ఎస్వి రామారావు చిత్రకళపై సంజీవదేవ్ వ్యాఖ్యానం
సంజీవ దేవ్ సుమారు 1956లో అంటే 69ఏళ్ల క్రితం ‘’స్మృతి బింబాలు ‘’లో రాసిన వ్యాసం మీకోసం
కృష్ణా జిల్లా గుడివాడలో జన్మించిన శీరం శెట్టి వెంకటరామారావు బిఏ బికాం లు గుడివాడలో పూర్తిచేసి మద్రాస్ లో స్కూలఫ్ ఆర్ట్స్ లో చిత్రకళలో డిప్లమో పొందాడు .
ఆయన చిత్రకళ ఇండియాలోనే వాస్తవ వాదం నుంచి కల్పనా వాదానికి రూపాంతరం చెందింది ,రిప్రె జెంటేషన్(సారూప్య )వాదం నుంచి నైరూప్యానికి -అబ్స్ట్రాక్ట్ కు పరిణతిచెందింది.తర్వాత పాశ్చాత్య దేశాలలో పూర్తిగా నైరూప్యానికి పరివర్తన చెందింది .లండన్ లో ఉండగా గ్రాఫిక్ కళలో కూడా ప్రావీణ్యం సంపాదించాడు .లండన్ లోనే గొప్ప పేరు ప్రఖ్యాతులు సంపాదించాడు .విశిష్ట వ్యక్తులు విశిష్ట సంస్థలు ఆయన చిత్రాలను సేకరించారు .అంతర్జాతీయ పత్రికలూ ఆయనను’’ నైరూప్య చిత్రకళా కు ప్రధాని ‘’అయిన ‘’కా౦డిన్ స్కి’’ తో పోలిస్తే ,ఆక్స్ఫర్డ్ యూని వర్సిటి జర్నల్ విశ్వ విఖ్యాత నైరూప్యచిత్రకారుడు ‘’పాల్ క్లీ’’ తో పోల్చింది .కొన్ని భారతీయ విషయ వస్తువులను తీసుకొని నైరూప్య పద్ధతిలో అనేక చిత్రాలు చిత్రించి పాశ్చాత్య చిత్రకారులను ,చిత్ర రసికులను సంతోషపెట్టాడు .
రామారావు ఉన్నతస్థాయికి చెందిన వర్ణ కారుడు .వర్ణాల వ్యతిరేకతలను సృష్టించటం లో ఆయన తూనిక -బ్రష్ అద్వితీయమైనది .అందుకే క్రిస్టియన్ సైన్స్ మానిటర్ పత్రిక కళా సమీక్షకులు ‘’Rao ;s harmonies of madder ,ultramarine ochre ,cobalt and a fantastic orchid pink enrich ‘’Festival ‘’,one of the best paintings in the present exhibition ‘’అంటే ఈప్రదర్శనలో ఉత్తమ చిత్రాలలో ఒకటైన ‘’పండుగ ‘’అనే చిత్రాన్ని రామారావు సృష్టించిన మ౦జిష్టవర్ణం ,గాఢనీలం కావిరంగు ,మృదుల నీలం కొట్టొచ్చినట్లు కనిపించే పాటల వర్ణం మొదలైన వాటి సమ్మేళనాలు ఎంతగానో రక్తి కట్టిస్తున్నాయి .
అమెరికాలోని కెంటకి లో జెబి స్పీడ్ ఆర్ట్ మ్యూజియం లో రామారావు చిత్రించిన తైల నీటిచిత్రాలు లితోగ్రాఫులు ,ఉడ్ కట్ లు ప్రదర్శించాడు.వాటిలో మేఘసందేశం, ఉండవల్లి గుహలు ,చలికాలం ,జెన్ బౌద్ధం,హిమాలయాలు ,రాగోదయం మొదలైనవి నిపుణులచేత విశేషంగా ప్రశంసలు పొందాయి .ఇండియానా రాష్ట్రం ఇవాన్సువిల్ మ్యూజియం ఆఫ్ ఆర్ట్స్ అండ్ సైన్స్ లో రామారావు రావు ప్రదర్శించిన చిత్రాలు విశిష్ట రీతిలో ప్రశంసలు పొందాయి వేలాది మంది ఆయన నైరూప్య చిత్రాలకు ఫిదా అయ్యారు .
రామారావు నైరూప్య చిత్రణ అమెరికన్ నైరూప్య చిత్రణకు అనుకరణ కాదని అమెరికన్ చిత్ర నిపుణులు అభిప్రాయ పడ్డారు .ఆయన విషయాలను విరూపపరచి ,నైరూప్యం లో చిత్రి౦చినందున ఎవరికీ అర్ధం కానట్లు అగమ్య గోచరంగా ఉంటాయి .కృష్ణానది ని చిత్రిస్తే మనంరోజూ చూసే ఆనది కనిపించక నైరూప్య౦గా గోచరించి అది కృష్ణానదే కాదు అసలు యేనది కూడా కాదు అనిపిస్తుంది .
దాదాపు అర్ధ శతాబ్దం నుంచి అమల్లో ఉన్నా ,నైరూప్య చిత్రకళా ఇప్పటికీ ప్రజలకు దురూహ్య౦ గానే ఉంది.అయినా నైరూప్య చిత్ర స్రవంతిని ప్రవహింప జేస్తూనే ఉన్నారు .అయితే రామారావు చిత్రాలు ఇతరులవాటికంటే భిన్నంగా ఒక విశిష్టత కలిగి ఉంటాయి .అవి రంగుల ముద్దలు మాత్రమేకాక ,ఆ రంగుల వెనుక లయాత్మక సూక్ష్మ రేఖలు నరాల కూడిక లాగా గోచరిస్తాయి .సూక్ష్మ రేఖలు లతలు లాగా పెనవేసుకొని ఉంటాయి .అందుకే ఆయన చిత్రాలలో రంగుల రాగాలు వినిపించటమే కాక ,రేఖల లయలు కనిపిస్తాయి .
ఆయన ఆయిల్ ,నీటి చిత్రాలను కూడా సమాన దక్షతతో చిత్రిస్తాడు .జలచిత్రాలు తైల వర్ణ చిత్రాలలాగా ఉండవు .కానీ తైలవర్ణ చిత్రాలు జలవర్ణ చిత్రాలులాగా కని పించటంవిశేషం .ఈ మధ్యతైల వర్ణ చిత్రాలను కూడా ఒక విశిష్ట రీతిలో చిత్రిస్తున్నాడు. తైల వర్ణాలను జలవర్ణాల వాష్ పద్ధతిలో వాడటమే ఈ ప్రత్యేకత .రంగుల్ని చాలా పల్చగా కలిపి ,కుంచెతో తెలుపు చేయబడిన కాన్వాస్ పై పూసి ,ఒకగుడ్డ పేలికతో ఆ భాగాలను రుద్దటం వలన ,తెలుపు భాగం లో ఈ శుద్ధ రంగులు కలిసిపోయి ఒక విధమైన పింగాణీ మెరుపు ప్రకాశిస్తుంది .రాజుల చిత్రాలు నీటి రంగుల్లో చిత్రించినా ఈ పింగాణి మెరుపు గోచరించి ఆశ్చర్యపరుస్తుంది .
తెలియని విషయాన్ని తెలిసే రూపాల్లో చిత్రించడం కాదు రామారావు పని .తెలిసిన విషయాలను తెలియని రూపాల్లో చిత్రించడమే ఆయన పని.అంటే ఆయనచిత్రాల్లో పరిచిత వస్తువులు అపరిచిత రూపాల్లో రూపొందుతాయి .గుప్త వస్తువులను వ్యక్తం చేయటంకాక ,వ్యక్త వస్తువులను గుప్త పరుస్తాడు రామారావు . ఇదంతా రామారావు 36 ఏళ్ల వయసులో ఉన్న నాటి విషయాలు .
స్వవిషయం -శ్రీ ఎస్వి రామారావుగారిని సుమారు 30ఏళ్ళక్రితం కృష్ణా జిల్లా అవనిగడ్డలో మాన్యులు శ్రీ మండలి బుద్ధ ప్రసాద్ గారు నిర్వహించిన నేతాజీ జయంతిలో మొదటి సారి చూశాను మాట్లడాను.అడ్రస్, ఫోన్ నంబర్ కూడా తీసుకొన్నాను .ఆయన అమెరికాలో ఇలినాయిస్ రాష్ట్రం లో ఉంటారని తెలిసింది .ఆతర్వాత కృష్ణా జిల్లా రచయితల సంఘం నిర్వహించిన కార్యక్రమాలలో ఆయన నాలుగైదు సార్లు పాల్గొనగా చూశాను .ఆతర్వాత సుమారు పదేళ్ళ క్రితం సరసభారతి ఆధ్వర్యం లో ఉయ్యూరులో శ్రీనివాస అక్షరాలయం లో ఆయన్ను ఆహ్వానించి సరస భారతి ఆప్తులు శ్రీ మైనేని గోపాల కృష్ణ గారు అందజేయించిన పట్టు వస్త్రాలు, 11000 రూపాయల నగదుకానుకతో సత్కరించాం .ఆయనను’’ఆధునిక పికాసో’’ ఆని సభకు పరిచయం చేశాను .వ్యాసం కూడా రాశాను .ఒక ఆరునెలలు ఇండియాలో ఉండగా తరచూ ఫోన్ లో మాట్లాడుకొనే వాళ్ళం .2017 నుంచి జరగలేదు .
మీ- గబ్బిట దుర్గాప్రసాద్ -24-10-25-ఉయ్యూరు .

