తెలుగు వాడి వ్యంగ్య నాడి ఆగి ఏడాది అయిపోయిందా !

తెలుగు వాడి వ్యంగ్య నాడి ఆగి ఏడాది అయిపోయిందా !

         చూస్తూ చూస్తుండ గానే ఏడాది గడిచి పోయింది ముళ్ళ పూడి సరస్వతీ సామ్రాజ్యం చేరి .అక్కడ అమ్మ సరస్వతమ్మ తో ఏ వ్యంగ్య  బాణాలు సంధించి నవ్విస్తున్నాడో ?ఆ యమ్మ ఈ కుర్రని ఆర్భాటపు అచ్చ తెలుగు పలుకు బడులకు  యెంత హర్షిస్తోందో ?మనం మాత్రం ఏదో ఒక సంతాప తీర్మానం పెట్టి ,మన బాధ్యత ను దులిపేసుకోన్నాం .మళ్ళీ ఆ విషయం లో చొరవ చూప లేక పోయాం .ఇది తెలుగు వాడికి మామూలే .ఆ మహా హాస్య  రచయిత పేర ఒక పురస్కారం ప్రకటించామా ?ఆ వ్యంగ్య వైభవాన్ని ఆవిష్కరించిన ప్రతిభా వంతులకు సత్కారాలు చేశామా ?ఆ పుస్తకాలను ఈ తరం వాళ్ళు చద వటానికి ,మార్గం ఆలోచించామా ?ఒక డాక్యుమెంటరి తీశామా ?చేతులు ముడుచుకు కూర్చున్నాం మనం .మన ప్రభుత్వ ప్రబుద్ధులకు ఎట్లాగు పట్టదను కోండి .ఆయనే మైనా పైరవీలు చేశాడా ,పంచన చేరి వంత పాడాడా ?.తిమ్మిని బ్రాహ్మి ని చేశాడా ?మాయ మాటలు చెప్పి మంత్ర జలం చల్లి మైమర పించాడా /ఉన్నది వున్నట్లు ,చురుక్కు మనేట్లు ,కొరడా తో చళుక్ మనేట్లు దులిపి మన బుద్ధుల్ని ఎండ గట్టి ,మన పాలకుల చీకటిని అక్షరాల వెలుగు లో చూపి ,మనదైన పౌరాణిక చిత్రాలకు కావ్య గౌరవం కల్పించి ,ప్రతి మాట వెనుక అనేక ఊహల ఊటలు నింపి ,,ఆ మహా పురుషుల చరిత్రను స్వర్ణ మయం చేశాడు .జాతికి ప్రేరణ కల్గించాడు .మంచి చెప్పాడు .చెడు ఇది దీని జోలికి పోవద్దు అని మర్యాదగా చెప్పాడు .మంచి మనిషికి ఒక మాట చాలు అని పించాడు .స్నేహం చేసిన బాపు కు తోడూ నీడ అయాడు .ఆ జంట పండించిన పంటలు అనుభవించ టానికి ఏళ్ళు ,పూళ్ళు చాలవు .అవి నేమరేసుకొంటే చాలు జీవితం ధన్యం అని పిస్తుంది .సామాన్యుని మాన్యుని చేసే విధం చెప్పాడు .చెవ లాయి లోని మూర్ఖత్వాన్ని వదిలించి ,చేవ గలాడిని చేయాలను కొన్నాడు .కోపం తోనో విప్లవ ధ్వానాలతోనో చెప్పే కంటే శల్య గతం అయేట్లు   నవ్విస్తూకొక్కిరిస్తూ , ,గిల్లుతూ చమత్కరిస్తు  చెబితే రక్త గతం కూడా అవుతుందని చెప్పాడుఅట్లా..
మనల్ని మర్కట కిషోర న్యాయం గా పొట్ట కంటించుకొని తనతో తెసుకు వెళ్తాడు .కోతి కొమ్మచ్చు లాడిస్తాడు .మనకేమీ భయం లేదు బాధ్యత అంతా ఆతనిదేగా .పెద్దల యెడ యెంత భక్తో రమణ కు ఆర్ధర్ కాటన్ ను ”గోదావరి మట్టిని బంగారం గా మార్చి ఎడారిని గోదావరి ని చేసిన మహనీయుడు ”అన్నాడు అందం గా .ఆయన్ను భూ-సురుడు ”అనటం రమణ ఒక్కడికే చెల్లింది .అంటే భూమి మీద తిరిగిన దేవత అని అర్ధం కాటన్ దొరకు ఇంత కంటే కీర్తి కిరీటం ఇంకేముంది ?మనకు ఆయనంటే అంతటి గౌరవాభిమానాలున్నాయి .కాని అలా మాటల పటం కట్టటం రమణ కే చెల్లు .
అందాల రాముడు సినిమా లో ”పలుకే బంగార మాయే ”పాట లో పల్లవి మాత్రమె రామ దాసు -చరణాలన్నీ ‘ఆరుద్రాసు ”అని వ్యంగ్యమాడాడు శ్లేషించాడు .భ.కా.రా.మాస్టారు అంత్య ఘడియలలో కూడాహాస్య  మేలనం చేశారట .దాన్ని గుర్తుంచుకొని రమణ భమిడి పాటి వారి భాష లో ఒక అద్భుత మైన శీను కట్టాడు .దీన్ని అంతా ”భమిడి పాటి వారు చావుల దేవుడి తో చేసిన సరసం ”అని ,మరణం లోను,మాస్టారి హ్యుమరాసాన్ని చిలకరిస్తూ  ,పాశం, మీద పడుతున్నా ఏట కారం మాన లేదని ముక్తాయిస్తాడు
ప్రవీణ్ అని మారు పేరు తో రాసే తురగా జానకీ రాణి  గారి భర్త కృష్ణ మోహన్ ను ”వాక్ చతుర్ముఖుడు ”అంటాడు ముళ్ళ పూడి .ఆయనది ప్రసన్న వదనం అని ప్రహ్లాద వచనం అని ,ప్రమోద రచనం అని అక్షర నివాళులు అర్పిస్తాడు .”ఘాటు ప్రేమ ”ను కాటు ప్రేమ అన గల సత్తా ఎవరికుంది బాబూ !”ఎక్కడ కవిత చిరు నవ్వితే అక్కడ ఏం,వి.ఎల్ .వేగు చుక్క గా వాటిని ఎత్తిన పెట్టు కొని వూరేగిస్తాడు అని యువ కవులకు ,అతనెంత ప్రోత్సాహాన్నిచ్చారో కళ్ళకు కట్టి నట్లు వర్ణించి నూజివీడు మాస్టారి ప్రేరణకు జోహార్లు అర్పిచాడు .యువ కవుల కవితల్ని నెత్తినా పెట్టుకోని ఊరేగించి ,ఆనదించి ఆనందింప జేసే వాడు అని వెన్నెల్లో మధుర స్మృతులతో పన్నీటి జల్లు కురిపించాడు ముళ్ళ పూడి .”తాగుడు మూత లు ”ఆడ బోయి ,పున్నమి చంద్రుడు సగమై ,విదియ చంద్రుడై ,పాడ్యమి నాటి చంద్ర రేఖ అయి ,అమావాస్య నాటి సినీ వాలి గా అదృశ్య మైనాడు .నవ్వు ఆగి పోయింది .చీకటి వెలిగింది .పున్నమి నాడే   అమావాస్య దాపరించిందని వాపోయాడు హితుడు ,స్నేహితుడు అయిన ఏం ..వి.ఎల్.మరణాన్ని జీర్ణించు కోలేక పోయాడు రమణ .
వ్యక్తీ లోని ప్రతిభకు అక్షర పట్టాభిషేకం చెయ్యనిది రమణ ఉండ లేడు .”హౌరా !అక్షర శరీరా ! !పరిశోధక పర మేశ్వారా !క్షర మైన దేహాన్ని ,అక్షర శరీరం గా అనువ దించి ,సాహిత్యాకాశం లో ధ్రువ తార గా రంజిల్లే  ఆరుద్రా !సేహబ్బాష్” అని నిండు మనసు తో అర్చించాడు . తిండి పోతు ను  ”తిండా సురుడు ”అంటాడు .మరి మన భూ బకాసురులనే మనాలో ?భూ మ్యా సురులు అందామా ?సరదాగా రమణ భాషలో .
రాయ బారాలను రాయ బేరాలు అని చమత్కరిస్తాడు ,నిజం గా ఇందులో జరిగేవి బేర సారాలేగా ?వేటూరి వారిపాటకు  పల్లకి కట్టి ఊరేగిస్తాడు ”వేటూరి వారి పాటకు సాటేదని సరస్వతిని చేరి కోర –నా పాటేశ్వరునికి ఉజ్జీ వేటూరే నంది నవ్వి వెంకట రమణా “.అదీ ఆ సరస్వతి పుత్రుని పాటను ఊరేగించిన విధానం .”మాటలతో ఆడుకొన్న పాటల పర మేశ్వరుడు వేటూరి ”అని మెచ్చిన సంస్కారి .
” త్యాగయ్య కీర్తన లన్నీ మాకోసమే అన్నట్లు మనసారా రస సాగర మగు రీతిని పాడిన వారు బాలు .అదే చాలు.ముక్కోటి వేలు ”అని బాలు సంగీతా గాయక ప్రతిభకు నీరాజనం పట్టాడు వెంకట రమణ .ఇదీ రమణ మార్కు రచన .అందుకే దానికి అంత వెలుగు . .అందుకే  రమణ మాటలు దివితీలై  తేజస్సు నిస్తాయి. రవ్వల వెలుగు లు పూస్తాయి .దివ్వెల దీపావళి జ్యోతులే అవుతాయి .ఎందుకంటె అవి హృదయం లో లోతు నుంచి వచ్చే మాటలు ;లిప్ సింపతి కాదు .అదో ”సింఫనీ”- అంతే . ”దేహం ఒక సందేహం ఆత్మ మాత్రం నిత్యం సత్యం ”అన్న వేటూరి పాటల  సుందర రామ మూర్తి గారి మాటలు ,”,మరణం ఒక కామా అంతే .చైతన్యానికి ఫుల్ స్టాప్ వుండదు అంతా ఇల్లు ఖాళీ చేసి వెళ్లి పోవాల్సిందే .”అన్న  మాటలూ  ముళ్ళ పూడి  వెంకట రామణకూ వర్తిస్తాయి .మళ్ళీ ఇంకో మారు ముళ్ళ వాడి వ్యంగ్య నాడిని  జ్ఞాపకం చేసుకొంటూ –సెలవ్ .
మీ –గబ్బిట దుర్గా ప్రసాద్ -23 -02 -12 .


గబ్బిట దుర్గా ప్రసాద్
https://sarasabharati.wordpress.com
http://suvarchalaanjaneyaswami.wordpress.com

Unknown's avatar

About gdurgaprasad

Rtd Head Master 2-405 Sivalayam Street Vuyyuru Krishna District Andhra Pradesh 521165 INDIA Wiki : https://te.wikipedia.org/wiki/%E0%B0%97%E0%B0%AC%E0%B1%8D%E0%B0%AC%E0%B0%BF%E0%B0%9F_%E0%B0%A6%E0%B1%81%E0%B0%B0%E0%B1%8D%E0%B0%97%E0%B0%BE%E0%B0%AA%E0%B1%8D%E0%B0%B0%E0%B0%B8%E0%B0%BE%E0%B0%A6%E0%B1%8D
This entry was posted in ముళ్ళపూడి & బాపు and tagged . Bookmark the permalink.

2 Responses to తెలుగు వాడి వ్యంగ్య నాడి ఆగి ఏడాది అయిపోయిందా !

  1. Rishi's avatar Rishi says:

    Good one sir!!

    Like

  2. సుభ/subha's avatar సుభ/subha says:

    మీరు చేసిన అక్షర నివాళి నిజంగా అద్భుతం సార్..

    Like

Leave a comment

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.