ఆప్తులు శ్రీ ఆలూరి భుజంగ రావు గారి అస్తమయం

ఆప్తులు  శ్రీ ఆలూరి భుజంగ రావు గారి అస్తమయం

Aluru

           దాదాపు పాతికా ముప్ఫై ఏళ్ళ క్రితం ఉయ్యూరు లో గ్లాస్కో పంచె అరవ గూడ కట్ట్టు కట్టుకొని,దానికి నడుము దగ్గర ముడి వేసి అరచేతుల చొక్కాతో ,భూతద్దం లాంటి నల్ల కళ్ళ జోడుతో ఆలూరి భుజంగరావు మ బజారు లలో తిరగటం చూశాను .భేషజం లేని తీరు .ఎవరేమని అనుకొంటారో అనే ఆలోచన లేని మనిషి .ఆప్యాయపు పలకరింపు నవ్వు ముఖం కదిపిస్తే విప్లవ భావ ధార తో మమ్మల్ని ఆకర్షించే వాడు .మా గురు తుల్యులు స్వర్గీయ వంగల కృష్ణ దత్త శర్మ గారింట్లో కాపురం ఉండే వారు .హిందీ ప్రేమీ మండలిని కొంతకాలం నడిపారు .ఆ తర్వాతా సి.బి.ఏం.స్కూల్ లో హిందీ పండిట్ గా పని చేశారు .మాట పెళుసుగా ఉన్నా మనసు వెన్న..నాకూ ,స్వర్గీయ టి.ఎల్.కాంతా రావు కు ఆంజనేయ శాస్త్రి కి ,రామకృష్ణా రావు గారికి మంచి స్నేహితులు .దత్తు గారు ఆయన గురించి మాకు ఎన్నో విషయాలు తెలియ జేశారు .రాహుల్ సాంకృత్యాయన్ రచనలను తెలుగు లోకి అనువాదం చేశారని దత్తు గారి వల్లనే తెలిసింది అప్పటి దాకా ‘’ఈయన వామ పక్ష భావాలున్న చాదస్తుడు ‘’అను కొన్నాను .కాని ఇంతటి సాహితీ సంపన్నుడు అని ఎరక్క పోయాను .ఇది తెలిసిన దగ్గర్నుంచి ఆయనపై ఆత్మీయతా భావం ,ఆరాధనా భావం పెరిగింది దత్తు గారింట్లో ఆయన రచనలు ఉంటె తీసుకొని చదివాను సాంకృత్యాయన్ ఎంత గంగా ప్రవాహం గా రాశాడో నాకు తెలియదు కాని భుజంగ రావు గంగా నిర్ఝర సదృశం గా రచన చేసి తెలుగు వారికి రాహుల్ ను సాక్షాత్కరింప జేశారు ..పైకి ఏమీ కనీ పించడు .లోపల అంతా సాహిత్యమే, విప్లవ భావజాలమే .

              నేను ఒక సారి ఆయన్ను అడిగాను ‘’భుజంగ రావు గారు!మీలో ఇంత విప్లవ భావ సంపద ఉందే మరి ఆ సిబి..ఏం.స్కూల్ లో ఎలా పని చేయగలుగుతున్నారు ?ఎలా ఇముడుతున్నారు నాకు ఆశ్చర్యం గా ఉంది ‘’అన్నాను దానికి ఆయన ‘’మేస్టారూ !ఇది జీవిక కు సంబంధించిన విషయం పెళ్ళాం పిల్లల్ని పోషించుకోవాలి ఏదో రాబడి కావాలి నేను పని చేస్తున్నాను వాళ్ళు జీతం ఇస్తున్నారు నా భావాలతో వాళ్ళకేమీ పని లేదు .వాళ్ళ మత ధర్మం నాకేమీ అడ్డు కాదు ‘’అన్నారు ఆయన కుటుంబం భార్యా పిల్లల సంగతి నాకేమీ పెద్దగా తెలియదు ఎప్పుడూ ఇంటికి వెళ్ళిన గుర్తు కూడా లేదు .అయితే నస్యం బాగా పీల్చే వారని గుర్తు .చేతి లో ఎప్పుడూ ఒక కర్చీఫ్ ఉండేది ముక్కు తుడుచు కోవటానికి .కళ్ళ జోడు ఎప్పుడూ ముక్కు మీదకు జారుతూ ఉండేది దాన్ని పైకి లాక్కుంటూ ఉండే వారు .రాత్రుళ్ళు చాలా సేపు మేలుకొని తన రచనా వ్యాసంగం చేసే వారని తానే నాకు చెప్పారు .మనిషి బక్క పలచగా, రివట లా గాలి వేస్తె పడి పయేట్లుందే వారు .శరీరం లో మాంసం ఉందా అని పించేది ..స్కూల్ కు పాంటు షర్ట్ తో వెళ్ళే వారు .లేక పోతే పంచ పైన ఉత్తరీయం

         ఉయ్యూరు హైస్కూల్ లో మా మిత్రబృందం సైన్సు రూమ్ నే సాహితీ కేంద్రం గా చేసుకొని అప్పుడు ఎన్నో సాహిత్య కార్యక్రమాలను నిర్వహించామని మీకు ఇది వరకే తెలియ జేశాను .సంక్రాంతి కి ,ఉగాది కి కవి సమ్మేళనాలు జరిపేవాళ్ళం .హైస్కూల్ ఆవరణలో. భుజంగరావు గారు తప్పక హాజరయ్యే వారు .ఆయనకు సామాన్యుడి జీవితమే ముఖ్యం .అప్పటికే అన్ని వస్తువుల ధరలూ ఆకాశం లో ఉండేవి .దానినే సబ్జెక్ట్ గా తీసుకొని కవిత్వం చెప్పే వారు .అది మా ఆంజనేయ శాస్త్రి గారికి నచ్చేది కాదు ‘’ప్రసాద్ గారూ !కవి సమ్మేళనం అంటే ఈ యన కూరలూ, చింత పండూ, పప్పు, ఉప్పూ సంగతి చేబుతాడేమి టండీ ?’’అని విసుక్కొనే వాడు .ఆయనకు కవిత్వసం అంటే మసి బూసి మారేడు కాయ చేసి చూపించటం .భుజంగరావు గారు చెప్పేవి యదార్ధ విషయాలు కనుక నచ్చక పోవటం సహజమే ఆ మాట కొస్తే నాకూ అలానే అని పించేది .కాని ఆయన్ని శాశించలేము కదా .అయన స్వేచ్చ ఆయనది బాగుంటే వింటారు లేకుంటే వినరు .దత్తు గారే మాకు కవి సమ్మేళనానికి అధ్యక్షత వహించే వారు .ఆయనకు కొంత వామ భావాలున్నాయి .కవిత్వాన్ని బేరీజు వేసే షరాబు లా వ్యవహరించే వారు దత్తు గారు .ఇలా కవి సమ్మళనాలలో భుజంగ రావు గారు మాకు దగ్గరయ్యారు .హిందీ బాగా బోధించే వారని మంచి పేరుంది .తన పనేదో తాను చేసుకు పోయే వారు .

            దత్తు గారింట్లో ఉన్నంత కాలం దత్తు గారు భుజంగ రావు గారికి చాలా అండగా నిలిచారు ఆయనకు అన్ని రకాల చేదోడు వాదోడుగా ఉండేవారు ఈ సహాయాన్ని భుజంగరావు గారు కలకాలం జ్ఞాపకం ఉంచుకొని మనసు నిండా కృతజ్ఞతా భావం తో ఉన్నారు ..దీనికి ఒక ఉదాహరణ .దాదాపు పదేళ్ళ క్రితం భుజంగ రావు గారు తన సహచరుడు నటరాజన్ అంటే నవలా రచయిత ‘’శారద ‘’జీవిత చరిత్ర లాంటిది రాస్తూ అందులో తాము తెనాలి లో గడిపిన కాలం ,శారద కుటుంబం అతని మరణం తన అన్నదమ్ములు తల్లి తో భార్య తో అక్కడి కాపురం విశేషాలు రావూరి భారద్వాజతో ధనికొండ హనుమంత రావు తో పరిచయాలురాశారు దీనికి ‘’స్మృతి శకలాలు ‘’అని పేరుపెట్టారు .  దాని పై  సమీక్ష ఏదో పేపర్ లో చదివాను అందులో ఆయన ఫోన్ నంబర్ కూడా ఇచ్చారు అప్పటికే గుంటూర్ లో ఉంటున్నారు .ఫోన్ చేసి మాట్లాడాను .పుస్తకాన్ని పంపారు దాని ఖరీదు మాత్రమె పంపమని అంతకంటే అదనం గా ఏమీ పంప వద్దని తెలిపారు అలానే చేశాను .వెంటనే గుర్తు పట్టి ఎంతో ఆప్యాయం గా మాట్లాడారు తాను ,భార్య కర్నాటక లోఅబ్బాయి దగ్గర ఇంతకాలం ఉన్నామని ఇప్పుడు గుంటూరు వచ్చి అద్దె ఇంట్లో ఉంటున్నామని అడ్రస్ ఇచ్చారు తరచూ మాట్లాడుకొందామని ఉత్తర ప్రత్యుత్త రాలు జరుపుదామని అన్నారు దత్తు గారిని అడిగి నట్లు చెప్ప మన్నారు దత్తు గారు మరణించారని తెలియ జేస్తే ఎంతో విచారించారు ‘’దత్తు గారు నాకు పితృ తుల్యులు అయన సహాయం లేక పోతే నేను ఉయ్యూరు లో బతక గలిగే వాడినే కాదు ‘’.అని కృతజ్ఞతలు తెలుపుకొన్నారు అలాగే పల్లా వజ్ఝాల మృత్యుంజయ శర్మ గారు అంటే ముత్తయ్య మాస్టారు ను కూడా జ్ఞాపకం చేసుకొన్నారు కాంతా రావు మొదలైన ఇతర బృందం విషయాలు అడిగి తెలుసుకొన్నారు. అప్పటికే కాంతా రావు మరణించాడు

              అయన కు ఉత్తరాలు రాసే వాడిని .కొంచెం ఆలస్యం గా సమాధానం రాసేవారు .ఉండటానికిస్వంత  ఇల్లు లేక పోయిందనే బాధ వారిలో కనీ పించింది సంపాదన ఏమిటో తెలీదు రెండు పొట్టలు రెండు పూటలా గడవాలి ఆయన ఉత్త్తరాలు చదివితే ఆర్ధిక స్తితి కాదు దయనీయం గా ఉందని అర్ధమవుతుంది . భార్య కూడా అనారోగ్యం తో బాధ పడుతున్నట్లు తెలిసింది .  .ఏదైనా సహాయం కావాలంటే చేస్తానని అన్నాను ఆయన నిర్ద్వంద్వం గా తిరస్కరించారు .పుస్తకాల మీద రాబడి ఏమైనా వస్తుందేమో అను కొన్నాను .ఒక సారి ఆయనకు జాబు రాస్తూ‘’భుజంగ రావు గారూ !ఇంతకాలం విప్లవ భావాలను నమ్మి ఉన్నారు వాళ్ళందరూ హాయిగా జీవిస్తున్నారు .మీకు కనీసం ఇల్లు కూడా కొని పెట్టలేక పోయారు ఆ భావ వాదులు. మిమ్మల్ని వాడుకోవటమే కాని మీకే సహాయం అంది నట్లు లేదు ‘’అని రాశాను దానికి నాకు సమాధానం రాలేదు .విరసం ను నారా నరాన జీర్ణించుకొన్న వారు భుజంగ రావు గారు .మారు పేర్ల తోను రచనలు చేశారు భగత్ సింగ్ జీవితం లో మనకు తెలియని విషయాలను రాశారు‘’ఆయన ఆత్మ కద ‘’మంచి పేరు తెచ్చు కొన్నది . .

       ఉయ్యూరు లో సాహిత్య కార్య క్రమాల గురించి ఒక సారి రాసి తెలుసు కొన్నారు ఉయ్యూరు వచ్చి అందర్నీ కలవాలను కొంటున్నట్లు చెప్పారు. అప్పుడు నేను సాహితీ మండలి ని నిర్వహిస్తున్నాను ‘’మీరు వస్తే సన్మానం చేసి ఇంతటి గొప్ప రచయిత తో మాకున్న అను బంధం గుర్తు చేసుకోవాలను కొంటున్నాము తప్పక. రావలసింది ‘’అని రాశాను .తప్పక వస్తాననే సమాధానం ఇచ్చారు అయితే మేము 2008 లో అమెరికా మూడో సారి వెళ్లి వచ్చి నప్పటి నుండి భుజంగ రావు గారివిషయమే ఆలోచించాను .ఒకటి రెండు సార్లు నా దగ్గరున్న అడ్రస్ కు జాబులు రాశాను సమాధానం లేదు అవి అందాయో లేదో తెలీదు ఇల్లు మారారో ఏమిటో అర్ధం కాలేదు .. ఒకటి ఎందు సార్లు ఆయన రచనలు పేపర్లో చదివాను గుంటూరు లోనే ట్లు తెలిసింది .కాని మళ్ళీ కమ్యూని కేషన్ లేక పోవటం బాధించింది

             నేను పామర్రు లో సైన్సు టీచర్ గా పని చేసినపుడు, అడ్డాడ లో హెడ్ మాస్టర్ గా పని చేసినప్పుడు గుడి వాడ టౌన్ హైస్కూల్ లు యేవో సమావేశాలున్దేవి . దానికి వెళ్ళే వాడిని ఒక సారి అక్కడ టౌన్ హైస్కూల్ లో భుజంగ రావు గారు ఫుల్ డ్రెస్ లో హిందీ టీచర్ గా పని చేస్తున్నారు కాసేపు మాట్లాడుకొన్నాం .రామకృష్ణయ్య గారు అనే నేషనల్ అవార్డీ దానికి అప్పుడు హెడ్ మాస్టర్ .అంతా పకడ్బందీ గా నడిపే హెడ్ మాస్టారు .అందుకని డ్రెస్ కోడ్ కూడా పెట్టి నట్లున్నారు .అక్కడే ఆయన్ను చివరి సారిగా చూడటం .

         భుజంగ రావు గారి జీవిత మంతా పోరాటమే దారిద్రం తో పోరాడి గెలిచారు సృజనాత్మక భావాలున్న రచయిత అని పించుకొన్నారు హిందీ రచనలను సరళ భాషలో అను వాదం చేసి చేయి తిరిగిన రచయిత అని పించుకొన్నారు విప్లవమే ఊపిరి గా జీవించి అలసి పోయారు .

         ఈ రోజు ఆంద్ర జ్యోతి లో శ్రీ ఆలూరి భుజంగ రావు గారి మరణ వార్త చదివి విచారించాను .మంచి మిత్రుని ఆత్మీయుడిని ,ఆప్తుడిని అభిమాన ధనుడిని నమ్మిన సిద్ధాంతానికి జీవితాంతం అంకితమైన వారిని ఆయనలో చూశాను . భావాలు వేరయి నంత మాత్రాన మనసులు కలవకుండా పోవటానికి వీలు లేదని భుజంగ రావు గారితో స్నేహం రుజువు చేసింది ఆ యన ఎంత సంప్రాదాయ వ్యతి రేకి అయినా, వారి భార్యగారికి మా సంతాపం, సాను భూతి వ్యక్తం చేస్తూ, భుజంగరావు గారి ఆత్మకు శాంతి ప్రసాదించ వలసిందిగా ఆ సర్వేశ్వరుని ప్రార్ధిస్తున్నాను .

            మీ –గబ్బిట దుర్గా ప్రసాద్—21-6-13- ఉయ్యూరు   

 
 
 
 
 
 
 


గబ్బిట దుర్గా ప్రసాద్
https://sarasabharati.wordpress.com
http://suvarchalaanjaneyaswami.wordpress.com

Unknown's avatar

About gdurgaprasad

Rtd Head Master 2-405 Sivalayam Street Vuyyuru Krishna District Andhra Pradesh 521165 INDIA Wiki : https://te.wikipedia.org/wiki/%E0%B0%97%E0%B0%AC%E0%B1%8D%E0%B0%AC%E0%B0%BF%E0%B0%9F_%E0%B0%A6%E0%B1%81%E0%B0%B0%E0%B1%8D%E0%B0%97%E0%B0%BE%E0%B0%AA%E0%B1%8D%E0%B0%B0%E0%B0%B8%E0%B0%BE%E0%B0%A6%E0%B1%8D
This entry was posted in మహానుభావులు and tagged . Bookmark the permalink.

1 Response to ఆప్తులు శ్రీ ఆలూరి భుజంగ రావు గారి అస్తమయం

  1. ఆలూరి భుజంగ రావు గారు కన్నుమూయడం విచారకరం!వారి మీద వ్యాసం బాగా రచించారు!

    Like

Leave a comment

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.