ఆదోని పురాణ సంఘం ఉపన్యాసాలు
– డా.అప్పిరెడ్డి హరినాథరెడ్డి
ఆంగ్ల సాహిత్యంలో ఎడిసన్, స్టీల్‌ల ‘స్పెక్ట్రేటర్, టాట్లరు’ వ్యాసాల మార్గాన పానుగంటి లక్ష్మీనరసింహారావు ‘సాక్షి’ వ్యాసాలను రాశాడు. అవి 1913న ‘సువర్ణలేఖ’ వారపత్రికలో, 1920, 1927, 1933లలో ఆంధ్రపత్రిక సారస్వతానుబంధాలలో ప్రచురితమయ్యాయి. తెలుగు సాహిత్యంలో ఈ వ్యాసాలకున్న ప్రాధాన్యం తెలిసిందే.
1917-1918లలో అనంతపురం ఆర్ట్స్ కాలేజీలో చదువుకుంటున్న పప్పూరి రామాచార్యులు, కర్నమడకల గోపాలకృష్ణమాచా ర్యులు తదితర యువకులు పదిహేను రోజులకొకసారి ‘వదరుబో తు’ పేరున వ్యాసాలను ప్రచురించి కరపత్రాలుగా పంచేవారు. 1913లో వెలువడిన సాక్షి వ్యాసాల విషయం వీరికి తెలియలేదనే చెప్పవచ్చు. అప్పట్లో ఈ యువకులు చేసిన స్వతంత్ర ప్రయత్నం ఎంతో మెచ్చుకోతగ్గది. అప్పటి సమకాలీన సమాజ పరిస్థితులు, సాంఘిక దురాచారాల ఖండన, జాతీయోద్యమం మొదలైన అంశాలపై హాస్య, వ్యంగ్యాత్మక ధోరణిలో, సులభమైన భాషాశైలిలో యాభైకి పైగా ఈ వ్యాసాలు వెలువడ్డాయి. వీటిలో లభ్యమైన ఇరవై రెండు వ్యాసాలను 1932న పుస్తకరూపంలో ముద్రించారు.
సాక్షి, వదురుబోతు వ్యాసాల కోవలోనే పప్పూరి రామాచార్యుల సంపాదకత్వంలో అనంతపురం కేంద్రంగా వెలువడిన ‘శ్రీసాధన’ వారపత్రికలో ‘ఆదోని పురాణ సంఘం’వారు రాసిన ఉపన్యాస వ్యాసాలు కనిపిస్తాయి. ఆదోనిలోని కొందరు యువకులు ‘పురాణసంఘము’గా ఏర్పడి ఉత్సాహంతో 1928 ఫిబ్రవరి 25 నుండి ఈ వ్యాసాలు రాశారు. ఈ సంఘం వారి చర్చలు, ఉపన్యాసాలు యధాతథంగా శ్రీసాధన పత్రికలోప్రచురించబడ్డాయి.
మొదటి వ్యాసంలో పురాణ సంఘం అధ్యక్షుడు గతంలో ఇచ్చిన ఉపన్యాసానికి సమాధానంగా సుగాత్రి అనే యువతి రాసిన లేఖలోని అంశాలను తెలియజేస్తాడు. ఆ లేఖలో ‘మీరు దక్షిణ యాత్ర సలుపుతున్న తరి మా నగరమున నిచ్చిన యుపన్యాసమును సాంగముగ వింటిని. మీకుండు సతీగౌరవము లెట్లున్నవో దెలిసిపోయినవి. ఓస్! చాలా బుద్ధిమంతులు! మీ పాండిత్యమంతయు నిచ్చటనే చూపితిరి. ఆడువారిని మీరెట్లు మన్నింతురో వేరుగ జెప్పనక్కరలేదు. పాపము పురుషులకు మాత్రమే బుద్ధులుండుట! మానినీమణులకు మతులుండవు కాబోలు! పురుషులు తమ యిచ్చ వచ్చినరీతి మెలగి, యిచ్చ వచ్చిన చోటికి పోవచ్చును. స్త్రీలు కొంపవిడిచి బయటకు రాగూడదు కాబోలు! మగవాడు సర్వస్వతంత్రుడు. ఆడుది స్వాతంత్రరహిత! మగవాడు తన యుపన్యాసములందు స్త్రీలను గూర్చి తన యిచ్చ వచ్చినట్లు చిలుకపలుకులు నుడవవచ్చును. ఆడుది యుపన్యాసరంగము కెక్కిన దోషము! ఆహా ఏమి మీ బుద్ధి! రాను రాను వృద్ధి చెందుచున్నదే? మగవానికి ఆడుదానివలనె మోక్షము. ఆడుది యే దేశమున నేజాతి వలన గౌరవింపబడునో యా దేశమే దేశము; ఆ జాతియే జాతి; మగవానికి యాడుది సైదోడుగ నుండవలెను.
ఆడుదియే గృహమున కలంకారము. ఇట్టి మాటలు స్త్రీలయెడల కరుణ్రార్థ హృదయములుప్పొంగుచుండునట్లు మీరు పలుకుచుందురేగాని, యాడుది మగవాని మాటలకు రవంత ప్రతికూలమాడిన ఆగ్రహావేశులై, అసూయపరులై అహంభావప్రపుర్ణులై ఆ యాడుదానిని నీరసించి, విమర్శించి, ఖండించి, పరిభవించి, యామె కృశించి, నశించు వరకు బాధలు పెట్టుదురే? ఇదియా మీ సహనము! సమభావము! స్నేహము!’ అని ఆమె రాసిన విషయాల్ని అధ్యక్షుడు తెలియచేస్తాడు.
ఇంకా ఆ లేఖలో ఆధునికత, వేషధారణ, స్వేచ్ఛ తదితర విషయాలలో పురుషుల నుండి స్త్రీలు ఎదుర్కొంటున్న వివక్ష గూర్చి ‘దేవుడు మిమ్ముల వేరే పుట్టించి, మీకు తలలనిండ బుద్ధులు నింపినాడా? మావి శూన్య శిరములా? మీరు జ్ఞాన సింధువులా? మేమజ్ఞానులమా? మీరు సజ్జనులు, మేము కాదా ఛీ! ఎందులో బేధము? మాకు స్వాతంత్య్రమియ్యక విద్య చెప్పింపక కటిక చీకటి కనువగు దుర్గంధకూపమున బడద్రోయుదురా? మేము నోరెత్తిన గయ్యాళులుమా? ఇది యేనా మీ స్వార్థత్యాగము?’ అని ప్రశ్నించినట్లు ఆ ఉపన్యాసమున తెలియజేస్తాడు. ఈ వ్యాసం స్త్రీలు, పురుషుల చేతుల్లో అవహేళనకు, ఆధిపత్యానికి బలౌతున్న తీరును తీవ్రస్వరంతో వ్యతిరేకిస్తూ, పురుషులతో పాటు స్త్రీలకు అన్ని విషయాలలోను స్వేచ్ఛ, స్వాతంత్య్రాలు కావాలని తెలియచేస్తుంది.
మార్చి 24న ప్రచురించిన వ్యాసంలో సంఘంలోని మరో సభ్యుడైన పామిడి వాస్తవ్యుడు వ్యాఘ్రాచార్యుల ఉపన్యాసంలో, రైల్వేస్టేషనులో కాషాయ వస్త్రాలు వేసుకొని పిచ్చివాడిలాగున్న ఒక సన్యాసి పలికిన పలుకుల్ని తెలిపాడు. ఆ సన్యాసి మాటలల్లో ‘నాగరికత, నాగరికత ఏమయ్యా! నాగరకత యన నర్థమేమి? నవనీత ఏమి? నీ తల. నవనమంతయు నాగరికతయా? ఎచ్చట జూచిన నవీనత. ఈ నవీనతయే మన దేశమును బాడులేపినది. మనుషులు నవీన మార్గమును ద్రొక్కుచున్నారు. విద్యాప్రదాతలు విద్యాశాలల యం దు విద్యలమ్ముకొని పొట్టలు పోషించుకొనుచున్నారు. కొందరు కూడులేక కన్నకుమారుల నమ్ముకొనుచున్నారు. ఓ! వర విక్రయములు, కన్యా విక్రయములు ఛీ! ఛీ! శివా ఎంత పాపము. అన్నిటియందును మార్పు, అన్నిటియందును వింత, అన్నిటియందును నవీనము. అథితి సత్కారములందు అద్వితీయులని పేరుగాంచిన హిందువులు బజారులో అన్న విక్రయమొనర్చి బతుకుతున్నారు. పల్లెటూరి పామరులకున్నంత యతిథి సత్కారము, భూతబలి, భూతదయాపరత్వము నేటి నాగరికులకున్న దా?’ అని ప్రశ్నిస్తున్నట్లు ఉపన్యాసం లో వివరించాడు. ఈ ఉపన్యాసంలో మారుతున్న సమాజంలో, తరిగిపోతున్న మానవీయ విలువలను గురిం చి తెలియచేస్తుంది.
ఏప్రిల్ 28న ప్రచురించిన వ్యాసం లో సంఘంలోని మరో సభ్యుడైన అప్పలాచార్యుడి ఉపన్యాసంలో ఒక వంగదేశ వనిత సభలో మాట్లాడిన విషయాలను తెలియజేశాడు. ‘స్త్రీలకు సంపూర్ణ స్వాతంత్య్రమిచ్చుటకు వారి మనస్సంగీకరించునా? వారు పలికిన పలుకులు వారి హృదయాంతరాళముల నుండి వచ్చినవా? బాల్యవివాహాలు మాన్పించి విధవావివాహములను ప్రోత్సహించే విషయమై, స్త్రీ స్వాతంత్య్రం పై ఉపన్యాసాలు, వ్యాసాలు, అరుపులు, ఆలాపనలే తప్ప ఆచరణలో కనిపించుట లేదని తెలియజేస్తుంది.
స్త్రీలను హింసించి, బెదిరించటమేనా, నవీన నాగరికత?’ అని ఆమె ప్రశ్నిస్తున్నట్లు ఉపన్యాసంలో ఉంది. ఇంకా ఆ ఉపన్యాసంలో ‘స్త్రీలు విద్యావంతులైతే విజ్ఞాన శాస్త్ర అభివృద్ధి నాగరికత విధ్వంసం వైపుకాక పురోగతి వైపు ఉంటుంది. స్త్రీలు లాలిత్యానికి సరళతకు కేంద్రమని, సృష్టికి ఆధారమని ఆమె లేకున్న సర్వము శూన్యమని, ఆమె దేవతాస్వరూపిణియని, ప్రపంచంలో నెచ్చటనైనను సుఖమనేది స్త్రీల వల్లనే కలిగినది. అధికారము కావాలని పెనుగులాడుచున్న పురుషుడి వెఱ్ఱి యాస అస్తిమించే రోజులు వచ్చాయని, వారి అధికారం అంత్యదశకొచ్చిందని ఇది తెలిసి ‘నస్త్రీ స్వాతంత్య్ర మర్హతి’ యని యేవేవో కాఱులు కూచుచున్నారని, కాని స్వాతంత్య్ర ప్రవాహమున తడడ్డుకోగలడా?’ అని ఆ వంగ వనిత ఉపన్యసించినట్లు పురాణ సంఘసభ్యుడు ఉపన్యాసములో తెలియజేశాడు.
ఈ విధంగా ఆదోని సంఘం వారి ఉపన్యాసాలు ఆనాటి సమాజంలోని పరిస్థితుల్ని, మార్పుల్ని, విధ్వంసమౌతున్న విలువల్ని, స్త్రీ పురుష సంబంధాల్ని, స్త్రీల స్వేచ్ఛా స్వాతంత్య్రాలను తెలియజేస్తాయి. ఈ వ్యాసాలలోని భాష, శిల్పం సాక్షి, వదరుబోతు వ్యాసాల సరసన నిలబడదగ్గవే. తరువాత కాలంలో ఈ సంఘం వారు రాసిన వ్యాసాలు, ఇతర పత్రికలలో వెలువడ్డాయేమో సాహిత్య పరిశోధకులు అధ్యయనం చేయాలి. అవి సేకరించగలిగితే తెలుగు సాహిత్యంలో వీటికున్న ప్రాధాన్యత మరింత విశదీకృతమవుతుంది.
– డా.అప్పిరెడ్డి హరినాథరెడ్డి
99639 17187

