ఒక ‘కీర్తి ‘ శేషురాలు

ఒక ‘కీర్తి ‘ శేషురాలు

ఒక ‘కీర్తి ‘ శేషురాలు 
గొల్లపూడి మారుతీరావు
gmrsivani@gmail.com

మంచి పని ఎప్పుడూ ఒద్దికగా జరుగుతుంది. దౌర్భాగ్యపు పని బాహాటంగా ఒళ్ళు విరుచుకుంటుంది. ఒక 70 సంవత్సరాలలో మానవాళి మరిచిపోలేని దౌర్భాగ్యపు పని రెండవ ప్రపంచ యుద్ధ కాలంలో యూదుల మారణ హోమం. మూలపురుషుడు హిట్లర్.
ఆ మారణ హోమం నుంచి తనదైన ప్రయత్నంలో కొందరు యూదుల్ని రక్షించిన జర్మన్ షిండ్లర్ కథని ప్రపంచ ప్రఖ్యాత దర్శకుడు స్టీవెన్ స్పీల్ బర్గ్ చిత్రంగా తీసి అజరామరం చేశాడు. అలాంటి మరొక అద్భుతమైన వ్యక్తి కథ ఇది. మానవాళి కృతజ్ఞతతో పులకించి చిరస్మరణీయం చేసుకోవలసిన కథ.
ఆమె పేరు ఇరీనా శాండ్లర్. పోలెండ్ దేశస్తురాలు. రెండవ ప్రపంచ యుద్దకాలంలో జర్మనీ పోలెండుని ఆక్రమించాక పోలెండులో యూదుల మారణహోమానికి తలపెట్టింది. అందుకు వార్సాలో ఒక శిబిరాన్ని ఏర్పరిచింది. దాన్ని ఘెట్టో అంటారు. ఇరీనా సాంఘిక సేవా సంస్థలలో పనిచేసేది. పాలక వ్యవస్థకి వ్యతిరేకంగా పనిచేసే జెగోటా అనే రహస్య (అండర్ గ్రౌండ్) సంస్థలో ఇరీనా సభ్యురాలు. ఈ వార్సా ఘెట్టోలో కుళాయిలు, మురుగు కాలువల మరమ్మత్తు చేసే పనికి కుదురుకుంది. అప్పటికి ఇరీనా వయస్సు 23 సంవత్సరాలు.
రోజూ చేతిలో పనిముట్లు ఉన్న పెట్టె, వీపు మీద పెద గోనె గోతాంతో పనిలోకి వచ్చేది. కేవలం నౌఖరీ చెయ్యడం ఆమె లక్ష్యం కాదు. ఆ శిబిరాల్లో ఉన్న యూదుల పసిబిడ్డల్ని తన పనిముట్ల పెట్టిలో అడుగున దాచిపెట్టి బయటకు రహస్యంగా చేరవేసేది. కాస్త శరీరం పెద్దదిగా ఉన్న పిల్లల్ని వీపు మీద గోతంలోకి ఎత్తుకునేది. ఆమెతో ఓ కుక్క కూడా వచ్చేది. ఈ పిల్లలు ఏడిచి శబ్దం చేస్తే నాజీ సైనికుల చెవినిపడకుండా వాళ్ళని చూసినప్పుడల్లా మొరగడం కుక్కకి అలవాటు చేసింది. కుక్క అరుపులకు అలవాటు పడిపోయిన సైనికులు ఆమెను పట్టించుకునేవారు కాదు. అనుమానం వస్తే నిర్ధాక్షిణ్యంగా కాల్చి చంపే నరరూపరాక్షసుల మధ్య నుంచి అలా రెండు వేల అయిదువందల మంది పిల్లల్ని బయటికి చేర్చింది.
బయటికి తెచ్చాక వారి తల్లిదండ్రుల వివరాలు, అడ్రసులు – అన్నీ స్పష్టంగా రాసి – ఆ విలువైన జాబితాలను ఓ గాజు కుప్పెలో ఉంచి – ఇంటి వెనుక పెరట్లో ఓ చెట్టు కింద పాతిపెట్టింది. ఈ పిల్లలకి కొత్త పేర్లూ, కొత్త అడ్రసులూ సృష్టించి కొన్ని కుటుంబాలలో, బాల రక్షణ కేంద్రాలలో వారిని చేర్చింది. ఇదొక అపూర్వమైన విప్లవం. తల్లిదండ్రులని కాపాడడం సాధ్యంకాకపోయినా వారి సంతానాన్ని కాపాడే మానవీయ విప్లవం.
యుద్దం ముగిశాక – అడ్రసుల్లో వివరాల ప్రకారం ఆయా పసివారిని వారి వారి తల్లిదండ్రుల దగ్గరికి చేర్చాలని ఆమె పధకం. కానీ యుద్ధం ముగిసేనాటికి చాలా మంది తల్లిదండ్రులు ఈ నాజీ శిబిరాలలో విషవాయు ప్రయోగాలలో మరణించారు. తప్పించుకుని ప్రాణాలు దక్కించుకున్న ఏ కొద్దిమందో ఆచూకీ లేనంతగా మాయమయారు.
1943లో పిల్లల్ని చేరవేస్తూ ఇరీనా నాజీ సైనికులకు దొరికిపోయింది. అప్పుడామెకు 23 సంవత్సరాలు. (ఫోటో చూడండి). ఇలాంటి సాహసాలు తలపెట్టనక్కరలేని వయస్సది. కానీ మనస్సులో మానవతా చైతన్యం వెల్లివిరిసిన అమృతమూర్తి ఇరీనా. నాజీలకు పట్టుబడ్డాక నిర్దాక్షిణ్యంగా ఆమెని చావగొట్టారు. కాళ్ళూ చేతులూ విరగ్గొట్టారు. నానా చిత్రహింసలూ పెట్టారు. చివరికి మరణ శిక్షను విధించారు. ఆమెని కాల్చి చంపడానికి తీసుకువెళుతుండగా ఆమె పనిచేసే జెగోటా సంస్థ మనుషులు – నాజీ సైనికులకు లంచాలిచ్చి ఆమెని కాల్చి చంపకుండా తప్పించారు. కానీ బయటి ప్రపంచానికి ఇరీనా చచ్చిపోయినట్టే ప్రకటన వచ్చింది.
యుద్ధం తరువాత పోలెండుని సోవియట్ యూనియన్ ఆక్రమించుకుంది. రహస్యంగా పనిచేసిన ఈ కార్యకర్తలందరిని ఆ ప్రభుత్వం రాసిరంపాన పెట్టింది. అప్పటికి ఇరీనాకి పెళ్ళయి – రెండోసారి గర్భస్రావమయింది. క్రమంగా రాజకీయ వాతావరణం మారింది. కమ్యూనిస్టు పాలన నుంచి పోలెండు విముక్తమయింది. కొత్త పోలెండు ప్రభుత్వం ఆమె సేవలను గుర్తించింది. ఇజ్రేల్ ప్రభుత్వం యూదులకు చేసిన సేవలకుగాను ఆమెకు తమ దేశపు అత్యున్నత పురస్కారాన్నిచ్చింది. పోలెండు ప్రభుత్వం ఆమె స్వయంగా వెళ్ళి ఆదుకునేందుకు అనుమతినిచ్చింది.
2003లో రెండవ పోప్ పాల్ యుద్దకాలంలో ఆమె కృషిని అభినందిస్తూ ఉత్తరం రాశారు. అదే సంవత్సరం పోలెండు తమ దేశపు అత్యున్నత పురస్కారంతో ఇరీనాను సత్కరించింది. 2007లో పోలెండు సెనేట్ ఆమెను గౌరవించుకుంది. అప్పటికి ఆమె వయసు 97. లేచివెళ్ళలేని పరిస్థితి. ఆమె రక్షించిన బిడ్డలలో ఒకరయిన ఎలిజబెత్ ఫికోస్కా అనే ఆమె ఇరీనా తరపున వెళ్ళి ఆ గౌరవాన్ని అందుకుంది.
2009లో ఐక్యరాజ్యసమితి తరపున ప్రముఖ హాలీవుడ్ నటి – ఆడ్రీ హెప్ బర్న్ ( ”రోమన్ హాలీడే’ హీరోయిన్) పేరిట ఏర్పరిచిన మానవతా పురస్కారాన్ని ఆమెకి అందజేశారు. 2007 లో కాన్సాస్ లో ఒక ఉపాధ్యాయుడు నోబెల్ శాంతి బహుమతికి ఆమె పేరుని ప్రతిపాదించారు. బహుమతిని ప్రకటించాక – అంగీకరించని నామినేషన్లని గత 50 సంవత్సరాలుగా బయట పెటకపోవడం ఆచారం. కానీ ఇరినా శాండ్లర్ పేరు బయటికి వచ్చింది. శాంతి బహుమతికి ఆమె కంటే ఎవరికి అర్హత ఉంటుంది? మానవత్వాన్ని అంతకంటే ఎవరు ఉన్నత స్థాయిలో నిలపగలరు? ఒక మదర్ థెరిస్సా, ఒక దలైలామా, ఒక మహాత్మాగాంధీ (ఆయన పేరుని నోబెల్ శాంతి బహుమతికి సూచించలేదు!), ఒక ఇరీనా శాండ్లర్.
కాదు బాబూ! కాదు. అర్హతలు చాలామందికి ఉన్నాయి. నోబెల్ స్థాయి రాజకీయాలూ ఉన్నాయి. పర్యావరణ కాలుష్యానికి కృషిచేసిన అమెరికా ఉపాధ్యక్షులు ఆల్ గోరేకి ఆ సంవత్సరం శాంతి బహుమతిని ఇచ్చారు.
అది 2007. ఈ విషయాన్ని తెలిసిన ఇరీనా నవ్వుకుని ఉంటుంది. 68 సంవత్సరాల ముందు వీపు మీద మోసిన మానవాళి ఔన్నత్యానికి ఇలాంటి విలువల్ని ఆశించి ఉండదు. విరిగిన కాళ్ళూ, చేతులూ, దాదాపు చావుదాకా వెళ్ళిన ప్రయాణం, తన కళ్ళముందే పెరిగి పెద్దదయిన ఎలిజబెత్ ఫికోస్కా, ఇంకా 2499 మంది పిల్లలు ఆమెకి సజీవ నోబెల్ బహుమతులు. ఈ బహుమతి కేవలం ఒక సంస్థ గుర్తింపు. ఆ కృషి మానవత్వం ఆమెకిచ్చిన కితాబు. ప్రశంస.
తన 98 వ ఏట – ఆ మధ్యనే ఇరీనాశాండ్లర్ అనే దేవతామూర్తి కన్నుమూసింది.
దేవుడిని చాలామంది నమ్మరు. 23 ఏళ్ళ ఓ అందమయిన అమ్మాయి – 2500 పసి జీవితాలకు ప్రాణం పోసిన మాతృమూర్తిలో దైవత్వాన్ని – 98 సంవత్సరాలు ఆ జీవితాన్ని జీవనయోగ్యం చేసిన వైభవాన్ని అందరూ నమ్మక తప్పదు. ఇది వాస్తవం. 98 వ ఏట ఆ దేవత ముఖంలో చిరునవ్వు ఆ జీవన సాఫల్యానికి అద్దం పడుతుంది.

***

సెఫ్టెంబర్ 26, 2011

************               ************           *************          *************

Unknown's avatar

About gdurgaprasad

Rtd Head Master 2-405 Sivalayam Street Vuyyuru Krishna District Andhra Pradesh 521165 INDIA Wiki : https://te.wikipedia.org/wiki/%E0%B0%97%E0%B0%AC%E0%B1%8D%E0%B0%AC%E0%B0%BF%E0%B0%9F_%E0%B0%A6%E0%B1%81%E0%B0%B0%E0%B1%8D%E0%B0%97%E0%B0%BE%E0%B0%AA%E0%B1%8D%E0%B0%B0%E0%B0%B8%E0%B0%BE%E0%B0%A6%E0%B1%8D
This entry was posted in మహానుభావులు, సేకరణలు. Bookmark the permalink.

1 Response to ఒక ‘కీర్తి ‘ శేషురాలు

  1. sreenivasrangavajjula's avatar sreenivasrangavajjula says:

    నమస్కారం శ్రీ మారుతీ రావు గారికి
    సామాజికవిలువలు ఉన్న ఒక వ్యక్తి నిరంతరం తను చేస్తున్న పనిలోనూ తనతో సంబంధం వున్నప్రతి వ్యక్తి తోనూ ప్రపంచంతోనూ దాని వ్యవస్త తోనూ తాను బందం ఏర్పరుచుకొని జాతికి ఒక దిశా నిర్దేశం చేస్తూ మానవత,సామజిక విలువలు పడిపోనికుండా హెచ్చరిస్తూ అనునయిస్తూన్న ఓ మారుతీ ( ప్రేమగా కౌగిలించుకొని ) మీకు ఏమి ఇచ్చుకొగలమ్ ( ఇట్లా రాస్తుంటే కళ్ళవెంబడి ఆనందముతో కారిన ఆనందభాష్పాలు తుడుచుకొంటూ)

    అర్జనుడి రధంపై విజయకేతనముగా ఆ మారుతీ వుంటే మన భారత జాతి ముద్దు బిడ్డలకు నీ చూపుడు వేలు తో ఏది చేయాలి? ఏది చేయకూడదు? అని తెలియచేసే మాకు ఈ మారుతీ వున్నాడు గర్వముగా చెప్పుకొంటాను ఎందరో మహనీయుల చరిత్ర తెలియని నాకు ఇరీనా శాండ్లర్ గారి గురించి తెలిపి నేను నా పిల్లలకు తెలియచేసే భాగ్యాన్ని కలిగించారు ధన్యులు మీరు చరిత్రలో మీది ఒక పేజిని ఏర్పరచుకొన్నారు
    ప్రేమతో
    మీ పాదాలకు నమస్కరిస్తూ
    రంగావజ్జుల శ్రీనివాస్ అని పిలువబడునది
    సూర్యాపేట
    sreenivasrangavajjula@gmail.com

    Like

Leave a reply to sreenivasrangavajjula Cancel reply

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.