సరస్వతీ పుత్రుని శివ తాండవం -1 ఆచార్య శ్రీ

  సరస్వతీ పుత్రుని  శివ తాండవం -1

                                            ఆచార్య శ్రీ 
    
 సరస్వతీ పుత్ర శ్రీ పుట్ట పర్తి నారాయణా చార్యుల వారు ‘శివ తాండవం ”అనే అద్భుత కావ్యాన్ని రాశారు .వీరిది శ్రీకృష్ణ దేవ రాయల గురు పాదు లైన శ్రీ తిరుమల తాతాచార్యుల   గారి వంశం .పండిత వంశామూను .14 వ ఏటనే ”పెనుగొండ లక్ష్మి ‘అనే కావ్యాన్ని రాశారు .వీరు విద్వాన్ పరీక్ష రాసినప్పుడు ఆ కావ్యమే వీరికి ”పాఠ్య గ్రంధం ”గా వుంది .అదొక ఆశ్చర్య కర మైన సంఘటన.”ఒక కవి తాను రాసిన పుస్తకం పై తానే పరీక్ష లో జాబు రాయటం” ప్రపంచ చరిత్ర లో ఎక్కడా చూడ లేదు .అది అరుదైన సంఘటన .ఆ గౌరవం ఆచార్యుల వారికే దక్కింది .వీరి  సంస్క్రుతాన్ద్రాన్గ్ల భాషా పాండిత్య వైభవం చూసి కంచి కామ కోటి peethaadhipatulu శ్రీ శ్రీ శ్రీ చంద్ర శేఖర యతీంద్రులు వీరికి ”సరస్వతీ పుత్ర ‘బిరుదు ను ప్రదానం చేశారు .’భావ కవి చక్ర వర్తి ”బిరుదునూ పొందారు .100 కు పైగా గ్రంధాలు రాశారు .15 భాష లలో అనర్గళం గా మాట్లాడ గలిగిన దిట్ట  పుట్ట పర్తి వారు .ఆయా భాషలలో కవిత్వమూ చెప్పి మెప్పించారు .శ్రీ ఆచార్యుల వారు 1914 మార్చ్ 28   న అంత పురం జిల్లా పెనుగొండ తాలూకా ”పెయ్యేడు ” లో జన్మించారు .
          14 ఏళ్ళ వయసు లోనే కవితా లతాంగితో సయ్యాటలాడారు .బాల్యం లోనే ”ప్రహ్లాద చరిత్ర ”ను హరికధ గా చెప్పి న బాల కిశోరం .చిల్లర మల్లర గా తిరిగి ఇల్లు వదిలి వెళ్లి పోయి ,లక్ష్మీ ప్రసన్నం చేసు కోని ,మళ్ళీ గృహ ప్రవేశం చేయటం ఒక అలవాటైంది .జీవితం మీద విరక్తి కలిగి హిమాలయాలకు చేరారు .అక్కడ స్వామి ”శివానందుల ”వారి అనుగ్రహం పొందారు .అదొక మధురాతి మధురమైన క్షణం .ఆచార్యుల వారి జీవితమే మారి పోయింది .అమోఘ పాండితీ ప్రకర్ష ఏర్పడింది .పండితుల మెప్పు లబించింది .నిజం గానే సరస్వతీ పుత్రులని పించు కొన్నారు .
        తిరుపతి సంస్కృత కళాశాల లో ప్రవేశం కోసం వెళ్ళారు .ఆదరణ కంటే ,నిరాదరణకు గురైనారు .ఆవేశం కట్టక్లు తెంచు కొంది .ఆశువు గా కవితా గంగాలహరి జాలు వారింది. అందులో ,ఆత్మాభిమానం అంతర్వాహిని గా ప్రవహించింది .ఇది విన్న ప్రిన్సిపాల్ కు ”మైండ్ బ్లాక్” అయి ఆయన పాండితీ గరిమకు పులకించి ప్రవేశార్హత కల్పించాడు .అయితె తాను అనుకొన్న తరగతి లో ప్రవేశం ఇవ్వలేదు .మళ్ళీ ఆశువు లంకిన్చుకొన్నారు .అంతే- కోరిన తరగతి లో చేర్చుకొన్నారు .అదీ ఆచార్యుల   వారి పట్టుదల ,ప్రావీణ్యం ,ప్రతిభ ,సామర్ధ్యం .రామ రాజ భూషణుడి వసు చరిత్ర ప్రభావం తో ”ఇందుమతీ పరిణయం ”రాశారు .కాని సంతృప్తి చెంద లేదు .అమిత ధారణా దురంధరులు పిన్న నాటి నుంచే .ప్రఖ్యాత ఆంగ్ల కవుల కవిత్వం అంతా ,నాలుక పై నర్తించేదట .వ్యాకరణ ,అలంకార శాస్త్రాలను మదించి ,సారం పిండేశారు .అంతా స్వయం కృషే .రాళ్ళ పల్లి అనంత కృష్ణ శర్మ  గారు వీరికి స్వయానా మేన మామే. .ఆ వైపు నుంచి కవిత్వం ,పాండిత్యం రస వాహిని గా చేరింది .ప్రాకృత భాష నేర్చారు .మాగధి ,శౌర సేని ,పైశాచీ భాషల పీచ మడచారు . 
                                పెండ్లి -పెటాకులు 
          19 ఏళ్ళ కే పెళ్లి అయింది .ఆ రోజే అత్త గారు టపా కట్టింది .రెండ్రోజుల తర్వాత భార్యబాల్చీ తన్నేసింది .”పెళ్ళేమో కాని ,కర్మలు చేయాల్సిన ఖర్మ పట్టింది ”అని అంత విషాదం లోను ,ఆయన చమత్కరించారు .ద్వితీయం చేసుకొన్నారు .ఆమె పంచ కావ్యాలు ,వ్యాకరణం పూర్తి చేసిన విదుషీ మణి .ఆవిడే ఇంటి వద్ద శిష్యులకు పాఠాలు చెప్పేది .వివిధ భాషా సాహిత్యాలను ఆస్వాదిన్చటమే ఆచార్యుల వారికి ఇష్టమైన మృష్టాన్న భోజనం .తులసీదాస్ ,సూరదాస్ వగైరా ఉత్తర దేశ కవుల ప్రభావం వీరిపై ఎక్కువ .సర్వజ్ఞుడు ,బసవేశ్వరుడు మొదలైన శైవ కన్నడ కవులంటే ఆరాధ్యభావం ఆచార్యులకు .ఆళ్వార్లు నాయనార్ల మాధుర్య భక్తికి ముగ్ధులవు తారు .ఇవన్నీ ,వారి నిత్య సాధనాలు అంటే మనం ముక్కు మీద వేలు వేసు కోవాల్సిందే.
                              లౌకికం తెలీని మేధావి 

ఇంతగా సాహితీ వ్యాసంగం లో మునిగి తేలుతున్నా వారికి ఆనందోప లబ్ది కాలేదు .అష్టాక్షరీ మంత్రాన్ని 13 కోట్ల సార్లు జపించి    మహా సిద్ధి సాధించారు .తులసీ రామాయణం kantho paathame .అష్టాక్షరి ఆయన శ్వాస .త్రిమతాలు కరతలామలకాలు .తాంత్రిక విద్యలో అసాధా రణులు అయారు . .షిర్డీ సాయి బాబా వారిని అనుక్షణం ఆవేశించి వుండే వారట .సాయి నామం తో నిరంతర పునీతు లయ వారు .ఇంత చేస్తున్నా ,మనసు లో ఏదో వెలితి వారిని అశాంతికి గురి చేస్తోంది ”.జిల్లెల్ల మూడి అమ్మ”ను దర్శిన్చిఆమె లోని ”అమ్మ తనం ”బిడ్డ లాగా అనుభ వించారు .కంచి పెద్ద స్వామి ”చంద్ర శేఖర సరస్వతి ”సన్ని దానం ఈ సరస్వతీ పుత్రుడైన  పుట్ట పర్తి నారాయణా చార్యుల వారికి  అనుకంప గా వుండేది . శ్రీ మద్రామాయణం ప్రవచనం గా నాలుగు సంవత్స రాలు .గంగా ఝరీ సదృశ్యం గా చెప్పి ,లోతులను తరచి భక్తులను ఆనంద రాసామ్రుతం లో   ఓల లాడించి ,తరింప జేసే వారు .
          పుట్ట పర్తి వారు ”లోకం తెలియని మేధావి ”.బాల హృదయులు .”వ్యవహారాజ్ఞత అంటని వైదిక జాతకుడు ;;అని అందుకే అన్నారు సి.నా.రే .ఎట్ట కేలకు  1972 లో ప్రభుత్వం ”పద్మశ్రీ ”నిచ్చి గోరవించింది .జ్ఞాన peetha స్థానానికి వారు అన్ని విధాలా అర్హులే .అది వారికి దక్క నివ్వలేదు .  .అందుకే వికల మనస్కు లయారు .నాట్యం కూడా చేసి విద్యార్ధులకు నేర్పించే నాట్య విశారదులు కూడా .సకల శాస్త్రాలు వారికి వాచో విదేయాలు .సంస్కృత సాహిత్యం లో భవ భూతి ,,మురారి ,అశ్వ ఘోషుడు వారి అభిమాన కవులు .ప్రాకృత కవుల్లో పుష్ప దంతుడు ,వాక్పతి అభిమానులు .ఆంగ్ల కవి జాన్ మిల్టన్ ఆరాధ్యుడు .”షెల్లీ ”అంటే ”ఆనంద వల్లే” . రవీంద్రుడు అంటే రవి ప్రకాశం తో విరసిన అరవిన్డమే అవుతుంది వారి హృదయం .తులసీ ,సూరదాస్ లను ”తులసీ దళం ”అంత పవిత్రం గాభావిస్తారు .”జన ప్రియ రామాయణం ”ను మాత్రా ఛందస్సు లో రాసి ,భక్త జనాలకు చేరువ చేశారు .హిమాలయ సదృశ బహు భాషా చతురాననుడు ,సరస్వతి పుత్రుడు పుట్ట పర్తి  నారాయణా చార్యుల వారు  01 — 09 -1990  న బ్రహ్మైక్యం చెందారు .
                           
     ఆనంద శివ తాండవం 
నిజం గా పుట్ట పర్తి వారికి అశేష శేముషీ వైభవం  కల్గించింది వారి ”శివ తాండవం ”అనే కావ్యం .శివా ,శివుల నాట్య హేల ను ,హృదయ రంగం మీద ప్రదర్శించిన మహా కవులు వారు .అందులో భావ సౌందర్యం ,ధ్వని ,సంగీత ,నాట్య మేళ వింపు ,అద్భుతం గా సమ్మేళనమై ,రస ఝరి లో ఓల లాడించింది. వారి ప్రతిభకు  ఆ  కృతి పట్టాభి షేకమైంది .దీన్ని వారు ”ప్రొద్దుటూరు ”అగస్త్యేశ్వర ఆలయం  ” లో శివునికి ,రోజూ  ,108 ప్రదక్షిణాలు చేస్తూ , అభిషేకం చేసి ,15 రోజుల్లో పూర్తి చేశిన కవితా దురంధరులు .ఇక్కడ ఆశ్చర్యం ఏమిటంటే ”పుట్టు వైష్ణవుడు -బట్టకట్ట లేని దిగంబర పరమేశ్వరునిపై ,పరమాద్భుత మైన కృతి చెప్పటం ”.
           శివ తాండవం లోని విశేషాలను తెలుసు కోవటానికి వేచి ఉండాల్సిందే 
              సశేషం 
                   మీ –గబ్బిట దుర్గా ప్రసాద్ –04 -02 -12 .
 
 

— 
గబ్బిట దుర్గా ప్రసాద్
https://sarasabharati.wordpress.com
http://suvarchalaanjaneyaswami.wordpress.com

Unknown's avatar

About gdurgaprasad

Rtd Head Master 2-405 Sivalayam Street Vuyyuru Krishna District Andhra Pradesh 521165 INDIA Wiki : https://te.wikipedia.org/wiki/%E0%B0%97%E0%B0%AC%E0%B1%8D%E0%B0%AC%E0%B0%BF%E0%B0%9F_%E0%B0%A6%E0%B1%81%E0%B0%B0%E0%B1%8D%E0%B0%97%E0%B0%BE%E0%B0%AA%E0%B1%8D%E0%B0%B0%E0%B0%B8%E0%B0%BE%E0%B0%A6%E0%B1%8D
This entry was posted in మహానుభావులు and tagged . Bookmark the permalink.

1 Response to సరస్వతీ పుత్రుని శివ తాండవం -1 ఆచార్య శ్రీ

  1. బత్తిని కొండన్న's avatar బత్తిని కొండన్న says:

    పుట్టపర్తి వారి గురించి మాకు తెలియని విషయాలు తెలియ చేసినందుకు ధన్యవాదాలు
    పుట్టపర్తి వారిది స్వగ్రామం అనంతపురం దగ్గర చియ్యేడు అనియు అది మా ప్రక్క గ్రామమేనని తెలియజేసుకుంటున్నాను.

    Like

Leave a comment

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.