ఈ ఆలోచన ఆయనకేనా ?మనకూ రావద్దా ?వస్తే ఎంత బాగుండు ?
అని పించింది మొన్న వాట్సప్ మెసేజ్ పెట్టి, నిన్న అదేసమయానికి మిట్టమధ్యాహ్నం 12 కు ముదునూరు నుంచి వచ్చి నాకు తాను రాసిన పుస్తకం అందజేసిన డా.నాగులపల్లి భాస్కర రావు గారి పుస్తకం చదివాక .ఇది నాకు నేను బెజవాడ ఎస్ ఆర్ అర కాలేజిలో ఇంటర్ సెకండ్ యియర్ లో మాకు ప్రిస్క్రైబ్ చేసిన ఆంగ్ల రచయిత సాహిత్య నోబెల్ ప్రైజ్ పొందిన జాన్ గాల్స్ వర్ది నవల –‘’ఫోర్సైట్ సాగా ‘’చదివిన అనుభూతి కలిగింది .ఒక రకంగా ఇది ‘’నాగులపల్లి సాగా .‘’.తెలుగులో ‘’నాగులపల్లి కుటుంబ సాగరం ‘’ సాగరం లో అలలుంటాయి ,సునామీ లుంటాయి అగ్నిపర్వతాలు౦టాయి .ముచ్చటగొలిపే జల జీవ వైవిద్యం ఉంటుంది .ఇంకా లోపలి వెడితే మణులూ మాణిక్యాలు దొరుకుతాయి .దిగే వాడి సత్తా ను బట్టి నిధి లభిస్తుంది . స్వాతంత్రోద్యమ నాయకుడు శ్రీ అన్నే అంజయ్య గారు ,కాంగ్రెస్ నాయకుడు శ్రీ కలపాల సూర్యప్రకాశరావు గారు , ఆమరవీరుడు కామ్రేడ్ నాగులపల్లి కోటేశ్వరరావు ,వంటి మహామహులు జన్మించి తీర్చి దిద్దిన గ్రామం కృష్ణా జిల్లా ముదునూరు .సిని దర్శకుడు శ్రీ కొల్లి ప్రత్యగాత్మ ,సిని సంగీత దర్శకుడు ,ఘంటసాల వారి ప్రియ శిష్యుడు బభ్రువాహన సినీ మ్యూజిక్ డైరెక్టర్ శ్రీ పామర్తి వెంకటేశ్వరరావులు అక్కడ పుట్టిన చేవగల చివురు కొమ్మలు .గోరా గారి అనుభవం పొందిన గ్రామం .బాలభారతి స్థాపించిన శ్రీ ముదునూరు వెంకటేశ్వరరావు గారు నడయాడిన నేల . అలాంటి ముదునూరు గ్రామం లో నాగులపల్లి కుటుంబానికీ ఒక ప్రత్యేకత ఉన్నది .భాస్కరరావు గారి తండ్రి సీతారామయ్య గారు స్వాతంత్ర్య సమరయోధులు .ఆదర్శ ఉపాధ్యాయులైన ,రైతుబిడ్డ వ్యవసాయ దారుడు .,ఇక భాస్కరరావు గారు ఎన్నికలపై ఎన్నో యేండ్లక్రితం అధ్యయనం చేసిన మార్గదర్శి అయిన సెఫాలజిస్ట్ .ఢిల్లీ లో ఉద్యోగించినా ,గల్లీ అయిన స్వగ్రామం ముదునూరును మరవని మట్టి మనిషి .తలిదండ్రులలపేరిట స్వంతింట్లో ‘’జేవిత చరిత్రల గ్రంధాలయం’’ స్థాపించి ఈ తరానికి ప్రేరణ కలిగిస్తున్న సాంఘిక జీవి,సంస్కర్త .ఎన్నెన్నో ప్రజోపకార కార్యక్రమాలు నిర్వహిస్తున్న ఆయనకుతోడు తందానతాన గా అనుసరిస్తున్న అర్ధాంగి,విద్యావంతురాలైన శ్రీమతి భారతి గారు .తలి దండ్రులకు వెన్నుదన్నుగా ఇద్దరు కుమార్తెలు .
భాస్కరరావు గారు ఈ సంవత్సరం లో తాజాగా రాసిన పుస్తకం ‘కుటుంబం –కలసి ఉన్నంతవరకేనా ?గురించే నేను చెప్పిన దంతా .ఈ పుస్తకం లో అయన చర్చించిన విషయాలు ఎన్నో ఉన్నాయి .చెప్పిన సూత్రాలు చాల ఉన్నాయి .కుటుంబం అంటే బాధ్యత, బంధుత్వం బాంధవ్యం ,భవిష్యత్ భావన గా భావించారు .ఇన్ని ఉన్నా బా౦ధవ్యాలే మూలాలు .ఈ గ్రామం లో పామర్తి వారంతా ఎక్కడెక్కడ ఉన్నా సంవత్సరానికి ఒక సారి ముదునూరులో కలుస్తారు .అది గ్రామం లో అన్ని కులాల వారికీ ఆదర్శం అన్నారు .ఈ కాలం లో చాలాచోట్ల ఒకే ఇంటి పేరున్నవారు కలిసి సంబరాలు చేసుకొంటున్నట్లు పేపర్లలో చూస్తూనే ఉన్నాం .అయితే అక్కడ వీరంటా తమ సంపాదన విషయమో ,ఉద్యోగ స్థాయి విషయమో గొప్పగా చేపుకోవటం తప్ప సాధించేది ఏమీ లేదని బాధపడ్డారు డా భాస్కర్ .తమనాగులపల్లి వారిలో ఒకరికొకరికి సంబంధాలు లేవని విచారించారు .హెచ్చులకు పోవటం ,కప్పదాటు మనస్తత్వం కుటుంబాలు దూరం అవటానికి కారణాలు ..తమ సత్యం తాత గారు తాటిచెట్టుఎక్కి కిందపడి ఒక కాలు తీసేసినా ,మిషన్ కుట్టి ,అందరికి దగ్గరై ఆత్మీయత పంచిన పుణ్యమూర్తి .ప్రోఫేసర్ డూబే లాంటి ఆలోచనా పరులు ‘’కుటుంబ వ్యవస్థ కుంటుపడుతోందని వాపోయారన్నారు .
తమ కుటుంబం లో బాపమ్మ గారు కోడలుగా వచ్చి తీర్చి దిద్దారని ఆనందపడ్డారు తమతల్లి ,తనభార్య కూడా మార్గదర్శికత్వం వహించారని ,గర్వ పడ్డారు కుటుంబ మనస్పర్ధలు మహమ్మారి గా మారి సర్వ నాశనం చేస్తాయి .పది మందితో సహకరించు కోవటమే ‘’చివరికి మిగిలేది’’ అని నవలారచయిత బుచ్చిబాబులా చెప్పారు .సెల్ ఫోన్ సౌకర్యం వలన దూరపు వారిని చూసుకోవటం జరుగుతో౦దికానీ ,ప్రత్యక్ష చర్యలు మృగ్యం అంటారు .కుటుంబం లో విప్లవాత్మక చర్యలు తీసుకోవటానికి ‘’సంధి కాలం ‘’అవసరమన్నారు .సామాజిక బాధ్యత అంతా కుటుంబాలనుంచే వస్తుంది .పిల్లల మధ్య వ్యత్యాసానికి కారణం చిన్ననాటి ఇంట్లో పరిష్టితులు .విజయవాడ ప్రజాశక్తి నగర్ వికాసానికి కామ్రేడ్ కోటేశ్వరరావు గారి భార్య సరస్వతమ్మ గారి కృషి అనన్యసామాన్యం .స్వాతంత్ర్య సమర యోదులతో పాటు ఆమెకు తగిన గౌరవం జరగలేదని తాను భావించి ముఖ్యమంత్రి చంద్రబాబును ముఖ్యఆతిధిగా ఆహ్వానించి బెజవాడలో స్వాతంత్ర్య సమరయోధుల భవనం లో సన్మానం జరిపించానని చెప్పారు భాస్కరరావు గారు .కుటుంబం లో ఎవరో ఒకరు ఉత్సాహవంతులు ఉంటె, మంచి ఆలోచన ఉద్దేశ్యాలు బలపడి కుటుంబాలు సర్వ జన శ్రేయోదాయకాలౌతాయని ,ఆదిశగా ఆలోచించటానికే ఈపుస్తకం రాశానని చెబుతూ ముగింపు వాక్యాలు పలికారు .ప్రతి ఫిబ్రవరిలో తమ జీవిత చరిత్రల గ్రంధాలయ వార్షికోత్సవాలు ఉత్సాహ భరితంగా నిర్వహిస్తారు భాస్కర్ జీ .ఇప్పటిదాకా అన్నిటికీ నేను హాజరైన గుర్తు .
ఈ పుస్తకం అందరు చదివి ఆయనలా ఆలోచించి సమాజ శ్రేయస్సుకు కుటుంబ బాధ్యత ఎలాంటిదో తెలుసుకోవచ్చు .వీలయితే ఆచరణలో పెడితే ధన్యులు ..
డా.నాగులపల్లి భాస్కరరావు గారి సెల్ -9811159588
మీ-గబ్బిట దుర్గాప్రసాద్ -25-12-25-ఉయ్యూరు .
?

