బదరీ కేదారాలు ఉండవా?
June 24, 2013
కలియుగాంతంలో బదరీకి దారి మూసుకుపోతుంది
కేదార్‌నాథ్ క్షేత్రం కూడా ఉండదు
జోషీమఠ్‌లో భవిష్యకేదార్ ఆలయం
అక్కడికి సమీపంలోనే భవిష్య బదరి
పురాణ కథనం. స్థానికుల విశ్వాసం
ఏమిటీ ఉత్పాతం ఎందుకీ విలయం ఎందుకిలా జరిగింది భవిష్యత్తులో ఏం జరగబోతోంది కేదార్‌నాథ్, బదరీనాథ్ క్షేత్రాలకు శాశ్వతంగా దారులు మూసుకుపోతాయనే కథనాలు నిజమేనా దానికి బదులుగా భవిష్య బదరి, భవిష్య కేదార్ క్షేత్రాలు ప్రాచుర్యం పొందనున్నాయన్న మాట వాస్తవమేనా?
ఉత్తరాఖండ్‌లో ప్రకృతి బీభత్సాన్ని చూసిన చాలా మంది మదిలో మెదులుతున్న ప్రశ్నలివి! భవిష్య కేదార్‌నాథ్ సంగతేమోగానీ.. మున్ముందు బదరీనాథ్ క్షేత్రానికి వెళ్లే దారిలో ఉండే నర, నారాయణ గిరులు (కొందరు వీటినే జయ, విజయ గిరులుగా కూడా వ్యవహరిస్తారు) కలిసిపోయి, ఆ దారి మూసుకుపోతుందని..అప్పుడు జోషీమఠ్‌కు సమీపంలో ఉన్న భవిష్య బదరి క్షేత్రమే బదరీనాథ్‌గా వెలుగొందుతుందని అష్టాదశ పురాణాల్లో ఒకటైన భవిష్య పురాణం చెబుతోంది. కలి ప్రభావం పెరిగిపోయి లోకంలో అశాంతి చెలరేగినప్పుడు.. కలియుగాంతం లో పాపులకు బదరీ క్షేత్రం కనిపించదని అగస్త్య మహర్షికి ఆ క్షేత్రాన వెలసిన నారాయణుడు తెలిపాడని మరొక కథనం కూడా ఉంది.
ఏదేమైనా..సప్త బదరీ క్షేత్రాల్లో భవిష్య బదరి అత్యంత ప్రాచుర్యం పొందింది. సప్త బదరీ క్షేత్రాలంటే వరుసగా.. విశాల్ బదరీ (ఇది ప్రధాన క్షేత్రం. బదరీనాథుడిగా విష్ణుమూర్తిని భక్తులు కొలిచేది ఇక్కడే), ఆది బదరి, వృద్ధ బదరీ, ధ్యాన్ బదరీ, అర్ధ బదరీ, భవిష్య బదరీ, యోగధ్యాన్ బదరీ. వీటిలోనూ..అర్ధ, ధ్యాన బదరీ క్షేత్రాలు మినహా మిగతావాటిని పంచ బదరీ క్షేత్రాలుగా వ్యవహరిస్తారు. వీటిలో ముఖ్యమైనది భవిష్య బదరి. ఆది బదరి క్షేత్రం కర్ణప్రయాగ నుంచి గంట ప్రయాణం దూరాన ఉంటుంది. ఇక్కడ కూడా బదరీనాథ్‌లాగా నే విష్ణుమూర్తి విగ్రహం సరిగ్గా 3.3 అడుగుల ఎత్తు ఉంటుంది. ఇక.. వృద్ధ బదరీ క్షేత్రం జోషీ మఠ్‌కు 7 కిలోమీటర్ల దూరంలోని అనీమఠ్ గ్రామంలో ఉంటుంది.
తపస్సు చేసుకుంటున్న నారదుడికి విష్ణుమూర్తి ఒక వృద్ధుడి రూపంలో ఇక్కడ ప్రత్యక్షమయ్యాడని పురాణ కథనం. అందుకు తగ్గట్టుగా ఇక్కడి మూలవిరాట్టు కూడా ఒక వృద్ధుడి రూపంలో ఉంటుంది. మూడోది భవిష్య బదరి. ఇక నాలుగోది.. యోగధాన్ బదరి లేదా యోగ బదరి. ఇది పాండుకేశ్వరర్ ప్రాంతంలో సముద్రమట్టానికి ఆరువేల అడుగుల ఎత్తున ఉండే క్షేత్రం. పాండురాజు తన శాపాన్ని పోగొట్టుకోవడానికి ఇక్కడే తపస్సు చేశాడని.. కుంతి, మాద్రిలతో కూడి ఇక్కడే మరణించాడని.. పాండవులు జన్మించింది ఇక్కడేనని చెబుతారు. ఈ క్షేత్రంలో పాండురాజు కంచుతో చేసిన యోగనారాయణుడిని ప్రతిష్ఠించి కొలిచాడని నమ్మిక.
అందుకు నిదర్శనంగా ఈ ఆలయంలో మూలవిరాట్టు యోగముద్రలో కనిపించడం విశేషం. అయితే.. ఈ విగ్రహం పూర్తిగా సాలిగ్రామ శిల. బదరీనాథ్ ఆలయాన్ని మూసేసినప్పుడు అక్కడి ఉత్సవ విగ్రహాలను ఇక్కడికే తరలించి పూజిస్తారు. మిగిలింది.. ధ్యాన బదరి. ఇక్కడ విష్ణుమూర్తి ధ్యానముద్రలో దర్శనమిస్తాడు.
భవిష్య బదరి..
జోషీమఠ్‌కు పదిహేడు కిలోమీటర్ల దూరంలోని శుభైన్ గ్రామంలో.. సముద్ర మట్టానికి 9,000 అడుగుల ఎత్తున భవిష్య బదరి క్షేత్రం నెలకొని ఉంది. జోషీ మఠ్ నుంచి సల్దార్ గుండా వాహనాలు వెళ్లే దారి ఉంది. ఇది 19 కిలోమీటర్ల దాకా ఉంటుంది. ప్రస్తుతం భవిష్య బదరిలో నరసింహ స్వామి విగ్రహం పూజలందుకుంటోంది. భవిష్యత్తులో ఈ నారసింహుడి విగ్రహం చేయి విరుగుతుందని అదే కలియుగాంతానికి గుర్తు అని.. అప్పుడే నరనారాయణ శృంగాలు కలిసిపోయి బదరీనాథుడు ఈ క్షేత్రంలో వెలసి పూజలందుకుంటాడని భక్తుల నమ్మిక.
జ్యోతిర్మఠంలోనే…
భవిష్య బదరి గురించి పురాణకథల్లో కనిపిస్తుందిగానీ.. భవిష్య కేదార్‌నాథ్ గురించి ఎక్కడా ఉన్నట్టు దాఖలాలు లేవు. కానీ, గర్హ్వాల్ కొండల్లోని స్థానికులు మాత్రం కలియుగాంతంలో అసలు కేదార్‌నాథ్ క్షేత్రమే ఉండదని..అప్పుడు శంకరాచార్యులవారు స్థాపించిన ఉత్తరామ్నాయ పీఠమైన జోతిర్మఠంలోని భవిష్య కేదార్ ఆలయంలోనే కేదారనాథుడు భక్తుల పూజలందుకుంటాడని విశ్వసిస్తారు. ఇందుకు ప్రతిగా జోషీమఠ్‌లోని ‘భవిష్య కేదార్’ ఆలయాన్ని చూపుతారు

