శ్రీ దేవీ భాగవతం లో’’ సూక్తి’’ రత్న మణి మాణిక్యాలు -9
81-‘’ఉపకారిణి మిత్రే యో నొప కుర్యాత్కధంచన -తం ధిగస్తు నరం దేవౌ భవేచ్ఛ రుణవాన్ భువి’’
ఉపకారం చేసిన మిత్రుడికి ప్రత్యుపకారం చేయనివాడు నీచుడు .వాడి జన్మ వ్యర్ధం .రుణ గ్రస్తుడయినట్లే .అశ్వినీ దేవతలతో చ్యవనుడు .
82-‘’కన్యా యోగ్యాయా దాతవ్యా పిత్రా సర్వాత్మనా కిల -తాదృశం హి ఫలం ప్రాప్తం యాదృశం వై కృతం మయా ‘’
నా స్వార్ధం కోసం ముసలి గుడ్డివాదికిచ్చి నాకూతురు గొంతుకోశాను .అన్ని రకాలా యోగ్యుడిని చూసి కన్యాదానం చేయాలంటారు పెద్దలు .నేను చేసిన దానికి తగిన ఫలితమే దక్కింది .కూతురు ప్రమద్వరతో తండ్రి శర్యాతి .
83-‘’కం ధాస్యతి కుమారోయం మంత్రిణశ్చుక్రు శుర్భ్రుశం -తధేన్ద్రో దేశినీం ప్రాదా న్మాన్ధాతేద్వాదచ్యత ‘’
ఇంద్రుడు తన చూపుడు వేలిని చూపి తండ్రి యవనాశ్వుడికి ఇష్టి చేసిన జలపూర్ణ కలశం లో పవిత్ర జలాన్ని తాగితే పుట్టిన ఆపిల్లాడు పాలకోసం ఏడుస్తుంటే ‘’మాం ధాతా’’ అన్నాడు అంటే నా చేతి వ్రేలిని నోట్లో పెట్టుకుని చీకుఅన్నాడు అందుకే ఆకుర్రాడికి మాంధాత అనే పేరు స్థిరపడింది .
84-‘’ న విశ్వసేత్పరాశక్తం సచివం ఛ తథానతం – చారాః సర్వత్ర యోక్తవ్యాఃశత్రు మిత్రేషు సర్వదా ‘’
వొంగివొంగి దొంగ దణ్ణాలు పెట్టే మంత్రి ని నమ్మకు .శత్రువులపైనీ కాదు మిత్రులపైన కూడా చారులను పెట్టాలి .అరుణుడు సత్యవ్రతునితో .
85-‘’హరిశ్చంద్ర సమో రాజా న భూతో నభవిష్యతి -సత్యవాదీతధా దాతాశూరః పరమ ధార్మికః ‘’
హర్స్చంద్ర మహారాజు మహాదాత వీరుడు ధర్మశీలి సత్యవాది ప్రజారంజకుడు .ఆయనతో సాటివచ్చే రాజు గతంలో లేడు భవిష్యత్తులో రాడు .వశిష్టుడు విశ్వామిత్రునితో .
86-‘’వ్యర్ధం హి జీవితం తస్య విభవం ప్రాప్య యేనవై -నోపార్జితం యశః శుద్ధం పరలోక సుఖ ప్రదం ‘’
సంపదలు దండిగా ఉండి పరలోక సుఖప్రదమైన శుభ్ర యశస్సును గడించు కో లేని వాడి జీవితం వ్యర్ధం .వశిష్టుడు విశ్వామిత్రునితో .
87-‘’చింతయా క్షీయతే దేహో నాస్తి చి౦తసమా మృతిః-త్యజ్యతాం నృపశార్దూల స్వస్తో భవ విచక్షణా ‘’
బెంగా చింతా ఆరోగ్యం పాడు చేస్తాయి .చింత మరణం తో సమానం .విచక్షణతో చింతను వదిలించుకోవాలి .హరిశ్చంద్రుడితో భార్య.
88-‘’అగ్నిహోత్ర మధీత౦ ఛ దానాద్యాః సకలాఃక్రియాః-భవంతి తస్య వైఫల్యం వాక్యం యస్యానృతం భవేత్ ‘’
ఇంతకాలం చేసిన హోమాలు దానాలు ,చదివిన శాస్త్రాలు క్క అబద్ధం తో తుడిచి పెట్టుకు పోవటం నేను సహించలేను ఎన్ని కష్టాలైనా ధైర్యంగా ఎదుర్కొందాం .భార్యతో హరిశ్చంద్రుడు .
89-‘’సత్యే నార్కః వ్రత సతి సత్యే తిష్టతిమేదినీ -సత్యేప్రోక్తః పరో ధర్మః స్వర్గస్సత్యే ప్రతిష్ఠితః ‘’
సత్యం వలన సూర్యుడు ప్రకాశిస్తున్నాడు .సత్యం వలన భూగోళం నిలబడింది .సత్యమ్లోనే ఉతమ ధర్మం ఉంది.సత్యమ్లోనే స్వర్గం ఉంది.వంద ఆశ్వమేధయాగాలఫలితాన్ని సత్యాన్ని త్రాసులో పెట్టి తూస్తే సత్యం వైపేముల్లు మొగ్గుతుంది .హరిశ్చ౦ద్రుడితో విశ్వామిత్రుడు .
90-‘’యది దత్తం యది హంతం బ్రాహ్మణా స్తర్పితా యది -తేన పుణ్యేన మే భర్తా హరిశ్చంద్రోస్తు వై పునః ‘’
నేను చేసిన దానాలు ధర్మాలు హోమాలు సంతర్పణలు ఏవైనా ఉంటే ఆ పుణ్యం వలన నాకు మరో జన్మలో కూడా హరిశంద్రుడే భార్త అగుగాక .చంద్రమతి మాధవీ దేవికి మొక్కుతూ .
సశేషం
మీ -గబ్బిట దుర్గాప్రసాద్ -2-11-25-ఉయ్యూరు

