కులపతి అడివి బాపిరాజుగారి కీర్తిచ్ఛటలు -3(చివరిభాగం )
జైలులో ఉన్నప్పుడు బాపిరాజుగారు బోలెడు పెన్సిల్ స్కెచెస్ వేశారు .అవన్నీ ఆయన జ్ఞాపకాలలోంచి వచ్చినవే .అందులో ద్వారం నాయుడు గారి వయోలిన్ కచేరి ,రామప్పదేవాలయ నాగిని నృత్యం ,సాలార్ మ్యూజియం లో నవాబుల హుక్కా వగైరాలున్నాయి .ఇవన్నీ కూడా బాగా ప్రసిద్ధి పొందినవే . ఆయనకాలం లో ఉన్న గొప్ప చిత్రకారులలో దామెర్ల రామారావు ,కవికొండల వెంకటరావు ,ఆయన సతీర్ధులు .బాపిరాజుగారి వర్ణ చిత్రాలన్నీ ఎవరూ జాగ్రత్తచేయలేదు .బందరు నేషనల్ కాలేజిలోరెండు ,విశాఖ మ్యూజియం లో కొన్ని ,చితికిపోయిన సంస్థానాలలో కొన్ని అలా ఎక్కడి కెక్కడికో చేరిపోయాయి .బాపిరాజుగారి ‘’శబ్ద బ్రహ్మ’’ చిత్రం మాత్రం డెన్మార్క్ చిత్ర శాలలో సజీవంగా ఉన్నది .
ఉమ్మడి మద్రాస్ రాష్ట్రం లో తెలుగు వారిని అత్యంత హీనంగా చూడటం భరించలేక కవితలు రాశారు బాపిరాజు గారు .ఆ అణచిచి వేత చరిత్రలో రాలేదు కనుక కవిత్వం లోకి ఎక్కించాను ఆని చెప్పారాయన .-
‘’ఆంధ్రులప్రతిభ ,ఆంధ్రులకీర్తి -ఆఖరుకాదనీ ఆరిపోవదనీ -మోగి౦ప వమ్మా జయజయ ఢంకా -తెలుగుగానమూ తెలుగు నాట్యమూ-తెలుగు రంగులు తెలుగు తేనెలు – ఆగిపోవనీ అందం వీడవనీ -రూపం చెడదనీ ,రుచులు తగ్గవనీ -మోగి౦ పవమ్మా జయజయ ఢంకా’’ఇలాంటి వెన్నో రాశారు స్వయంగా పాడే వారు బాపిరాజుగారు .’’జ్యోతిర్మయి ఆంధ్రీ ‘’లాంటిపాటలలో మిగిలిన భాషలవారి పట్ల ద్వేషం లేదు.మహాత్మా గాంధీ మీద రాసిన పాటలలోనూ ఇంగ్లీష్ వారిపై ద్వేషం లేదు ఆని చెప్పారాయన ..ఈ పాతలన్నే ఆయన భావనా శక్తి వల్ల బ్రతికి ఉన్నాయి అందుకే విశ్వనాథ ‘’బావా !నీకున్నంత భావనా శక్తి నాకు లేదోయి.నాకున్న భాషా పాటవం నీకు లేదోయి ‘’అంటే నవ్వేసే వారు బాపిబావ .
బందరు జాతీయ కళాశాల ప్రిన్సిపాల్ గా బాపిరాజుగారున్నప్పుడు దాని అభివృద్ధికి ఎంతో కృషి చేశారు .అప్పుడు కాటూరి వెంకటేశ్వరరావు గారు అక్కడ అధ్యాపకుడు .వీరిద్దరికలయిక ‘’ప్రకృతి ,పురుషులకలయిక గా ‘’ఉండేది .ముట్నూరి కృష్ణారావుగారు వీరి గురుదేవులు .బాపిరాజు గారి ఇంటిపేరు ‘’అడివి’’ అయినా సాహిత్యం ‘’నందనోద్యానం ‘’ .ఆరోజుల్లో బాపిరాజు ,బసవరాజు నండూరి గార్లు ‘’గేయ కవిత్రయం ‘’.బాపిరాజు గారి గేయాలెన్నో అముద్రితాలు ఆని ఆయన బాధ పడేవారు .ఆయన గేయాలు అన్నీ ‘’Poems ‘’అనే ఆయన ముచ్చటైన నోట్ బుక్ లో ఉన్నాయని అది తన కూతురు రాదా వసంత వద్ద ఉందని చెప్పారు .తంజావూరు రాజు రఘునాధ నాయకుడి ఊరేగింపు తో ప్రారంభమయె నవల ‘’మధుర వాణి ‘’ రాశారు .అది రఘునాధ రాయలు ,మధురవాణి చుట్టూ తిరిగే కధ .
త్రివేణి పత్రికకు బాపిరాజుగారు కొంతకాలం సంపాదకులుగా ఉన్నారు.సతీఅనసూయ ,ధ్రువ విజయం ,మీరాబాయి సినిమాలకు కళాదర్శకులుగా పని చేశారు .’’బాపిరాజుగారికి చిత్రకళ పిలిస్తే పలికే దివ్య శక్తి ఉంది’’అన్నారు ప్రముఖ ఆయుర్వేద వైద్యులు సాహితీ ప్రియులు శ్రీ గూడూరి నమశ్శివాయగారు .ముట్నూరి కృష్ణారావుగారు బాపిరాజులోని కళా తృష్ణ గుర్తించి ‘’కులపతి ‘’బిరుదునిచ్చారు .బందరు ఆంధ్రజాతీయ కళాశాలనుబాపిరాజుగారు ఆదర్శమైన ‘’గురుకులం ‘’.గా తీర్చిదిద్దారు .
‘’నువ్వటే,నువ్వటే – పువ్వు వంటీ వయసు ,-నవ్వులాంటీ సొగసు -రువ్వి నాయెదపైన-పర్వు లెత్తా వటే ‘’అంటూ ఎప్పుడూ పాడుకొనే వారు కులపతి శ్రీ అడివి బాపిరాజు గారు .
ఆధారం
శ్రీ పురాణం సుబ్రహ్మణ్య శర్మగారి ‘’మధుర వాణి ఇంటర్వ్యూలు ‘’.
మీ – గబ్బిట దుర్గాప్రసాద్ -19-11-25-ఉయ్యూరు

