‘’తెగిన జ్ఞాపకాలలో’’ సంజీవ దేవ్ తో తెగని నారీ జన జ్ఞాపకాలు -1

‘’తెగిన జ్ఞాపకాలలో’’ సంజీవ దేవ్ తో తెగని నారీ జన జ్ఞాపకాలు -1

ఇది శ్రీ సంజీవ దేవ్ శత జయంతి సంవత్సరం ఆయన తో నాకు మొదటి పరిచయం పది హేనేల్ల కిందట ఉత్తరం ద్వారా జరిగింది ఆయన రచనలు చదివి ,ఆ రచనా విధానం పై పేరడీ గా ఒక కార్డుముక్క  ఆయనకు రాశాను .అందులో నా వ్యంగ్యం స్పుటం గా నే జోడించాను .పెద్ద మనసున్న  సంజీవ  దేవ్ దాన్ని ‘’లైట్ ‘’తీసుకొని ముత్యాల కోవ వంటి దస్తూరితో ప్రత్యుత్తరమిచ్చారు అందులో నేను రాసిన దాని పై కోపం, ద్వేషం ఏమీ లేవు అప్పుడు నేనే సిగ్గు పడ్డాను .మా బావ మరిది ఆనంద్ దగ్గరున్న ఆయన రసరేఖలు తెగిన జ్ఞాపకాలు మొదలైన రచనలు చదివాను .ఎంత సృజన శీలియో తెలిసింది .స్వయం గా చదువుకొని ఉన్నత శిఖరాలకు ఎదిగి పోయిన మన ముందున్న మరో ఆలోచనా పరుడు అని పించింది డాక్టర్ జి.వి.కృష్ణా రావు గారి తర్వాత అంతటి మేధస్సు ,ప్రజ్ఞా  ,ప్రదర్శించి ప్రజాభిమానం చూరగొన్న సాహితీ మూర్తి అని పించింది .ఆయన పెయింటింగ్స్ ను నేను చూసిన తర్వాత  చిత్ర రచనలో ‘’అ ఆ’’ లు కూడా రాని నాకు  ఆ చిత్రాలలో పరమాద్భుత మైన వేగం, ధృతి ఉన్నట్లని పించి మా బావ మరిది నిఅడిగితే ‘’నిజమే బావా !భలే కనీ పెట్టావే ‘’అన్నాడు .

మిత్రుడు, విమర్శక శిరో మణి స్వర్గీయ  టి.ఎల్ .కాంతా రావు సంజీవ దేవ్ గురించి కధలూ గాధలుగా చెప్పే వాడు ప్రతి సంక్రాంతికి తుమ్మ పూడి లో సంజీవ దేవ్ ఇంట వందలాది సాహితీ వేత్తలు నలుమూలల నుండి వచ్చి సభలూ సమావేశాలు నిర్వహిస్తారని తాను చాలా సార్లు వెళ్లి పాల్గోన్నానై చెప్పే వాడు .నాకూ వెళ్ళాలనే అని పించినా వెళ్ళ లేక పోయాను .తర్వాతనేను ‘’తెగిన జ్ఞాపకాలు ‘’చదివినప్పుడు కొన్ని పేజీలు  చదవగానే ఒక ఆలోచన వచ్చింది సంజీవ దేవ్ పై ఇంత మంది స్త్రీల ప్రభావం ఉందా ?అని ఆశ్చర్యమూ కలిగింది .చదవటం పూర్తీ కాగానే పైన పెట్టిన హెడ్డింగ్ పెట్టి మళ్ళీ ఒక సారి చదివి ఆ విశేషాలన్నీ నాకోసమే నేను రాసుకోన్నాను .3-5-1991 లో దీన్ని రాయటం మొదలు పెట్టి నాలుగైదు రోజుల్లో పూర్తీ చేశాను ఖచ్చితం గా ఎప్పుడు పూర్తీ చేశానో రాయలేదు .నేను నా కవితలు ,వ్యాసాలూ అన్నీ పాత డై రీలలో రాసే అలవాటు నాకు ఉంది అందులోనే రాశాను .చివర రాసిన డేట్ నేను రాయటం మరిచానాను కొంటాను .లేక ఇంకా రాయాల్సింది ఉంది ఆపెశానో గుర్తులేదు .

విజయ వాడలో మా బావ మరది, ప్రసిద్ధ ఆర్టిస్ట్ టి.వి. గారు,కొండపల్లి శేషగిరి రావు  ఆయన మిత్రులు కలిసి ‘’అకాడెమి ఆఫ్ ఆర్ట్స్ ‘’సంస్థను స్తాపించి సంజీవ దేవ్ ను ప్రెసిడెంట్ ను చేసి ,ఆయన తో ప్రారంభోత్సవం  చేయించే సందర్భం లో నన్ను కూడా తనతో బాటు తుమ్మ పూడి రమ్మని మా బావ మరిది ఆనంద్ కోరితే కారు లో వెళ్లాను. ఆయన్ను విజయ వాడ తీసుకొని రావటానికే మేమిద్దరం వెళ్లాం ఆయన ఎంతో  ఆప్యాయం గాపలకరించారు .వారి భార్య మాకు కాఫీ ఇచ్చి మాట్లాడారు .ఆ ఇల్లూ ఆ వాతావరణం నాకు ఎంతో నచ్చింది ఇందుకేనా ఇన్ని వందల మంది సంజీవ దేవ్ దర్శనం కోసం వస్తారు అని పించింది .ఆయన్ను కారు లో ఎక్కించుకొని నేను ఆనంద్ కలిసి బెజవాడ బయల్దేరాం .దారి లో ఎన్నో తన అనుభవాలను ఆయన చెబుతూనే ఉన్నారు అడిగిన ప్రతి ప్రశ్నకూ సంతృప్తి కర సమాధానం సమగ్రం గా చెప్పటం ఆయన ప్రత్యేకత .నేను నాతో బాటు తీసుకొని వెళ్ళిన డైరీ లో ఆయన తెగిన జ్ఞాపకలపై  నేను రాసిన వ్యాసాన్ని చూపించాను .ముసి ముసి నవ్వులలు చిలకరిస్తూ చదివారాయన .ప్రతి పేజీ ,ప్రతి లైనూ చదివారని నేను అనుకోను .అలాగే నేను రాసినదాన్ని బాగుందనో లేదనో అభిప్రాయమూ ఆయన చెప్పలేదు కాని ఆయనలో సంతోషం నాకు కనీ పించింది నేను ఆయన్ను నేను రాసిన చివరి పేజీ లో సంతకం చేయ మని కోరగానే ఆనందం గా ఆయన సంతకం చేసి 22-8-93 తేదీ వేసి నాకు షేక్ హాండ్ ఇచ్చారు .ఇది నాకు మధురానుభవం .ఈ కోణం లో ఎవరూ తెగిన జ్ఞాపకాలపై రాసినట్లు నాకు తెలియదు అప్పటి నుంచి దాన్ని అలాగే నా దగ్గర భద్రం గా ఉంచుకోన్నాను ఈ శత జయంతి సందర్భం గా ఉడతా భక్తిగా నేనూ సంజీవ దేవ్ పై సాహితీ వ్యాసం రాసి నా వంతు కృతజ్ఞతలు చెప్పాలనిపించి దీనిని ప్రారంభిస్తున్నాను .ఆ రోజు సభలో అద్భుత మైన ప్రసంగం చేశారు సంజీవ దేవ్ .వారితో బాటు అక్కడ విందు ఆరగించే అదృష్టమూ కలిగింది .చిత్రకారుల చిత్ర రచనలన్నీ చూసే భాగ్యమూ కలిగింది

ఇప్పుడు సంగ్రహం గా సంజీవ దేవ్ ఈవితాన్ని గురించి తెలియ జేస్తాను .

సంజీవ దేవ్ సంగ్రహజీవితం

సంజీవ దేవ్ ఇంటి పేరు సూర్యదేవర .ఇది ఎవరికి గుర్తుండదు కారణం ఆయన సంజీవ దేవ్ గా నే అందరికి ఆప్తుడు ఇంటి పేరుతొ పనిలేని వాడాయన .3-7-1914లో వెంకాయమ్మ ,రామ దేవా రాయ గార్లకు సంజీవ దేవ్ జన్మించాడు .చిన్న తనం లోనే తల్లిని కోల్పోతే బాబాయి దియాసఫిస్ట్ అయిన  చిన వెంకట క్రిష్నయ్య పెంచాడు .కృష్ణా జిల్లా కోనాయ పాలెం లో ప్రాధమిక విద్య నేర్చాడు .అనిబి సెంట్ ,జిడ్డు కృష్ణ మూర్తి అరబిందో టాగూర్ రచనలను అధ్యయనం చేశాడు అన్నిటిని స్వయం కృషి తో నేర్చి విద్యా వంతు డయ్యాడు స్వామి రామ తీర్ధ ,రచనలు రామ కృష్ణా మిషన్ వారి  గ్రంధాలన్నీ పరిశీలనతో జీర్ణించుకొన్నాడు 1950 లో శ్రీమతి సులోచన ను అర్ధాంగిగా చేసుకొన్నాడు

26ఏళ్ళ వయసు లో ఇల్లు వదిలి ఉత్తర భారత దేశం అంతా తిరిగాడు  హిమాలయాలకు వెళ్లి వాటి సహజ సిద్ధ సౌందర్యానికి ముగ్ధుడయ్యాడు అక్కడి రామ కృష్ణా మిషన్ లో గడిపాడు కులూ లోయ సౌందర్యానికి ప్రభావితుడయ్యాడు వీటి నన్నిటిని చిత్రాలుగా గీశాడు ఇంగ్లిష్ ఫ్రెంచ్ హిందీ బెంగాలి జపాన్ భాషలను అతి సునాయాసం గా నేర్చుకొన్నాడు కులూ వాలీ లో ప్రపంచ ప్రఖ్యాత రష్యన్ చిత్ర్రకారుడు నికాలస్ రోరిచ్ తో గొప్ప పరిచయ మేర్పడింది ఆయన అతిధిగా ఉన్నాడు

1939 నుంచి సంజీవ దేవ్ రచనా వ్యాసంగం ప్రారంభించాడు పుంఖాను పున్ఖం గా రాసి చదువరులకు చేరు వయ్యాడు తన అనుభవాలను జ్ఞాపకాలను ఆంద్ర ప్రభ డైలీ లో ధారా వాహికం గా రాసి మెప్పు పొందాడు వాటిని దాని సంపాదకుడు నార్ల వెంకటేశ్వర రావు ఆధ్వర్యం లో మద్రాస్ లో ముద్రించాడు ఏ స్కూలు ,కాలేజి, యూని వర్సిటి లలోను చదవని విజ్ఞాని  ,రచయిత సంజీవ దేవ్ .చిత్రకారుడు ,రచయిత కవి ,పెయింటర్ ఫోటోగ్రఫీ కళా వేది,ఆంద్ర ఆంగ్లాలలో అనన్య సదృశం గా మాట్లాడగలడు రాయ గల చాతుర్యమూ సంజీవ దేవ్కున్నది . .

 

 

సంజీవ దేవ్ ప్రతిభా సామర్ధ్యానికి బెంగుళూర్  తెలుగు ఫెడరేషన్ పురస్కారం అందజేసి సత్కరించింది 1980  లో ఆంద్ర విశ్వ విద్యాలయం సాహిత్యం లో డి.లిట్ నిచ్చి గౌరవించింది 1994 లో ఆంద్ర ప్రదేశ్ ప్రభుత్వం ఉగాది పురస్కారాన్ని అంద జేసింది  1945 లో రోరిచ్ పీస్ పాక్ట్ మెంబర్ గౌరవం పొందాడు ప్రపంచం లో నలు మూలలా ఉన్న వేలాది మందితో కలం స్నేహం నేర్పిన ఉత్తమ స్నేహ శీలి సంజీవ దేవ్

 

సంజీవ దేవ్  అనేక ప్రసిద్ధ భారతీయ పాశ్చాత్య రచయితల తో పరిచయం ఉంది ముఖ్యంగా  రాహుల్ సాన్క్రుత్యాన్ ,అసిత్ కుమార్ హాల్దార్ తో అయన కు చిరస్మరణీయ మైన స్నేహం ఉంది

చలం ఉత్త్తరాలకు ప్రత్యక ఉపోద్ఘాతం రాశాడు సంజీవ దేవ్ .సంజీవ దేవ్ని నివశించిన తుమ్మ పూడి ఒక ‘’పిలి గ్రిం సెంటరే’’ అయింది .సంజీవ దేవ్ విజయ వాడ లో ఏర్పడిన అకాడెమి ఆర్ట్స్ ప్రెసిడెంట్ గా ఉన్నాడు .లలిత కళా అకాడెమి కి మెంబర్ అయ్యాడు .కేంద్ర సాహిత్య అకాడెమి ఆర్తిస్త్స్ట్రిఅసోసియేషన్ లో సభ్యత్వం ఇచ్చి గౌరవించారు .అమెరికన్ ఫిలసాఫికల్ అసోసియేషన్ సభ్యుడు .ఆంద్ర ప్రదేశ ఫెడరేషన్ ఆఫ్ ఫోటోగ్రఫీ కి ఉపాధ్యక్షుడు .ఆల్ ఇండియా ఫొటోగ్రాఫిక్ ఫెడరేషన్ ప్రెసిడెంట్ అయ్యాడు .ఈ గౌరవాలు గుర్తింపులు అన్నీ ఆయనకు 1960 నుంచే ఇవి లభించాయి  1990 లో అమెరికా లోని తానా సభలకు వెళ్లి సన్మానం పొందాడు జెన్, బుద్ధిజం ,మొదలైన వివిధ మత గ్రంధాలన్నీ ఆయనకు సుపరిచితం దేని నైనా సులభం గా వ్యాఖ్యానించే నేర్పు సంజీవ దేవ్ ది.. 1999 ఆగస్ట్28 న డెబ్భై మూడేళ్ళ వయసులో సంజీవ దేవ్ అమరుడైనాడు .అయన శతాబ్దిని అత్యంత ఘనం గా నిర్వహించే ఏర్పాట్లలో అభిమానులున్నారు .

అసలు కద రేపటి నుంచీ ప్రారంభిస్తాను

సశేషం

తెలుగు భాషా దినోత్సవ శుభా కాంక్షల తో (నేడే గిడుగు రామ మూర్తి గారి 151 వ జయంతి )

మీ– గబ్బిట దుర్గా ప్రసాద్—29-8-13-  ఉయ్యూరు

 

 

Unknown's avatar

About gdurgaprasad

Rtd Head Master 2-405 Sivalayam Street Vuyyuru Krishna District Andhra Pradesh 521165 INDIA Wiki : https://te.wikipedia.org/wiki/%E0%B0%97%E0%B0%AC%E0%B1%8D%E0%B0%AC%E0%B0%BF%E0%B0%9F_%E0%B0%A6%E0%B1%81%E0%B0%B0%E0%B1%8D%E0%B0%97%E0%B0%BE%E0%B0%AA%E0%B1%8D%E0%B0%B0%E0%B0%B8%E0%B0%BE%E0%B0%A6%E0%B1%8D
This entry was posted in పుస్తకాలు and tagged . Bookmark the permalink.

Leave a comment

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.