సద్గురువు బేతవోలు -డాక్టర్ చాగం కొండారెడ్డి

సద్గురువు బేతవోలు -డాక్టర్ చాగం కొండారెడ్డి

June 28, 2013

పశ్చిమ గోదావరి జిల్లా ‘నల్లజర్ల’ లోని అతి సామాన్య కుటుంబంలో 1948 జూన్ 10 న ఆచార్య బేతవోలు రామబ్రహ్మం జన్మించారు. కష్టాలే తోడుగా వారి ప్రాథమిక విద్యాభ్యాసం సాగింది. ఆ తర్వాత కొవ్వూరు సంస్కృత కళాశాలలో భాషా ప్రవీణ చేశారు. అది గురుకులంగా భావించి ప్రాచీన కావ్య శాస్త్రాలను రావూరి వెంకటేశ్వర్లు గారి ప్రోత్సాహంతో ఆపోసన పట్టారు. వారి ప్రేరణతో భాషాప్రవీణ రెండవ సంవత్సరం చదివేప్పుడే అవధానాల వైపు ఆకర్షితులై పద్ధెనిమిదేళ్ల కే ( 1967లో)నవరాత్రి ఉత్సవాలకు మొదటి అవధానం చేశారు.

దాదాపు పాతిక సంవత్సరాల్లో 300 వరకు అవధానాలు చేసి తెలుగు ప్రజల హృదయాలను దోచుకున్నారు. తర్వాత లెక్కలేనన్ని అవధాన సభలకు సంచాలకత్వం వహించారు. అవధాన సుధాకరుడుగా సభా సంచాలక సార్వభౌమగా కీర్తి పొందారు. అంతేకాదు , వారు చదువుకున్న కొవ్వూరు సంస్కృత కళాశాల నుంచే ‘గౌతమి’ మాసపత్రిక వెలువడేది . అంతవరకు గ్రాంథికంలో వెలువడుతున్న ఆ పత్రికకు ఒక్క సంవత్సరం పాటు సంపాదకుడుగా వ్యవహరించి పూర్తిగా వ్యవహారంలోకి తెచ్చిన ఘనత వారికే దక్కుతుంది.

‘కేశిరాజు వేంకట నృశింహ అప్పారావు గారు’అని అప్పట్లో కొవ్వూరి సంస్కృత కళాశాల ప్రిన్సిపాల్ . పచ్చి గ్రాంథికవాది . స్వాతంత్య్ర సమరయోధుడు . గాంధేయ వాది . వారితో ఎన్నో చివాట్లు తిని మరీ ఆ పత్రికను వ్యవహారికంలోకి తెచ్చారు. అందులో బేతవోలు వారు ‘ జయసింహ చరిత్ర’ ( కల్పిత కథా ప్రబంధం) అన్న శీర్షికతో సరళ శైలిలో పద్యాలు రాశారు. ఆంధ్ర విశ్వవిద్యాలయం నుంచి ఎం ఏ తెలుగు చేసిన వీరు నాగార్జున విశ్వవిద్యాలయం నుంచి ఆచార్య తూమాటి దొణప్ప గారి పర్యవేక్షణలో ‘తెలుగు వ్యాకరణాలపై సంస్కృత వ్యాకరణాల ప్రభావం’ అనే అంశంపై పిహెచ్ డి చేశారు.

మొట్ట మొదట బేతవోలు గారు డా కెవికె సంస్కృత కళాశాల (గుంటూరు)లో ఉపన్యాసకులుగా చేరి అక్కడ ‘సరసభూపాలీయం, అహో బల పండితీయం’లోని పాఠ్యాంశాలు బోధిస్తుంటే అక్కడున్న అధ్యాపక బృందం చెవులు రిక్కించుకొని మరీ వినే వారు. ఆ కళాశాలలోని ఏలూరిపాటి అనంతరామయ్య , మల్లంపల్లి వీరేశ్వర శర్మ , కోగంటి సీతారామచార్యులు వంటి పండితులు ఏకంగా తరగతి గదిలోనే కూర్చొని వినేవారు.

జమ్మలమడుగు మాధవరామశర్మ గారైతే కిటికీ దగ్గరే కుర్చీ వేసుకొని వినేవారు. అంత అద్భుతంగా ఆకర్షిస్తుంది బేతవోలువారి బోధన. నాగార్జున విశ్వవిద్యాలయానికి వచ్చాక వారి బోధనా పఠిమ ఇతర శాఖల వారిని కూడా ఆకట్టుకొంది. ఆ విశ్వవిద్యాలయం ఆంగ్ల శాఖ ఆచార్యులు డివికె రాఘవాచార్యులు, రామబ్రహ్మం పాఠం ఉందంటే చాలు తప్పకుండా తరగతి గదిలోని పిల్లలతో పాటు కలిసి కూర్చొనేవారు.

ఒకసారి నాగార్జున విశ్వవిద్యాయలంలో బుద్ధిస్ట్ స్టడీస్ కేంద్రాన్ని ప్రారంభిచడానికి భూటాన్ దేశపు మఠాధిపతి జె.కంపూ, వారి బృందం వచ్చారు. వారితోపాటు అప్పటి మన ఉపరాష్ట్రపతి ఆర్. వెంకట్రామన్, యూజీసీ వైస్ చైర్మన్ ఆచార్య కె సచ్చిదానంద మూర్తిగారు కూడా వచ్చారు. ప్రారంభోత్సవం అయ్యాక సాంస్కృతిక కార్యక్రమాల్లో భాగంగా బేతవోలు రామబ్రహ్మం రాసిన ‘సౌందర నందం’ నాటకాన్ని పిల్లలతో ప్రదర్శింపజేశారు. నాటకాన్ని ప్రదర్శించేప్పుడి బుద్ధుడి పాత్ర వేదిక మీద కనిపించినప్పుడంతా ఆ భూటాన్ మఠాధిపతి, బృందం సభ్యులు నిల్చొనే తిలకించారు.

అంతేగాక నాటకం అయ్యాక బుద్ధుడి భిక్షాపాత్రని డాలర్లతో నింపి, రచయితను అభినందించి, ఆ ఆనందంలో మీరంతా మా దేశం వచ్చి పలుచోట్ల ప్రదర్శనలు ఇవ్వమన్నారు. దాంతో బేతవోలువారు భూటాన్ వెళ్ళి అక్కడ ‘ఉన్మత్త యక్షరాజం, సౌందరనందం’ వంటి బౌద్ధ సంబంధి నాటక ప్రదర్శనలు ఇప్పించి, అక్కడివారి ఆదరాభిమానాలను చూరగొన్నారు. ఇలా బేతవోలువారు తమ రచనల ద్వారా విదేశీయులను సైతం ఆకర్షించారు. నాటక రచయితే కాకుండా బేతవోలువారు స్వయంగా నాటకాలు ఆడారు.

ఎన్‌టి రామారావు ముఖ్యమంత్రి అయ్యాక ఒక ‘బుద్ధపూర్ణిమ’ రోజు నాగార్జున విశ్వవిద్యాలయానికి వచ్చారు. ఆ సందర్భంగా బేతవోలుగారు రాసిన పద్యాలతో రామారావు గారికి స్వాగతం పలికారు. ‘ఎన్టీ రాముడు మనసున, ట్వంటీ రాముడు’ వంటి ధోరణిలో నడుస్తాయి ఆ పద్యాలు. కార్యక్రమం అయ్యాక రామారావుగారు తిరిగి వెళ్తూ పద్యాలు రాసిన బేతవోలువారిని పిలిపించుకొని అభినందిస్తూ… ‘మేం త్వరలో ఏర్పాటు చేయబోయే తెలుగు విశ్వవిద్యాలయానికి మీ వంటి వారు అవసరం. త్వరలో మనం తప్పకుండా కలుద్దాం’ అని వెళ్ళారు. దాంతో రామారావు ప్రత్యేకంగా కళలకు సంబంధించి తెలుగు విశ్వ విద్యాలయం స్థాపించడం, రాజమండ్రి వద్దనున్న బొమ్మూరు కేంద్రంగా సాహిత్య పీఠాన్ని ఏర్పాటు చేయడం, అక్కడికి బేతవోలు వారిని ఆచార్యులుగా తీసుకోవడం జరిగింది.

అక్కడ తెలుగు సాహిత్య అధ్యయనం రూపకల్పనలోనూ, పరిశోధన విషయంలోనూ బేతవోలు వారు పెనుమూర్పులు తీసుకువచ్చి భావితరాలకు మార్గదర్శకత్వం వహించడంలో కీలకపాత్ర పోషించారు. ‘భారతి’ లేని లోటును తీర్చిన ‘వాజ్ఞ్మయి’ త్రైమాసిక పత్రిక పేరు వీరు సూచించిందే. హైదరాబాద్‌లో ప్రారంభమై ఏడాది పాటు నడిచిన ఆ పత్రికలను బొమ్మూరుకు తీసుకెళ్ళి పరిశోధనలో ప్రామాణికతను పాటిస్తూ తెలుగు సాహిత్యానికి విశిష్టమైన సంచికగా రూపొందించడంలో కీలకంగా నిలిచారు.

బొమ్మూరు విశ్వవిద్యాలయం తరపున ఒకసారి ‘వచన కవితకు షష్టిపూర్తి’ అన్న శీర్షికతో కవి సమ్మేళనాలు, సభలు నిర్వహించారు. ఆ సందర్భంగా వచన కవులు పద్యకవితను నిందిస్తూ, పద్యం ప్రగతి నిరోధకంగా ముద్రవేస్తున్న సమయంలో బేతవోలు వారు కెరటంలో పైకి ఎగసి ఉద్యమంలా ముందుకు సాగారు. వెంటనే హైదరాబాదులో ‘ఆంధ్ర పద్య కవితా సదస్సు’ నిర్వహించి నండూరి రామకృష్ణమాచార్యులు అధ్యక్షలుగా, బేతవోలు వారు ఉపాధ్యక్షులుగా రాష్ట్రం నలుదిశలా పర్యటించి పద్యం విశిష్టతను తెలిపారు. పద్యం కనుమరుగైతే ఏర్పడే పరిస్థితులపై చక్కని ఉపన్యాసం ఇచ్చారు. బేతవోలు వారు కొత్త గోదావరి వంటి పద్య కావ్యాలే కాకుండా నాటకాలూ రాశారు. కథలు రాశారు. అనువాద రచనలు చేశారు.

సాహిత్య వ్యాసాలు, పరిశోధనా గ్రంథాలు రాశారు. అన్నింటికన్నా సంస్కృత నాటకాలకు వ్యాఖ్యానాలు రాసి ఎనలేని కీర్తి గాంచారు. దేవీ భాగవతం వచన రచన ద్వారా కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు పొందారు. దాసరి లక్ష్మణ కవి సంకలనం చేసిన ఆణిముత్యాల వంటి 8 వేల పద్యాలకు వ్యాఖ్యానాలు రాయించడం, రాయడంలో నిమగ్నమై ఉన్నారు. బేతవోలువారి మార్గదర్శకత్వంలో పాతికమంది వరకు పీహెచ్‌డీలు చేసి డిగ్రీలు పొందారు. తొలినాళ్ళలో నాస్తిక భావాలున్న వీరికి ఆధ్యాత్మిక దిగ్ధర్శకత్వం నెరపినవారు లక్ష్మణ యతీంద్రులు. వీరికి దిశానిర్దేశం చేసి ఆచార్యునిగా తీర్చినవారు ఆచార్య తూమాటి దొణప్ప. ఆచార్య బేతవోలువారు శిష్య చిత్తాపహారకులైన సద్గురువని నిస్సందేహంగా చెప్పగలను.

-డాక్టర్ చాగం కొండారెడ్డి
(ఈ నెల 30వ తేదీన ఆచార్య బేతవోలు రామబ్రహ్మం పదవీ విరమణ చేయనున్నారు)

Unknown's avatar

About gdurgaprasad

Rtd Head Master 2-405 Sivalayam Street Vuyyuru Krishna District Andhra Pradesh 521165 INDIA Wiki : https://te.wikipedia.org/wiki/%E0%B0%97%E0%B0%AC%E0%B1%8D%E0%B0%AC%E0%B0%BF%E0%B0%9F_%E0%B0%A6%E0%B1%81%E0%B0%B0%E0%B1%8D%E0%B0%97%E0%B0%BE%E0%B0%AA%E0%B1%8D%E0%B0%B0%E0%B0%B8%E0%B0%BE%E0%B0%A6%E0%B1%8D
This entry was posted in మహానుభావులు and tagged . Bookmark the permalink.

1 Response to సద్గురువు బేతవోలు -డాక్టర్ చాగం కొండారెడ్డి

  1. anrd's avatar anrd says:

    ఆచార్య బేతవోలు రామబ్రహ్మం గారి శ్రీ దేవీ భాగవతము వచన రచన మా వద్ద ఉన్నదండి.

    Like

Leave a comment

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.