ప్రాపకాల కవులు… వాయనాల రచయితలు – –”సాహిత్య తలంటి ”-జయధీర్ తిరుమలరావు

ప్రాపకాల కవులు… వాయనాల రచయితలు

  • – జయధీర్ తిరుమలరావు, 9951942242
  • 05/01/2015
TAGS:

సాహిత్యం – విమర్శ : కొన్ని ఆలోచనలు

వర్తమానంలో సాహిత్యానికి కాలం దగ్గరపడుతోందా అనిపిస్తుంటుంది. దూరం కానున్నదా అనికూడా అప్పుడప్పుడు ఆలోచన వస్తుంది కొందరికి.
వాస్తవానికి ఎన్నడూ లేనంతగా సాహిత్యం ఎక్కువగా ప్రచారం అవుతున్న కాలం కూడా ఇదే. అచ్చు అనే చట్రంలోంచి బయటపడి అక్షరం అంతరిక్షయానం చేస్తున్నది. క్షణాలలో లోకంలోని కోటానుకోట్ల మంది జేబు ఫోనుల్లో ప్రత్యక్షం అవుతున్నది. వెబ్‌సైట్లలో, బ్లాగుల్లో, చివరకు సోషల్ మీడియాలో విస్తృతంగా ప్రచారం పొందుతున్నది. ఒక అతిపెద్ద దినపత్రిక తప్ప రెండు రాష్ట్రాలలో ఏడు ఎనిమిది దినపత్రికల సాహిత్య పేజీలు వెలువడుతున్నాయి. ఓ అతి పెద్ద దినపత్రికలో సాహిత్య పేజీ లేని లోటు తీర్చడానికా అన్నట్లు ఒక మాసపత్రిక ప్రారంభించి భాషా సాహిత్య రంగాలకు తనదైన రీతిలో ఊతం ఇస్తున్నది. ఆదివారం ఆంగ్ల దినపత్రికల ప్రత్యేక సంచికలలో సాహిత్యం గురించి, పుస్తకాల గురించి చాల వ్యాసాలు వెలువడుతున్నాయి. ఐనా చాలామందికి సాహిత్యానికి రోజులు దగ్గరవుతున్నాయా అని ఎందుకు అనిపిస్తున్నది? అందుకు గల కారణాలు ఏమిటి?
ప్రింట్ మీడియాతో పాటు ఆన్‌లైన్‌లో అందుబాటులో ఉండే వెబ్‌సైట్లు, ఇ-పత్రికలు, బ్లాగులు, చివరకు సోషల్ మీడియాలో సైతం లక్షల సంఖ్యలో సాహిత్య పేజీలు పాఠక లోకానికి అందుతున్నాయ. ఇవేకాకుండా పుస్తకావిష్కరణలు, సాహిత్య సభల వార్తలు కూడా వస్తూనే ఉన్నాయి. అన్ని పత్రికల ఆదివారం ప్రత్యేక సంచికలలో పుస్తక సమీక్షలు నిరాటంకంగా వెలువడుతునే ఉన్నాయి. ఆంధ్రభూమి దినపత్రికలో ప్రతి శనివారం సమీక్షల కోసం ప్రత్యేకంగా ఒక పూర్తి పేజీనే కేటాయించారు. ఐనా సాహిత్యం తన అస్తిత్వం కోసం ఊగిసలాడుతున్నదా?
ఈ పత్రికలే కాకుండా ఎన్నో ఇ-పత్రికలు వెలువడుతున్నాయి. వివిధ సాహిత్య సంస్థలు ఏర్పాటుచేసిన ఇ-పత్రికలూ ఉన్నాయి. ఇతర రూపాలలో సాహిత్య ప్రచారం జరుగుతునే ఉంది. కొన్ని ఆన్‌లైన్ పుస్తక విక్రయ సంస్థలు సైతం తమ వెబ్‌సైట్లలో మంచి పుస్తకాల గురించి రాస్తూనే ఉన్నాయి. వ్యక్తులు, రచయితలు తమ వెబ్‌సైట్లలో వ్యాసాలు రాస్తున్నారు. సాహిత్యం గురించి వ్యాసాలు అభిప్రాయాలు, చర్చలు సోషల్ మీడియాలో తగినంతగానే కనువిందు చేస్తున్నాయి. కొందరు రచయితలు వ్యక్తిగత సమాచారం, పుస్తకాలు, ముందుమాటలు, మొత్తం పుస్తకాలను ఆన్‌లైన్‌లో ఉంచుతున్నారు. ఇదొక ప్రత్యేక సాహిత్య లోకం. ఎందుకంటే డబ్బున్న, సాంకేతిక పరిచయం ఉన్నవారే ఈ సమాచారం చూడగలరు. దానిని అందిపుచ్చుకోగలరు. కాగితంపై కాకుండా కంప్యూటర్ తెరపై మాతమే కానవచ్చే సాహిత్యం ఇది. ఈ సాహిత్యానికి కాయినేజి మారకం ఎక్కువ. ఒక వేలు ఒత్తుతో వేల మందికి రచనలను పంపవచ్చు. ఏక కాలంలో వేలాది మంది దానిని చదవగలరు. లోగడ ‘దూరం’వల్ల సాహిత్యానికి అంతగా ప్రచారం ఉండేది కాదు. కాని ఇవ్వాళ రచనకీ-పాఠకుడికీ మధ్య దూరం తగ్గిపోయింది. నిజానికి లేదు కూడా. ఐనా ఏదో కానరాని దూరం కానవస్తున్నది.
లోగడ సమాజంలో సాహిత్యానికి తగినంత గౌరవం ఉండింది. ఇప్పుడు అది తగ్గిపోయినట్లు అనిపిస్తున్నది. సాహిత్య గౌరవం సమాజం అంతటా ప్రతిబింబించేది. ప్రచార పటాటోపం తక్కువైనా సమాజంలో సాహిత్యానికి ‘స్థానం’, ‘గౌరవం’ ఎక్కువ. సృజనకారులకు సామాజిక స్థాయి, అంతరాలు తక్కువగా ఉండేది. విభిన్న వర్గాలనుండి వచ్చినవారు సైతం సాహిత్యస్థాయి అనే కొలబద్దముందు నిలిచినప్పుడు పాండిత్యంతో, సాహిత్య విలువలతో పోటీకి నిలిచేవారు. ఐతే ఆనాడు కూడా సాహిత్య రాజకీయాలు లేవని కాదు. కాని అవి సాహిత్య తత్వాన్ని, పాండిత్యాన్ని దాటిపోలేదు. ఎంతోమంది ‘ప్రాపకం’ కవులు, రచయితలు ఆనాటికి ప్రచారం పొందినా తదుపరి కాలంలో వారిని తలిచేవారు లేరు. కాని ఇవ్వాళ అలాకాదు. మొత్తం వ్యవస్థని అస్తవ్యస్తం చేసి ధనం వెదజల్లి, అధికారం ఆసరాతో పేరుప్రఖ్యాతులు అవార్డులు, రివార్డులు పొందాలని పథక రచన చేయడం గమనించవచ్చు. అలాంటివారి పట్ల సమాజం ఓ కనే్నసి ఉంచుతున్నది. ఇలాంటి వాతావరణాన్ని చూసి చాలామంది సాహిత్యం పట్ల ఏవగింపు కలిగి ఉంటున్నారు. కేవలం మామూలు కవులూ రచయితలే కాదు సమాజంకోసం త్యాగాలు చేసే పార్టీలు, వామపక్ష భావజాలం కలిగిన కవులు కూడా ఇలాంటి చర్యలు చేపట్టడం సాహిత్య విలువను మరింత దిగజార్చుతున్నది.
లోగడ సాహిత్య సంస్థలు ఒకే లక్ష్యంతో, ధ్యేయంతో ఏర్పడ్డాయి. ఇప్పుడు వ్యక్తుల ప్రచారం కోసం ఏర్పడుతున్నాయి. నాకో అవార్డు ఇవ్వు, నీకోటి ఇస్తాను అన్న చందంగా తయారయ్యాయి. నా సంస్థకు నిన్ను ముఖ్యఅతిథిగా పిలుస్తాను. నీ సంస్థ సమావేశానికి అదే హోదాతో వస్తాను వంటి కనబడని ఒడంబడికల వల్ల కూడా సంస్థల కీర్తి తగ్గిపోతున్నది. అమెరికాలోనే కాదు, మన రాష్ట్రంలో కూడా కొన్ని సంస్థలు కులాలవారీగా ఏర్పడ్డాయి. ప్రస్తుతం ప్రభుత్వాలలో కీలక హోదాల్లో ఉన్న వ్యక్తులు రోజుకో సంస్థ ఏర్పాటుచేసి సాహిత్యేతరులతో సభలు, సమావేశాలు నిర్వహిస్తున్నారు. ప్రస్తుతం సాహిత్య సంస్థలు వ్యక్తుల జేబు సంస్థలు అయ్యాయి. ముఖ్యమంత్రుల కార్యాలయాలనుండి కొన్ని సంస్థలు ఆరంభం కావడం ప్రస్తుత పరిస్థితికి అద్దం పడుతున్నది. ప్రభుత్వమే సాహిత్య సంస్థలు నడిపితే ఇకముందు ఎలాంటి సాహిత్యం వెలువడుతుందో ఊహించవచ్చు. ఏర్పాటుచేసిన ఆ సభలలో ఎలాంటి ఉపన్యాసాలు చేస్తారో తెలుసుకోవచ్చు.
సాహిత్యంలో పెడధోరణులు, అపసవ్య సాహిత్యం ఎక్కువ మొత్తంలో వెలువడితే ఆ సమాజాన్ని బాగుచేయడం సాధ్యంకాదు. కళాసాహిత్యం ప్రజల తరఫున నిలిచినప్పుడే ఆ సమాజం సమతౌల్యంగా ఉంటుంది. అక్షరం ప్రజల తరఫు ఆయుధం. పాలక పక్షాలకది ప్రతిపక్షం. ఈ సరిహద్దు గీత చెరిగిపోతున్న వేళ, ప్రజల తరఫున నిలిచిన కవిగాయక సమాజం జీ హుజూరంటూ చేతుల చాచి నిలబడడం చూస్తుంటే బాధేస్తుంది. లోగడ కొద్దిమంది మాత్రమే ప్రభుత్వ బాకా ఊదేవారు. వారు దానిని దాచేవారు కాదు. ఇప్పుడు ప్రభుత్వం అలాంటి వారితో ఒక బాకా సైన్యం ఏర్పాటుచేయబూనడం ప్రజలు గమనిస్తున్నారు. ఈ విషయంలో ప్రగతిశీల సమాజం యావత్తూ చూసీచూడనట్లు నటిస్తున్నది. తమతమ చంచాలు అలాంటి బాకా పనులు చేస్తుంటే చూసి ఊర్కోవడం వింత కలిగించే పరిణామం. ఓ ప్రగతిశీల విప్లవ అభిమాని ఒక పత్రిక వెలువరించి రాజకీయ అధి నాయకుడితో ఆవిష్కరింపచేయడం విచిత్రం కాదు. కాని దానిని ఆమోదించే విప్లవ సాహిత్య శిబిరం నేతల చేష్టని గమనించాల్సిన సందర్భం ఇది.
***
ఇక మరికొందరు రచయితలు కేవలం జయంతులు, వర్ధంతులు ఎప్పుడా అని ఎదురుచూస్తూ నిరంతరం వాటిపైనే వ్యాసాలు రాయడం చూస్తుంటే సాహిత్య విషయకంగా వీరు మరేమీ రాయలేరా అనే అనుమానం వేస్తున్నది. ప్రతి ఏడాది అదే కవిది జయంతో, వర్ధంతో వస్తుంటుంది. శత జయంతి సందర్భంగా ప్రారంభం, ముగింపులు ఉంటాయి. ఈ రచయితలు పుంఖానుపుంఖంగా ఆ సందర్భాల్లో – రాసిన వ్యాసాలనే మరోసారి రాయడమే వారి పని. మరొక ధోరణి ఏమంటే, ఒక రచయిత పైనో, కవిపైనో వ్యాసాలు రాయడం. ఆ తరువాత ఈ కవి మళ్ళీ రాసిన ఆయనపై తిరిగి రాయడం. ఇచ్చుకుంటి వాయనం- పుచ్చుకుంటి వాయనం అన్న రీతిలో వ్యాసాలు ఎక్కువగా వస్తున్నాయి. పాత కవులు, రచయితలపై ఇతర పుస్తకాలనుండి సమాచారం గ్రహించి, తరగతి గదిలో చెప్పిన పాఠాలను వ్యాసాలుగా రాసి పత్రికలకు పంపుతున్నారు. నిజానికి వారి వ్యాసాలలో చాలావరకు లోగడ ముద్రితమైన వ్యాసాల నుండి, పుస్తకాలనుండి గ్రహించిన విషయాలే ఎక్కువ. ఎవరైనా చూస్తారు అనే ఆలోచన లేకుండా రాయడం జరుగుతున్నది.
సాహిత్య పేజీలను రచయతలు వ్యక్తిగతంగా వాడుకోవాలని చూసే దృక్పథం ఎక్కువగా కనుపిస్తోంది తప్ప, సాహిత్య విశే్లషణ, చర్చ, విలువలు వంటి అంశాలపై అంత ఆశించిన రీతిలో వ్యాసాలు రావడం లేదన్నది వాస్తవం. అలాంటి వ్యాసాలు రాసే విమర్శకులు తగ్గిపోయారా? అలాంటి విమర్శ అవసరంలేదని భావిస్తున్నారా? నిజానికి సాహిత్య విమర్శ స్థాయి దిగిపోవడానికి కారణాలు వేరే ఏమైనా ఉన్నాయా అని ఆలోచించవలసిన పరిస్థితి ఏర్పడింది.
అవును. ఇదివరకటిలా సాహిత్యరూపం ఒకే మొత్తంలో ఘనీభవించి లేదు. అంటే ఏక ఖండంగా లేదు. వర్తమానంలో అది భిన్న శకలాల్లా విభాజితమై ఉంది. అది ప్రవాహంలా కనుపిస్తోంది. అస్తిత్వ ఉద్యమసాహిత్య ప్రవాహాలు అనేకం. అవి ఏకశిలా సదృశంగా లేవు. మన సమాజం కూడా అలాగే ఉంది. ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటువల్ల తెలుగు సాహిత్య స్వరూపం, స్వభావం గురించి మాట్లాడ్డం కొంత క్లిష్టతకు గురిచేస్తున్నది. నిర్దిష్టతకు లొంగడం లేదు. ఐనా సాహిత్య విలువలు, ఆలోచనలు ఒక రకంగానే ఉంటాయనే విషయం గుర్తుంచుకోవాలి. కన్నడ, మరాఠీ, తమిళ సాహిత్యాల కథలు, నవలలు, నాటకాల గురించి మాట్లాడుకున్నప్పుడు వాటి రచనాశక్తి, ఇతివృత్తం, శైలి, భాషల గురించి మాట్లాడుతాం. రచన ప్రాశస్థ్యం, శక్తి, రచయిత ప్రతిభల గురించి చూస్తాం. ప్రక్రియాపరంగా పరిశీలించడం ఎక్కడైనా ఒక్కటే. దేశ కాల పరిస్థితిని బట్టి ఐదు పది శాతం తేడాలు ఉంటే ఉండవచ్చును. అది ఎక్కువగా ఇతివృత్తానికి సంబంధించినదై ఉంటుంది.
తెలుగులో మంచి రచనలు రాకపోవడంవల్ల మంచి విమర్శ రావడం లేదని ఒక అభిప్రాయం. కాని మంచి సాహిత్యం వెలువడడానికి బలమైన విమర్శ అవసరం. సద్విమర్శ నవ్యసాహిత్య సృజనకు ఊతం ఇవ్వగలదు. స్తబ్దుగా ఉన్న సాహిత్య సమాజంలో ఆలోచనలు రేకెత్తించడం విమర్శకులు బాధ్యత.
సాహిత్య విమర్శకుల మీద విమర్శ చేయడం అవసరం అనిపిస్తోంది. వృత్తి, ప్రవృత్తి విమర్శకులు తగ్గిపోయిన కాలంలో ఎవరిని ఏమి అనగలరు. అది సమాజం ఇచ్చిన అనధికార బాధ్యత. దానిని ధైర్యంగా, సమర్థంగా పాటించడం విమర్శకుని ధర్మం. నిజానికి అస్తిత్వ సాహిత్య పాయలు పెరిగాక విమర్శ తన అస్తిత్వాన్ని కోల్పోయింది. ఆ సాహిత్యాల అంతర్గత విమర్శ, బాహ్య విమర్శల మధ్య ఏకీభావం కుదరలేదు. దళిత, స్ర్తివాద సాహిత్యాలపై ఇతర వర్గాలవారు విమర్శ చేసినప్పుడు ‘వ్యక్తి’ కేంద్రంగా ప్రతి విమర్శ జరిగింది. దానివల్ల అసలు విమర్శ చేయడమే తగ్గిపోయింది. ఒక్కొక్కప్పుడు కేవలం మెప్పుకోలుకే విమర్శ పరిమితం అయింది. ఇలాంటి విమర్శ పుస్తకాల ముందు మాటలలో, సభలలో ఉపన్యసించినప్పుడో బయటపడింది. అంటే విమర్శేతర మార్గాలలో వ్యక్తం అయ్యింది. అంతే తప్ప ఒక విమర్శ చట్రంలోంచి నిశజూజఔళశజూళశఆగా వెలువడ లేకపోవడం గమనించాలి. దృక్పథ విమర్శ అంటే, మార్క్సిస్టు విమర్శ, దళితవాద సాహిత్య విమర్శ, స్ర్తివాద సాహిత్య విమర్శ, ప్రాంతీయవాద సాహిత్య విమర్శ దేనికది విడివడిగానైనా సమగ్రంగా ఎదగలేదు. కలగలసిన అస్తిత్వ సాహిత్య దృక్పథం అయినా ఒకటి ఏర్పాటుకాలేదు. ఇకపోతే ప్రక్రియాపరంగా విమర్శ కూడా ఎదగవలసినంత ఎదగలేదు. ప్రక్రియ గురించి మాట్లాడితే రూప విమర్శ అని కొట్టిపడేసిన ప్రగతిశీల సాహిత్యకారులు ప్రతిగా దానిని తాత్వికంగా ఎలా చూడాలో చెప్పలేకపోవడం కూడా ఒక లోటే. నిజానికి పాత విమర్శసూత్రాలు, చూపు, దృక్పథాలు ఇవ్వాళ పాతపడిపోయాయి. ఏ విమర్శకుడైనా సమాజాన్ని ముందుకు నడపగలిగే ఆలోచనతో విమర్శ విధానాన్ని తనకైతాను రూపొందించుకోవలసి వస్తున్నది. మార్క్సిస్టు పడికట్టు పారిభాషిక పదాలతో చేసిన విమర్శకూడా బలహీనపడింది. ప్రత్యామ్నాయ సాహిత్య రంగాన్ని గుర్తించని ఆ విమర్శకులు మెల్లిమెల్లిగా ఆ రంగంనుండి నిష్క్రమించి ఘనీభవించిపోయారు. కొత్త తరం, కొత్తతరహా విమర్శ అప్పుడప్పుడు కనుపించినా అదీ స్థిరం కాలేదు. ఈ నేపథ్యంలో తెలుగు విమర్శ దిక్కుతోచక బలహీనపడింది. తన చేతగానితనం వలలో తానే చిక్కుకుపోయింది.
ఇప్పుడు విమర్శక రక్షకులు లేని సాహిత్యం బలహీనపడింది, దిగాలుగా కానవస్తున్నది. యువతరం పట్టించుకోని తల్లిదండ్రుల మాదిరి సాహిత్యం సుక్కి వడలిపోతోంది. ఎక్కువగా పాత తరం, అతి కొద్దిమంది యువతరం కనిపిస్తూ ఉన్నా భావితరం సాహిత్యానికి దగ్గర కారేమో అనే ఆలోచన అందరిలోనూ పెనుగులాడుతున్నది. అందుకే సాహిత్య భవిష్యత్తు గురించి నిరాశాజనకమైన అభిప్రాయాలు వినవస్తున్నాయి. వాటిని అబద్ధం అని కొట్టిపారేయగలిగే రోజులు రావాలి.

Unknown's avatar

About gdurgaprasad

Rtd Head Master 2-405 Sivalayam Street Vuyyuru Krishna District Andhra Pradesh 521165 INDIA Wiki : https://te.wikipedia.org/wiki/%E0%B0%97%E0%B0%AC%E0%B1%8D%E0%B0%AC%E0%B0%BF%E0%B0%9F_%E0%B0%A6%E0%B1%81%E0%B0%B0%E0%B1%8D%E0%B0%97%E0%B0%BE%E0%B0%AA%E0%B1%8D%E0%B0%B0%E0%B0%B8%E0%B0%BE%E0%B0%A6%E0%B1%8D
This entry was posted in వార్తా పత్రికలో and tagged . Bookmark the permalink.

Leave a comment

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.