|
పచ్చనాకు సాక్షిగా జీవిత సత్యాలను చెప్పే నామిని తాజా నవల ‘మూలింటామె’పై చాలా చర్చలే జరిగాయి. మూలింటామె నవలపై చర్చలో అధిక భాగం అందులో వున్నది వాస్తవమా కాదా పల్లెల్లో అలాటి వారు వున్నారా లేదా అనే నైతిక కోణంలోనే నడిచినట్టు కనిపిస్తుంది. రచనగా, రచయిత దృక్పథ సూచికగా దాన్నెలా చూడవలసి ఉంటుందనేది నా పరిశీలన.
చెప్పాలంటే పచ్చనాకు సాక్షిగా నుంచి నామిని నెంబర్ వన్ పుడింగి రాసేనాటికి ఈ రచయితలో మార్పు అంతకంతకూ ప్రస్ఫుటమవుతూ వచ్చింది. జీవిత సత్యాలను సహజ భాషలో చెబుతాడన్న ప్రశంస కాస్త వికటించింది. ప్రకృతిలో ప్రపంచంలో ప్రథమ సత్యమైన అమ్మ ప్రేమను చెప్పినంత వరకూ ఆయన శైలి అంత స్వచ్ఛంగానూ ఉంది. ఆ పైన మిట్టూరులో మట్టి మనుషుల గురించి చెప్పినప్పుడు కూడా జీవన భాష్యంలానే అనిపించింది. ఒక దశ తర్వాత రచనా శైలి ఇంకా చెప్పాలంటే రచయిత శైలి మారుతూ వచ్చింది. వీరారాధనలూ విచక్షణారహితమైన స్వీయారాధనల దుష్పలితంగానే ఇది కనిపిస్తుంది. ఇలా జరక్కూడదంటే రచయితలకు చాలా స్వీయ నిబద్ధత లేదా నియంత్రణ ఉండాలి. నీతి రీతి ఎవరి ఇష్టం వారిది అని చెప్పడానికి నియతి నిజాయితీ ఉండాలి. ఏ పల్లెల్లో ఏఏ పదాలతో తిట్లతో బూతులతో ఆడజనం మాట్లాడుకుంటారో తెలియదు గాని నామిని ఎంచుకున్న ఈ మూలింటామె కథ పొడుగునా ప్రతి పేజీకి కనీసం పది పలకలేని మాటలుంటాయి. మూలింటామె మొదటామెతో సహా ఆడవాళ్లందరూ లోలోపల చాలా చేశామని చెప్పుకుంటుంటారు. మరోవైపున వయసులో చాలా చిన్నదైన పందొసంతను పెళ్లి చేసుకున్న నారాయుడు మాత్రం ఇవేవీ పట్టకుండా ఆమెతో ‘సహజీవనం’ చేస్తున్న గుడుగుడు చంద్రుడికి తోకలా వ్యవహరిస్తుంటాడు. ఈ ముగ్గురూ ఒక జట్టుగా మెలగడం, ప్రత్యేకించి వసంత చంద్రుల పోకడలు రచయిత విపులంగా వివ రంగా పొందుపరుస్తాడు. మూలింటామె నవల (నిజానికి పెద్ద కథ) పల్లెటూళ్ళలో మారుతున్న పరిస్థితులను చిత్రించిందని కొంతమంది చేస్తున్న సమర్థన వాదనకు నిలవదు. కథ ప్రకారమే చూసినా ఇవన్నీ ఈ రోజునే జరిగినవి కావు. చెట్లు కొట్టేయడం, సేద్యం మానేయడం వంటివి పందొసంతలే గాక అన్ని రకాల వారూ చేస్తారు. ఇక సహజ భాష అన్న మాటకొస్తే ఇంతకంటే పచ్చిగా మాట్లాడుకోవడం అందరికీ తెలుసు. ఆమె కన్నా ఘోరమైన పాత్రలూ తెలుసు. అయితే వాటిని ఏ మేరకు ఏ తీరుగా చిత్రిస్తామన్నదే ప్రశ్న. పందొసంత-గుడుగుడు చంద్రుడు-నారాయుడు త్రయం చుట్టూనే కథ తిప్పడం ద్వారా నామిని అదనంగా చెప్పిన కొత్త విషయమేమీ లేదు. ఇలాటి వ్యవహారాలు వుంటాయని ఎవరికీ తెలియదనీ కాదు. ఒక ఆర్థిక సామాజిక కథాక్రమాన్ని చెప్పే సందర్భంలో ఎలాటి ఘటనలనైనా పాత్రలనైనా రచయితలు పొందుపర్చవచ్చు. మాలపల్లి నుంచి మైదానం వరకూ తెలుగు సాహిత్యంలో అర్ధశతాబ్ది కిందటే ఇలాటి అంశాలు వచ్చాయి. అయితే ఏ నేపథ్యంలో ఏ సందేశంతో చెప్పారన్నదే కీలకం. మూలింటామె చదివితే మాత్రం రచయిత అక్రమం అనుకున్న రాసలీలలపైనే కలం నడిపించారు. పోనీ పల్లెల్లో అది సహజం అని చెప్పడానికి రాశాడనుకుందామా అంటే జనం అలా అనుకున్న ప్రతి సందర్భాన్ని వ్యంగ్యంగా చిత్రించారు. పైగా అనేక ముఖ్య ఘట్టాల్లో పరస్పర విరుద్ధమైన కథనాలు ఇస్తూ ఏది వాస్తవమో తేల్చకుండా వదిలేశారు. వ్యభిచారం అన్న భావన ఆధారంగా ఉద్భవించిన అనేక జుగుప్సాకర పదాలను అదే పనిగా గుప్పించి వదిలిపెట్టారు. అవన్నీ మహిళను కించపర్చేవిగా వుండగా గుడుగుడు చంద్రుడి వంటి పాత్రలను మాత్రం ఘనంగానే వర్ణించారు. నామిని హఠాత్తుగా సీ్త్రల నైతికతపై ఈ కాలంలో ఇంత కథనం వదలడం ఆశ్చర్యకరం. పైగా అనైతికత వారిలో సార్వత్రికమన్నట్టు చెప్పే అనేకానేక సంభాషణలనూ సన్నివేశాలనూ గుప్పించి వదలిపెట్టారు. వాటిని బేఖాతరు చేసినట్టుగాక సమాజమే నీతి బాహ్యమైందన్నట్టు చిత్రించారు.ఆయనకు ఆధారమైన ఉదాహరణలు ఏమిటో తెలియదు గాని మన సమాజం ఇంత అస్తవ్యవస్తంగా అనాగరికంగా లేదని మాత్రం చెప్పొచ్చు. ఆయన అలా అనుకున్నా మహిళలను మాత్రమే ఆడిపోసుకోవడం సంస్కారం కాదనీ చెప్పకోవాలి. నామిని మీద ప్రేమతోనో ఆయన భాషపైన మోజుతోనో కొందరు ఈ నవల ప్రపంచీకరణకు ప్రతిబింబం అన్నట్టు పల్లెలు నిజంగానే పాడైపోయినట్టు సమర్ధించడం కూడా పాక్షికంగానే నిలబడుతుంది. ఎవరు ఏ కథ రాసినా అందులోని వైరుధ్యాలను భిన్న శక్తుల సంఘర్షణను చెబితే అప్పుడు సమాజీకులు పరిణామక్రమాన్ని అర్థం చేసుకోగలుగుతారు. అంతా పాడై పోయిందనీ పాడై పోవడం మామూలేననీ సాధారణీకరణ చేసిపారేస్తే వాస్తవికత కాదు. పిల్లులను తీసుకొస్తేనో మొక్కల కోసం విచారిస్తేనో ఒక రచన ప్రకృతి సిద్ధమై పోదు, వికృతి మాసిపోదు. తెలుగునాట అమ్మపైన నాకు పేటెంటు వుందని గర్వపడిన ఒక రచయిత ఆడాళ్లందరిలోనూ అదే అమ్మతనం చూడలేకపోవడం బాధాకరం. లావుగా ఉన్న వారిని పంది అంటారు గనక పుస్తకం పొడుగునా పందొసంత అని రాయడం, కుల సీ్త్రల కులటతనాన్ని పేజీల కొద్ది చిత్రించడం సహజత్వం ముద్రతో నడిచిన మనో చాపల్యం మాత్రమే. రచయిత తన కులం పేరే వాడుతున్నారు గనక దీనిపై ఏది రాసినా చెల్లిపోయినట్టేనా? కొడవటి గంటి కుటుంబరావు కూడా చాలా దశాబ్దాల కిందటే పతివ్రత అనే కథ రాశారు. అయన కథలు నవలలు చాలా వాటిలో శారీరక సంబంధాల ప్రస్తావనలుంటాయి. బాలచందర్ చిత్రాల్లోనూ నైతిక విలువల ఘర్షణను, జీవితపు వికార పార్శ్వాన్ని చూపించే పాత్రలు ఎన్నో ఉంటాయి గాని ఆ తరహా వేరు. సమాజంలో పౌరుల్లాగే రచయితలు కూడా ఐచ్ఛికంగా కొన్ని ప్రమాణాలు పాటించడం రచనా శిల్పంలో భాగం తప్ప ప్రత్యేక నైతిక సూత్ర బోధన కాదు. రచయిత అనుకున్నా లేకున్నా కొంతమంది ఇందులో ప్రపంచీకరణ ప్రభావాలను చూడటానికి ప్రయత్నించడం కృత్రిమ సమర్థన కోసమే అక్కరకు వస్తుంది. మూలింటి మొదటామె గురించిన కథ నాటికి ఏ ప్రపంచీకరణ ఉంది? నెంబర్ వన్ పుడింగిలో కేవలం ఆత్మస్తుతి, అనుచితమైన పరనింద, ఆదరించినవారిపట్ల అపహాస్యం వుంటే మూలింటామెలో మొత్తం సమాజాన్ని చులకన చేసే జుగుప్సాకర ధోరణి ఉంది. ఇందుకు విచారిస్తూ తొలినాటి సహజ వాస్తవికతకు తిరిగి వస్తారని ఆశిస్తున్నాను. – తెలకపల్లి రవి |


