ఆముక్త మాల్యద —–శరదృతు వర్ణన
——————————————
కృష్ణ దేవ రాయల ”ఆముక్త మాల్యద ”కావ్యం వర్ణనా విశేషాలతో నిండి వుంటుంది అందరు కవులు వసంత ఋతువు ను ముందు వర్ణిస్తే రాయలు గ్రీష్మ రుతువు తో ప్రారంభించాడు .రుతు వర్ణనకు ,కధకు లంకె పెట్టటం రాయల నేర్పు ప్రస్తుతం శరత్తు లో వున్నాం కనుక కధకు ,వర్ణనకు సంబంధం గురించి ఆలోచిద్దాం .యామునా చార్యుడు కాల ప్రభావం వల్ల భోగిగా వీరమయ జీవితం గడుపు తున్నాడు .ఆచార్యత్వాన్ని ,రాజరికం కమ్మేసింది .కాని అది ఆయన ప్రవ్రుత్తి కాక పోవటం ఇబ్బంది గా పరిణమించింది .మత్యధ్వజ రాజులో ,యామనప్రభవు లో వున్న లోపలి ప్రవృత్తుల లోని భేదాలను రాయలు గొప్పగా ఆవిష్కరించాడు .దీన్ని వర్ణనా వక్రత అన్నారు ఆచార్య జి.వి సుబ్రహ్మణ్యం గారు .ఇదే అందరి కవుల కంటే రాయలని ప్రత్యేకం గా వేరు చేసింది .కధలో ప్రాణ చైతన్య స్పందన దీని వల్లే వచ్చినది mఅంటారు జి.వి .కాల ప్రభావం ,రుతు ప్రభావం మానవునిపై పెద్ద ప్రభావాన్నే చూపుతాయి .రుతు వర్ణన లతో ,అద్భుత కదా సంవిధానాన్ని రాయలు సాధించాడని అర్ధం అవుతుంది .
వర్షా కాలమ్ లోపన్నాగ శాయనుడైన విష్ణు మూర్తికి ,ఆది శేషుని పడగల కదలికలతో మెలకువ వచ్చింది నిద్ర లేచి భూమి పై కాలు పెట్టి అనుగ్రహించి నట్లుగా భూమి పంటలతో నిండి పోయింది .సూరీడు నీటితో పాటు తాగిన ముత్యాలనూ ,వుమిసి (వుమ్మేసి)పద్మాల మీద ,తామరాకుల మీద కొత్త ముత్యాలతో అందాలుదిద్దు తున్నాడట .ఆకాశం లో నక్షత్రాలు తలంటు పోసుకోనిన కుంకుడు రసం నురగలు ,నదుల మీద రెల్లు పూలతో కలిసి ,తేలు తున్నాయట .సముద్రం నుంచి చల్లదనాన్ని ,తియ్యని నీటినీ అప్పు తీసుకొన్న సూర్య చంద్రులు ఆ అప్పు తీర్చటమే కాదు ,అందాలు అనే నగలు కూడా ఇచ్చి వడ్డీ తీర్చేశారట .
చెరకు గడలంత ఎత్తుకు పెరగలేక పోయామని సిగ్గుతో వరిచేలు కంకులతో తలలువంచుకొని వున్నాయట .విశ్వామిత్ర యాగం వంటి వేసంగి తొలకరి వచ్చింది .వర్షము ,గాలీ రామ లక్ష్మణుల లాగా వచ్చాయట .శరత్తులో రాముడు శివ ధనుస్సును ఎత్తి పట్టాడు .ఇక సీతా అనే భూదేవి మనసు నుంచి పొంగక ఏమి చేస్తుంది?అని కుప్ప నూర్పిల్ల ను గురించి పంట దిగుబడి గురించి అద్భుతం గా వర్ణించాడు .ఇది కధకు ఏ విధం గా సహకరిస్తుంది అని మన సందేహం .ఆంటే యామున ప్రభువు జైత్ర యాత్ర చక్కని ఫలితాన్నిస్తుందని సూచన . ఇంత వివరం గా వర్ణన చేసిన రాజు రాయలు యామున ప్రభువు దిగ్విజయాన్ని ఒకే ఒక మహా స్రగ్ధర లో చెప్పి వదిలేశాడు .వర్ణనా నేపధ్యం లోంచి మంచి ఫలితాన్ని అందించి ఔచిత్యాన్ని ఘనం గా పోషించాడు .యుద్ధ వర్ణనను అతి గా చేస్తే అది రాయల రచన అవుతుందా ?అందుకే కవులందరి లో కృష్ణ దేవ రాయలు అందనంత ఎత్తున వున్నాడు .రాయల్ టచ్ ఆంటే అదే .ఆముక్త మాల్యద రాయల ప్రతిభా దర్పణం .
మరిన్ని విశేషాలు వరుస క్రమం లో తెలుసు కుందాం .సెలవ్
మీ –గబ్బిట దుర్గా ప్రసాద్ 08 -06 -11

