తెలుగు వాడైన ఫ్రెంచ్ సాహిత్య నిష్ణాతుడు ,సినిమాటోగ్రఫీ లో అందెవేసిన చేయి ,,’’మాన్సూన్ ‘’డాక్యుమెంటరి ఫిలిం ఫేం -డా.పి.వి.పతి
పి.వి .పతి అంటే పిట్టమండలం వెంకటాచలపతి .నెల్లూరు జిల్లా వాడు .చిన్నతనంలోనే ఫ్రాన్స్ దేశం వెళ్లి అక్కడ ఫ్రెంచ్ సాహిత్యం చదివి సినిమాటోగ్రఫీ ,స్టిల్ ఫోటోగ్రఫిలలో నిష్ణాతుడయ్యాడు ..సార్బాన్ యూని వర్సితిలో ప్రసిద్ధ ప్రాచ్య శాస్త్రజ్ఞుడు ప్రొఫెసర్ సిల్వరీ మార్గదర్శిగా భారతీయ నాటకకళ గురించి పరిశోధన చేసి డి.లిట్ డిగ్రీ పొందాడు .ఫ్రెంచ్ వనితను వివాహమాడి ఇద్దరబ్బాయిలకు జన్మనిచ్చాడు .తల్లీ ,పిల్లలూ ఫ్రాన్స్ లోనే ఉండి పోయారు .చిన్న కొడుకు డాక్ ఇంజనీర్ .భార్యా పిల్లలను ఇండియా తీసుకొని రావాలని పతి నిర్ణయం .వారికి ఇష్టం ఉన్నట్లు కనిపించదు .ఈయన ఫ్రాన్స్ కు వెళ్ళడు, వాళ్ళు ఇక్కడికి రారు.’’విడాకులు తీసుకోకపోయినా అనుకూల దంపతులుగానే ఉన్నాం .భౌతికంగా వేరుగా ఉన్నా ,మానసికం గా కలిసే ఉంటున్నాం .ఉత్తరాలద్వారా మా ప్రేమ అభి వ్యక్తం చేసుకొంటున్నాం .కొన్ని ఏళ్లనుంచి మాది ‘’పోస్టల్ లవ్ ‘’‘’అన్నాడు పతి సంజీవదేవ్ తో . భార్య పారిస్ లో ఒక విద్యాసంస్థకు డైరెక్టర్ .
1951లో మద్రాస్ లో బ్రిటీష కౌన్సిల్ లో ‘’ఆధర్స్ అండ్ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ ‘’ప్రదర్శనలను ఉమెన్స్ క్రిస్టియన్ కాలేజి ప్రిన్సిపాల్ శ్రీమతి మార్సేలా హార్ది ఏర్పాటు చేసింది అందులో సంజీవదేవ్ ,పివి పతి గార్ల ఫోటోగ్రాఫులు మాత్రమె ప్రదర్శించ బడ్డాయి .డా.పతి గారివి శిల్పాలకు తీసిన ఫోటోలు .ప్రపంచ నిపుణ డాక్యుమెంటరి ఫోటోగ్రాఫర్లలో డా.పతి ఒకరు .ఎన్నో డాక్యుమెంటరి ఫిల్మ్స్ తీసిన అనుభవం ఆయనది .మార్సెల మద్రాస్ నుంచి ‘’చక్ర’’అనే ఇంగ్లిష్ మాసపత్రిక నడుపుతోంది .
బర్మాషెల్ కంపెని కి ప్రసిద్ధ రచయిత ముల్కరాజ్ ఆనంద్ ‘’మాన్సూన్’’అనే కధ రాసి ఇస్తే దాన్ని డాక్యుమెంటరి ఫిలిం నిర్మాత డా .పతి వర్ణ చిత్రంగా1956జనవరి లో దాన్ని తీయాలనుకొని ,ఆకధ లో కొంత ఆంధ్ర పల్లెటూరి నేపధ్యం లో సాగినందువల్ల పల్లెటూరి షాట్స్ గుంటూరుజిల్లా సంజీవదేవ్ స్వంతవూరు తుమ్మపూడిలో తీయాలనుకొని సంజీవ దేవ్ కు చెప్పి అందరి అనుమతి పొంది సంజీవదేవ్ ఇంటికి ఆబృండం వచ్చింది .అందులో ప్రముఖ హిందీ సినీనిర్మాత దర్శక నటుడు గురుదత్ తమ్ముడు ఆత్మారాం కూడా ఉన్నాడు .ఆత్మారాం కు పెళ్ళికాలేదు .బెజవాడ రేడియో స్టేషన్ నుంచి శ్రీ ప్రయాగ నరసింహశాస్త్రి ఇద్దరు స్త్రీలు బుర్రకధ చెప్పటానికి వచ్చారు .పతిగారి తమ్ముడు సుబ్రహ్మణ్యం మూవీ ఫోటోగ్రాఫర్ .
డా.పతి ఫ్రెంచ్ సాహిత్యం లో డాక్టరేట్ ,స్టిల్ ఫోటోగ్రఫీ సిద్ధ హస్తుడు .తుమ్మపూడిలో బావి దగ్గర బుర్రకధ సన్ని వేశాలు తీశారు .బకి౦గ్ హాం కాలువ ,రాదారిపదవలు తెరచాపల సౌందర్యం ,తాళ్ళతో పడవలను లాగుతూ ‘’జోర్సేయ్ బార్సేయ్ ‘’అంటూ ఉత్సాహంగా పాటలుపాడే వారిని అద్భుతంగా చిత్రీకరించారు .జనుముచేలు ,జనుం కోస్తున్న రంగురంగుల చీరలు కట్టుకొన్న ఆడ కూలీలు దృశ్యాలు నయన మనోహరంగా చిత్రీకరించాడు డా.పతి .
మంగళగిరి కొండ సంజీవదేవ్ బృందం ఎక్కుతుంటే కి౦ది మెట్టు నుంచి డా.పతి లాంగ్ షాట క్లోజప్ లలో గొప్పగా ఫోటోలు తీశాడు .వారం రోజులు తుమ్మపూడిలో ‘’మాన్సూన్ ‘’డాక్యుమెంటరి నిర్మాణంతో సందడి చేసిన డా.పతి బృందం సంజీవదేవ్ సులోచన దంపతులు అందించిన సహకారానికి ఆతిధ్యానికి ధన్యవాదాలు చెప్పి మద్రాస్ వెళ్ళిపోయారు .
తెలుగువాడైన ఇంతటి గొప్ప ఫ్రెంచ్ భాషా సాహిత్యకారుదు , ,మాన్సూన్ లాంటి ఎన్నెన్నో డాక్యుమెంటరీ చిత్రాలు తీసి మెప్పుపొందిన సినిమాటోగ్రఫీ నిష్ణాతుదు అయిన డా.పతి అంటే పిట్టమండలం వెంకటాచలపతి ని మనం మర్చిపోయాం .ఆయన గురించి వీకీపీడియాలో,తెలుగు వెలుగులు లో కనిపించలేదు .ఫోటో కూడా లేదు.శ్రీ సంజీవదేవ్ తన ఆత్మకధ ‘’తుమ్మపూడి’’ లో ఈ విషయాలు రాయకపోతే మనకు అస్సలు తెలిసేదికాదు .
మీ -గబ్బిట దుర్గాప్రసాద్ -21-10-25-ఉయ్యూరు .
