శ్రీ పాద వారి అనుభ వాల జుంటి తేనే – జ్ఞాప కాల దొంతర మల్లెలు 1

 శ్రీ పాద వారి అనుభ వాల జుంటి తేనే –

                                      జ్ఞాప కాల దొంతర మల్లెలు     1

—  శ్రీ పాద సుబ్రహ్మణ్య శాస్త్రి గారు అంటే నాకు పరవశం .ఆయన ధవళ  వస్త్ర ధారణ ,పంచె కట్టు ,శాలువా వేసే విధానం ,తెలుగు భాష ,ఆణి ముత్యాల్లాంటి కధలు ,నడవడి నడక తీరు ,మల్లె మనసు ,ఆయన అనుభవాలు ,జ్ఞాపకాలు అన్నీ మరీ మరీ ఇష్టం .ఎన్నో సార్లు చదివినా మళ్ళీ చదివించే ఆప్యాయత వారి సొత్తు .1999 లో మళ్ళీ వారి” అనుభ వాలు -జ్ఞాపకాలు ”చదివా .ఆ ఆనందం లో ”అనుభవాల జుంటి తేనే పుచ్చు కొని ,జ్ఞాపకాల దొంతర మల్లెల సువాసన అనుభవించాక ” అని నాకోసం 01 -02 -1999 న రాసు కొన్న నిక్షిప్త నిధి ఇది .పన్నెండేళ్ళు మాగిన దివ్య ఫలం .ఇప్పుడు మీ కోసం .
అన్న గారూ !శ్రీ పాద సుబ్రహ్మణ్య శాస్త్రి గారూ !ఆంగీరస ,అయాస్య ,గౌతమ త్రయార్ర్శేయ  ప్రవరాన్విత గౌతమ గోత్రోద్భావస్య   కృష్ణ యజుస్సాఖాధ్యాయీ దుర్గా ప్రసాద శర్మన్ అహం భో అభి వాద యేత్ –
బ్రహ్మణ్యులు   మీరు -సుబ్రహ్మణ్యు లు  యదార్ధం గా -అసలు సిసలు తెలుగు వచనానికి శ్రీ పాదులు తమరు .మీ అనుభవాలు ,మా బోంట్లకు అననుభవాలు .మీ జ్ఞాప  కాలు మీకు తీపి గుర్తులైతే ,మాకు తేనెల ఊటలు. జాతికి అందిన అమూల్య రత్నాభరణాలు .వచన రచనకే కీర్తి తోరణాలు .భవిష్యత్ తరాలకు నిక్షిప్తం చేసిన ,నిధి నిక్షే పాలు .మీ అనుభవ సారాలు మాకు మా” నూజివీడు చిన్న రసాలు” .విజాతి వ్యామోహ పైత్య కారులకు మాదీ ఫల రసాయనాలు ,పైత్యాంత కాలూను .
శుద్ధ వైదిక కుటుంబం లో పుట్టి ,ఆర్షేయ ,పౌరుషేయాలకు ఆల వాల మైన వాతావరణం లో పెరిగి ,శల్య గతః వాటిని జీర్ణించుకొని ,ఆ బాటలో మీ తండ్రీ ,సహోదరుల కు  ఏమాత్రం తీసి పోని ,ప్రజ్ఞా పాటవాలు చూపించి ,మీ మార్గం లోంచి ,మిమ్మల్ని మల్లిన్చాలన్న వాళ్ల తీవ్ర ప్రయత్నాలకు ,పట్టుదల వదలని విక్రమార్కుని లా మీరే  పంతం నెగ్గించు కొంటు ,సాధ్య మైనంత వరకు వారిని నొప్పింపక ,వారే తప్పనిసరి యై ,మీ దారి లోకి వచ్చే ట్లు చేసిన ,మీ సానుకూల ప్రయత్నాలు ధన్య తరాలు .మీ మనో శక్తి ముందు ,ఏదీ ఆగ లేక పోయింది .నిత్య విజేతలై ,అనుకున్నది సాధించి ,మీరు మీరే అన్న ప్రమాణం నెల కోల్పారు .అమోఘ మైన మీ ఆత్మ శక్తికీ ,బాధ్యతల బరువును కొండం త  గా మోస్తున్నా ,చలించని మీ ధైర్యం ,సాహసమే ఊపిరిగా సాగిన మీ జీవితం జాతికి ఎంతో స్ఫూర్తి నిచ్చింది .ఎప్పుడో ఒక సారి చదివినా ,ఆ అనుభవాల తేగల  పాతర ,నిత్యం ఊరిస్తూనే వుంది .అందుకే వీలైన ప్పుడల్లా  చది వాను .చదువుతున్నాను ,చదువు తాను కూడా .ఏదో రస ప్రవాహం లో పూర్తిగా మునిగి పోయినంత  ఆనందం .అందు లోంచి ,బయటకు రాలేని వైనం .ఇంత చదివీ నేర్చుకొని ఆచరించేది అతి స్వలప్పమే అని తెలిసినా ,మీ వచన ప్రవచన ప్రవాహం లో కొట్టుకు పోవడమే ఎప్పుడూ .పుస్తకం పుచ్చుకుంటే ,ఆసాంతం చదివితే కాని వదలని పట్టు ,మీ శైలి సొత్తు .నగిషీలు చెక్కిన మాటల అందాలు ,నిజాయితీకి నిలువెత్తు అద్దాలు  మీ జ్ఞాపకానుభాలూనూ. అదో రస లోకం .ప్రాపంచిక స్ఫూర్తి ఏమవు  తుందో ,తెలీని అలౌకికానందం ..ఆ అందపు అనుభవ సారమే ఈ మాటల విరి దండలుగా మీకు సమర్పిస్తున్నాను .
శ్రీ విద్యా ఉపాసన ఫలితం గా వచ్చిన” బిరుదు ”మీ ఇంటి పేరై ,సార్ధక నామం అయింది .ఇదంతా మీ పూర్వీకుల తపో ఫలమే .”మునుల కూడలి ”అయిన ”ముని కొడవలి ”గ్రామం ,మీ వంశాన్కురాల వల్ల పవిత్ర మైంది .మీ పూర్వీకు లంతా ,స్మార్త ,ధర్మ శాస్త్ర పారంగతు లై ,మంత్ర శాస్త్ర పాదుకాంత దీక్షా పరులై ,మీకు దివ్యాశీస్సు లంద జేసి ,అభ్యుదయ పరం పర గా దీవించారు .ఆ బ్రహ్మాశీస్సులే అక్షయం అయాయి .
అన్న గారూ !ఉపనయనానికి ఎంతటి అర్ధం చెప్పా రండీ మీరు ?మొదటి భాగం లో అదొక సంస్కారం అని ,ధార్మిక జీవ నానికి నాంది అనీ ,పూర్ణ పురుషత్వానికి తొలి మెట్టు అని ,”నడవడికకు తొలి అడుగు ఒడుగు” అని ,విధి ,నిషేధ ,పరిజ్ఞానానికి ప్రారంభం అని విన్న వించారు తమరు .అవన్నీ అర్ధం చేసు కోలేని వారికి ,దాని విలువ తెలీదు అని బాధా పడ్డారు .శీలం అలవడ్డానికి బ్రహ్మ చర్య దీక్శే   అవసరం అని ఘంటా పధం గా చెప్పారు .వివేకమూ కలిగించారు .
మీ అమ్మ గారి ప్రభావం మీ మీద చాలా వుంది కదూ అన్న గారూ !అందరు బాధలో” అమ్మోయ్ ”అంటే ,మీతల్లి    గారు  ఆమె ,తండ్రి గారి మీద వున్న గౌరవాభి మానాలతో”నాన్నోయ్ ”అని  అందరి కంటే భిన్నం గా ,అనే వారు అంటే ,మీరు అవలంబించే కొత్త దారులకు ఆమె ఆ రకం గా మార్గ దర్శి అయారన్న మాట .ఊపిరి పోశారన్న మాట  .ఆ ఉగ్గు పాల మహాత్మ్యమే మిమ్మల్ని అందరి లాంటి వారు గా కాక ,నూత్న పద వర్తి గా మార్చిందని నా నమ్మకం సుమండీ .అందుకే మీకు ,మీ కుటుంబం లో,అందరి పై కంటే ,ఆమె పైనే భక్తీ ప్రపత్తులు ఎక్కువ. .మీ మాతృశ్రీ మీ కిచ్చిన దీవెన ఫలితమే మీ కొత్త పుంతలు ,వింతలూ,విశేషాలూ .
”తలిదండ్రులు మొదటినుంచి సరి అయిన శిక్షణ నిస్తే ,పిల్లలకు అసభ్య ప్రవర్తన రాదు ”అనీ ,మీ తండ్రి గారి పెంపకం లో మీరు మొదట శోత్రియం గానే కాలక్షేపం చేసి ,తండ్రికి తగ్గ వారు అని పించు కొన్నారు .”జాతిని పెంచేది పశు వ్రుత్తి అయితె ,సరిదిద్డేది మానవ ప్రవృత్తి ”అన్న కఠోర సత్యాన్ని అందించారు మీరు మాకు .
”మాధుకర వ్రుత్తి ”ని రుషి వాటికల లోని బాలకులు అవలంబించిన మహోత్తమ వ్రుత్తి గా ,తమరు భావించారు .అన్నం పెట్టె తల్లిని ”అన్న పూర్ణమ్మ ” గా పూజించారు .వారం ఇవ్వని కుటుంబీకులపై మీరు ద్వేషం పెంచు కోలేదు .అడ్జస్టు మెంటాలిటి కి మీరు విలువ నచ్చినా ,మీ గౌరవ భంగం అయిన చోట ”ఎక్ఖడా ”రాజీ పడ లేదు .
ఎవరి నుంచి ఏది నేర్చు కోవతానికైనా ,వెనుదీయని మీరు ”కళ్ళు తాగు తారు -పానకం పుచ్చు కుంటారు ”అని దివాకర రాజు గారు చెప్పే దాకా ,మీకు తెలియదు .మీరు చెప్పే దాకా మాకూ తెలీదు .ఈ విష్యం లో మీ ఆవేదన వివరించిన తీరు బాగుంది .”జాతికి పట్టు కొని  వుండే విషయాలకు సమ్బంధించిన వచన వాజ్మయం లేక పోయింది ”అని విచారించారు .ముమ్మాటికీ ఇది నిజం .శ్రీ దాట్ల వారి కుటుంబం తో నిత్య సాహచర్యం వుండటం ,నిజం గా సరస్వతీ దేవి సాక్షాత్కరించి ,కాళిదాస మహా కవికి నాలుక మీద రాసి నట్లు వుంది ”అన్న మాట నిజాయితీ మూట .అంతరంగం లో నుంచి పెల్లుబికిన సత్యపు ఊట .ఆ నిజాయితీకే నా జోహార్లు .ఇలాంటి సందర్భం లో మీ మాటలు చదువు తుంటే కళ్ళ వెంట బాష్ప ధార నిరంతరం గా ప్రవహిస్తుంది నాకు .చిత్తం ఆర్ద్రం అవుతుంది .ఆ అనుభూతి విలువ మాటలతో చెప్ప రానిది .అనుభవైక వేద్యమే .ఇది నాకు మాత్రమే ప్రత్యేకమా ?కాదేమో ?అందరిదీ అదే తీరేనేమో ?ఏమో ?అవునేమో ?కాదేమో ?
సశేషం
మీ –గబ్బిట దుర్గా ప్రసాద్ –12 -02 -12 .

గబ్బిట దుర్గా ప్రసాద్
https://sarasabharati.wordpress.com
http://suvarchalaanjaneyaswami.wordpress.com

Unknown's avatar

About gdurgaprasad

Rtd Head Master 2-405 Sivalayam Street Vuyyuru Krishna District Andhra Pradesh 521165 INDIA Wiki : https://te.wikipedia.org/wiki/%E0%B0%97%E0%B0%AC%E0%B1%8D%E0%B0%AC%E0%B0%BF%E0%B0%9F_%E0%B0%A6%E0%B1%81%E0%B0%B0%E0%B1%8D%E0%B0%97%E0%B0%BE%E0%B0%AA%E0%B1%8D%E0%B0%B0%E0%B0%B8%E0%B0%BE%E0%B0%A6%E0%B1%8D
This entry was posted in మహానుభావులు and tagged . Bookmark the permalink.

Leave a comment

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.