నా దారి తీరు -29
స్టాఫ్ అసోసియేషన్ ఏర్పాటు – సెక్రటరిగా బాధ్యత
పామర్రు హైస్కూల్ లొ అనైక్యత గురించి ముందే చెప్పాను .బదిలీ అయిన వాడికి పార్టీ లేదు వీడ్కోలు సభా లేదు .కావలసిన వాడికి మాత్రం ఇష్టులు ఏర్పాటు చేయటం .పాపం హెడ్ గారు ఏమీ చెయ్యలేని స్తితి .ఎవరేర్పాటు చేసినా స్కూల్ పెద్ద గా హాజరయ్యే వారు .మమ్మల్ని పిలిస్తే మేమూ వెళ్ళే వాళ్ళం .ఇదంతా ఒక గ్రూప్ తగాదా లా ఉంది కాని ఇంత పెద్ద స్కూల్ కు హుందా గా లేదు .నేను పామర్రు లో చేరిన దగ్గర నుంచీ ఈ విషయాన్ని మిగిలిన ఉపాధ్యాయులు,ఆఫీసు స్టాఫ్ తో తెలియ జేస్తూనే ఉన్నాను .అందరికి స్టాఫ్ అసోసియేషన్ ఏర్పడితే బాగుంటుంది అని, దాని ఆధ్వర్యం లో కార్య క్రమాలు నిర్వహిస్తే మంచిది అని తెలుసు .కాని ఎవరూ ముందుకు రావటం లేదు .నాకు మాత్రం చాలా చిరాకుగా ఉంది .
నాకు పెద్దలైన తిమ్మరుసు గారు గండ్రం వెంకటేశ్వర రావు గారు ,ఆచార్యులు ,గారు కొండూరి వారు మొదలైన వారితో సుదేర్ఘం గా మాట్లాడే వాడిని. మేమంన్దరం కలిసి హెడ్ మాస్టారు దృష్టికి కూడా తీసుకొని వెళ్లాం .ఆయనకూ ఇది బాగా నచ్చింది .కాని ‘’పిల్లి మెడ లో ఎవరు గంట కడతారు ?’’.ఎవరి పేరైన చెబితే ఆయన పనికి రాడని అనటం తో ఎన్నో పేర్లు చర్చకు వచ్చాయి .ఈ బృందమే అందర్నీ సంప్రదించింది .అందరూ స్టాఫ్ అసోసియేషన్ ఏర్పడాల్సిందే అని ఒక నిర్ణయానికి వచ్చాం .దీనికి వ్యతి రేకత రాలేదు మరి స్టాఫ్ సెక్రటరి గా ఎవరు /?అన్న దాని దగ్గరే ఆగిపోతోంది .అప్పుడు తిమ్మరుసు గారు మొదలైన వారు నాతో‘’ప్రసాద్ గారూ !అసలు స్టాఫ్ అసోసియేషన్ ఒకటి కావాలని పట్టు పట్టింది మీరు .అందరితో మాట్లాడి ఒప్పించింది మీరు .అందరికి మీ మీద విశ్వాసం ఉంది మీరు ఒప్పుకొంటే మా స్టాఫ్ సెక్రటరీ మీరే ‘’అన్నారు .నాకేందుకోచ్చిన భారం అని అనుకొన్నా.కాని నాపేరు అయితే ఎవరూ అభ్యంతరం చెప్పరని అందరి భావన .కనుక తప్పక ఒప్పుకోవలసి వచ్చింది .జ్ఞానేశ్వర రావు అనే పామర్రు నివాసి, డ్రిల్ మేష్టారు అసిస్టంట్ సెక్రటరి గా ఉంటె నేనూ రెడీ అని చెప్పాను.అతనూ చాల మంచి వాడు .అభి వృద్ధి కోరుకొనే వాడు వెంటనే అంగీకరించాడు .ఎన్నో నెలల ప్రయత్నం ఫలించి స్టాఫ్ అసోసియేషన్ ఏర్పడింది పామర్రు హైస్కూల్ లో దాదాపు పది పదిహేనేళ్ళ తర్వాత.ఇది నా విజయం అని అందరూ అనుకొన్నా దీన్ని కావాలను కొన్న వారందరి విజయం గా దాన్ని నేను భావిస్తాను .
అప్పటి నుంచి ఎవరు స్కూల్ నుండి బదిలీ అయినా ఆయనకు స్టాఫ్ తరఫునశాలువా దండా జ్ఞాపిక తో సన్మానం, వీడ్కోలు విందు ఏర్పాటు చేశాం జ్ఞానేశ్వర రావు జమా ఖర్చులన్నీఒక పుస్తకం లో రాసి అందరికి సర్క్యు లేట్ చేసే వాడు .దానిలో అందరు సంతకాలు చేసే వారు .డబ్బులు వసూలు చేసి జాగ్రత్త చేసే వాడు ..ఏ రకమైన భేదాభి ప్రాయమూ రాలేదు .మేమిద్దరం మంచి జంట గా వ్యవహరించం .అందరు మమ్మల్ని అభి నందించే. వారు ఇలా పామర్రు హైస్కూల్ లో ఒక ఆదర్స్దాన్ని అమలు చేయ గలిగాం .ఆ తర్వాతా మళ్ళీ ఎప్పుడూ అక్కడ గూడు పుఠాణీలు ముఠాలు ఏర్పడలేదు ఆ వారసత్వం ఇప్పటి దాకా కోన సాగుతోంది .దీనికి హెడ్ మాస్టర్ రామకృష్ణయ్య గారి సహకారం మరువ లేనిది అందరం ఒకటిగా ముందుకు సాగాం .ఎవరి పెళ్లి అయినా ఎవరింట్లో శుభ కార్యమైనా అందర్నీ పిలిచే వారు స్టాఫ్ అందరం వెళ్ళే వాళ్ళం వారికి స్కూల్ తరఫున కానుక అందజేసే సంప్రదాయాని కూడా సృష్టించాం . కనుక ఎవరూ ఇబ్బంది పడలేదు ఎవరికో ఒకరిని భుజాన వేసుకోవటం ఇంకోర్ని తీసి పారెయ్యటం లేకుండా జరిపించాం . జ్ఞా నేశ్వర రావు సహకారాన్ని నేను ఎన్నటికీ మరిచి పోలేను అందరూ మాకు సహకరించి కార్య క్రమాల అమలుకు సహకరించి నందుకు వారందరికీ కృతజ్ఞతలు .
కూరగాయల మార్కెట్
పామర్రు అంటే అరటి పండ్ల కు ప్రసిద్ధి .అలానే తాజా కూర గాయలకూ పేరు .’’పాస్’’బెల్ తర్వాత పీరియడుఖాళీ ఉన్న వాళ్ళు దగ్గరలో ఉన్న కూరగాయల మార్కెట్ కు వెళ్లి తాజా కూరలు కొని సంచీలో వేసుకొని వచ్చేవారు .ఇంటికి వెళ్ళేటప్పుడు తీసుకొని వెళ్ళే వారు మేస్టర్లకు అందరి కంటే తక్కువ రేట్ కే అమ్మే వారు అందరికి ఆ వర్తకులు బాగా పరిచయం అయ్యారు ..తాజా కూరలు నోరూరించేట్లున్దేవి .అన్ని రకాలు దొరికేవి కొందరు ఇంటర్వెల్ సమయం లో వెళ్లి తెచ్చుకొనే వారు నేనూ చాలా సార్లు కూరలు కొని ఉయ్యూరు తెచ్చే వాడిని .
ఊటుకూరి వారి పచారీ కొట్టు
పామర్రు సెంటర్ లో ఊటుకూరు వారి పచారీ దుకాణం బాగా ప్రసిద్ధ మైనది అక్కడ మంచి సరుకు మిగిలిన కోట్ల కంటే తక్కువ ధరలో దొరికేవి అందుకని మేస్స్టర్లందరూ అక్కడే చింతపండు మిర్చి కందిపప్పు మొదలైనవి కొనుక్కొనే వారు. అప్పు కూడా పెట్టె వారు .జీతాలు రాగానే తీర్చటం పధ్ధతి .షావుకార్లు మంచిగా మర్యాదగా ఉండే వారు .ఒక రకం గా మేస్టార్ల పాలిటి కల్ప వృక్షం ఊటుకూరి వారి దుకాణం ..
పామర్రు మిఠాయి దుకాణం
పామర్రు సెంటర్ లో ఒంతేనకు ఇవతల ఎడమ వైపు ఒక పెద్ద మిథాయి దుకాణం ఉండేది సరుకు బాగా ఉండటమే కాక బెజ వాడ బందరు మధ్య అంత చవక గా అమ్మే దుకాణం లేదు అందుకని స్కూల్ ఫంక్షన్లకు, జాతీయ దినోత్సవాలకు అక్కడే చుట్టుపక్కల స్కూల్ వాళ్ళందరూ ఆర్డర్ ఇచ్చి సరుకు చేయించుకొని తీసుకొని వెళ్ళే వారు .ఫ్రెష్ గా, రుచి కరం గా ఉండేవి .నేను మేడూరు హైస్కూల్ కు కూడా పామర్రు నుండే లడ్డూ కారప్పూస మిక్చర్ వగైరాలను తెప్పించే వాడిని .అంత ఫేమస్ దుకాణం అది .పేరు ఇప్పుడు గుర్తుకు రావటం లేదు తర్వాతా వంతెన అవతల అవని గడ్డ దారిలో ఎడమ వైపు ఇంకో కొట్టు వచ్చింది ఇక్కడా మంచి సరుకే లభ్యమయ్యేది ..వివాహాహాది శుభ కార్యాలకు అందరూ పామర్రు మిఠాయి దుకాణం నుండే అన్నీ తయారు చేయించి బుట్టలతో తీసుకొని వెళ్ళేవారు .
పామర్రు సంత
పామర్రు లో ప్రతి మంగళ వారం పండ్ల సంత జరిగేది..దున్నపోతు లాంటి అరటి పండ్ల తో గెలలు చూడ ముచ్చటగా ఉండేవి దివితాలూకా నుండి అరటి గెలలు వచ్చేవి ఈ సంతకు .ఇక్కడే కొని ఉయ్యూరు గుడివాడ కూచి పూడి మొదలైన చోట్లకు తీసుకొని వెళ్ళే వారు .ఇప్పుడు మా ఉయ్యూరు లో ను సంత వచ్చింది .కంకి పాడు సంతకూ గిరాకీ ఉంది అక్కడ ఒకప్పుడు కూరగాయలకు ప్రత్యేకం గా ఉండేది .అరటి గెలలకు అరటి ఆకులు చుట్టి గెల పాడు కాకుండా జాగ్రత్త చేసి రవాణా కు వీలుగా చేసి ఇవ్వటం ఉంది .అత్తవారింటికి అమ్మాయి ని పంపిస్తుంటే అరటి గెల ఇచ్చి పంపటం ఆన వాయితీ. చక్ర కేళీ పళ్ళు బాగా వచ్చేవి .
పామర్రు హైస్కూల్ లైబ్రరి –పఠనం –రచనా వ్యాసంగం
పురాతన మైన హైస్కూల్ పామర్రు స్కూలు ఇక్కడ పెద్ద లైబ్రరి ఉండేది ఎన్నో విలువైన గ్రంధాలు ఉండేవి .వాటిని చక్క గా చదివే వాడిని .ఎన్ని కావాలంటే అన్ని ఇంటికి తీసుకొని వెళ్ళేవాడిని .ఇక్కడ చదివిన అతి గొప్ప పుస్తకాలలో జనమంచి శేషాద్రి శర్మ గారి ‘’శ్రీ రామావతార తత్త్వం ‘’దాదాపు పదిహేను భాగాలు ఎంతోరిఫెరెంసు తో వారు రాశారు .అది నాకు చాలా ఉప యోగ పడింది .ఉయ్యూరు విష్ణ్వాలయం లో పరిమి రామ కృష్ణ శాస్త్రి గారు ఒక సారి సుందర కాండ ను, మరో సారి సంపూర్ణ రామాయణాన్ని పురాణం గా చెప్పారు ఆ రెండు నెలలపాటు సాగాయి రోజూ వెళ్లి వినేవాడిని ఆయన చెప్పే తీరు బాగుండేది. అన్నీ వాచో విదేయం .ప్రార్ధన ప్రారంభిస్తే మనల్ని మనం మరిచి పోతాం ఆ రెండు గంటలూ .అంత పకడ్బందీ గా చెప్పేవారు నల్లగా ఉన్నా ఆకర్షణీయమైన ముఖం వర్చస్సు ఉండేవి ,కళ్యాణాలు జరిపించటం ఉండేది. చివరి రోజున నన్ను మాట్లాడమని మా వాళ్ళు కోరే వారు .అప్పుడు ఆయన చెప్పని వాల్మీకి చెప్పిన విషయాలను వివరించే వాడిని ఆయన ఆశ్చర్యం తో విని ‘’ఇంత శ్రద్ధగా విన్నారా మేస్టారూ !నేనే చెప్పని విషయాలు అందరి దృష్టికి తెచ్చి నందుకు అభి నందనలు ‘’అని చెప్పారు .అందులో ముఖ్యం గా సుందర కాండ లో ‘’సీతమ్మ వారిని చూసినట్లు భావించిన ఆంజనేయుడు డాన్సు చేసి నట్లుగా చక్కని శ్లోకాలు మహర్షి చెప్పాడు వాటిని వివరించాను .అలాగే అహల్యా శాప వృత్తాంతం లో శాస్త్రి గారు చెప్పిన తీరు సరిగా లేదని వాల్మీకి ఆమెను తప్పు చేసిన దాని లానే చెప్పాడని శ్లోకాలు ఉదహరించి చెప్పాను .ఇవి చెప్ప టానికి నాకు జ్ఞానాన్ని చ్చింది జనమంచి వారి రామా వాతార తత్వమే .అయితే పరిమి వారు ఈ పుస్తకాలను తాను చదవ లేదని సభా ముఖం గా అంగీ కరించారు .ముఖే ముఖే సరస్వతి అంతటి జ్ఞాన సంపన్నుడికి ఇవి తెలియక పోవటం పెద్ద విషయమేమీ కాదు చెప్పాలను కొన్న నా తొందర బాటేమో నని అనిపించింది .కాని విషయం అందరికి చెప్ప్ప గలిగానని సంతృప్తి .ఆ తర్వాత పరిమి వారు ఎక్కడ కనీ పించినా చాలా గౌరవం గా ఆత్మీయం గా మాట్లాడే వారు వారు రోజూ కైక లూరు నుండి వచ్చేవారు ఉయ్యూరు లో ప్రవచనానికి
రెండో పుస్తకం ‘’తేవప్పేరు మాళ్లు ‘’గారు అభిజ్ఞాన శాకుంత లానికి రాసిన టీకా టిప్పణి.నాకు కొత్త లోకాలు చూపించింది దానిని చదివిన తర్వాతే శాకుంతలం లో ఎవరూ స్పృశించని శకుంతల చెలి కత్తేలైన ‘’అనసూయ ప్రియంవద ‘’లపై పరిశీలనాత్మకమైన రచన చేశాను అది తెలుగు విద్యార్ధి మాస పత్రిక లో పడింది .అంతకు ముందు ఒక సారి మద్రాస్ వెళ్లి నప్పుడు కృష్ణ శాస్త్రి గారింటికి మా అక్కయ్య లోపాముద్ర తీసుకొని వెళ్లి పరిచయం చేసింది ఆయన ఎంతో ఆప్యాయం గా పలకరించి మాట్లాడి తన పుస్తకాలను నాకు సంతకం పెట్టి ఇచ్చారు వాటి ఆధారం గా ‘’భావ కవిత్వానికి మేస్త్రి –సాహో కృష్ణ శాస్త్రి‘’అన్న వ్యాసం రాశాను ఇదీ తెలుగు విద్యార్ధిలో ప్రచురిత మైంది .పామర్రు లో ఉండగానే పుట్టపర్తి వారి శివ తాండవం చదివి చలించి పోయా ఆయన బహు ముఖ ప్రజన నన్నెంతో ఆకర్షించింది దాని పై ‘’పుట్టపర్తి వారి శివ తాండవం ‘’అనే వ్యాసం రాసి పంపిస్తే ‘’ఆంద్ర ప్రభ సాహితీ గవాక్షం ‘’లో ప్రచురిత మైంది .ఇలా పామర్రు నాకు సాహిత్యం లో గొప్ప అనుభూతిని కలిగించి ప్రేరణ నిచ్చింది .
సశేషం –మీ –గబ్బిట-దుర్గా ప్రసాద్ 19-6-13-ఉయ్యూరు


staff association ఏర్పాటు చేసి secretary గా బాధ్యతలు స్వీకరించి సమర్థవంతంగా నిర్వహించిన మీకు అభినందనలు!
LikeLike