సాహితీ కితకితలు
June 27, 2013
‘తెలుగువాళ్లకి నవ్వడం రాదండీ. తెలుగులో హాస్యం తక్కువండీ.. అనే వాళ్లని చూస్తే నవ్వొస్తుంది’ అంటూ ద్వానాశాస్త్రి తెలుగులో బోలెడు మంది రచయితలు రాసిన హాస్యాన్ని సేకరించి ‘తెలుగు సాహిత్యంలో హాస్యామృతం’ అన్న పుస్తకాన్ని తీసుకొచ్చారు. దాన్నుంచి కొన్ని హాస్యగుళికలు మీకోసం…
ముద్దుకృష్ణ ‘జ్వాల’ అనే పత్రిక నడిపేవారు. అందులో ఒక వర్థమాన కవిని విమర్శిస్తూ వ్యాసం వస్తే అతగాడు వెళ్లి ముద్దుకృష్ణపై మండిపడ్డాడట. అప్పుడు ముద్దుకృష్ణ తాపీగా ఇలా అన్నారు. ‘చూడండి కవిగారూ, పత్రిక కొనేవారిలో సగంమంది ఆ వ్యాసాన్ని చూడరు. చూచినవారిలో సగంమంది చదవరు. చదివిన వారిలో సగం మందికి అర్థం కాదు. అర్థం అయినవారిలో సగంమందికి మీరెవరో తెలీదు. తెలిసిన వారిలో సగం మంది నమ్మరు. నమ్మినవారిలో సగం మందిని మనం ఖాతరు చెయ్యవలసిన పనిలేదు. ఇకపోతే మిగిలేది ఆ సగం మంది కనుక మీరు ఖాయిలా పడకండి’ అని!
* * *
సమాచార పౌర సంబంధాల శాఖలోనూ, వికలాంగుల సంక్షేమ శాఖలోనూ పనిచేసిన గోపాల చక్రవర్తి హాస్యం తప్ప ఏమీ రాయలేదు (కొన్ని కవితలు తప్ప). ‘నాతి కథలూ – నీతి కథలూ’ ‘గోలాయణం’ ‘సల్లాప గోపాలం’ ‘నవ్వు గోపాలం’ వంటి రచనలు చేసి తెలుగు సాహిత్యంలో హాస్యపు లోటును కొంత వరకు తీర్చారు. అనువాదం కత్తి మీద సామువంటిది. సరిగ్గా అనువదించకపోతే అసలు రచయితకి అన్యాయం చేసినట్టే అంటూ గోపాల చక్రవర్తి చెప్పిన ఉదాహరణలు చూడండి.
‘ఎ స్మయిల్ బ్రోక్ ఆన్ హర్ లిప్స్’ను ‘ఆమె పెదాల మీద చిరునవ్వు బద్దలయింది’గా అనువదించాడట ఒకాయన. ఒక ప్రభుత్వ అధికారి మాట్లాడుతూ ‘దేర్ మస్ట్ బి గివ్ అండ్ టేక్ బిట్వీన్ పబ్లిక్ అండ్ ది గవర్నమెంట్’ అని చెప్తే అనువాదకుడు ‘ప్రజలకూ ప్రభుత్వోద్యోగులకూ మధ్య ఇచ్చిపుచ్చుకోవడాలు ఉండాలి’ అన్నాడట. వెంటనే సభలో నుంచి ఎవరో లేచి ‘మా ఊళ్లో ఇవి చాలాకాలం నుంచి ఉన్నాయిలే’ అన్నాట్ట!
ఓ బోర్డులో అనువాదం ఇలా ఉంది – ‘ప్రభుత్వ అవినీతి నిరోధక శాఖ’ – అంటే ప్రభుత్వంలో గల అవినీతిని (ఉందని ఒప్పుకున్నట్టేగా) నిరోధించేది అని కదా అర్థం? ఓసారి టైపిస్ట్ ‘మినిస్టర్ ఫర్ ఇరిగేషన్’ అని టైపు చెయ్యడానికి బదులు ‘మినిస్టర్ ఫర్ ఇరిటేషన్’ అని టైప్ చేశాట్ట.
* * *
‘ఆత్మహత్యలు చేస్కున్న రైతులకు మీ సర్కారు ఎక్స్‌గ్రేషియ ఎందుకు ఇస్తలేదు?’
‘ఆత్మ నీలల్ల నానదు, నిప్పులల్ల గాలదు. ఆత్మను కత్తి నర్కలేదు. తుపాకిగుండు తున్కలు జెయ్యలేదు. ఆత్మకు సావు లేదు. సావు లేని ఆత్మను రైతు ఎట్ల సంపుతడు? రైతులకు ఆత్మను ఎట్ల హత్య జెయ్యొస్తది? రైతులు ఆత్మహత్యలు జేస్కోనప్పుడు గాల్లకు ఎక్స్‌గ్రేషియ ఇచ్చే ముచ్చటే లేదు.’
ఇదీ తెలిదేవర భానుమూర్తి వరస. రాజకీ యాలతో ఈ మాటల దేవర ఫుట్‌బాల్ ఆడుకొంటాడు. భానుమూర్తి భాష, ధ్యాస అంతా తెలంగాణ గోస! తెలంగాణ తెలుగువెలుగులు తెలుసుకోవాలంటే భానుమూర్తిని చదవాలి.
ఒకసారి రైతులందరికీ నాయకులు ‘భగవద్గీత’ను ఉచితంగా పంచుతున్నారు. అందరికీ ఆశ్చర్యం వేసింది. ‘ఎందుకిలా’ అనుకుంటుంటే వారేం చెప్పారంటే –
‘బగవద్గీతను సదిఇతె మనసు నిమ్మలమైతది. పాత అంగిని ఇడ్సి కొత్త అంగిని తొడిగిన తీర్గ మన పానం గీ పెయ్యిని ఇడ్సి ఇంకొక పెయ్యిలకు పోతున్న దిశని బగవద్గీత జెప్తున్నది. గీ సంగతి ఎర్కుంటె ఏ రైతన్న పుర్గుల మంది తాగి సచ్చినా ఎవ్వలు ఏడ్వరు. మా సర్కార్‌ను దిట్టరు. లాబమొస్తదా నస్టమొస్తదా అని సూడకుంట పని జెయ్యాల అని బగవద్గీత జెప్తున్నది. రైతులందరు వానబడిందా లేదా అని సూడొద్దు. పంట పండుతుందా లేదా అని సూడకుంట ఎవుసం జెయ్యాలె. కస్టమొచ్చినా సుకమొచ్చినా ఒక్క తీర్గ ఉండాలని బగవ ద్గీత సదివితె ఎర్క అయితది!’
* * *
‘అవధానిగారూ, సన్యాసికీ సన్నాసికీ తేడా ఏమిటండీ?’ అని అడిగారు అప్రస్తుత ప్రాసంగీకులు. వెంటనే అవధానిగారు ‘అన్నిటినీ విడిచినవాడు సన్యాసి. అందరూ విడిచినవాడు సన్నాసి’ అని చెప్పగానే హర్షధ్వానాలు!
అనేక అవధానాలలో అప్రస్తుత ప్రసంగం చేసి ఎంతో పేరు తెచ్చుకొన్న కీ.శే. ఆమళ్లదిన్నె గోపీనాథ్‌గారు ‘అవధానాలలో అప్రస్తుత ప్రసంగాలు’ అనే విశిష్టమైన పుస్తకం రాశారు. ఇటువంటి పుస్తకం ఇంతకుముందు రాలేదు. సాహిత్యప్రక్రియ అయిన అవధానంలో ఎంత హాస్యం ఉంటుందో ఈ పుస్తకం తేటతెల్లం చేస్తుంది.
అవధానికి సమయస్ఫూర్తితో పాటు శబ్ద శక్తి కూడా ఉండాలి. అప్పుడే అప్రస్తుత ప్రసంగం బాగా రక్తి కడుతుంది.
‘అవధానిగారూ, రవికలో దాగి ఉన్న ఇద్దరు మహానుభావులెవరో తెలుపుతారా?’ అనే అప్రస్తుత ప్రశ్నకు అవధానిగారు చమత్కారపు విడుపు ఇది – ‘రవి, కవి వీరిద్దరూ దాగి ఉన్నారు’ అని చెప్పారు..

