నిత్య హరిత శ్రీ శ్రీ ————చివరి భాగం
”సింధూరం ,రక్త చందనం –బంధూకం ,సంధ్యా రాగం –పులిచంపిన లేడి నెత్తురు –ఎగరేసిన యెర్రని జండా –రుద్రాలిక నయన జ్వాలిక –కలకత్తా కాలిక నాలిక —కావాలోయ్ నవకవనానికి ”అని ఆత్మాశ్రయం గా చెప్పినా కవిత్వం లో విశ్వ జనీనత సాధించాడు శ్రీ శ్రీ .
”కదిలేది ,కదిలించేది ,–మారేది ,మార్పించేది –పాడేది ,పాడించేది –పెను నిద్దర వదిలించేది –పరిపూర్ణపు బ్రతుకిచ్చేది –కావాలోయ్ నవ కవ నానికి ”అని వ్యంగ్య వైభవం తో కవిత చెప్పాడు .”సాహిత్య సభాన్గానా –వ్యంగ్యానిదే మొదటి పద్దు ”అన్నాడాయన .”కవిత్వమొక తీరని దాహం ”గా భావించాడు .”ఉండాలోయ్ కవితావేశం ”అని ఆవేశమే ఊపిరి అన్నాడు .
”నేను సైతం ప్రపంచాగ్నికి –సమిధనొక్కటి ఆహుతిచ్చాను –నేను సైతం విశ్వ వ్రుస్తికి –అశ్రువొక్కటి ధార పోశాను —నేను సైతం భువన ఘోషకు వెర్రిగొంతుక లిచ్చి మోశాను ”అని స్వంత గొంతుకతో ”జయభేరి ”మ్రోగించాడు .అంతులేని శోకం జడివాన గాకురుస్తుంటే తానూ వో అశ్రు కణం ధార పోశాడట ..ప్రపంచ హోమాగ్నికి తానూ వో సమిధ నిచ్చి జ్వాలా ప్రజ్వలనకు దోహదం చేశాడు .విశ్వ శోకం విలయ ఘోష గా వినిపిస్తోంది .ఆ ఘోష లో వీరావేశం తో తానూ శృతి కలిపాడు .ఒక కొత్త కేక వేశాడు .సామాజిక దృక్పధాన్ని,జాతీయ ,అంతర్జాతీయ స్థాయికి తీసుకొని వెళ్ళాడు .అరసం లో వున్నా ,విరసం లో వున్నా జన బాధ తో శ్రుతికలిపి సహవేదన చెందాడు .
సమాజాన్నిసైనిక సంఘం లా చేయాలని భావించాడు .మాటల్లో మహోత్చాహం ,గతిలో మిలిటరీ బాండు ,వినిపిస్తూ ,గర్జిస్తూ ,గమ్యం చూపాడు .ప్రతి పదం ప్రగతి శీలంప్రతిధ్వనిస్తూ ,సమాజ చైతన్యాని సంఘటితం చేసే శబ్ద శక్తిని సమీకరిస్తూ ,మరో ప్రపంచం వైపు నడిపించాడు .శ్రీ శ్రీ శిల్పానికిది కలికితురాయి గా విశ్లేషకులు మెచ్చారు .అందుకే ”ఆధునిక యుగం లో పాల్కురికి సోమనాధుని వంటి వాడు శ్రీ శ్రీ ”అన్నారు .”మహా ప్రస్థానాన్ని ”సామాన్యుల మనోలోకాన్ని గురించి రాస్తే ,”దేశ చరిత్రలు ”బౌద్ధిక లోకాన్ని ఉద్దేశించి రాశాడు .ఆంటే ఆలోచించే వారి కోసం రాశాడని భావం .అందుకే ఆయన సవ్య సాచి .రెండంచుల కత్తి .ఆయన గీతాలన్నీ ,పాథక జన హృదయాల్లో చేరి పోయాయి .oft quoted lines అయాయి .ప్రతి సందర్భం లోను ఏదో ఒక శ్రీ శ్రీ కవితా పంక్తిని ఉదాహరించాకుండా మాట్లాడలేం .maarx భావ దాసుడని అందరూఅన్నా శ్రీ శ్రీ మహాకవే .సామ్య వాదాన్ని సామవేదం లా వినిపిస్తాడు .”రామనీయారధక ప్రతిపాదక శబ్దం ఆయన కావ్యం ”.శబ్ద శక్తి సారాన్ని ఆపోసన పట్టిన కవి అగస్తుడు శ్రీ శ్రీ .శబ్దం చేత ఆకారాన్ని ,అర్ధం చేత చిత్రాని గీస్తాడు .ఎంతటి శబ్ద శాసనుదో అంతటి రస వాది కుడా .ఏ వస్తువును తీసుకొన్నా ,ఆవిష్కరణలో అగ్ర స్థానం ఇచ్చే మహా కవి శ్రీ శ్రీ .ప్రళయం శ్రుస్టించినా ,ప్రాణం కల్పించినా ,మంట పెట్టినా మహా చల్లదనం కల్గించినా ,అశాంతి బావుటా ఎత్తినా ,శాంతి కపోతాన్ని ఎగారేసినా ,విప్లవం సృష్టించినా ,వినిర్మల మనస్కత సాధించినా మాటలతో చీల్చి చెందాడినా ,మమతల వర్షం కురిపించినా .లోకం తీరు నిరసించినా ,లోక చైతన్యం కల్గించినా వాడిగా వేడిగా రాసినా ,వెన్నెల కురిపించినా శ్రీ శ్రీకే సాధ్యం .అతని మాట నిత్య హరితమే .అందుకే ఆయన నిత్య హరిత శ్రీ శ్రీ .
—
గబ్బిట దుర్గా ప్రసాద్ —–17 -06 -11
రచనా కాలమ్ 20 -09 -1998
