సరసభారతికి అత్యంత ఆప్తులు సశరీ మైనేని గోపాల కృష్ణ గారి మరణం
సరసభారతికి అత్యంత ఆప్తులు ,ఉయ్యూరు ఏ.సి గ్రంధాలయనిర్మాణానికి కారకులు ,నాకు అత్యంత మిత్రులు శ్రీ మైనేని గోపాల కృష్ణ గారు 30-6-2025 న అమెరికాలోని అలబామా రాష్ట్రం హ౦ట్స్ విల్ లో స్వగృహం లో మరణించి నట్లు ఇవాళ ఉదయం తెలిసింది .సుమారు ఏడాది నుంచి ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్నట్లు వారి కోడలు శ్రీమతి రమ గారి ద్వారా తెలిసింది .నిన్న రాత్రే డా.రామయ్య గారి సతీమణి శ్రీమతి కృష్ణమయి గారు ఫోన్ లో యేవో మాటల సందర్భం గా మైనేని గారు మరణించి నట్లు చెప్పారు .ఆమెనుంచి మైనేని గారబ్బాయి కృష్ణ వాట్సాప్ నంబర్ అడిగి తీసుకొని రాత్రి నుంచి అందరికీ మెయిల్స్ మెసేజెస్ పంపిస్తుంటే ఎవరూ జవాబు ఇవ్వలేదు ఆనంబర్ మైనేనిగారి బంధువుల అమ్మాయిది ఆని తెలిసింది ఉదయంమేసేజేస్ ద్వారా ,ఫోన్ ద్వారా .ఆమెను కృష్ణ నంబర్ ఇమ్మంటే కృష్ణ భార్య శ్రీమతి రమ నంబర్ ఇస్తే ఉదయం మాట్లాడితే పై విషయాలన్నీ తెలిశాయి .ఈ అక్టోబర్ 16న 117వ మూలకం కనిపెట్టిన డా .ఆకునూరి వెంకట రామయ్య గారి మరణం ,అంతకు ముందుఈ నెల 15 న మైనేనిగారి బావగారు డా.రాచకొండ నరసింహ శర్మ ఎం.డి.గారి మరణం జరిగింది .వారు చనిపోయిన మూడోరోజు వారి నంబర్ కు ఫోన్ చేస్తే ,అమెరికా నుంచి వచ్చిన శర్మగారబ్బాయి లిఫ్ట్ చేసి మాట్లాడారు .ఆయన ఆప్యాయంగా పిలిచే ‘’కృష్ణ మామ ‘’ మరణించిన సంగతి చెప్పలేదు . సరసభారతికి అత్యంత ప్రియులైన ఈ ముగ్గురు త్రిమూర్తుల మరణ వార్తలు తెలియడం అత్యంత బాధాకరం .మైనేని గారు దాదాపు 2018 నుంచి మాట్లాడటం కాని ,సరసభారతి పోస్ట్ లకు స్పందించటం కాని జరగటం లేదు .నేనుమాత్రం రెగ్యులర్ గా వారికి సరసభారతి పోస్ట్ రోజూ పంపుతూనే ఉన్నాను . ప్రతియేటా గురుపూజోత్సవం సెప్టెంబర్ 5 ఉపాధ్యాయ దినోత్సవం నాడు మా ఇద్దరికీ గురు వరేణ్యులైన బ్రహ్మశ్రీ కోట సూర్యనారాయణ శాస్త్రి గారి గురుపూజోత్సవంనాడు మైనేని వారిపేరిట ఒక పేద ఎస్. సి.ఒకపేద బి.సి.విద్యార్ధినికి నగదు బహుమతులు ఇస్తూనే ఉన్నాము మా గురుపుత్రులు ఇచ్చే నగదు బహుమతులతోపాటు .ఈ సెప్టెంబర్ 5 న కూడా అందజేశాం .ఈ విషయాలన్నీ మైనేని గారికి ఎప్పటికప్పుడు తెలియజేస్తూనే ఉన్నాను .పది రోజులక్రితం రమ్యభారతి సంపాదకులు ,ఆంధ్రప్రదేశ్ రచయితల సంఘం కార్యదర్శి శ్రీ చలపాక ప్రకాష్ ఫోన్ చేసి మైనేని గారి సాహితీ సేవకు గుర్తింపు గా ఏదైనా చేయాలని ఉందని వారిపై ఆర్టికల్ రాసి పంపమని కోరితే మూడు రోజుల క్రితమే ఈ క్రింది ఆర్టికల్ పంపాను .ఇందులో మైనేని గారి వ్యక్తిత్వం అంతా దర్శన మిస్తుంది .ఇంతలోనే ఈడుర్ఘటన. .మైనేని గోపాల కృష్ణ గారి ఆత్మకుశాంతి కలగాలనీ, వారి కుటుంబసభ్యులకు సానుభూతి తెలియ ఇస్తున్నాను .
మీ- గబ్బిట దుర్గా ప్రసాద్ -28-10-25-ఉయ్యూరు
సౌజన్యశీలి, సహృదయులు ఆత్మీయులు
శ్రీ మైనేని గోపాలకృష్ణ
జననం – విద్యాభ్యాసం
శ్రీ మైనేని గోపాలకృష్ణ గారు కృష్ణాజిల్లా ఉయ్యూరుకు సమీపంలోని కుమ్మమూరు
గ్రామంలో శ్రీ మైనేని వెంకట నరసయ్య, శ్రీమతి సౌభాగ్యమ్మ దంపతులకు 10-1-
1935న ఆరవ సంతానంగా జన్మించారు. వీరి అన్నగార్లు స్వర్గీయ సూర్యనారాయణ,
స్వర్గీయ తాతయ్య అనే రాజశేఖర్, అక్కయ్యలు శ్రీమతి అన్నపూర్ణాదేవి, స్వర్గీయ శ్రీమతి
కనక దుర్గాదేవి, శ్రీమతి భారతీదేవి. చెల్లెళ్ళు శ్రీమతి హేమలతా దేవి, శ్రీమతి సత్యవాణి.
బాల్యంలోనే పిల్లల చదువుకోసం తండ్రిగారు కుటుంబాన్ని ఉయ్యూరుకు మార్చారు.
ప్రాధమిక విద్యను గోపాలకృష్ణ గారు కీ.శే. కోట సూర్యనారాయణ శాస్త్రి గారి వద్ద
నేర్చారు. కోటమాస్టారు అంటే మైనేని వారికి అమితమైన గౌరవం భక్తి. వారి పేరు
చెబితే పులకించి పోతారు. 1950 వరకు తాడంకి స్కూల్లోచదివి ఎస్. ఎస్. ఎల్.సి.
పాసై, తరువాత విజయవాడ ఎస్.ఆర్.ఆర్. కాలేజిలో ఇంటర్ చదివి 1954లో
ఉత్తీర్ణులయ్యారు. కొంతకాలం నాటకాలు, సోషలిస్ట్ పార్టీ సభలతో కాలేజీకి డుమ్మా
కొట్టారు. బెజవాడ హోటల్ వర్కర్స్ యూనియన్తో చేరి, వర్కర్ల జీవన పరిస్థితులను
మెరుగు పరచటానికి వారిని యాజమాన్యం గౌరవంగా చూడటానికి కృషి చేశారు.
ఉన్నత విద్య – వివాహం – మొదటిసారి అమెరికా ప్రయాణం
1953-54లో ఉయ్యూరులో డ్రమాటిక్ అసోసియేషన్ స్థాపించి ఆత్రేయ గారి
యెన్.జి.వో నాటికను ప్రాక్టీస్ చేశారు. 1955-58 కాలంలో విశాఖ ఆంధ్ర
విశ్వవిద్యాలయంలో ఫిలాసఫీ మెయిన్ సబ్జెక్ట్ ఎడ్యుకేషనల్, సోషల్ అండ్ చైల్డ్ సైకాలజీ
ఆధునిక ప్రపంచ నిర్మాతలు- జీవితాలలో చీకటి వెలుగులు
మైనర్ సబ్జెక్ట్లుగా తీసుకొని చదివి 1959లో ఏం.ఎ. సెకండ్ క్లాస్లో పాసైనారు.
1960లో గుంటూరు జిల్లా రేపల్లె తాలూకా నల్లూరు గ్రామవాసి కీ. శే. పరుచూరి భావ
నారాయణ చౌదరి, శ్రీమతి రత్నమాణిక్యమ్మ దంపతుల కుమార్తె శ్రీమతి సత్యవతిని
వివాహం చేసుకొన్నారు. 1960-61లో అమెరికా వెళ్లి మిన్నియా పోలీస్లోని మిన్నెసోటా
యూనివర్సిటిలో ఎడ్యుకేషన్ సైకాలజీ, స్టాటిస్టిక్స్లో కొంత కోర్సు వర్క్ చేశారు.
గోపాలకృష్ణ గారు 1961-62లో మాడిసన్లోని విస్కాన్సిన్ విశ్వవిద్యాలయంలో
ఇండియన్ స్టడీస్కు అనుబంధంగా ఉన్న తెలుగు గ్రంథాలను కేటలాగ్ చేయటానికి
సహాయ పడుతూ, కొన్ని లైబ్రరీ కోర్సులు పూర్తి చేశారు. 1962లో ఇండియా తిరిగి
వచ్చి కొంతకాలం చిరు ఉద్యోగాలు చేస్తూ, కొంతకాలం నిరుద్యోగిగా ఉంటూ,
కొంతకాలం ఉయ్యూరు కే.సి.పిలో అతి చిన్న ఉద్యోగం చేసి, స్థిరమైన రాబడి లేక
కుటుంబాన్ని పోషించలేక ఇబ్బంది పడుతూ మంచి రోజుల కోసం ఎదురు చూస్తూ
1968వరకు ఆరేళ్ళు గడిపారు.
తలపు తట్టిన అదృష్టం లైబ్రరీ సైన్స్ కోర్స్ -ఉద్యోగం
అదృష్టం తలుపు తట్టగా 1969లో అమెరికా వెళ్లి టెన్నేసిలో లైబ్రరీ సైన్స్లో
ఎం.ఎస్. చేసి, అందరి ఆదరాభిమానాలు పొంది డిగ్రీ తీసుకొని సంతృప్తి చెందారు.
సుమారు ఏడేళ్ళు పడిన మానసిక వేదనకు, శారీరక శ్రమకు విముక్తి కలిగింది. కోర్సులో
ఉండగానే కెంటకీలోని లూవిల్ యూనివర్సిటిలో కేటలాగర్ అండ్ ఇన్ స్ట్రక్టర్ ఇన్
లైబ్రరీ సైన్స్కు ఎంపికై, పదవీ బాధ్యతలు చేబట్టారు. అమెరికన్ లైబ్రరి ఆఫ్ కాంగ్రెస్,
న్యూయార్క్ పబ్లిక్ లైబ్రరి, ఇతర విశ్వ విద్యాలయాల లైబ్రరీలను సందర్శించారు. మెషీన్
రీడబుల్ కేట లాగింగ్కు ఇన్ హౌస్ ట్రెయినింగ్ ఇచ్చారు. ఆంగ్లో అమెరికన్ కేటలాగింగ్
రూల్స్పై వర్క్ షాప్ నిర్వహించారు. ఆబ్ స్ట్రాక్ట్ ఆఫ్ అకడేమిక్ ప్లాన్ అండ్ బిల్డింగ్
ప్రోగ్రాంకు సహకరించారు. లాంగ్ రేంజ్ బడ్జెట్, పర్సనల్ అండ్ రిసోర్సెస్ ప్రొజెక్షన్కు
సహాయకుడిగా సేవలందించారు. యూనివర్సిటి ఆఫ్ లూయీ విల్ లైబ్రరి సిస్టంకు
టెక్నికల్ సిస్టం అందించటంలో ప్రముఖ పాత్ర పోషించారు. మైనేనిగారి బాస్
ప్రోత్సాహంతో కేటలాగింగ్ కన్సల్టంట్గా 1974 నుంచి 76 వరకు రెండేళ్ళు యునైటెడ్
స్టేట్స్ డిపార్ట్ మెంట్ ఆఫ్ డిఫెన్స్ ఫోర్ట్ నాక్స్ లైబ్రరీ, నేషనల్ ఆర్కైవ్స్, సన్స్ ఆఫ్
అమెరికన్ రివల్యూషన్ లో 1976-78 వరకు సలహాదారుగా, కెంటకీలోని లూయీ
విల్లో ఉన్న లైబ్రరీ ఆఫ్ వరల్డ్ ఫెయిత్ సెంటర్లో 1980-82 వరకు ఎంతో సంతృప్తిగా
సేవలందించారు. తనపై బాస్ కున్న నమ్మకానికి ఎంతో కృతజ్ఞత చూపిస్తారు శ్రీ గోపాలకృష్ణ. పై ఉద్యోగులచేత ప్రశంసలు, సహోద్యోగుల చేత ఆత్మీయ మిత్రులుగా
అభినందనలు పొందారు. 1997లో అసోసియేట్ ప్రొఫెసర్ అండ్ స్పెషల్ అసిస్టంట్
టు యూనివర్సిటీ లైబ్రేరియన్గా పదవీ విరమణ చేశారు.
కుటుంబం
మొదటి నుండి సత్యం ధర్మం న్యాయంలపై మక్కువ ఉన్న గోపాలకృష్ణగారు కెంటకీ
సదరన్ బాప్టిస్ట్ దియలాజికల్ సెమినరి, ముర్రె స్టేట్ యూనివర్సిటీలలో హిందూధర్మంపై
ప్రసంగాలు చేశారు. లూయీవిల్ యూనివర్సిటిలో రెలిజియన్ స్టడీ డిపార్ట్మెంట్
ఆహ్వానంపై బౌద్ధధర్మంపై దార్మికోపన్యాసమిచ్చి అందరి మన్ననలు అందుకొన్నారు.
అతిధులను గౌరవంగా ఆదరించటం. బాధితులకు సానుభూతి సహవేదనలను చూపటం
మైనేని వారికి తలిదండ్రుల నుండి సంక్రమించిన గొప్ప సుగుణం. గోపాలకృష్ణ
దంపతులకు ఇద్దరు కుమారులు. పెద్దకుమారుడు శ్రీ కృష్ణ, కోడలు శ్రీమతి రమ.
మనుమరాళ్ళు చి|| శ్రేయ, సెరీన. చిన్న కుమారుడు శ్రీ రవి, కోడలు శ్రీమతి కవిత.
మనుమడు చి|| కిరణ్, మనుమరాళ్ళు చి|రియా, కరీనా. మన సాంప్రదాయం
ప్రకారం వివాహాలు చేసుకొని సంతానం పొంది, అమెరికాలోనే తాము ఎంచుకొన్న
వృత్తిలో రాణిస్తూ, తలిదండ్రులను కనిపెడుతూ ఆదర్శంగా ఉంటూ సంతోష
పెడుతున్నారు. గోపాలకృష్ణగారు భార్య శ్రీమతి సత్యవతి గారితో అనుకూల దాంపత్యం
వలన సుఖ సౌఖ్య ఆనందమయ జీవితాన్ని గడుపుతున్నారు.
ఉయ్యూరుపై అభిమానం – వితరణ
అమెరికాలో ఉన్నా గోపాలకృష్ణ గారికి ఉయ్యూరుపై అభిమాన, మమకారాలు ఏ
మాత్రమూ తగ్గలేదు. ఇక్కడి విషయాలు ఎప్పటికప్పుడు తెలుసుకొంటూనే ఉంటారు.
దక్షిణ భారతదేశంలోనే మొట్టమొదటిసారిగా ఏర్పడిన ఉయ్యూరు ఏ.సి. లైబ్రరీకి వారి
తలిదండ్రులు కీ.శే. మైనేని వెంకట నరసయ్య, శ్రీమతి సౌభాగ్యమ్మ గార్ల పేరు మీద
5లక్షల రూపాయలు భూరి విరాళం ఇచ్చి మరో లక్ష రూపాయల విలువైన రిఫరెన్స్
గ్రంథాలను బహూకరించి, లైబ్రరీ ప్రారంభోత్సవ సభకు మరో లక్ష రూపాలు ఖర్చు
చేసి ఘనంగా నిర్వహించారు. మచిలీపట్నం కృష్ణా విశ్వవిద్యాలయానికి ఇరవై వేల
రూపాయలు, భగవద్గీతలో రాణిస్తున్న చి|| మాదిరాజు బిందు దత్తశ్రీకి ఉన్నత విద్యాభ్యాసం
కోసం 15 వేల రూపాయలు, ఉయ్యూరులోని హిందూ స్మశానవాటిక (స్వర్గ పురి)ని
ఆధునీకరిస్తూ అభివృద్ధి చేస్తున్న ఉయ్యూరు రోటరీ క్లబ్ వారికి 25 వేల రూపాయలు సరస భారతి ద్వారా అందజేయించారు.
పెద్దల యెడ గౌరవం
పెద్దలను ఎలా గౌరవించి సత్కరించాలో గోపాలకృష్ణ గారిని చూసి మనం
నేర్చుకోవాలి. ప్రపంచ ప్రసిద్ధ ఆర్థికవేత్త ఉయ్యూరు వాసి, ప్రస్తుతం అమెరికా నివాసి
శ్రీ ఆరిగపూడి ప్రేమ్చంద్ గారిని ఉయ్యూరు రప్పించి, ఖర్చు అంతా భరించి వారికి
మాతో ఘనసన్మానం చేయించి ఆనందించారు. బౌద్ధ ధర్మ ప్రచారకులు శ్రీ అన్నపరెడ్డి
వెంకటేశ్వరరెడ్డి గారికీ ఇలాగే గొప్ప సత్కారం చేయించారు. బాపు రమణలు అంటే
గోపాలకృష్ణ గారికి అమితమైన ఆరాధనాభావం. వారిద్దరితో మంచి పరిచయం
ఉన్నవారు. ఉత్తర ప్రత్యుత్తరాలు, ఫోన్ సంభాషణ జరిపేవారు. రమణ, బాపుల
మరణం తర్వాత బాపు-రమణల స్మారక నగదు పురస్కారాన్ని మొట్టమొదటిసారిగా
ఏర్పాటు చేసి ప్రముఖ కథకులు శ్రీ వేదగిరి రాంబాబుకు అయిదు వేలు, ప్రఖ్యాత
చిత్రకారులు కవి శ్రీ శీలా వీర్రాజు గారికి 10వేల రూపాయలు సరస భారతి ద్వారా
అందజేశారు. ప్రముఖ కథకులు శ్రీ కాళీ పట్నం రామారావు గారు నిర్వహిస్తున్న ‘కథా
నిలయం’కు 15 వేల రూపాయలు, ప్రఖ్యాత ఆధ్యాత్మిక గురువులు, సాహిత్య సాంస్కృతిక
ధార్మిక కార్యక్రమ నిర్వాహకులు స్వర్గీయ సద్గురు శివానందమూర్తి గారి ‘సనాతన ధర్మ
చారిటబుల్ ట్రస్ట్’కు 11,116 రూపాయలు అందజేసిన సంస్కారి. ‘ఇండియన్ పికాసో’
అని పిలువబడే అంతర్జాతీయ ప్రసిద్ధి చెందిన గుడివాడ వాసి అమెరికాలో స్థిరపడిన
నైరూప్య చిత్రకారులు పద్మశ్రీ ఎస్.వి.రామారావు గారికి సరసభారతి, స్థానిక శ్రీనివాస
విద్యా సంస్థలు ఆధ్వర్యంలో 1-9-16న ఆ కాలేజి సెమినార్ హాల్ లో ఎం.ఎల్.సి.
శ్రీ వై.వి.బి.రాజేంద్ర ప్రసాద్ చేతుల మీదుగా ఘన సన్మానం చేయించి, శ్రీ రామారావు
గారికి 11,116 రూపాయలు నగదును కానుకగా అందింపజేసిన కళాప్రియులు శ్రీ
గోపాలకృష్ణ గారు. ఇవన్నీ వారు అమెరికాలో ఉంటూ సరసభారతి చేత చేయించిన
సత్కారాలు, సత్కార్యాలు.
తన జీవితానికి మార్గదర్శి స్నేహితులు, ఆత్మీయులు అయిన శ్రీ కోగంటి సుబ్బారావు
గారికి 11-1-2015న నభూతోగా సరసభారతి చేత సన్మానం చేయించి ఆ
కుటుంబంలోని వారందరికీ నూతన వస్త్రాలను కొనిపించి, అందజేయించి నేను రాసిన
‘దర్శనీయ దైవ క్షేత్రాలు’ గ్రంథాన్ని శ్రీ సుబ్బారావు గారికి అంకితమిప్పించి, జన్మ
ధన్యమైందని కృతజ్ఞతలు తెలిపి, దీన్ని లైవ్ టెలికాస్ట్ చేయించి చూసి పరవశించిన
మహోన్నతులు మైనేని గారు. ఈ కార్యక్రమానికి మొత్తం ఖర్చు తానే భరించిన సజ్జన
హృదయులు శ్రీ గోపాలకృష్ణ గారు.
70 ఏళ్ళ క్రితం ప్రాధమిక విద్య నేర్పిన గురుదేవులు కీ.శే. కోట సూర్యనారాయణ
శాస్త్రి గారిని మర్చిపోక, వారి కుమారుల చిరునామాలు సేకరించి ఫోన్లో మాట్లాడి
5-9-15 ఉపాధ్యాయ దినోత్సవం రోజున వారందరినీ సకుటుంబంగా ఆహ్వానించి
గురువుగారి చిత్రపటాన్ని ప్రముఖ ఆర్టిస్ట్ టి.వి.ఎస్.బి.శాస్త్రి (ఆనంద్) చిత్రింపజేసి,
శాసన మండలి సభ్యులు శ్రీ వై వి బి రాజేంద్ర ప్రసాదో ఆవిష్కరింపజేసి, ప్రముఖ
సంగీత విద్వాంసులు శ్రీమతి సింగరాజు కల్యాణి, శ్రీమతి కాళీపట్నం ఉమా గార్లచే
సంగీత కచేరీ జరిపించి గురుపూజోత్సవంగా సరసభారతి చేత ఘనంగా
నిర్వహింపజేయించి, వారందరికీ నూత్న వస్త్రాలు అందజేయించి కార్యక్రమాన్ని
ప్రత్యక్ష ప్రసారం చేయించి అమెరికాలో చూసి తన్మయం చెంది తన జన్మ చరితార్ధమైఁ
నదని సంతృప్తి చెందిన ఆదర్శ వ్యక్తి శ్రీ గోపాలకృష్ణ గారు. తమ ప్రియ తమ గురువులు
స్వర్గీయ కోట సూర్యనారాయణ శాస్త్రి గారి స్మారక నగదు పురస్కారాన్ని ఏర్పాటుచేసి
ఇద్దరు అతి పేద ప్రతిభగల హైస్కూల్ విద్యార్థికి, విద్యార్థినికి ఒక్కొక్కరికి 10వేల
రూపాయల 2014, 2015, సంవత్సరాలలో అందజేసిన వితరణ శీలి శ్రీ
గోపాలకృష్ణగారు. 3-9-16న శ్రీ కోట గురువరేణ్యుల గురుపూజోత్సవాన్ని సరసభారతి,
స్థానిక ఉయ్యూరు పబ్లిక్ స్కూల్ సంయుక్త ఆధ్వర్యంలో నిర్వహింపజేసి గురు పుత్రులకు,
ఉపాధ్యాయులకు సన్మానాలు చేయించి పేద ప్రతిభ గల విద్యార్థినికి విద్యార్ధికి 10 వేల
రూపాయలు ఒక్కొక్కరికి అందజేయించిన వదాన్యులు. 2015, 2016, 2017లలో
జరిగిన ఈ గురుపూజోత్సవాలలో ప్రేరణ పొందిన మా గురుపుత్రులు శ్రీ కోట సోదరులు
శ్రీ కోట చంద్ర శేఖర శాస్త్రి, శ్రీ సీతారామాంజనేయులు, శ్రీ గాయత్రి ప్రసాద్ గార్లు
ఇంటర్ చదువుతున్న పేదరికం ప్రతిభ ఉన్న విద్యార్థినికి తమ తలిదండ్రుల పేరిట
స్మారక నగదు బహుమతి 10 వేల రూపాయలు తమ చేతుల మీదుగా ఈ రెండు
సంవత్సరాలు అందజేసి, ఇక ముందు కూడా ఇస్తామని తెలియ జేసి మాతా, పితరుల
యెడ తమకు గల అనన్య భక్తిని చాటి, విద్యకు ప్రోత్సాహం కలిగించారు. అంతటి
ప్రేరణ శ్రీ మైనేని గారు కల్గించారు.
సరసభారతికి ఆత్మీయులు
సరసభారతికి పరమ ఆత్మీయులు శ్రీ గోపాలకృష్ణ గారు. తాను స్పాన్సర్గా ఉండి,
నా రచనలు, సరసభారతి ప్రచురణలు అయిన ‘సిద్ధ యోగి పుంగవులు’, ‘మహిళా
మాణిక్యాలు’, ‘పూర్వాంగ్ల కవుల ముచ్చట్లు’, ‘దర్శనీయ దైవ క్షేత్రాలు’, గ్రంథాలను
వరుసగా తమ తల్లిగారు కీ.శే. మైనేని సౌభాగ్యమ్మ గారికి, తమ ప్రియతమ అర్ధాంగి
ఆధునిక ప్రపంచ నిర్మాతలు- జీవితాలలో చీకటి వెలుగులు
శ్రీమతి మైనేని సత్యవతి గారికి, తమ బావ గారు డా. శ్రీ రాచకొండ నరసింహశర్మ-
ఎం.డి.గారికి, తనకు మార్గదర్శి, మెంటార్ అయిన కోగంటి సుబ్బారావు గారికి అంకిత
మిప్పించి వారిపై తన కున్న గౌరవ ఆత్మీయ అనురాగాలను, కృతజ్ఞతను చాటుకొన్న
ఉదార హృదయులు మైనేని వారు. అందుకనే వారికి తెలియకుండా, చెప్పకుండా
‘గీర్వాణ కవుల కవితా గీర్వాణం-1 మొదటి భాగం’ అనే బృహత్ గ్రంథాన్ని శ్రీ గోపాలకృష్ణ
గారికి ఆన్లైన్ అంకితమిచ్చి నా ఋణం తీర్చుకొన్నాను. ఈ పుస్తకాన్ని వారి మేనకోడళ్ళు
మేనల్లుళ్ళు స్పాన్సర్ చేసి సరసభారతి చేత ముద్రింపజేసి తమ ప్రియతమ ‘కృష్ణ మామ’
ఆదరాన్ని, ఆశీస్సులను అందుకొన్నారు.
నాపై శ్రీ గోపాలకృష్ణ గారికి అమితమైన ఆత్మీయత ఉంది. ఎన్నో అమూల్యమైన
గ్రంథాలు నేను చదవాలని భావించి, కొని, పోస్ట్లో పంపుతూనే ఉన్నారు. నా పుట్టిన
రోజు పండుగనాడు, గీర్వాణం ఆవిష్కరణ రోజున వారు అందజేసిన బహుమానాలు
‘అమూల్యమైనవి.. నేనెప్పుడూ ఋణం తీర్చుకోలేనివి. వారి అవ్యాజాను రాగానికి
కృతజ్ఞతలు. దైవ భక్తి, పెద్దల యెడ గౌరవం, సనాతన ధర్మం పై అభిమానం, ఆచరణలో
శుద్ధ మనస్కత, సర్వ జనుల సౌభాగ్య చింతనాశీలి, ‘దైవ చిత్తం’ గ్రంథానికి స్పాన్సర్గా
తానే ఉండాలి అని ముందుకొచ్చిన శ్రీ మైనేని గోపాలకృష్ణ గారికి అంకిత మివ్వటం
సముచితం అని భావించి, సరసభారతికి వారిపై ఉన్న గౌరవాదరణలకు నిదర్శనంగా
వారికి మనస్పూర్తిగా అంకితమిచ్చాను. ఇప్పుడు గీర్వాణ కవుల కవితా గీర్వాణం
రెండవ భాగానికి తామే స్పాన్సర్గా ఉంటామని మొదటి నుంచీ చెబుతూ ఈ బృహద్గ్రంథం
వెలువడటానికి సౌజన్య సహాయ సహకారాలు అందజేసిన శ్రీ మైనేని గోపాలకృష్ణ
శ్రీమతి సత్యవతి దంపతుల ఔదార్యానికి, సరసభారతిపై వారికున్న ఆదరాభిమానాలకు
కృతజ్ఞతలు తెలుపుకొంటున్నాను.
“ఆధునిక ప్రపంచ నిర్మాతలు- జీవితాలలో చీకటి వెలుగులు” అనే ఈ బృహద్గ్రంథం
తమ బావమరిది, ప్రపంచ ప్రఖ్యాత గణితశాస్త్రవేత్త కీ॥ శే॥ డాక్టర్ పరుచూరి రామకృష్ణయ్య
గారికి అంకితమిస్తే సముచితముగా ఉంటుందని సూచించి, అంకితమిప్పించి, ఈ
గ్రంథాన్ని సరసభారతి చేత ప్రచురింపచేయటానికి కావాలిసిన ఆర్థికాన్ని అందించి
తామే ప్రాయోజకులుగా ఉంటామని స్వచ్చందంగా ముందుకు వచ్చి సరసభారతిపై
తమకున్న అపార ఆదరాన్ని సాహిత్యంపై మక్కువ తెలియజేసిన ఆప్తులు శ్రీ మైనేని
గోపాలకృష్ణ, వారి అర్ధాంగి శ్రీమతి సత్యవతి గారికి కృతజ్ఞతలు.
– గబ్బిట దుర్గాప్రసాద్

