శ్రీ మాదిరాజు రంగారావు గారి గురించి శ్రీ చేపూరు సుబ్బారావు  

శ్రీ మాదిరాజు రంగారావు గారి గురించి శ్రీ చేపూరు సుబ్బారావు  

మాదిరాజు రంగారావు గారు తెలుగులో, సంస్కృతంలో గొప్ప పండితులు, కవితారాధకులు, కవి, సాహిత్య విమర్శకులు. పిన్న వయస్సులోనే డాక్టరేట్‌ తీసుకున్న ప్రజ్ఞాశాలి. అధ్యాపక వృత్తిలో వారు అధిరోహించని ఉన్నత శిఖరాలు లేవు. సీనియర్‌ ప్రొఫెసర్‌గా, డీన్‌గా ప్రసిద్ధులు. మృదుస్వభావి, వినయశీలి, పూర్వభాషి, బహుగ్రంథకర్త.

Fame is the last infirmity of a noble mind,’’ అన్నారు సుప్రసిద్ధ ఆంగ్లకవి మిల్టన్‌. రంగారావు గారి విషయంలో ఇది ప్రత్యక్షర సత్యం. నిజాయితీతో ఇచ్చే కాంప్లిమెంట్‌ను కూడా పట్టించుకోని వినయ భూషణులు ఆయన. మెచ్చుకోబోతే దారి మళ్ళిస్తారు! ‘లైమ్‌లైట్‌’లో ఉండడానికి ఏ మాత్రం ఇష్టపడని పెద్ద మనిషి.

కొన్ని రోజులు విశ్వనాథవారి ఇంట్లో ఉండి శిష్యుడిగా కవితా కళ రహస్యాలను ఆకళింపు చేసుకున్న భాగ్యశాలి మాదిరాజు రంగారావు. అయినా తన గ్రంథాన్నొకదాన్ని శ్రీశ్రీకి అంకితమిచ్చిన సమ్యక్‌దృష్టి కలిగినవారు. తన పని తాను చేసుకుంటూ పోయినవారు, రాసుకుంటూ పోయినవారు.. తపస్సు చేసుకుంటూ పోయినట్లు. అది ఆయన మనోధర్మం. లోకం పొగడుతుందో, తెగుడుతుందో పట్టించుకోని వైరాగ్యం కలిగిన మనిషి.

సాహిత్యం సమాజ హితం కోరేదై వుండాలన్నది రంగారావు నిశ్చితాభిప్రాయం. ఛందోబద్ధమైన పద్యం, గేయం ఉండనే ఉన్నవి. వాటి పట్ల వారికి గౌరవమూ ఉన్నది. కానీ వారు అభిమానించే కవితారూపం ‘‘స్వేచ్ఛా కవిత్వం’’. వచన కవిత్వమని బహుళ ప్రచారంలో ఉన్నదానిని వారు స్వేచ్ఛా కవిత్వమని సంభావిస్తారు. ప్రజాస్వామ్య సామ్యవాదయుగంలో ఉన్న మనకు తగినది ఈ స్వేచ్ఛా కవిత్వమేనని వారు గాఢంగా విశ్వసిస్తారు. కొన్ని పదుల సంవత్సరాల నుంచి నెలకు ఒక స్వేచ్ఛా కవిత్వ గ్రంథాన్ని రాస్తున్నారు, ప్రచురిస్తున్నారు. నన్ను అభిమానించి నాకు పంపుతున్నారు.

స్వేచ్ఛా కవిత్వాన్ని గురించి ఆయన ఇలా అంటారు: ‘‘ఎందరు కవులు వచ్చినా ఇంకా మరొకరికి చోటు లభిస్తూనే వుంటుంది. ఇదీ దీని మహనీయత.’’ అంటే పుష్పక విమానం లాగ అన్నమాట. ఇంకా అంటారు– ‘‘జీవనయాన కవిత్వంలో ఒక పొర (లేయర్‌) భావమయం, ఊహానవం, కొంత కల్పన ఎక్కువగా యాదార్థ్యంతో కూడినది. రెండో పొర అనుభవ సుందరరమైంది. అనుభవ స్పందనలతో ఆవిష్కృతమైంది. మూడోది దార్శనికత చేత ఆయువుపట్టుగా ఏర్పడింది. చివరిది నాల్గవది దివ్యత, భవ్యత చేత కళాత్మకతను కలిగింది.’’ ఇలా కవిత్వతత్త్వాన్ని సిద్ధాంతీకరించగలిగిన గొప్ప మేధావి, విమర్శకులు రంగారావు. పగలనక, రాత్రనక వెల్లివిరిసే ప్రకృతి సౌందర్యాన్ని ఎంత చక్కగా కవిత్వీకరించారో చూడండి: ‘‘రాత్రి అయితే పదహారు చంద్రకళలు/ పగలయితేనో శతసహస్ర కిరణ పంక్తులు’’ – జీవన సౌందర్యాన్ని వారు ఆవిష్కరించే తీరే వేరు…

‘‘ఆకుపచ్చని భాగ్యం సమృద్ధికి సంకేతం/ ఎరుపురంగు పరివర్తన తైజస చిహ్నం/ వివిధ వర్ణసమాహితం ఈ అనుభవం.’’

రంగారావు గారు John Donne వలె మెటాఫిజికల్‌ పొయెట్‌. జీవన సత్యాలను, లక్షణాలను సిద్ధాంతీకరిస్తున్నట్లు ఆయన కవిత సాగుతుంది.

‘‘ఈ చరిత్ర నిర్మాణంలో మనిషిది ప్రధాన భాగస్వామ్యం/ భాగ్యస్థితకు సమాజ పరిణామంలో స్థాయి బహు ముఖ్యం’’.

Advertisement

వీటిని అర్థం చేసుకొని ఆనందించడానికి ఎంతటి పరిణతి కావాలి? అంచేతే నేను దీనిని ‘మెటాఫిజికల్‌ పొయెట్రీ’ అంటున్నాను. కవితలనిండా కాన్‌సెప్ట్స్‌. ఇన్సిడెంట్స్‌ తక్కువ. వాటిని అందంగా చెప్పడం వారి ప్రత్యేకత.

అక్కడక్కడ sensuous beautyని అందించే కవితలు కూడా చక్కగా రాస్తారు. ‘‘మనసులో బాధ, కనులలో నీరు/ తూకంలో దేని బరువు దానిదే’’ – జీవితాన్ని వీడని దుఃఖాన్ని ఎంత మన హృదయాలు ఆర్ద్రమయేట్లు చెప్పినారు! గుండెల్ని పిండే జీవన సత్యమిది.

మాదిరాజు రంగారావు గారి ప్రతి పంక్తీ ఏదో ఒక విషయ నిర్వచనమే. ప్రతి పంక్తీ అందమైన నిర్వచన క్లుప్తతతో, ఆలోచనాంశాలతో మన మేధస్సును, హృదయాన్ని ఆకట్టుకునేదే. ఆయన పదాలలోని శబ్దం, అర్థం భవిష్యవాణిలా ప్రతిధ్వనిస్తుంది. ఈ క్రింది పంక్తుల్లోని ప్రాఫెటింగ్‌ రింగ్‌ విందాం: ‘‘రవి చండతను వానను అదుపులో పెట్టేను మనిషి/ కవితకు నవత ప్రతీకమై కళాకృతి నిచ్చేను’’/ ‘‘రాజకీయ క్రియా చరణపర్వంలో/ కలహ సమర చర్యలతో రోబోట్‌ ప్రవేశం’’ అయినా/ ‘‘ఇది నవయుగాలోకనం, సృజన జగం/ అక్షరతేజంతో వెలిగేను నవభవం./ ఆశారేఖలు శుభనవయుగారంభానికి/ సూచికలై ఫలిస్తాయి’’.

రంగారావుగారు మంచి విమర్శకులు. సాహిత్య విమర్శను బయోగ్రాఫికల్‌, హిస్టారికల్‌ పరిశీలనకు పరిమితం చేయకుండా సూత్రబద్ధమైన సిద్ధాంతచర్చ చేయగలరు. మూలాలకు వెళ్లి విషయస్థితిని సిద్ధాంతీకరించగలరు. అది నిజమైన విమర్శ. దీనికి సునిశితమైన మేధస్సు కావాలి. కవితా రచనకు సౌందర్య విలసితమైన సృజనాత్మకశక్తిలాగా. ఈ రెండూ రావుగారికున్నవి.

కొద్దిరోజుల క్రితం వెల్చాల కొండలరావు నిర్వహించిన రంగారావుగారి సంస్మరణ సభలో వారి పిల్లలను చూశాను. ఒక కుమారుడు, ఇద్దరు కుమార్తెలు. అందరూ నాన్నగారి వినయాన్ని పుణికిపుచ్చుకున్నవారు, విద్యాధికులు. నాన్నగారి స్మృత్యర్థం ప్రతి ఏటా తెలుగు, సంస్కృతంలో విశిష్ట సేవలందించిన వారికి పెద్ద మొత్తంలో అవార్డులను కొండలరావుగారి విశ్వనాథ సాహిత్యపీఠం నిర్వహణ క్రింద ట్రస్ట్‌ను ఏర్పాటు చేసి అందిస్తామని రంగారావుగారి పిల్లలు ఆ సమావేశంలో ప్రకటించారు. అంతటి తండ్రికి వారు పిల్లలవడం వారి అదృష్టం. అంతటి మంచి పిల్లలు కలగడం రంగారావుగారి అదృష్టం.

 చేపూరు సుబ్బారావు

మీ -గబ్బిట దుర్గా ప్రసాద్ -14-12-25-ఉయ్యూరు 

Unknown's avatar

About gdurgaprasad

Rtd Head Master 2-405 Sivalayam Street Vuyyuru Krishna District Andhra Pradesh 521165 INDIA Wiki : https://te.wikipedia.org/wiki/%E0%B0%97%E0%B0%AC%E0%B1%8D%E0%B0%AC%E0%B0%BF%E0%B0%9F_%E0%B0%A6%E0%B1%81%E0%B0%B0%E0%B1%8D%E0%B0%97%E0%B0%BE%E0%B0%AA%E0%B1%8D%E0%B0%B0%E0%B0%B8%E0%B0%BE%E0%B0%A6%E0%B1%8D
This entry was posted in రచనలు. Bookmark the permalink.

Leave a comment

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.