బంగారు భవిష్యత్తు కలగన్నారు .దీనినే utopia అంటారు .
‘’రావేసనాతని నూపుర-రవముల్ డెందమున సుస్వరములే పల్కన్ -కావ్య సుధారస దారలు -తేవె రసరాణివి నీవే తేనెలు తేవే ‘’.వామనుడి వంటి తన ఇంటికి మేరుపర్వతంలా వాగ్దేవి వచ్చిందని మురిసిపోయడుకవి .
‘’సితకా౦తి ప్రియ శారద -శతకంబు లిఖించి పాయస మధురకృతుల్ -నుతము జేయుచు పాడగ -అతిశయమంది నను నేను మరచితికాదా ‘’ అంటూ నూరవ పద్య౦ తో శతకం పూర్తిచేశారుకవి పూలబాల .
చక్కని ముద్రణ .బైండింగ్ ,అందమైన చిత్రాలు చిత్తాకర్షణాలు ఈ శతకానికి .కవిత్వం పరుగులెత్తింది. సుమధుర భావ బంధురం .తగినట్లు లలితకోమల పద బంధం వన్నె తెచ్చాయి .ఎంతో ఖర్చు భరించి ముద్రించిన వదాన్యులైన దాతలకు వాణీ మాత పూజా ఫలం దక్కింది . పదాలమధ్య ఎడం సరిగ్గా కుదరక భావానికి ఇబ్బంది కలిగింది .కొన్నిచోట్ల ఒత్తులు సరిగ్గా పడలేదు .మరింతజాగ్రత్త పడితే బాగుండేది.పూలబాల గారి సరస్వతీ సమార్చనం అభినందనీయం .మరిన్ని అర్ధవంతమైన రచనలు రావాలని కోరిక .
మీ -గబ్బిట దుర్గా ప్రసాద్ -6-10-25-ఉయ్యూరు .
