నవంబర్ 9కవికోకిల దువ్వూరి రామిరెడ్డి ,కథా మాస్టారు కాళీ పట్నం రామారావు గార్ల జయంతి సందర్భం గా విజయవాడ రేడియో కేంద్రంలో అక్టోబర్ 22న రికార్డ్ చేయబడి ,ఇవాళ ఉదయం 10-30 కు ప్రసారమైన నా ప్రసంగాలు -గబ్బిట దుర్గాప్రసాద్ -9-11-25-ఉయ్యూరు
కవికోకిలశ్రీదువ్వూరిరామిరెడ్డి సాహిత్య సమాలోచనం .
దువ్వూరి రామి రెడ్ది గారంటే
‘’అంతములేనియీభువనమంతపురాతనపాంధశాల,వి
శ్రాంతగృహంబు,నందునిరుసంజలురంగులవాకిళుల్,ధరా
క్రాంతలుపాదుషాలు,బహురామ్జమిషీడులువేనవేలుగా
గొంతసుఖించిపోయిరెటకో పెరవారికిచోటొసంగుచున్’’
— (పానశాల),
‘’అన్నాహాలిక!నీదుజీవితమునెయ్యంబారవర్ణింపమే
కొన్నన్నిర్ఘరసారవేగమునవాక్పూరంబుమాధుర్యసం
పన్నంబై ప్రవహించుగాని,యితరుల్భగ్నాశులై
యీర్ష్యతో నన్నుం గర్షక పక్షపాతియనినిందావాక్యముల్ పల్కరే?. ‘’(కృషీ వలుడు) పద్యాలు గుర్తుకు వస్తాయి .‘
దువ్వూరి రామిరెడ్డి ఈ శతాబ్దం ప్రథమార్థంలో తెలుగు సాహిత్య నందనోద్యానాన్ని కలకూజితం చేసిన కవి కోకిల. సామాన్య కర్షకుని కావ్యవస్తువుగా మలచిన శిల్పి. తెలుగులో పాస్టరల్ అంటే గ్రామీణ విషయ కవిత్వానికి మార్గదర్శి. కవిత్వాన్నీ, విజ్ఞాన శాస్త్రాన్నీ ఒకే నాగలికి వూన్చి ఆంధ్ర కవితాకేదారంలో సేద్యం చేసిన కృషీవలుడు. రామి రెడ్డి కవిత్వమునకు హాలికుడు ఉద్దీపకుడైనాడు ఆంధ్ర రసలుబ్ధులకు సాహిత్య పానశాలలో కవితామరంద ధార నందించిన సఖి. మహాకవి, ,, నాటక కర్త, విమర్శకుడూ. ఆధ్యాత్మికతనూ, అభ్యుదయాన్ని జోడించినవాడు. కావ్యకళకు సామాజిక ప్రయోజనాన్నికూర్చాడు. గురజాడ ఆయనకు అడుగుజాడ.. రామిరెడ్డి కవిత్వ జీవనం. ఆత్మవిశ్వాసం, దానికి తగిన పట్టుదల, దీక్ష ఆయనకు జన్మగతం. ఆంధ్రులకు జరిగిన అన్యాయ, అవమానాలు జాతి భావాన్ని ఉత్తేజిత పర్చి “హరిసర్వోత్తమ ప్రశంస’’ “తెలుగుతల్లి” కీర్తి గానం చేశాడు.
. తన ఖండ కావ్యాల నుండి మణిపూసలు లాంటి పద్యాలను ఏరి ’’వాయిస్ ఆఫ్ రీడ్ ‘’అంటే రెల్లుపూల స్వగతం’’ అన్న పేరున ఆంగ్లంలో 1923లో ప్రచురించాడు. .” ‘’నా దేశాటనం’డైరీరాశాడు..
రామిరెడ్డి 1895 నవంబర్ 9న నెల్లూరుజిల్లా గూడూరులో దువ్వూరి సుబ్బారెడ్డి, లక్ష్మీదేవమ్మ దంపతులకు జన్మించారు. భారతదేశం స్వేచ్ఛ, స్వాతంత్య్రం, జాతీయతతో కూడిన నవీన భావాలతో నిండిన సాహితీ సంపద కోసం తహతహలాడుతున్నరోజుల్లో కవిత్వంలో కొత్త రుచులు మేళవించి సాహిత్యప్రియుల దృష్టిని రామిరెడ్డి తన వైపు మరల్చుకున్నారు. ఆయన బహుబాషాకోవిదుడు, నిరాడంబరుడు, ప్రకృతి ఉపాసకుడు.
‘’చరఖా ఉత్సాహానికి,స్వాతంత్ర్యసిద్ధికి ఆయుధం -a weapon of encouragement and empowerment అన్నారు.
ఆయన జీవితమే ఓ సాహిత్య సాహసగాథ. థర్డ్ ఫారం చదివే రోజుల్లో కెమెరా, పెద్దయ్యాక వైర్లెస్ రెడియోసెట్ తయారు చేసి,కొయ్య విమానం తయారు చేసే ప్రయత్నం చేసిన మేధావి . చిత్రలేఖనం, శిల్పకళ నేర్చారు . కలకత్తా రామకృష్ణ పరమహంస ఆశ్రమ౦లోచేరి సంస్కృతం, బెంగాలీనేర్చి శారదామాతఆదేశానుసారం తిరిగి స్వస్థలానికి చేరి . గ్రంథాలయ పుస్తకపఠనంతో విశేష విజ్ఞానం సాధించారు .కార్యదీక్ష పట్టుదల త్యాగం ఆయన ఆభరణాలు . శేషమ్మను వివాహమాడారు .. భార్య ,కూతురు చనిపోవటంతో దుఃఖ నివృత్తి కోసం 1919లోనేపారశీకంనేర్చి ..ఉమర్ఖయ్యాం రుబాయిలను ‘’పానశాల’’గా పునః సృష్టి.చేశాడు .
కట్టమంచి వారి ‘’ముసలమ్మ మరణం ‘’కావ్యం ప్రభావం తో ‘’నలజారమ్మ ‘’ కథ ఆధారంగా 1915లోనే తొలి పద్యకావ్యం రచించారు.’’పంచ భూతాత్మక౦బైన పడతి మేను – ప్రకృతిలీనమైపూతమై పరిఢవిల్లె -మిగిలి యుండును సత్కీర్తి పగిది సాధ్వి -యాత్మ సర్వంబు తానయై యతిశయిల్లె’’అంటూ నలజారమ్మ అగ్ని ప్రవేశం గురించి రాసి కన్నీళ్లు తెప్పిస్తాడు . ‘వనకుమారి’ కావ్యంతో ఆయన కీర్తి మరింత ప్రకాశించింది.కర్షక విలాసం ,కు౦భరాణా ,సీతా వనవాసం నాటకాలు రాశారు . , అణగదొక్కబడుతున్న రైతుల జీవితాలే పాత్రలుగా ‘కృషీవలుడు’ అనే మహత్తర కావ్యం రచించారు. ఈ కావ్యం ఆయనను ముందుతరం కవులకు మార్గదర్శకుడిగా నిలిపింది. రైతుల జీవితాన్ని వన్తువుగా స్వీకరించి రచించిన తెలుగు కావ్యాలలో ‘’కృషీవలుడు’’ మొట్ట మొదటిది. కవిరైతు.వస్తువురైతు జీవితం.అద్భుతంగాకుదిరింది ..
“సూర్యోదయంతో తూర్చుదిక్కు స్వర్గ శిల్పి తన ఇంద్రజాలశక్తితో గీసిన చిత్రపటంలాగా ఉంది. నీ కుమార్తె వాకిలి ముంగిట ముగ్గులు వేసి గుమ్మడి పూలతో గొబ్బెమ్మలు నిలిపి, కుంకుమ చల్లి అలంకరించింది. వాటిని తొక్కకుండా వెళ్లు.అన్నారు .
స్వాతంత్య్రం నేపథ్యంలో ఆయన రచించిన ‘మాతృశతకం’లో ఒక్కో పద్యం అగ్నిశిఖను తలపించింది. . . ‘సమదర్శిని’ పత్రికకు సంపాదకుడిగా పనిచేశారు. .
. .
1936లో రామిరెడ్డి . వేంకటేశ్వర మహత్యం, గరుడగర్వభంగం, సతీతులసి, సీతారామజననం సినిమాలకు మాటలు, పాటలు. ‘నల దమయంతి’ కి దర్శకత్వంకూడా వహించారు…
పార్సీ కవి సౌదీ రచించిన రెండు కావ్యాలను ‘గులాబీ తోట’ పండ్ల తోట’ పేర్లతో తెలుగులోకి అనువదించారు. ‘కవి-రవి’, ‘ఫలితకేశం’ ద్వారా మూఢనమ్మకాలను ఎండగట్టారు. ‘జలదాంగన’తో భూగోళ రహస్యాలను చర్చించారు.
- రామి రెడ్దికి 22వ యేట నే1917లో, , సి.ఆర్. రెడ్డి అధ్యక్షతన జరిగిన ఒక సభలో స్వర్ణపతకం బహూకరించారు
- 1918లో ఈయన “వనకుమారి“,కావ్యం విజయనగరం మహారాజు ఆస్థానంలోని కావ్యస్పర్ధలో ప్రథమ స్థానం పొందింది
· 1929లో విజయవాడ ఆంధ్రమహాసభ కవికోకిల బిరుదు ప్రధానంచేసింది
“నేను మరణింపబోనోయి, మేనె మడియు; అదియు మొదలంట నాశనమగుట లేదు,”
· ‘’చిత్తరంజక రాగ నిశ్రేణి వైచి, దివ్యగానంబు భూమికి దింపరావె తంత్రులెడలిన ,వల్లకీ దండ మటుల, కూజిత విహీనమై తోచు గున్నమావి’’.ఆని విశ్వమెల్ల తనదిగ భావించమని కవిత్వతత్వాన్ని ఆవిష్కరించిన కవికోకిల కలకూజితం 11-9-1947న 51ఏళ్లకే కనుమరుగయి౦ది . ‘.
గబ్బిట దుర్గా ప్రసాద్ -22-10-25-
2-405 శివాలయం వీధి -ఉయ్యూరు .521165-కృష్ణా జిల్లా
సెల్-9989066375
కథా మాస్టారు శ్రీ కాళీపట్నం రామారావు
యజ్ఞం కధతో దోపిడి స్వరూప స్వభావాలను నగ్నంగా, సరళంగా, సహజంగా, శాస్త్రీయంగా చిత్రీకరించి , 1995 కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు పొందిన శ్రీ కాళీపట్నం రామారావు సామాన్య జ్ఞానం కల చదువరులను కూడా లీనమయ్యే భావ ప్రాధాన్య రచనలు చేశారు ..కథా మాస్టారు గా పిలువబడే శ్రీ రామారావు 1924 నవంబర్ 9న ఉత్తరాంధ్ర శ్రీకాకుళం జిల్లా లావేరు మండలం మురపాకలో జన్మించారు .భీమిలీ లో సెకండరి గ్రేడ్ టీచర్ ట్రెయినింగ్ వేర్వేరు చోట్ల టీచర్ గా ఉద్యోగించినా 1948 నుంచి 31ఏళ్ళు ఒకే ఎయిడెడ్ స్కూల్ లో ఒకే స్థాయి ఉద్యోగం చేసి రికార్డ్ సృష్టించి 1972లో ప్రథానోపాధ్యాయునిగా పదవీ విరమణ చేశారు .భార్య సీతామహాలక్ష్మి .
చిత్రకారుడు కూడా అయిన కా.రా.మాస్టారు తెలుగు కథకు శాశ్వతత్వాన్నిచ్చే విశేష కృషి చేశారు .ఆంధ్రభూమి దినపత్రికలో ‘’నేటి కథ ‘’శీర్షిక నిర్వహించి కొత్తరచయితలకు ప్రాదాన్యమిచ్చారు .అలాంటివారిలో శ్రీ యండమూరి వీరేంద్రనాథ్ ఒకరు .కారా గారి ‘’సిగ్నేచర్ కథలు’’ గా ప్రసిద్ధి చెందినవి యజ్ఞం ,ఆర్తి, చావు ,హింస ,నో రూం ,భయం ,శాంతి ,జీవధార మొదలైనవి .వర్గ చైతన్యానికి స్పూర్తి యజ్ఞం కథ ‘యజ్ఞం’ కథ ఫ్యూడల్ విధానంలోని దోపిడీని కళ్ళకు కట్టినట్లు చూపుతుంది. అట్టడుగు జీవితం లో అంతస్సంఘటన ఉన్నది .ఇది శ్రీకాకుళం పోరాటాలకు ముందు జరిగిన కథ .దీనిపై జరిగినంత చర్చ యే తెలుగు కథ పైనా జరగలేదు .సినిమా కూడా తీశారు .గురజాడ ‘’మీ పేరేమిటి “”కథ ఒక గ్రామానికి సంబంధించిన మౌఢ్యాన్ని గురించి రాస్తే ,కా.రా.ఒక గ్రామానికి సంబంధించిన క్రౌర్యాన్ని చిత్రించాడు .
ఆయన కథలు ఇతర భారతీయభాషలలోకి, రష్యన్, ఇంగ్లీషు భాషలలోకి అనువదింపబడినాయి . అభిమానాలు,రాగమయి,జీవధార,రుతుపవనాలు (కథా సంకలనం)కారా కథలు కథాకథనం, కథాయజ్ఞం ఆయన ఇతర రచనలు . ఆయన కధలు క్లిష్టంగా రాస్తారు . ’అభిమానాలు ‘’కథలో పాత్రల సంఘర్షణ,వాళ్ళ కుటుంబ వ్యవస్థ ,అభిమానం ముసుగులో వెలువడే క్రౌర్యం వ్యక్తం చేస్తారు . ఉమ్మడి కుటుంబ వ్యవస్థలో వ్యక్తిగత చైతన్యం ఆరోగ్యకర పరిస్తితులలో ఎదగదని చూ పించారు .‘’తీర్పు’’కథలో ఎలాంటి ఆర్ధిక రాజకీయ సమస్యలు ఏర్పడతాయిఅన్నది వివరించారు . ఆయన కథలు మనసుకు ఆహ్లాదం కలిగించవు .బుద్ధిని గిలకొడతాయి ’’ఆ కథలు అలానే రాయాలి ‘’అంటారాయన .ప్రపంచ సాహిత్యంలో కా.రా .గారిలా కథ చెప్పే వారు ఎంతోమంది లేరు . కన్యాశుల్కంతో సమమైన స్థానం యజ్ఞం కథది . ఆయన నిరంతరాన్వేషి ‘ ‘’అన్నారు డా .వేల్చేరు .వ్యధార్తుల యదార్ధ జీవితాన్ని చిత్రించారు . ‘’కార్డు సైజు కథ’’ కూడా రాశారు 1943లో .కథా రచనపై మార్గదర్శకం గా గొప్ప వ్యాసాలూ రాశారు .’’శైలి ఏర్పడేదే కాని ఏర్పరచుకొనేది కాదు’’,కొసమెరుపు’’ కథను సుస్పష్టం చేస్తుంది’’అన్నారు . . ఆరు దశాబ్దాలుగా కారా మాష్టారి కథలు తెలుగు సాహిత్యాన్ని సుసంపన్నం చేశాయి. ఇంతరాసినా ‘’రాయాల్సినంత ‘’ఎఫెక్టివ్ గా రాయలేకపోయాను .రాయాల్సింది చాలా ఉంది’’ఆని బాధపడ్డారు మాస్టారు..దీర్ఘ శృతి -తీవ్రధ్వని ‘’వంటి వ్యాసాలూ రాశారు .ఫ్యూచర్ రచయిత కాగల శక్తిసామర్ధ్యాలు కె .ఎన్ .వై .పతంజలికి ఉన్నాయని నమ్మకం గా చెప్పారు .వివినమూర్తి ఆయన అంతేవాసి ..సంచార విక్రయశాలలద్వారా పుస్తకాలను గ్రామీణ ప్రజలకు అందుబాటులోకి తేవాలని సూచించారు .
· . రావి శాస్త్రి వలన తానెన్నో విషయాలు నేర్చుకొన్నానని ఒక రకం గా ఆయన తన ‘’మెంటార్’’ అనీ చెప్పారుకా.రా . మనసు ఫౌ౦డేషన్ కా.రా .గారి పై పుస్తకం తెచ్చి ఆయన కథలన్నీ ప్రచురించింది .గొప్ప కథలురాసే అదృష్టం రావిశాస్త్రి, కారా, ,బీనాదేవి లకే దక్కింది అన్నాడు కొడవటి గంటి .
· ..వ్యక్తిగతంగా సమున్నతుడు .,ఒకరకంగా చెప్పాలంటే ఆయన ‘కథా తనువు.’’దేవుడు మానవుడు అయితే ఆయనకూడా .కారా మాస్టారికి నమస్కరించి తీరాల్సిందే’’ అన్నారు ప్రముఖ రచయిత రావి శాస్త్రి.
· కారా మాస్టారి మేధోజనిత నిర్మాణం శ్రీ కాకుళం లో ఫిబ్రవరి 22, 1997 న నిర్మించిన , ‘’కథా నిలయం అనే ‘’తెలుగు కథా సరస్వతీ నిలయం’’ అదే ఆయన కథా యజ్ఞం . ప్రచురితమైన ప్రతి తెలుగు కథా అక్కడ ఉండాలన్న ధ్యేయం . కథలతో పాటు కథా రచయితల జీవిత విశేషాలు, ఛాయాచిత్రాల సేకరణ కూడా చేపట్టారు. ఎక్కడెక్కడి పాత పత్రికల కాపీలు సంపాదించడంలో విపరీతంగా శ్రమించారు. 5000 కంటే ఎక్కువ వారపత్రికలు, మాసపత్రికలు ప్రత్యేక ప్రచురణలు ఉన్నాయి . ‘’ఇటువంటి కథారిఫరెన్సు గ్రంథాలయం ఏర్పరచే కృషి ఇంతకుముందు ఎక్కడా జరుగలేదని ప్రొఫెసర్ గూటాల కృష్ణమూర్తి అన్నారు .కథానిలయం రెండం అంతస్తులభవనం సకల సదుపాయాలతో వర్ధిల్లుతోంది గురజాడ, కొకు, రావిశాస్త్రులవి పెద్ద తైలవర్ణ చిత్రాలు ఉన్నాయి. పై అంతస్తులో ముందు ఒక వందమంది దాకా కూర్చోవటానికి వీలైన పెద్ద హాలు. ఈ హాలు గోడల నిండా అంగుళం ఖాళీ లేకుండా తెలుగు కథా రచయితల ఫొటోలు. వెనక వైపున ఒక అతిథిగృహం .ప్రతి ఏటా మార్చిలో కథానిలయ వార్షికోత్సవం ఘనంగా నిర్వహిస్తారు .కథలన్నీ కంచికి చేరతాయి అనే సామెత ఉంది. . .కానీ ఇప్పుడు తెలుగు కథలన్నీ కా.రా.గారి కథా నిలయం చేరి శాశ్వత గౌరవ స్థానం పొందుతున్నాయి .
· కేంద్ర సాహిత్య అకాడెమీ పురస్కారం ,ఎన్టీర్ జాతీయ పురస్కారం , హంస అవార్డ్ పొందారుమాస్టారు .1993లో న్యూయార్క్ లో జరిగిన 9వ తానా కాన్ఫరెన్స్ – ప్రపంచ తెలుగు కన్వెన్షన్‌కు అతిథిగా కా.రా .మాస్టారు అమెరికాలో వెళ్లారు .96 సంవత్సరాల నిండు జీవితం గడిపి 4-6-2021న కథకు పట్టాభిషేకం చేసిన కథా శిల్పి శ్రీ కాళీపట్నం రామారావు గారి’’ జీవిత కథ’’ కంచికి చేరింది .కథా మాస్టారు కారా ‘’కథా చిరంజీవి’’ .
· గబ్బిట దుర్గా ప్రసాద్ -22-10-25-
· 2-405 శివాలయం వీధి -ఉయ్యూరు-521165-కృష్ణా జిల్లా
· సెల్ -9989066375 .

