రాజమహేంద్రి వైభవానికి ప్రతిబింబం..
- -సన్నిధానం నరసింహశర్మ
- 03/01/2015
నరసింహావలోకనం (స్వీయ చరిత్ర)
-యాతగిరి శ్రీరామనరసింహారావు;
366 పుటలు; వెల: రూ.125/-లు
ప్రతులకు: ఎమెస్కో బుక్స్, 1-2-7,
భానూకాలనీ, గగనమహల్‌రోడ్,
దోమలగూడ, హైదరాబాదు- 500 029
మరియు సాహితీ ప్రచురణలు,
29-13-53, కాళేశ్వరరావురోడ్, విజయవాడ-2
ధారణాశక్తిగల బుద్ధిమంతుణ్ణి మేధావి అంటారు. ఇది శబ్దసంబంధ అర్థం. మేధావి వావిలాల వారు రాజమహేంద్రిలో పురపాలక సంఘ ప్రాంగణ వేదికపై ఓ సందర్భంలో ప్రకాశంపై అనర్గళ ఉపన్యాసం ఇస్తున్నారు. వేదికపై తెనే్నటి విశ్వనాథం, క్రొవ్విడి లింగరాజు మొదలైన వారున్నారు. తమ ప్రకాశ ప్రసంగధారలో వావిలాల వారు మధ్యమధ్య కొన్ని తేదీల వంటివి వచ్చినపుడు- కరెక్టే కదండీ అని వేదికపైనున్న ఓ వ్యక్తితో చూపుల సంప్రతింపులు చేసుకునేవారు. ఆ సంప్రతించబడిన వ్యక్తే శ్రీయాతగిరి శ్రీరామనరసింహారావు. ఆయన స్వీయచరిత్రే ఈ ‘నరసింహావ లోకనం’.
ఆంగ్లంలో స్వీయచరిత్ర రాసుకున్న మొదటి భారతీయుడు డీన్‌మహమ్మద్ (1759-1851). వెనె్నలకంటి సుబ్బారావు తమ ఆత్మకథను ఆంగ్లంలో రాసుకున్న ఆంధ్రుడు, శతక ప్రక్రియలో మండపాక పార్వతీశ్వర శాస్ర్తీ రాసిన దినచర్యారూప గ్రంథం ‘హరిహరేశ్వర శతకము’ లేక ఆత్మపర్యాయ- కార్యసపర్య తెలుగులో మొదటి ఆత్మచరిత్ర. ఇటువంటి పెద్దలు అనుకునేవి వకుళాభరణం రామకృష్ణ- చిలకమర్తి స్వీయచరిత్ర పీఠికలో విశే్లషణా పూర్వకంగా ఇచ్చారు.
వచనంలో వచ్చిన తెలుగు స్వీయచరిత్ర మొదటిది కందుకూరి వారిదనేది చారిత్రక వాస్తవం. ఒకనాటి కాలంలో కందుకూరి, చిలకమర్తి, ప్రకాశం వంటివారి స్వీయ చరిత్రలు వచ్చి ఎందరికో స్ఫూర్తినిచ్చి సామాజిక సాంస్కృతిక, రాజకీయ కాలనాళికలుగా వెలుగొంది ప్రథమశ్రేణి స్వీయచరిత్రలై పరిఢవిల్లాయి.
చిత్రమేమిటంటే- కందుకూరి, ఆంధ్రకేసరి వంటి స్వీయచరిత్రలు కంఠోపాఠం అన్నంతగా అధ్యయనం చేసిన ఒకనాటి యువకుడు శ్రీ నరసింహారావువారి సేవా చైతన్యస్ఫూర్తులతో, సాంస్కృతిక చారిత్రక సామాజిక కార్యకలాపాలతో ఎదిగి డెబ్భై ఏళ్ళు దాటిన వాడయి తానూ స్వీయచరిత్ర రాసుకునే స్థాయికి, రాయమని అడిగించుకునే స్థాయికి ఎదగడం! ఇందులోగల పట్టుదల, దీక్ష, సేవాతత్త్వం వంటి వాటిని వర్తమాన తరంవారు గ్రహించడానికి ఈ నరసింహావలోకనాన్ని అవలోకించాలి.
కర్ణాటకలోని యాదగిరినుండి 1703లో రాజమహేంద్రికి వలస వచ్చిన మధ్వ బ్రాహ్మణ కుటుంబానికి చెందినవారు శ్రీరావు. వీరేశలింగం స్వగృహం, ప్రకాశం అద్దెయిల్లూ వీరింటికి దగ్గరలో ఉండడంతో తమ తాతలకూ వారికీ రాకపోకలుండేవి. చిననాట నాటిన స్ఫూర్తిబీజాలు జీవన వృక్షాల్ని పెంచుతాయి. పనిచెయ్యని కొందరు ప్రజాప్రతినిధుల్ని కూడా ఇంద్రుడూ, చంద్రుడూ అని పొగడే కొందరి మధ్యకు వృద్ధ స్వాతంత్య్రయోధుల్ని తీసుకువచ్చి ఇదిగో మనం అర్చించుకోవలసిన వారు, వీరు. వీరి వీరగాథా ఘటనల్ని వినండి అంటూ వారిని రప్పించడం, ఉపన్యాసాలిప్పించడం, వారిని సత్కరించడం జీవితం నిండా చేసిన వీరి స్వీయ చరిత్ర నిండా ఏముంటాయో మనం వూహించుకోవచ్చు. ఆంధ్రకేసరి యువజన సమితి స్థాపించి నిత్య సంచలన సంస్థగా పెంచారు. ఆంధ్రకేసరి జూనియర్ కళాశాల, ఆంధ్రకేసరి డిగ్రీ కళాశాలలను స్థాపించారు. గౌతమీ గ్రంథాలయ ప్రభుత్వ స్వీకరణ ఉద్యమాన్ని చేబట్టి సఫలత చెందారు. రాజమహేంద్రవరంలో మార్కండేయేశ్వరస్వామి దేవాలయం ఉందనేది అందరకూ తెలుసు. మార్కండేయేశ్వరస్వామి తండ్రి పేర మృకండేశ్వర దేవాలయం వుండేదని, సంబంధ శివలింగం వంటి చారిత్రక పరావస్తు త్రవ్వకాల ద్వారా వెల్లడయ్యాయంటే దానికీ ఓ స్థానిక ఉద్యమం వచ్చింది. ఉద్యమాలనేవి ఏ ఒక్క వ్యక్తివల్ల మాత్రమే జరిగేవి కావు నిజమే. కానీ, వీటన్నిటికి ‘పిల్లిమెడలో గంటకట్టే వారెవరంటే శ్రీ నరసింహారావే. ఆ ఉద్యమాల్లో తన పాత్ర, సహకరించినవారి పాత్ర, ప్రసిద్ధులదీ, అప్రసిద్ధులదీ కూడా వుండడం ఈ గ్రంథ విశేషం.
ఆంధ్రరత్న దుగ్గిరాల గోపాలకృష్ణయ్య రాజమహేంద్రవరంలో ప్రభుత్వ సమగ్ర బోధనాభ్యసన కళాశాలలో ఉపన్యాసకులుగా పనిచేసేటప్పుడు ఆయన తానున్న వీరభద్రపురం పేట నుండి కళాశాలకు గుర్రంమీద వెళ్ళేవారట. ఈ సంగతి తొంభై ఆ పేట వాసి జనమంచి కామేశ్వరరావు చెప్పారని ఈ పుస్తకంలో ఆయన రాశారు. ఇటువంటి చెప్పుడు మాటలు- మంచివి ఇంకా ఇందులో ఎన్నో వున్నాయి.
14 ప్రకరణాలుగా ఈ గ్రంథం సాగింది. ఇందులో స్వాతంత్య్ర సమరవీరులు, సత్రాలు, చెరువులు, ఆదర్శమూర్తులు, టౌన్ హాలు, ఇతర సంస్థలు, వివిధ రంగాల ప్రముఖులు వంటి శీర్షికల్లోని అంశాలు అత్యంత ఆసక్తిదాయకంగా ఉన్నాయి. ఇందులో స్వీయాంశాలతో, ఎంతోమంది హేమాహేమీలైన వారి చారిత్రక సంఘటనా స్పర్శలుండడంవల్ల బంగారానికి తావి అబ్బింది. ‘సమాచారమ్’ అనే స్థానిక దినపత్రికలో గుర్తుకొస్తున్నాయ్ పేర రాసిన ధారావాహికల సమాహారమే ఈ ‘స్వీయ నది’.
362వ పుటలో ఒక ఛాయాచిత్రం క్రింద శ్రీశ్రీ, మధునాపంతుల, దామెర్ల, పోతుల, వై.యస్.ఎన్‌లతోపాటు శ్రీ మద్దూరి అన్నపూర్ణమ్మ ఉన్నట్టు రాశారు. అది పొరపాటు. ఆయన లేరు. ఉన్నవారు మద్దూరి శివరామకృష్ణయ్య. తరువాత అచ్చులో మార్చుకోవాలి. ముఖ్యమైన ఛాయాచిత్రాలు కూడా చారిత్రక ఘటనల్ని చూపించాయి.
రాజమహేంద్రిలో కోటిపల్లి బస్‌స్టాండుకు ఎదురుగా ‘ఫ్రీడం పార్కు’ అనేది నరసింహ స్వప్న దృశ్యంగా ఉంది. అందులో స్వాతంత్య్రయోధుల విగ్రహాలు, ఛాయాచిత్రాలు, వస్తువులు భద్రపరుస్తున్నారు. స్వా.స. యోధుల జీవిత చరిత్రల వంటితో ఓ గ్రంథాలయాన్నీ నడపడం నగర కీర్తికి ఓ హెచ్చింపు.
రాజరాజనరేంద్ర పట్ట్భాషేక సంచికలో ముఖచిత్రంపై అలనాటి చాళుక్య ద్వారం చూపి అటువంటి ద్వారాన్ని గోదావరి గట్టుపై తమకు చెందిన నరసింహస్వామి దేవాలయ ముఖద్వారంగా కట్టించి ఏర్పాటుచేసుకున్నారంటే సామాన్యమా?
రాజమహేంద్ర చరిత్రను ప్రశ్నోత్తరాల రూపంలో ‘నృసింహ ప్రశ్నోపనిషత్’గా రాశి స్థానిక చరిత్ర రాశికి ఓ రూపకల్పన చేశారు.
వీరేశలింగ సంస్థలను ఎంతగానో సేవించిన ఈయన విగ్రహారాధకుడే కాక, నిరీశ్వర, హేతువాద ప్రముఖులతో స్నేహం చేయడం ఒక సహజీవనాంశం.
రాష్టప్రతులందర్నీ కొందరు ప్రధానమంత్రుల్నీ- ఇంకా ఎంతోమందిని ఈయన కలిసేటప్పుడు స్థానిక నగర సమస్యల్ని సైతం వారిదృష్టికి తీసుకువచ్చేవారు.
1962 అక్టోబరు 2వ తేదీన రాజమండ్రి వాసి- భారత రాష్టప్రతి సర్వేపల్లి రాధాకృష్ణన్‌తో ఇరవై రెండు నిముషాలు సంభాషించడం.. ఇటువంటి సంఘటనలున్న వ్యక్తి స్వీయచరిత్ర ఇది. ఇందులో అయిదు దశాబ్దాల సేవాసంచలనాలు, ఎంతోమంది చారిత్రక వ్యక్తుల సంఘటనా పరిమళాలూ నిండి వున్నాయి. ఈ గ్రంథం సాంతం చదివితే ‘‘ఇది గతానికి, అగతానికీ లోచనం. ఇంతెందుకూ రాజమహేంద్రి నగరం తనను తాను అద్దంలో చూసుకుంటే శ్రీనరసింహారావే కన్పిస్తారని చెప్పిన డా. అరిపిరాల నారాయణరావు వెనుక అట్టహాస వాక్యం అక్షరాలా నిజమనిపిస్తుంది.

