సుప్రసిద్ధ వాగ్గేయ కారులు శ్రీ హరి నాగభూషణం గారి చేతులమీదుగా ‘’సువర్ణ ఘంటా కంకణం ‘’పొందిన ప్రముఖ హార్మోనిస్ట్ -శ్రీ అంబా ప్రసాద్
గారి గురించి మనం మర్చే పోయాం .చిన్నప్పుడే పెద్దన్న గారు వెంకట రావు గారి వద్ద హార్మోనియం లో అక్షరాభ్యాసం చేశారు అంబా ప్రసాద్ .నిజాం రాష్ట్ర ఆస్థాన విద్వాంసులు శ్రీ హరిరామ చంద్ర రావు గారి వద్ద హార్మోనియం మెళకువలు నేర్చారు .విశేష శ్రమ చేసి హార్మోనియం విద్య ను కైవశం చేసుకొన్నారు .అంతటి విద్వాంసుడు లేడు ఆని పించుకొన్నారు .
హిందూ స్థానీ సంగీతం లో ఉద్దండులైన శ్రీఅబ్డుల్ కరీం ఖాన్ ,శ్రీ ఉస్తాద్ సయ్యద్ ఖాన్ లకు హార్మోనియం సహకారం అందించి ఎన్నో కచేరీలలో అంబా ప్రసాద్ పాల్గొని మెప్పు పొందారు .అప్పటికి శిష్టులు హార్మోనియం ‘’శాస్త్రీయ వాయిద్యం కాదు ‘’ఆని గగ్గోలు పెట్టి ఘోషిస్తున్నా , అంబా ప్రసాద్ హార్మోనియం తోనే రసజ్ఞుల ను అలరించి హార్మోనియం ఘనతను లోకాని చాటి చెప్పి తానూ పేరు ప్రఖ్యాతులు పొందారు .
హార్మోనియం పై అంబా ప్రసాద్ కృషికి గుర్తింపుగా మచిలీ పట్నానికి చెందిన సుప్రసిద్ధ వాగ్గేయ కారులు శ్రీ హరి నాగభూషణం గారి అధ్యక్షతన ‘’సువర్ణ ఘంటా కంకణం ‘’పొంది ఘనంగా సన్మానించ బడ్డారు .అనేక ఆస్థానాలలో సన్మానాలు పొందారు .చాలా సంగీత సంస్థలతో అంబా ప్రసాద్ సంబంధం కలిగి హార్మోనియం సంగీతాభి వృద్ధికి విశేష కృషి చేశారు .హార్మోనియం శాస్త్రీయ సంగీతం ఆని నిరూపించి ,ప్రపంచ స్థాయి గౌరవాన్ని ,నాటకాలలో ముఖ్య స్థానాన్నీ కల్పించిన శ్రీ అంబా ప్రసాద్ గురించి ఈ తరానికే అస్సలు తెలియక పోవటం దురదృష్టం .ఆయన జనన మరణాలు చదువు ,ఇతర జీవిత విశేషాలు మనకేమీ తెలియవు .ఈ మాత్రమైనా తెలిశాయంటే అది డా వెలగా వెంకటప్పయ్య గారి వలననే .
మీ -గబ్బిట దుర్గా ప్రసాద్ -18-1-25-ఉయ్యూరు .
