జీవన సాఫల్య పురస్కారం -2(చివరిభాగం )
ఈ ఆగస్ట్ లో హైదరాబాద్ నుంచి శ్రీ తనికెళ్ళ భరణి ఫొన్ చేసి ‘’మీరు రాసిన వ్యాఖ్యాన చక్రవర్తి కోలాచలం మల్లినాథ సూరి ‘’పుస్తకం ఎవరిదగ్గరో ఉంటే తీసుకొని చదివాను .అద్భుతం .మీకు నాపాదాభి వందనం ‘’ఆని మూడు సార్లు అన్నారు .ఇంతకంటే గొప్ప అవార్డ్ నాకు ఇంకేవరుఇస్తారు ఆని పించింది .సరసభారతి పుస్తకాలన్నీ కావాలి అంటే అన్నీ పిడిఎఫ్ లో ఉన్నాయి డౌన్ లోడ్ చేసుకోవచ్చు అన్నా .మర్నాడు ఉదయం మళ్లీ ఫోన్ చేసి అన్నీ డౌన్ లోడ్ చేసుకొన్నాననీ కాని ఒరిజినల్స్ కావాలన్నారు .డబ్బు ఎంత అయితే అంతా పంపుతానన్నారు .’’మాపుస్తకాలన్నీ ఉచితమే .మా అబ్బాయి శర్మ హైదరాబాద్ లో ఉంటాడు అతనే మీ ఇంటికి తెచ్చి అందిస్తాడు ‘’అన్నా .’’ఆశ్చర్యంగా ఉందే’’ అన్నారు .తాను మల్లినాథ సూరి పుట్టిన తెలంగాణలోని సిద్ధిపేట దగ్గరున్న కొలచలగ్రామం లో సూరి ఇంట్లో ఒక కార్యక్రమంచేయాలను కొంటున్నాననీ ,దానికి ‘’మీరుకూడా తప్పక రావాలి ‘’అనగా ‘’అది నా అదృష్టం మహద్భాగ్యం ‘’అన్నా.నేను అన్నట్లే మా అబ్బాయి శర్మ,మా మనవడు హర్ష వారింటికి వెళ్లి సరసభారతి పుస్తకాలు అందజేసి వీడియో తీసి యుట్యూబ్ లో పోస్ట్ చేశాడు .
నేనుదాదాపు రెండున్నర ఏళ్లనుంచి ఉదయం రెండు గంటలు సాయంత్రం రెండు గంటలు సరసభారతి ఫేస్ బుక్ లో వివిధ గ్రంథాలను ప్రత్యక్ష ప్రసారం చేస్తున్నాననీ ,అవన్నీ యుట్యూబ్ లో పోస్ట్ అవుతున్నాయని ఇప్పటికి నాలుగు వేల ఎపిసోడ్ లు నాలుగు వేల గంటలు చేశానని చెప్పాను .
సుబ్బారావు గారు మాటల మనిషికాదు చేతల మనిషి .అర్ధాంగి స్మృతినిఇంత అర్ధ వంతం గా నిర్వహించటం మనీషులకే సాధ్యం ఆని ,అలాంటి మనీషి గుత్తికొండ అనీ ,దీనికి సహకరిస్తున్న అమెరికాలో సెటిల్ అయిన వారి ముగ్గురు కుమార్తెల సహకారం, అంతకు మించి వారి అల్లుళ్ళ సహృదయత మాటలలో చెప్పలేనిదని అన్నాను .వారందరికి మా అందరి శుభాశీస్సులని చెప్పాను .ఈ ఓల్డేజ్ హోమ్ లో ఇరవై మంది మహిళలున్నారు .వారందరూ ఉచిత సేవ పొందుతున్నారు ఈ ట్రస్ట్ సహకారంతో .ఎవరైనా ఒకరోజు భజనం స్పాన్సర్ చేయాలంటే 2500 రూపాయలు పంపిస్తే వారి పేర మధ్యాహ్న భోజనం ఏర్పాటు చేయిస్తారని నెలకు ఇలాంటి స్పాన్సర్లు సుమారు పది మంది ఉంటారని,గదులలో ఆహార పదార్ధాలు స్టోర్ చేసి ఉంటాయని ,వంటమనిషి కూడాఉంటారనీ ,ఆశ్రమం లోని ఓపికున్న వారు వంటకు, వడ్డనకు సాయం చేస్తారని ,ఉదయంతిఫిన్ కాఫీ మధ్యాహ్నం భోజనం సాయంత్రం స్నాక్స్ రాత్రి భోజనం ఉంటాయి .దాతలు ఇచ్చిన స్థలం లో ఈ భవన నిర్మాణం సుబ్బారావు గారు చేశారనీ చెప్పాను .అనాధలు ఎవరైనా మరణిస్తే వారి అంత్యక్రియలు కూడా ట్రస్ట్ ఖర్చు తో నిర్వహిస్తారు.,నేను కొందరు ఇన్ మేట్స్ తో మాట్లాడితే వారంతా ఎంతో సంతోషంగా ఉన్నట్లు ఏలోటూ లేనట్లు చెప్పారని తెలియజేశాను .చిలకలపూడి రైల్వే స్టేషన్ ఎదురుగా ఈ సేవాభవనం ఉందని చెప్పాను .దీన్ని ఎ లోట్టు రాకుండా సమర్ధతతో నిర్వహిస్తున్న శ్రీమారి సుశీల గారిని అభినందించాలి .ఆమె అందరికి తలలో నాలుకలా ఉంటారు .ముఖ్యంగా సుబ్బారావు గారి కుటుంబానికి చాలా సన్నిహితురాలు .రెండేళ్లక్రితం సరసభారతి ఉగాది పురస్కారం ఆమెకు అందజేశాం .ఈసభకు సరసభారతితో పరిచయమున్న శ్రీమతి గురజాడ రాజరాజేశ్వరి ,శ్రీమతి మేరీకృపాబాయి శ్రీమతి అన్నపూర్ణమొదలైన వారు వచ్చారు .ఇదంతా నిన్నటి సభా విశేషాలు .
శ్రీ గుత్తికొండతో 50 ఏళ్ల క్రిందటి తొలి పరిచయ విశేషాలు
.బహుశా ఆయనకు గుర్తు ఉండకపోవచ్చు .1970 దశకం లో అనుకొంటా బందరు సెంట్రల్ లైబ్రేరియన్ కృష్ణా జిల్లా గ్రంథాలయ సెక్రెటరి శ్రీ చ౦ద్ర శేఖర రావు గారు ఉండేవారు .అప్పుడు శ్రీ దొండపాటి దేవదాసుగారు అటెండర్ .తర్వాత ఆయనా లైబ్రేరియన్ అయ్యారు అక్కడే .అప్పటికే మంచి కథారచయితగా పేరు పొందారు .మేము ఉయ్యూరులో సాహితీ మండలి నిర్వహించినపుడు ,సరసభారతి కార్యక్రమాలకుఆహ్వానిస్తే వచ్చి చక్కని ప్రసంగం చేసేవారుదేవదాసుగారు .అపుడు ఆ లైబ్రరీలో శ్రీ ఆవంత్స సోమసుందర్ గారి ఉపన్యాసం కు ఉయ్యూరు నుంచి నేనూ,ఉయ్యూరులో నాతో పాటు సైన్స్ మాస్టర్ గా పని చేస్తున్న ,ప్రముఖవిమర్శకుడు ,శ్రీశ్రీని అవపోసన పట్టిన మిత్రుడు టి ఎల్ కాంతారావు ,లెక్కలమాస్టారు ఆంజనేయ శాస్త్రి ,హిందీ మాస్టార్ శ్రీ కొడాలి రామారావు కాంతారావు ప్రేరణ తో ఆ మీటింగ్ కు వెళ్ళాం .సభలో ఉపన్యాసం విన్నాం .మాకు లైబ్రరి సెక్రెటరి గారింట్లోనే భోజనం పడక కూడా .ఆయన శ్రీ కొల్లూరి కోటేశ్వర రావు గారికి దగ్గర బంధువు ఆని గుర్తు .
మర్నాడు ఉదయం కాంతారావు మమ్మల్నిముందుగా శ్రీ పువ్వాడ తిక్కన సోమయాజి గారింటికి తీసుకు వెళ్లారు .అక్కడే వారితండ్రిగారు కవిపాదుషా శ్రీ పువ్వాడ శేషగిరి రావు గారిని మొదటిసారీ,ఆఖరి సారి చూశాం .ఆతర్వాత ఆంధ్ర సారస్వత పరిషత్ అధ్యక్షులు శ్రీ ‘’జిసనార ‘’ గారిని వారింట్లో చూశాం .ఆతర్వాత శ్రీ విహారి గారి నీదర్శించా౦ ,వీరి జంట శ్రీ శాలివాహన ఊర్లో లేరట .పిమ్మట శ్రీ గుత్తికొండ సుబ్బారావు గారినీ కలిశాము .ఆయన అప్పుడు ఇన్ షర్ట్ర్ట్ ,బెల్ట్ తో, సన్నగా రివటగా ఉన్నట్లు గుర్తు . కాంతారావు ఆయన్ను పరిచయం చేస్తూ ‘’మాంచి చురుకైన వ్యక్తి .ఒకరకంగా మాలీడర్ ‘’ఆని చెప్పాడు .తర్వాతప్రసిద్ధ కథా రచయిత ‘’సి. రా .‘’ఆని పిలువబడే శ్రీ సింగరాజు రామ చంద్రమూర్తి గారినీ చూసి మాట్లాడిన గుర్తు .వీరంతా బందరు ఎల్ .ఐ. సి. లో ఉద్యోగస్తులే .అలా సుబ్బారావు గారితో ఆనాటి బంధం ఈనాడూ సుమారు 20 ఏళ్లనుంచి మళ్లీ కొనసాగటం నా అదృష్టం .
మీ -గబ్బిట దుర్గాప్రసాద్ -24-11-25-ఉయ్యూరు .

