కవి శేఖర శ్రీ గురజాడ రాఘవ శర్మ
‘’మహాత్మాగాంధీ పిలుపు విని ,స్వరాజ్య సంరంభం లో పాల్గొని దేశ సేవకు తనను తాను అర్పించుకొన్న త్యాగమూర్తి కవి శేఖర శ్రీ గురజాడ రాఘవ శర్మ గారు .చదువు సంధ్యలు పూర్తి చేసి, గౌరవప్రదమైన ఉద్యోగం లో చేరి కుటుంబ భారం వహిస్తాడని గంపెడు ఆశతో ఉన్న తలిదండ్రులను కాదని, రాత్రిం బగళ్ళు కాంగ్రెస్ సందేశాన్ని గురించి కృష్ణా జిల్లా గ్రామాల వెంట తిరిగి ప్రజలను ,కాంగ్రెస్ కార్యకర్తలను ఉత్తేజితులను చేసిన ఘనత శ్రీ గురజాడ రాఘవ శర్మ గారిదే .
శ్రావ్యమైన కంఠం,మధురమైన కవిత్వం ,నిష్కామమైన ప్రజాసేవ ఆయనది .మిత్రులకు ప్రేమమూర్తి .బందరు ఆంధ్ర జాతీయ కళాశాలలో ,ఖద్దరు సంస్థలో కుటుంబ పోషణకు తగినంత మాత్రం సంపాది౦చు కొంటూ ,కవితా వ్యాసంగం చేస్తూ,జ్యోతిషం ,సాముద్రిక శాస్త్రం , వాస్తుశాస్త్రాలలో గొప్ప పాండిత్యం సంపాదించి ,కోరిన వారికందరికీ ఉచితంగా సలహా సంప్రది౦పులనిస్తూ ,పరమ పూజ్యభావంతో ప్రణతులు అందుకొంటున్న నా ప్రియమిత్రులు నా షష్టిపూర్తి సన్మాన సంచికకు సర్వ వ్యవహారాలలో మిత్రుడు శ్రీ మండలి కృష్ణారావు గారికి సలహాలనిస్తూ ,సవ్య సాచిగా శ్రమించారు శర్మగారు .వారికి నా కృతజ్ఞతా పూర్వక వందనాలను సమర్పించటం నా విధి గా భావిస్తున్నాను ‘’అంటూ గొప్ప కీర్తి కిరీటం పెట్టారు శర్మగారికి రైతుపెద్ద ఆంధ్ర ప్రదేశ్ శాసనమండలి చైర్మన్ ,పద్మభూషణ్ శ్రీ గొట్టిపాటి బ్రహ్మయ్య గారు తమ స్వీయ చరిత్ర ‘’నా జీవన నౌక ‘’లో .
గురుజాడ రాఘవశర్మ

