నా దారి తీరు -26
లాబ్ సమస్య –తీరిన విధం
పామర్రు లో సీనియర్ సైన్సు అసిస్టంట్ గొట్టి పాటి సత్య నారాయణ గారు హెడ్ మాస్టర్ గా ప్రొమోషన్ రావటం వల్ల అ ఖాళీ లో నన్ను వేయించి ఉంటారు రుద్రపాక హెడ్మాస్టారు ఈ.వి.ఆర్ .గారు తాడంకి లో వేయిన్చుకొంటానన్న గురజాడ వెంకటేశ్వర రావు గారి మాట ఒట్టిది అయింది ఆయన్ను ఇంఫ్లుఎన్స్స్ చేసి జి నారాయణ రావు అక్కడికి చేరాడు .వెంకటేశ్వర రావు గారు నాకు చేయ్యిచ్చారు .ఆ సంగతి ముందు నుంచి నేను ఊహిస్తూనే ఉన్నాను .పాపం ఆయన స్వభావం తెలియని ఆంజనేయశాస్త్రి మాట పోయిందని బాధ పడ్డాడు ..గురజాడ స్వభావం నాకు చాలా కాలం నుండి తెలుసు .పైకి కనీ పించి నంత సౌమ్యుడు కాదు ఆయన .సరే మంచిదే జరిగింది .తాడంకి లో కమిటీ పెత్తనం ఎక్కువ .అది నా లాంటి వాడికి భరించటం కష్టం .పామర్రు ఎవరికీ పట్టనిది .పైగా పెద్ద స్కూలు .హాయిగా ఉంది స్వతంత్రం ఉంది స్వతంత్రం పొందుతూ విధిని చక్కగా నిర్వహించాలి అన్నది నా తపన .
ల్యాబ్ ఇంచార్జి గా సీనియర్ ఉంటాడు.సత్యనారాయణ గారికి ,కేశవ రావు గారికి పడేది కాదట .ఇద్దరు ఒక ఊరి వారే .అంత పాలిటిక్స్ ఉండేవి అందుకని సత్యనారాయణ గారు లాబ్ ను కేశవ రావు కు అప్పగించాకుండానే రిలీవ్ అయి వెళ్ళారు .హెడ్ మాస్టారు తన కున్న అధికారం తోL.p.c.ఇవ్వలేదు లాబ్ అప్పగించిన తర్వాతే అది ఇస్తానని హెడ్ గారు భీష్మించారు ఈ పరిస్తితి లో నేను అక్కడికి చేరాను .ఒక సారి హెడ్ గారు నన్ను పిలిచి విషయం అంతా చెప్పి లాబ్ ను నన్ను స్వాధీనం చేసుకోమన్నారు .అప్పుడు స్టాక్ రిజిస్టర్లు చూశాను అందులో ఎక్కడా బ్రాటోవర్లు ఎంట్రీలు లేవు ఏవి ఉన్నాయో ఏవి లేవో తెలీదు .ఇలాంటి పరిస్తితి లో అప్పగించుకోవటం కష్టం అని చెప్పాను .ముగ్గురం కలిసి ఒక నిర్ణయానికి వచ్చాం .ఉన్న సరుకు నంతా విడివిడిగా ఫిజిక్స్ ,కేమిస్త్రి,,బయాలజీ జువాలజీ రిజిస్టర్లలో ఎత్తి రాసి కొత్త రిజిస్టర్లు తయారు చేసి అప్పగించుకొంటే ఎవరికీ ఇబ్బంది ఉండదు అలానే కానీ మన్నారు హెడ్ .నేనూ ,కేశవరావు గారు దాదాపు మూడు నెలలుఖాళీ పీరియడ్ల లో కూర్చుని దాని నంతటిని దారికి తెచ్చి కొత్త రిజిస్టర్లు తయారు చేశాం ఉన్న వాటిని మాత్రమే స్టాక్ లో చూపించి ,లేని వాటికి రైట్ ఆఫ్ రాశాం .హెడ్ గారు నేను చెప్పిన ఈ ఉపాయానికి చాలా సంతోషించారు ఇప్పటికైనా ఒక దారి ఏర్పడి నందుకు ఆనందించి నన్ను అభి నందించారు .సత్యనారాయణ గారిని పిలిపించి’’ హాన్దేడ్ ఓవర్ ,టేకెన్ ఓవర్ మాతో రాయించి ‘’సంతకాలు పెట్టించి అయన కౌంటర్ సిగ్నేచర్ చేసి హాయిగా పని పూర్తీ చేయించారు అప్పుడు సత్యనారాయణ గారికి L.P.C.ఇచ్చారు ఇది లేనిదే జీతం పొందే వీలు లేదు సేనియర్ హెడ్ మాస్టర్ అంటే అల హుందాగా దారికి తేచ్చి పరిపాలించాలని దారి చూపించారు .నాకే లాబ్ ఇంచార్జి అంటే ఫిజికల్ సైన్సు ను కేశవరావు కు నేచురల్ సైన్సు విభాగాన్ని అప్పగించారు .కద సుఖాంతం అయింది .లాబ్ అసిస్టంట్ గా ఒక మెత్తటి మనిషి వెంకటేశ్వర రావు అను కొంటా ఉండేవాడు .ప్రక్క ఊరి నుండి వచ్చేవాడు పంచె కట్టే వాడు సౌమ్యుడు నిదానస్తుడు ఓపిక ఉన్న వాడు నాకు ప్రయోగాలలో మంచి సహాయ కారి .లాబ్ లోనే నా క్లాసులు చెప్పేవాడిని .కేశవరావు కు లాబ్ వెలుపల పెద్ద రూమ్ ఉండేది అక్కడ చెప్పే వాడు మేమిద్దరం చాలా ఆప్యాయం గా ఉండే వాళ్ళం వాళ్ళ అబ్బాయి కూడా అప్పుడు చదివే వాడు వాడికి చదువు అబ్బేది కాదు . ఒక సారి కేశవరావు నాతో ‘’నేను చాలా కాలం నుంచి ఇక్కడ సైన్సు మేష్టారు గా పని చేస్తున్నాను కానీ మీ లాంటి ఫిజికల్ సైన్సు టీచర్ని ఇంత వరకు చూడ లేదు మీ చెప్పే విధానం చాలా ఆకర్షణ గా ఉంటుంది .నేను గమనించాను .పామర్రుకు మీ లాంటి మంచి సైన్సు మేష్టారు రావటం మాకు ముఖ్యం గా నాకు ఆనందం గా ఉంది ‘’అన్నారు తోటి టీచరు అంత సహృదయత చూపటం అరుదు .అయన టీచింగ్ కూడా అద్భుతమే .ఆ విషయం నేనూ చెప్పాను పామర్రు లోనే చాలా కాలం లెక్కల మేస్టారు గా పని చేస్తున్న N.v.Rకు కేశవ రావు కు తేడా ఉంది .కేశవరావు కపటం లేని మనిషి .నూతక్కి వెంకటేశ్వర రావు అంటే nvr గడుసు పిండం .పైకి తేలడుకాని వీరిద్దరూ జిగినీ దోస్తులు .ఒకే ఊరి వారు .ఇద్దరు బాగా సంపాదించారు nvr స్కూల్ లోలేక్కలు అంత శ్రద్ధ గా చెప్పడు అనుకొనే వారు .ఇంటి దగ్గరబాగా చెప్పేవాడని పేరు కేశవరావు ఇంటి వద్దా స్కూల్ లోను ఒకే విశదం గా చెప్పేవాడని అనుకొనే వారు .
గవర్నమెంట్ స్కూల్ కు ఆఫర్
ఎప్పుడో చాలా కాలం క్రితం ప్రభుత్వపాఠ శాలల లోకి జిల్లా పరిషత్ ఉపాద్యాయు లెవరైనా వెళ్ళాలి అనుకొంటే ఆఫర్ ఇవ్వమని సర్క్యులర్ వస్తే వెళ్తానని ఆఫర్ ఇచ్చా .ఇప్పుడు అది కది లింది ‘’ఖాళీలు ఉన్నాయి చేరుతారా మీ అంగీకారం పది రోజుల్లో తెలియ జేయండి ‘’ అని డి యి .వో.నుండి నాకు హెడ్ మాస్టర్ ద్వారా కాగితం వచ్చింది .ఏమి చేయాలో తోచలేదు ప్రభుత్వం లో చేరితే బదిలీలు తక్కువే .దాదాపు కదలక్కర్లేదు. కానీ మాకు దగ్గరలో ఆకునూరు మాత్రమె ఉంది అక్కడికి రానిస్తార ?లేక పోతే చాలా దూరం వెళ్ళాలి .రెండో సమస్య –ప్రమోషన్ చానల్ తక్కువ .ఇక్కడ ఉంటె హెడ్ మాస్టర్ అయ్యే అవకాశాలు ఎక్కువ.ఇవన్నీ ఆలోచించి హెడ్ గారిద్వారా ఆఫర్ ను తిరస్కరిస్తున్నానని , జిల్లా పరిషద్ లోనే కోన సాగుతానని తెలియ బరిచి ఊపిరి పీల్చుకోన్నాను .హెడ్ గారు కూడా చక్కని సలహా ఇచ్చారు .
శివరాత్రి
ఒక శివ రాత్రికి తిమ్మరుసు గారిని సత్యనారాయణ గారిని గండ్రం వారిని ఉయ్యూరు కు ఆహ్వానించాను .ఆ రోజు రాత్రి మనిన్ట్లోనే భోజనం చేసి రాత్రికి నడిచి తోట్ల వల్లూరు వెళ్ళాము అక్కడ తిమ్మరుసు గారి సహాధ్యాయి శివాలయం లో అభిషేకం కల్యాణం చేయించే శివలెంక ఆయన రూమ్ లో పడుకోన్నాం మర్నాడు ఉదయమే లేచి కృష్ణా స్నానం చేసి దైవదర్శనం చేసి అభిషేకం లో పాల్గొని శివలెంక వారు ఏర్పరచిన కాఫీ ఫలహారాలు తిని అక్కడ జరిగే సాంస్కృతిక కార్య క్రమాలు చూసి కల్యాణం దర్శించి మర్నాడు ఉదయం ఎవరిల్లకు వాళ్ళం చేరుకొన్నాం ఈ విషయాన్ని మేము చాలా కాలం చెప్పుకొనే వాళ్ళం .
ధనుర్మాసం భోజనం
ఒక ధనుర్మాస కాలం లో వీరిని మన ఇంటికి ఆహ్వానించాను రాత్రే వచ్చి భోజనం చేసి పడుకొన్నారు ఉదయంకాల కృత్యాలు స్నాణాలు అనుస్టానాలు అయిన తర్వాతా మా అమ్మ వారందరికీ కమ్మటి భోజనం తయారు చేసి పెట్టింది అందరు సంతృప్తి గా భోజనం చేశారు అందరికి ఆవ పోసన పోసుకోంది అమ్మ .ఈ రకం గా ఆవిడ కోరుకొన్న ధనుర్మాస కార్య క్రమం పూర్తీ అయింది .
గండ్రం వారింట్లో కార్తీక భోజనాలు
పామర్రు లో లెక్కల మేష్టారు గండ్రం వెంకటేశ్వర రావు గారింట్లో శివ పంచాయతనం ఉండేది ప్రతి నిత్యం వారి నాన్న గారు అభిషేకం చేసుకొనే వారు .కార్తీక ఏకాదశి నాడు ,పౌర్ణమి నాడు ప్రత్యేకం గా పురోహితులను పిలిచి పభిషేకం ఏకాదశ రుద్రం చేసి మారేడు దళాలతో పూజ చేసి రాత్రికి భోజనాలు ఏర్పాటు చేసే వారు ఊరి లోని బ్రాహ్మణు లందరూ వచ్చే వారు స్కూలు స్టాఫ్ అందరు హాజరయ్యే వారు చాలా భక్తీ శ్రద్ధలతో వెంకటేశ్వర రావు దంపతులు చేసే వారు .వంట వాళ్ళతో కమ్మటి భోజనాలు తయారు చేయించి లడ్డూలు పూర్ణం బూరెలు పులిహోర పాయసం మొదలైన వాటితో గొప్ప విందు నిచ్చేవారు నేను ఉయ్యూరు లో సోషల్ మేస్టారు ఎస్.వి.సత్యనారాయణ తప్పకుండా ఫామిలీస్ తో వెళ్ళే వాళ్ళం .వెంకటేశ్వర రావు గారి తమ్ముడు ఉమా మహేశ్వర రావు సైన్సు మేస్టర్ గా ఉండేవాడు బికాం వాడు ఫిజికల్ సైన్సు చెప్పేవాడు ఎలా సాగిందో ఆశ్చర్యమే .ఇంకో తమ్ముడు రామారావు కో ఆపరేటివ్ సొసైటీలో పని చేసే వాడు ఉమా మహేశ్వర రావు ఉయ్యూరు హెడ్ కర్ణం సీతం రాజు సాంబశివ రావు గారి అల్లుడే .రామా రావు పెళ్ళికి నూజివీడు దగ్గర ఊరికి మేమంతా వెళ్లాం .గండ్రం వారిది బందరు దగ్గర ఒక అగ్రహారం ఒక సారి మమ్మల్ని అందర్నీ అక్కడికి తీసుకొని వెళ్లి రాత్రి అక్కడే పడక ఏర్పాటు చేసి భోజనాలు ఏర్పాటు చేశారు బహుశా రామా రావు పెళ్లి సందర్భం గా సత్యనారాయణ వ్రతం సందర్భం అని జ్ఞాపకం .ఇలా పామర్రు ఉద్యోగం చాలా హాయిగా గడిచి పోతోంది .
సశేషం –మీ –గబ్బిట దుర్గా ప్రసాద్ -10-6-13-ఉయ్యూరు

