సైన్స్ డాక్టరేట్ కాలేజి ప్రిన్సిపాల్ , బౌద్ధ ఆరామాలను హిందూ దేవాలయాలుగా మారిన తీరుపై పరిశోధకుడు ,సర్వ కళా నిపుణుడు ,జిల్లెళ్ళమూడి అమ్మ శిష్యుడు – శ్రీపాద గోపాలకృష్ణమూర్తి

సైన్స్ డాక్టరేట్ కాలేజి ప్రిన్సిపాల్ , బౌద్ధ ఆరామాలను హిందూ దేవాలయాలుగా మారిన తీరుపై పరిశోధకుడు ,సర్వ కళా నిపుణుడు ,జిల్లెళ్ళమూడి అమ్మ శిష్యుడు – శ్రీపాద గోపాలకృష్ణమూర్తి

శ్రీపాద గోపాలకృష్ణమూర్తి 1901లో జన్మించాడు. మద్రాసు విశ్వవిద్యాలయం నుండి 1932లో ఎం.ఎ., 1936లో డాక్టరేట్ ఇన్ సైన్స్ చదివాడు. లండన్‌లో పి.హెచ్.డి. చేశాడు. మద్రాసులోని ప్రెసిడెన్సీ కళాశాలలో ఫిజిక్సులో లెక్చరర్‌గా ఒక దశాబ్దం పనిచేశాడు. తరువాత బాపట్ల ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాలకు ప్రిన్సిపాల్‌గా కూడా పనిచేశాడు. పరిశోధనా తత్వంగల శ్రీపాద, వరంగల్లు ప్రాంతంలో దేవాలయాలు పరిశీలించాడు. బౌద్ధ ఆరామాలను హిందూ దేవాలయాలుగా మారిన తీరుపై వ్రాశాడు. తిరుపతిలో వెంకటేశ్వర విగ్రహం స్త్రీ రూపంలో వుంటుందన్నాడు. ఈయన రచనలు రాష్ట్ర ఆర్కియిలాజికల్ శాఖ ప్రచురించింది. గోపాలకృష్ణమూర్తి కవితా ధోరణులపై పత్రికలో వ్రాశాడు. ఆయన ప్రవేశించని రంగం అంటూ లేదు. కళలు, శిల్పం, దేవాలయాలు, కవిత్వం, సైన్స్ వుండేవి. వినువీధుల శీర్షికన సైన్స్ ఎంతో చక్కగా అందరికీ అర్థం అయ్యే శైలిలో వివరించాడు. ఈయన జిల్లెళ్ళమూడి అమ్మ బోధనలకు ప్రభావితుడై భక్తుడిగా మారాడు[1]. ఈయన 1977లో రాజమండ్రిలో తనువు చాలించాడు.

రచనలు

  1. లేపాక్షి కళామండపం
  2. స్వర కల్పన
  3. కవితా పరిశీలనం
  4. దేశి సారస్వతం
  5. తెలుగు ఏకాంకిక నాటక పరిచయము[2]
  6. అర్థ శతాబ్దపు ఆంధ్ర కవిత్వము
  7. దాక్షిణాత్య శిల్పం
  8. విజ్ఞాన సాధన
  9. విజ్ఞాన వీధులు (సైన్స్)
  10. మనభూమి – ఆకాశము
  11. ఇంటింటా విజ్ఞాన సర్వస్వము
  12. రాకెట్లు – ఆకాశయానము
  13. వైజ్ఞానిక గాథాశతి
  14. ఆంధ్రశిల్పము
  15. స్త్రీల పాటలు (సేకరణ)
  16. అక్షర తుణీరం
  17. అమ్మ – అమ్మవాక్యాలు
  18. అమ్మతో జరిపిన సంభాషణలు
  19. English – Telugu Dictionary of Scientific terminology
  20. ఐన్ స్టీన్ సాపేక్షతావాదం
  21. కలంపేరు-కృష్ణశ్రీ

శ్రీశ్రీ తరువాత ప్రయోగాలు చేస్తున్న కవుల్ని ‘నవ్యాధునికులు’గా శ్రీపాద గౌరవించారు. ఆ సత్కారాన్ని పొందినవాళ్లలో మల్లవరపు విశే్వశ్వరరావు, పిలకా గణపతిశాస్ర్తీ, ఇంద్రగంటి హనుమచ్ఛాస్ర్తీ, సంపత్ రాఘవాచార్య, పఠాభి, కుందుర్తి, బాలగంగాధర తిలక్, గోపాల చక్రవర్తి, భద్ర సింహాసనాలు పొందారు.
వీరి కవితా ధారా ధోరణులను ఎగాదిగా చూసి చూపించారు. శ్రీపాద పద్యాన్నీ, వ్యాకరణాన్ని ఈ కవులు పూర్తిగా మన్నించలేదు. మాకు అడ్డుపడి అల్లరిపెట్టే వాటిని తన్ని తరిమివేయాలనిపించిందని చమత్కరించారు శ్రీపాద. కుందుర్తి తిలక్‌ల ద్వారా మాత్రాచ్ఛందస్సులు తోకముడిచే స్థితి వచ్చేసింది. వచన పద్యం రాణి అయింది. శక్తివంతంగా అందంగా చెప్పడం సాగకపోతేనే అలంకారం అని కూడా శ్రీపాద వచన కవితాశక్తికి వెనకేసుకొచ్చారు. అయితే అది గుణపక్ష పాతంవల్లనే! ఆయన ప్రశ్న వినండి ఏ నియమాలూ లేకుండా వ్రాస్తే కవిత్వమా? అని అడుగుతారేమో నియమాలన్నీ పాటించి వ్రాస్తే కవిత్వవౌతుందా?..
కవిత్వానికో నియమాలక్కరలేదు. ఆ సత్యం గ్రహించడానికి తెలుగు వారికిన్ని శతాబ్దలు పట్టింది అంటూ నిట్టూర్పు విడిచి వచనా పద్యాలు రాసేవారిని చూసి మూతి విరుచుకోనివ్వండి. వారి మూతులట్లే ఉండనివ్వండి అని చురకనంటించారు.
అనుభవాన్ని కరిగించిపోయడం ఆధునికతా లక్షణం. జీవిత సమస్యలనెదుర్కొనే ఎదిరింప శక్తినిచ్చే రచనలు నవ్యాధునికతా లక్షణం అని క్రోడీకరించారు శ్రీపాద.
1950-60 మధ్య కవిత్వాన్ని అంచనా వేయడానికి ఈనాటి సంరంభం అనే వ్యాసం రాశారు. అది ఈ సిరీస్‌లో చివరిది. 1964 జనవరి భారతిలో వచ్చిందిది. సంకెళ్లను తెంచిపారేసిన నవ్యాధునికుల కృషి ఫలితంగా పలు ముఖాల కవిత్వం మొదలయ్యిందన్నారు. నవ్యాధునికుల్లో రెండోతరం ఆధునిక ఆరుద్రగా వీరికి కనిపించడం సహజం. ఆరుద్రలో స్వేచ్ఛతోపాటు ప్రత్యేక తంత్రం కూడా ఉందని వీరు గమనించారు. ఊహలకు బదులు వస్తువునీ అనుభవాన్నీ వాడటం ఆ నిర్మాణతంత్రం. త్వమేవాహం శ్రీపాద పరిశీలనలో నిగ్గుతేరింది. భారతిలో వచ్చినా, అప్పటికి శ్రీరంగం నారాయణబాబు కవిత్వం గ్రంథరూపం ధరించలేదు. రుథిరజ్యోతిని ఆయన ఆరుద్ర వద్ద చూశారు. నారాయణబాబు బ్రహ్మముడులు శ్రీపాద విమర్శలో విడిపోయాయి.
పాఠకుల కోసం చక్కని అవగాహన కవాటం తీశారు. హాస్యాన్ని కవిత్వంలోకి తెచ్చిన జరుక్, మాచిరాజుల ధోరణుల్ని శ్రీపాద స్పృశించారు. ఈ వ్యాసంలో నాది ప్రజల ఉద్యమం అన్న గురజాడను కమ్యూనిస్టులెలా గుర్తించారో వివరించారు. సంఘంలోని దీనులపక్షం వహించి రచనలు చేయడం కొత్త సంరంభమయిందన్నారు.
‘ఈ సందేశాలు ప్రజలకందుతాయా?’ అని నిలదీశారు. ఎవరో చెబితే వినే రోజులు ఎప్పుడో పోయాయి! అయినా చెప్పేవారు చెబుతూనే ఉంటారు. చెప్పవలసిన అంశం వుంటే శక్తివంతంగా చెప్పండి అని ముగిస్తూ శ్రీపాద తెరలోంచి వెనక్కు వెళ్లిపోయారు.

మీ -గబ్బిట దుర్గాప్రసాద్ -3-11-25-ఉయ్యూరు .

Unknown's avatar

About gdurgaprasad

Rtd Head Master 2-405 Sivalayam Street Vuyyuru Krishna District Andhra Pradesh 521165 INDIA Wiki : https://te.wikipedia.org/wiki/%E0%B0%97%E0%B0%AC%E0%B1%8D%E0%B0%AC%E0%B0%BF%E0%B0%9F_%E0%B0%A6%E0%B1%81%E0%B0%B0%E0%B1%8D%E0%B0%97%E0%B0%BE%E0%B0%AA%E0%B1%8D%E0%B0%B0%E0%B0%B8%E0%B0%BE%E0%B0%A6%E0%B1%8D
This entry was posted in రచనలు. Bookmark the permalink.

Leave a comment

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.