జీవన సాఫల్య పురస్కారం -1
నిన్న 23-11-25 ఆదివారం బందరు దగ్గర చిలకలపూడిలో కృష్ణాజిల్లా రచయితల సంఘం అధ్యక్షులు శ్రీ గుత్తికొండ సుబ్బారావు గారి ఆధ్వర్యం లో వారి ధర్మ పత్ని కీ.శే.శ్రీమతి గుత్తికొండ రామరత్నం గారి 12వ వర్ధంతి సందర్భంగా జీవన సాఫల్య పురస్కారాలను గుత్తికొండ రామ రత్నం చారిటబుల్ ట్రస్ట్ -అన్నపూర్ణ వృద్ధుల సేవాశ్రమం లో లోని రామరత్నం ఆడిటోరియం లోఒక గంట ఆలస్యంగా ప్రారంభమైనా కమనీయంగా జరిగింది .సభాధ్యక్షులు సాహితీ సింధు,శతాధిక గ్రంధకర్త ,మహా సాహితీవేత్త డా.జి వి పూర్ణచంద్ నేతృత్వంలో అవనిగడ్డ శాసనసభ్యులు తెలుగు భాషా సంస్కృతీ పరిరక్షకులు మాన్యులు డా.మండలి బుద్ధప్రసాద్ ముఖ్యఅతిధిగా ,అన్నపూర్ణ వృద్ధుల సేవాశ్రమం అధ్యక్షురాలు ,సాంఘిక సేవా తత్పరురాలూ శ్రీమతి కరెడ్ల సుశీల స్వాగత ప్రసంగం తో ప్రారంభమైంది .ఉయ్యూరునుంచి కారులో నేనూ ,సరసభారతి సాంకేతిక నిపుణులు శ్రీ గంగాధరరావు ,మా మూడవకోడలు రాణి ,నాల్గవ కోడలు మహేశ్వరి వెళ్ళాం .సాయంత్రం 4-30కె సభాస్థలి చేరాం .కారణం మా ఉయ్యూరు సరసభారతి సభలకు సుబ్బారావు గారు ఎప్పుడూ అందరికంటే ముందే వస్తారు .మేమూ దాన్నే అనుసరించాం .
జీవన సాఫల్య పురస్కారాలు అందుకొన్నప్రముఖులు 1-ఆచార్య ఎం.సి దాస్ -విద్యా ,సామాజిక వేత్త (బెజవాడ )2-శ్రీ గబ్బిట దుర్గాప్రసాద్ -నిరంతర రచనా నిమగ్నులు ,సరసభారతి అధ్యక్షులు (ఉయ్యూరు )3-శ్రీమతి మందరపు హైమవతి -స్త్రీవాద రచయిత్రి (బెజవాడ )3-డా. గుమ్మా సాంబశివరావు -ప్రసంగ ప్రజ్ఞానిధి,విమర్శక శిఖామణి (బెజవాడ )4-శ్రీమతి తేళ్ళ అరుణ-సామాజిక వేత్త ,గౌరవాధ్యక్షులు ,నవ్యాంధ్ర రచయితల సంఘం 5-శ్రీదామెర్ల నరసింహారావు -విద్యా వేత్తసాహితీ ప్రియ౦భావకులు*(మైలవరం ) 6-భవిష్య -భావతరంగిణి సంపాదకులు-(బందరు) .వీరందరికీ శ్రీ బుద్ధప్రసాద్ గారి చేత శాలువా జ్ఞాపిక తెల్ల చామతుల పుష్పహారం తో పాటు 5 వేల రూపాయల నగదు కానుకగా అందించి అపూర్వంగా సత్కరించి గౌరవించారు .
బుద్దప్రసాద్ గారు,పూర్ణ చంద్ గారు సన్మానితులందరి గురించి విపులంగా వివరించారు . సన్మానితులూ ఉచితరీతిని కృతజ్ఞతలు చెప్పారు .ఆడిటోరియం నిండిపోయి అదనపు కుర్చీలు వేయాల్సి వచ్చింది .నేనూ బందరు సభలకు వెళ్లి ఆరేళ్ళు దాటి ఉంటుంది .అందరికి ఈసభ గొప్ప జోష్ నిచ్చింది .ఇదంతా సుబ్బారావుగారి పై ఉన్న ఆప్యాయత గౌరవం కారణం .సభాన౦తరం అందరికి గొప్ప విందు నిచ్చారు .
సభకు ముందు నేను బుద్ధప్రసాద్ గారి ప్రక్కన కూర్చుని మాట్లాడుకున్నాం.శ్రీకాకుళం. లో కృష్ణ దేవరాయల సభలు జరపటం లేదేమని అడిగా .ఎలెక్షన్ కోడ్ అడ్డం వచ్చి అప్పుడు జరపలేదు ఈసారి చేద్దాం అన్నారు .నేను సభలకు హాజరైనప్పుడు ఎవరు ఏమి మాట్లాడిందీ చక్కగా నోట్ చేస్తానని ఆ డైరీలన్నీ ముద్రించాలనీ లేకపోతె విలువైన సమాచారం మిస్ అవుతుందని చెప్పారు .ఇదేమాట వేదికపైనా అందరికి తెలియజేశారు .సరే అన్నాను .
వేదికపై నేను కృతజ్ఞత తెలియజేస్తూ మాట్లాడుతూ ‘’12ఏళ్ల కాలాన్ని పుష్కరం అంటారు .ఇవాళ ఇక్కడ కొంత హృదయభారంతో జరిగినా’’ సాహితీ పుష్కరం’’ గా ఉంది.సాహితీ వాహినులు అయిన ఆరుగురికి జీవనసాఫల్య పురస్కారం అందించటం కనువిందుగా ఉంది .కృష్ణా జిల్లా రచయితల సంఘం జరిపిన జాతీయ సభలో నాకు ఈ సంఘం తో మొదటి సారి పరిచయం ఏర్పడింది .అప్పుడు సెకండరి విద్యా విషయమై ఒక వ్యాసం రాయాల్సి వచ్చినప్పుడు సుబ్బారావు గారు నేషనల్ అవార్డీ గొప్పకధకులు మా అందరికి పితృసమానులు శ్రీ సోమంచి రామం గారిని అడగటం ,ఆయన నాపేరు చెప్పటం , ఆవిషయం రామం గారు కూడా నాకు ఫోన్ చేసి చెప్పటం జరిగింది .ఆ వ్యాసం రాసి పంపాను అప్పుడే సుబ్బారావు గారు కూడా మొదటిసారిగా నాతో ఫోన్ లో మాట్లాడటం .సభలోనే మొదటిసారి పూర్ణ చంద్ గారితో పరిచయం ..అప్పుడే ఇటీవలే పరమపదించిన శ్రీ కాలనాథ భట్ల వీరభద్ర శాస్త్రి గారితో పరిచయం .అయన మా కజిన్ సిస్టర్ శారదక్కయ్య ఆడపడుచు భారతి భర్త విశాఖ లో ఉండే మాధ్స్ లెక్చరర్ శ్రీ పొన్నపల్లి రామకృష్ణయ్య వారి బంధువు . అప్పటి నుంచి ఈసంఘం అన్నికార్యక్రమాలలో నేను పాల్గొంటూనే ఉన్నా.వారు ప్రచురించిన అన్ని పుస్తకాలలో నాతో ఆర్టికల్స్ రాయిస్తూనే ఉన్నారు .పూర్ణ చంద్ గారు ఫోన్ చేసి ‘’మాస్టారూ! ఈ టాపిక్స్ ఉన్నాయి .వ్యాసం రాయాలి మీ ఇష్టం వచ్చింది తీసుకొని రాయండి ‘’అనేవారు .’’అలాకాదు .మీరూ ఏది రాయమంటే అది రాస్తా ‘’అనే వాడిని .అలానే రాసేవాడిని .ఉయ్యూరులో మా సరసభారతి కార్యక్రమాలనన్నిటికి ఈ’’ త్రయం’’ తప్పక వస్తారు .రావటంలో ఆనందం ఉంటుదిమాకు .వేదిక ముందు కూర్చున్నప్పుడు బుద్ధప్రసాద్ గారు సుబ్బారావు గారితో ‘’దుర్గా ప్రసాద్ గారు ఎందరెందరికో పురస్కారాలిస్తారు ఆయనకు మనం ఎప్పుడూ ఇవ్వలేదు ‘’అంటే సుబ్బారావు గారు ‘’అందుకే ఇప్పుడు ఇస్తున్నాం ‘’అన్నారు .మిగిలిన విషయాలు ఈసారి .
సశేషం
మీ -గబ్బిట దుర్గాప్రసాద్ -24-11-25-ఉయ్యూరు

