కులపతి అడివి బాపిరాజుగారి కీర్తిచ్ఛటలు

కులపతి అడివి బాపిరాజుగారి కీర్తిచ్ఛటలు

త్రివేణి పత్రిక సంపాదకులు శ్రీ కోలవెన్ను రామకోటేశ్వరరావు బాపిరాజుగారిని రేడియో టాక్ లో ఆయన చేతులు తిప్పటం చూసి’’ శ్రీమతి బాపిరాజు’’ అనేవారట .ఆకాలం లో అందరూ ‘’బాపిబావ ‘’అనే పిలిచేవారు .సౌందర్య పిపాసి అయిన ఆచంట జానకిరాం గారికి బాపిరాజుగారి సుతిమెత్తనిభావాలతో పాటు ,నిత్యసహజ చేష్టలూ ఇష్టమే .బాపిరాజుగారికితెలియకుండానే ఆవేశమో ఉద్వేగమో చెందుతారు.అందుకే ఆయన బ్రతుకు ‘’పరిమళార్ద్ర నందనోద్యానం’’ అయింది .

 ‘’అతడు గీసిన గీత బొమ్మై -అతడుపలికిన పలుకు పాటై -అతడిహృదయములోని మెత్తన -అర్ధవత్క్రుతియై ‘’అన్నారు విశ్వనాథ బాపి బావ గురించి .కాలపురుషుడు ఉల్లాసంగా ఉన్నప్పుడు’’కాటూరీ విశ్వనాథా జాషువా బాపిరాజు ‘’పుట్టారుకనుకనే అంతకు పూర్వం ఏకాలం లోనూ పుట్టని ఈ మహాను భావులు పుట్టారు .బాపిరాజుగారి ఊహా సుందరి శశికళ ‘’అభవ ,సద్యో యవ్వన ,అయోనిజ .ఎవరికీ ఎంతవలచినా ఆమె గృహిణి కాలేదు .

  వ్యవహార దక్షత లేని బాపిరాజుగారు లాయరుగా అధ్యాపకుడుగా ,పత్రికా సంపాదకుడుగా రాణించలేక పోయారు .ఆయన హృదయం కళా సృష్టి లేని చోట రమించదు..కల్లాకపటం లేని ఆయన లోకాన్ని మాత్రం జయించారు .ఇంట్లో ఎవరికైనా జబ్బు చేస్తే మందు కొనడానికి బజారుకు వెళ్లి  ఆడబ్బుతో యే నక్కపల్లి బొమ్మో ,కాళహస్తి కంచు విగ్రహమో కొని తెచ్చే కళాపిపాసి .ఆ బొమ్మలగురించి ఎంతసేపైనా లెక్చర్ దంచే వారు .ఆయన్ను చూస్తె ఆంగ్లకవి ‘’ఆలివర్ గోల్డ్ స్మిత్ ‘’మళ్లీ పుట్టాడని పిస్తుంది .

  ఆయన పిల్లల ప్రపంచంలో ఇట్టే ఇమిడిపోతారు .పిల్లలపోషణ బాగా తెలిసిన శ్రీమతి బాపిరాజు అయిపోతారు .కొత్తవాళ్ళు అంటే మహా బెరుకు .త్వరగా మాట్లాడి కలవలేరు ..ఆయన పాండిత్యం అంతా గురుముఖతా నేర్చింది కాదు .సాహిత్య సభల్లో రక్తితగ్గి బోరు కొట్టినప్పుడు ‘’పిలవండి బాపిరాజు ‘’ను అనగానే వేదిక ఎక్కి ‘’గవళ్ళ సెల్లాయి కూతురు .-కడు చక్కనిదని సూతురు ‘’అంటూ పాడితే ముసిముసి నవ్వులతో సభ  వెలిగిపోయి మాంద్యం వదిలి పోయేది ..

  బాపిరాజుగారి చిత్రలేఖన గురువులు రాజమండ్రి ఆర్ట్స్ కాలేజి ప్రిన్సిపాల్’’ఆస్వాల్డ్ జెన్నింగ్  కూల్డ్రేదొర , ‘’ప్రమోదకుమార్ ఛటర్జీలు .సాహిత్యం శిల్ప లేఖనం ,శిల్పం సంగీతం, నాట్యం అనేవి అయిదూ పంచనదీ పరివేష్టితమైన పంజాబు వంటిదికళ ..వాటిలో నిష్ణాతులను కులపతి అంటారు .అలా౦టికులపతి బాపిరాజుగారు

  కవులు ఆయనను చిత్రకారుడు ఆని చిత్రకారులు ఆయన్ను కవి ఆని అనుకొంటూ ఆయనకు రావాల్సిన కీర్తి రాలేదని విజ్ఞులు అంటారు ..తన శశిని ఒక తల్లికి ,కళను మరో తల్లికి పంచి ఇచ్చానన్నారు .చంద్రుడు కవిత్వానికి అధిపతి .వెన్నెల అంతా కవిత్వమే .సూర్యుడు  వర్ణపతి .చిత్రలేఖానికి అధిపతి ‘’.ఆని చెప్పారాయన .బాపిరాజుగారిభార్యకు చిన్నప్పటినుంచి నెర్వస్ బ్రేక్ డౌన్ .కదలలేని స్థితి .తనను ఎప్పుడూ దగ్గరే కూర్చోమనేది .పెద్దమ్మాయి రాధా వసంతకు చిన్నతనం లోనే పోలియో వచ్చి నడవలేదు .అయినా వాళ్ళిద్దరికీ  అత్యంత స్థైర్యం  కలిగించారు బాపిరాజుగారు .పిల్లల్ని కనటం తప్ప అన్నీ ముమ్మూర్తులా స్త్రీత్వమే ఆయనది .ఆయన నోట్లో ఆడవాళ్ళులాగా’’ నువ్వు గింజనానదు ‘’అనేవారట కాటూరి .

  ఆస్వాల్డ్ కూల్డ్రే గారితో ఆజంతా ఎల్లోరా గుహలన్నీ తిరిగి చూసి ప్రకృతి సౌందర్యం వెల్లి విరిసే చోటు కోసం బాపిరాజు గారు వెతికి ఆ రాత్రి పాపికొండల మీద అడవిలో చిక్కుకున్నారు .అన్నీ లతా నికు౦జాలే . గలగలపారే సెలయేళ్ళ  ప్రక్క తలలూపుతున ఎత్తైన వృక్షరాజాలు ,, వాటి దగ్గర రాతి బండలు .వాటిపై ప్రసరించే పండు వెన్నెల .అలసి సొలసి బాపిరాజు ఒక బండమీద నిద్రపోయారు .అప్పుడు కూల్డ్రే దొరకు ఒక అద్భుత దృశ్యం కనపడింది .ఆవెన్నెల అంతా ఒక స్త్రీ మూర్తిగా మారి బాపిరాజుగారిమీద వాలిపోయింది .ఆ దృశ్యాన్ని దొరగారు చిత్రించి శిష్యుడు బాపిరాజుగారికి బహూకరించారు అదే ‘’ఎండి మియాన్ ‘చిత్రంగా ప్రసిద్ధి కెక్కింది .ఇదీ ఆంగ్లకవి కీట్స్ రాసిన ఒక కవిత .చంద్ర దేవత సెలీన్ కు అత్యంత ప్రియమైన గొర్రెలకాపరి ’ఎండిమియాన్ పై కురిపించిన ప్రేమ వర్షం .కూల్డ్రే గీసిన ఈఅద్భుత చిత్రంపై శిష్యుడు బాపిరాజు -‘’చంద్రలోకం తూర్పు దెసలో -సూర్యలోకం పశ్చిమంలో -చిన్నిలోకం ఒకటున్నాదే-ఓ నా వెన్నెలా చిన్నారి పడుచా -ఆలోకమేలే కన్నె రాశివి -నువ్వే నువ్వేనే ‘’

  తెలుగు భాష భాషా మాధుర్యానికి  చక్కగా సేవ చేసిన  ,’’షట్ చక్రవర్తుల’’ లో బాపిరాజుగారు ,చిలకమర్తి లక్ష్మీ నరసింహం ,,శ్రీపాదసుబ్రహ్మణ్య శాస్త్రి , విశ్వనాథసత్యనారాయణ , ,నోరి నరసింహశాస్త్రి ,మల్లాది రామకృష్ణ శాస్త్రి గార్లు ఆని అంటారు విజ్ఞులు .బాపిరాజు గారి ఆహార్యం విచిత్రంగా ఉండేది .ఖద్దరుపంచ ఖద్దరు లాల్చీ ,పైన ఉత్తరీయం ,దువ్వని జుట్టు ,కాళ్ళకు బందరు చెప్పులు .

  స్వాతంత్రోద్యమం లో జైలుకు వెడితే ,మిత్రులుఎవరైనా బాపిరాజుగారికి డబ్బు ఇస్తే ,దాన్ని ఎదురైనా ‘’తన కుచేల మిత్రుల ‘’చేతుల్లో పెట్టి నిర్విరామంగా ఇంటికి తిరిగి వచ్చేవారు .తెలుగు సాహితీ వనం లో ఆ నాడు ఆయన ఒక రసాలవృక్షం  గా నిలబడి అన్నివైపులకు చేతులు సాచేవారు .బాపిరాజుగారికి స్వర్ణాభిషేకం జరిగింది .’’నాకు గురుత్వం వహించిన నా శిష్యుడు బాపిరాజు ‘’అనూ కూల్డ్రే దొర ఒకపుస్తకాన్ని బాపిరాజుగారికి అంకితం చేయటం చరిత్రలో అపూర్వ విషయం .గొప్ప అదృష్టం .తెలుగు సాహిత్యాభిమానులకు బాపిరాజు ,విశ్వనాథ గార్లు సూర్య చంద్రులు .’’పూర్వకవుల ఆఖరి కాపు శ్రీపాద కృష్ణ మూర్తి శాస్త్రిగారు ,నవ్యకవుల ప్రధమ సంతానం రాయప్రోలు సుబ్బారావు ,నవ్యకవిత్వం లో వంకర కొమ్మ శ్రీ శ్రీ ‘’ఆని బాపిరాజుగారు ఎస్టిమేట్ చేశారు ..

  హైదరాబాద్ లో మీజాన్ పత్రిక నడుపుతూ ,పత్రికలో సీరియల్ నవలారచనకు ఆద్యులై , సినిమాకాలం కూడా ప్రవేశ పెట్టిన ఘనత బాపిరాజుగారిది .’’ఆకాశ మల్లె దీవి -ఆమల్లెపూల తావి -అల్లదిగో బావ చూడు -అల్లారు ముద్దుబావ -అడివి బాపి బావ ‘’

ఆధారం -పురాణ౦ వారి ‘’మధుర వాణి ఇంటర్వ్యూలు ‘’

సశేషం

మీ -గబ్బిట దుర్గాప్రసాద్ -18-11-25-ఉయ్యూరు

Unknown's avatar

About gdurgaprasad

Rtd Head Master 2-405 Sivalayam Street Vuyyuru Krishna District Andhra Pradesh 521165 INDIA Wiki : https://te.wikipedia.org/wiki/%E0%B0%97%E0%B0%AC%E0%B1%8D%E0%B0%AC%E0%B0%BF%E0%B0%9F_%E0%B0%A6%E0%B1%81%E0%B0%B0%E0%B1%8D%E0%B0%97%E0%B0%BE%E0%B0%AA%E0%B1%8D%E0%B0%B0%E0%B0%B8%E0%B0%BE%E0%B0%A6%E0%B1%8D
This entry was posted in రచనలు. Bookmark the permalink.

Leave a comment

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.