తిక్కన పద్య సౌరభం
”శ్రీ యన గౌరి నా బరగు చెల్వకు జిత్తము పల్లవింప ,భ
ద్రాయిత మూర్తి యై ,హరిహరంబగు రూపము దాల్చి ,విష్ణు రూ
పాయ నమ్హస్సివాయయని పల్కెడు భక్త జనంబు ,వైదిక
ధ్యాయితకిచ్చ మచ్చు పరతత్వము గొల్చెద నిష్ట సిద్ధికిన్ ”
ఇది కవి బ్రహ్మ తిక్కన గారి పద్యం మహా భారతం లోది .భారతం పూర్తి చేయటానికి సంకల్పించాడు తిక్కయజ్వ .అందుకే సకల బ్రహ్మ ప్రార్ధన చేసాడు .హరి ,హర మైన రూపము ,సగుణ బ్రహ్మం దానినే సకల బ్రహ్మం అంటారు .ఆంటే కలా సహిత బ్రహ్మం .కల ఆంటే మూల ప్రకృతి .,మాయ అని అర్ధం .ఆమెతో కూడిన బ్రహ్మం సకల బ్రహ్మం .ఆమెకు శ్రీ అని ,గౌరి అనీ పేర్లున్నాయి .ఆమె చిత్తం పల్లవించే టట్లు పరతత్వం హరి హర మైన రూపం దాల్చింది .ఆ రూపం భద్రాయిత మూర్తి .ఆంటే కళ్యాణ మూర్తి .,శృంగార మూర్తి అన్న మాట .సృష్టికి మూల మయిన ప్రకృతి పురుషుల దాంపత్యశృంగారం ఈ పద్యం లో కన్పించటం విశేషం .
నిర్గుణ బ్రహ్మ మనకు అందరానిది .మన కోర్కెలు తీర్చేది కూడా కాదు .అందుకే కోర్కెలు తీర్చే సగుణ బ్రహ్మను కవి భావించాడు .శ్రీ తో వున్న గౌరి హరి ,హర సకల బ్రహ్మను అందుకే ఆరాధించాడు .హరిగా భావిస్తే హరి యేనమః అని హరునిగా భావిస్తే హరాయనమః అని లోకం లో ధ్యానించటం సంప్రదాయం గా వున్నది .”విష్ణు రూపాయ నమ్హ శివాయ ”అని తాత్వికు లైన సాత్విక భక్తులు ధ్యానిస్తారు .ఇలా చేయటం” వైదిక ధ్యాయిత ”అంటారు .దీనివల్ల కోర్కెలు తీరతాయి .
తిక్కన ముఖ్యం గా శివ భక్తుడు .అందుకే విష్ణు రూపాయ నమ్హ శివాయ అన్న దానిలో చమత్కారం చూపించాడు .నమః శబ్దం మధ్యలో వుండటం వల్ల విష్ణురుపాయనమః ,అనీ ,నమ్హ శివాయ అనీ అన్వయం వస్తుంది .నమశ్శివాయ అన్నది శివ పంచాక్షరి మంత్రం ..విష్ణు రుపాయనమ్హ అనేది అస్తాక్షరీ మంత్రం కాదు ఇదీ కవి చమత్కారం .అసలు పర తత్త్వం శివుడే విష్ణు తత్త్వం ఆయన గుణం .అని చెప్పకుండా చెప్పాడు ఉభయ కవిమిత్రుడైన తిక్కన .ఆయన ”చిత్త నిత్యస్థిత శివుడు ”.అందుకే ఆయన నిత్యం జపించే పంచాక్షరి అలా అద్భుతం గా మార్పు చెందింది అని విశ్లేషించారు డాక్టర్ పాటి బండ్ల మాధవ రామ శర్మ .
శివ కేశవుల భేదం జగత్తుకు ప్రమాదం .అందుకే జగత్కల్యానానికి హరి హర రూపం అవసర మైంది .సర్వ దేవతలు సమానమే సర్వ ధర్మాలు సమానమే .అని ఆంద్ర జాతికి బోధించ టానికి ,సుస్థిర శాంతిని స్థాపించా టానికి ఆ హరి హరున్ని కళ్యాణ మూర్తి గా భావించి పంచమ వేదమయిన మహా భారతాన్ని తెలుగు చేయటానికి ప్రారంభం చేసాడు మహాక్ కవి ,సోమయాజి,కవి బ్రహ్మ,ఉభయ కవి మిత్రుడు అయిన తిక్కనామాత్యుడు .ప్రారంభం లోనే కవితా శిల్పం అత్యద్భుతం గా చూపి తన ప్రతిభా పాండిత్యాన్ని,వేదోపనిషత్తుల మర్మాన్ని ప్రదర్శించి మలచిన తొలి పద్య రాజం ఇది .అజరామరమై ఆంధ్రదేశ జనం నాలుకల మీద నిత్యం నాట్యం చేసి పరవశుల్ని చేస్తూ ,మూల రహస్యాన్ని తెలియ జేస్తోంది
తిక్కన మహా కవి తనను ””అమలోదాత్త మనీష మైననుభయ కావ్య ప్రౌధి పాటించు శిల్పమునన్ బారగుడాన్ కళావిదుడ” అని చెప్పు కున్నాడు .మనీష ఆంటే కవి రచనా శక్తి యొక్క గొప్పదనం అని పండితుల భావన . ప్రౌది(proudhi ) ఆంటే రసమయం సిద్ధింప జేసే నైపుణ్యం అని విబుధులు విశ్లేషించారు .ఈ రెండు కలిస్తే కావ్య శిల్పం అది తిక్కన లో పుష్కలం అందుకే ఆయనకు సలాం
గబ్బిట దుర్గా ప్రసాద్
ఇలా తెలుగు లో ఎన్నో పద్యాలు హృద్యం గా ,రసస్ఫోరకం గా వున్నాయి తవ్విన కొద్దీ టన్నుల కొద్దీ బంగారం లభిస్తుంది ఆ శేముషీ దురంధరులకు నమో వాకాలు .ఎందేరందరో విశ్లేషకులు అద్భుతమైన విశ్లేషణ చేసిఆవిష్కరణ చేసి మరుగున పడిన బంగారాన్నివెలికి తీసి అందించారు దాన్ని మన స్వంతం చేసు కునే ప్రయత్నం లో ఇదో భాగం .


very good concept.. u should do more often these traslating poems
LikeLike