కాశ్మీర్‌లో గవర్నర్‌ పాలన అనివార్యం? అక్షర సత్యాలకు పట్టం గట్టిన విమర్శకుడు

అక్షర సత్యాలకు పట్టం గట్టిన విమర్శకుడు

adhraprabha –   Mon, 29 Dec 2014, IST
  • అతడు అక్షరాల ఆకాశంలో అభ్యుదయ నక్షత్రాలను మెరిపించిన ప్రగతిశీల భావాల కవి.
  • అతడు ఆధునిక తెలుగు సాహితీ విమర్శను కొత్తపుంతలు తొక్కించిన విమర్శ
  • కుడు.

మార్క్సిజం కన్నుతో కథను నవలను కవిత్వాన్ని నిశితంగా పరిశీలించిన పరిశోధకుడు

ప్రాచీన సాహిత్యానికి ఆధునిక భాషలో, వర్తమాన సామాజిక స్పృహతో భాష్యం చెప్పిన ఆధునికుల్లో అత్యాధునికుడు

అతడు ఒక చేత్తో అభ్యుదయ భావాల లావాలను అక్షరాల్లో వెదజల్లి కవిత్వపు మంటల్లో గుండెల్ని రగిలించగలడు

మరో చేత్తో కలాన్ని బలంగా కదిలిస్తూ నిర్భయంగా తన భావాలను వెల్లడిస్తూ సాహితీ విమర్శ రాయగలడు.

అతడొక కవి, సుప్రసిద్ధ సాహితీ విమర్శకుడు, అటు విద్యార్థులను ఇటు సమాజంలోని ప్రజలను ఏకకాలంలో చైతన్యవంతం చేసే ఉపన్యాసకుడు, అన్నింటికీ మించిన మానవతావాది. ఆయనే రాచపాళెం చంద్రశేఖర్‌ రెడ్డి..

తెలుగు సాహిత్య విమర్శారంగంలో రాయలసీమ సాహితీ విమర్శకులకు ఒక ప్రత్యేకత ఉంది. ఒక రాళ్ళపల్లి ఒక పుట్టపర్తి, ఒక కట్టమంచి, ఒక రాచమల్లు ఇలా ఎందరెందరో సాహితీ విమర్శకులు రాయలసీమనుండి పుట్టుకొచ్చారు. వారి వారసత్వాన్ని పుణికి పుచ్చుకుని, సాహితీ విమర్శను కొనసాగిస్తూ 2014 కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డును కైవసం చేసుకున్నారు మార్క్సిస్టు విమర్శకులు ఆచార్య రాచపాళెం చంద్రశేఖరరెడ్డి. నిబద్ధతకు, నిజాయితీకి, నిలువెత్తు నిదర్శనం ఆయన. నిర్మొహమాటంగా నిక్కచ్చిగా, సాధికారికంగా తన అభిప్రాయాలు వ్యక్తం చేయడానికి ఆయన ఏనాడు వెనకడుగు వేసిందేలేదు. కవిత్వంతోపాటు విమర్శరాసి అందరి ప్రశంసలు అందుకున్న విమర్శకుడాయన. అందుకు కారణాలు లేకపోలేదు. సీమలో వేమన, రాళ్లపల్లి అనంతకృష్ణ శర్మ, పుట్టపర్తి నారాయణాచార్యులు, సర్ధేశాయ్‌ తిరుమలరావు, లాంటి ఎందరో విమర్శకులను ప్రేరణగా తీసుకుని ఆయన విమర్శారంగాన్ని ఎన్నుకున్నారు. రా.రా. తర్వాత శూన్యత ఏర్పడిన సంధికాలంలో తెలుగు విమర్శవినీలాకాశంలో తళుక్కున మెరిసిన వేగుచుక్క ఆయన. తెలుగు సాహిత్య విమర్శకు మార్క్సిజం సొబగులద్దిన నిబద్ధత కలిగిన సద్విమర్శకులు రాచపాళెం చంద్రశేఖర్‌ రెడ్డి. పరిశోధక విద్యార్థిగా ఉన్నప్పుడే పింగళి సూరన ప్రభావతీ ప్రద్యుమ్నం కావ్యాన్ని డాక్టరేట్‌ పట్టాకోసం ఎంచుకుని శిల్పప్రభాతి అన్న అంశంపై సాధికారికమైన పరిశోధన చేశారు. దీని మూలంగా ఆయన తదనంతరకాలంలో కథ, నవల, కవిత్వంపై సాధికారిక విమర్శనా గ్రంథాలెన్నో వెలువరించగలిగారు. ప్రాచీన సాహిత్యాన్ని బాగా చదువుకున్న రాచపాళెం, ఆ సాహిత్యాన్ని ఆధునిక దృష్టితో చూసే ఒక అరుదైన దృష్టిని అలవరచుకున్నారు. అంతేకాదు దాన్ని తన విమర్శలో ప్రవేశపెట్టారు. అందుకే కచదేవయాని లాంటి చర్చలకు తెలుగు సాహిత్యంలో తెరతీశారు. సర్దేశాయ్‌ తిరుమలరావు రాసిన నూరేళ్ల కన్యాశుల్కమంటే రాచపాళెం గారికి ఎంతో ఇష్టం. అందుకేనేమో గురజాడ కథలపై ఒక మంచి విమర్శాగ్రంథాన్ని వెలువరించారు. అలాగే దళిత, స్త్రీవాద, ముస్లిం అస్తిత్వ ఉద్యమాలను విపరీతంగా ప్రేమించారు. ఆయా ఉద్యమాల, కవులను, రచయితలను ఎక్కువగా అభిమానించారు. వారి రచనలపై ఎన్నో సమీక్షలు, వ్యాసాలు రాసి ప్రోత్సహించారు. మారుతున్న కాలానికి అనుగుణంగా ఆయన విమర్శలో మార్పులు మనం గమనించవచ్చు. అభ్యుదయం ఆయన హృది, మార్క్సిజం ఆయన విమర్శకు పునాది. అయినప్పటికీ స్థలకాలాను దృష్టిలో ఉంచుకుని విమర్శలు రాశారు. ప్రపంచీకరణ నేపథ్యంలో వస్తున్న మార్పులను పసిగడుతూనే రచయితల వస్తుశిల్పాల్లో వచ్చిన పరిణామాలను కూలంకషంగా పరిశీలించారు. విమర్శలో సంయమనం పాటిస్తూ రాగద్వేషాలకు అతీతంగా విమర్శలు రాసిన ఏకైక విమర్శకుడాయన. ఒకేభావజాలానికి కట్టుబడిన విమర్శకుడైనప్పటికీ ఇతరులను భావజాలపరంగానే విభేదించి, విమర్శించినప్పటికీ ఏ భావజాలం కలిగిన వ్యక్తులనైనా గౌరవించే సంస్కారం రాచపాళెంలో ఉంది. అందుకే ఆయన అజాత శత్రువుగా అందరి ఆదరాభిమానాలు అందుకున్నారు. గత నాలుగు దశాబ్దాలుగా నిరంతరంగా సాహిత్య కృషిచేస్తున్న రాచపాళెం చంద్రశేఖర్‌ రెడ్డిగారు ఇప్పటివరకు 36 గ్రంథాలు వెలువరించారు. ప్రాచీన ఆధునిక కవులు రచయితల గ్రంథాలపై, వారి జీవిత సాహిత్యాలపై అరుదైన సాహిత్య విమర్శాగ్రంథాలెన్నో వెలువరించారు. ఆయన కలం నుండి వెలువడిన ప్రతి గ్రంథం ఏదో ఒక కొత్త కోణాన్ని, నూతన సత్యాన్ని, ఆవిష్కరించిందంటే అందులో అతిశయోక్తి లేదు. ప్రగతి శీలభావాలు, హేతువాదం, సామాజికస్పృహ, శాస్త్రీయ విజ్ఞానం, ప్రపంచ పరిణామాలు, అభ్యుదయ దృక్పథం, ఆర్థిక సాంఘిక రాజకీయ సాంస్కృతికరంగాల్లో వచ్చిన మార్పులు ఆయన విమర్శలో చూడవచ్చు. ఆ నేపథ్యంలోనే ఒక రచననుగాని, రచయితనుగాని అంచనావేస్తూ వారి రచనలను సమగ్రంగా పరిశీలించి వస్తుశిల్ప రహస్యాలను వింగడిస్తూ, సత్యాసత్యాలను ఆవిష్కరించడం రాచపాళెం విమర్శలో ఉన్న ప్రత్యేకతగా చెప్పవచ్చు. కొన్ని సందర్భాల్లో రచయిత దృక్పథంలో, ఆలోచనా విధానంలో ప్రపంచాన్ని అర్థం చేసుకునే విధానంలో అభివ్యక్తీకరించే నైపుణ్యంలో ఏవైనా లోపాలుంటే సున్నితంగా రచయితల మనసులు గాయపడకుండా సలహాలు సూచనలను ఇస్తూ ప్రోత్సహించడం ఆయన నైజం. అందువల్లనే ఆయన ఒక మంచి విమర్శకునిగా, మార్క్సిస్టు విమర్శకునిగా అన్నివర్గాల మేధావుల మన్ననలు అందుకున్నారు. మంచి వ్యక్తిత్వం ఉన్నవాడు మంచి విమర్శకుడవుతారనటానికి రాచపాళెం చంద్రశేఖర్‌ రెడ్డిగారే ప్రత్యక్ష నిదర్శనం. ఇక ఆయన జీవిత విశేషాల్లోకి వెళితే చిత్తూరుజిల్లా కుంట్రపాక గ్రామంలో 1948 అక్టోబర్‌ 16న ఒక సాధారణ మధ్యతరగతి రైతుకుటుంబంలో రామిరెడ్డి మంగమ్మ దంపతులకు రాచపాళెం జన్మించారు. చిన్నతనంలోనే తల్లిని కోల్పోయి తల్లి ప్రేమకు దూరమయ్యారు. అయితే పినతల్లి రాజమ్మ ఆయనకు అవ్యాజమైన ప్రేమను పంచిపెట్టి తల్లిలేని లోటును తీర్చింది. అందుకే ఆయన హృదయం దయాపూరితంగా ఉంటుందనీ ఆయన గురించి తెలిసినవారంటారు. సహజంగా ఆయన మృదుస్వభావి.

మానవతావాది. యూనివర్సిటీ ఆచార్యులకున్న అకడమిక్‌ అహంకారం ఆయనలో ఏకోశానా కనిపించదు, అయితే విమర్శలో మాత్రం ఆయన నిజాలు నిర్భయంగా వెలువరించడానికి ఏమాత్రం సంకోచించడు. అదే సుగుణం ఆయనను విమర్శకునిగా అగ్రభాగాన నిలబెట్టింది. కరవు సీమలో చదువుకోవడం చాలాకష్టం. అందునా రైతుకుటుంబాల పిల్లలుచదువుకోవడం మరీ కష్టం. అయితే ఆ కష్టాలే ఒక్కోసారి కసిని, పట్టుదలను పెంచి బతుకు భయంవల్ల బాగా చదువుకోడానికి కారకాలు ప్రేరకాలు కూడా అవుతాయి. రాచపాళెం విషయంలో అదే జరిగింది. ఆయన ఎంతో కష్టపడి చదువుకున్నారు. తిరుపతిలోని వెంకటేశ్వర యూనివర్సిటీలో తెలుగు సాహిత్యం చదువుకుని అనంతపురం శ్రీకృష్ణ దేవరాయ యూనివర్సిటీలో లెక్చర్‌గా, ప్రొఫెసర్‌గా, ఆంధ్ర భారతి శాఖాధిపతిగా పనిచేసి 2008లో పదవీ విరమణ చేశారు. అటు తర్వాత 2008 నవంబర్‌ నుండి కడప యోగివేమన విశ్వవిద్యాలయంలో తెలుగు శాఖలో పనిచేస్తున్నారు. 31 ఏళ్ల ఉద్యోగ జీవితంలో ఆయన పర్యవేక్షణలో 25 మందికి డాక్టరేట్లు, 18 మందికి ఎంఫిల్‌ పట్టాలందుకున్నారు. రాచపాళెంలో ఉన్న మరో పార్శ్వం సంగతి చాలామందికి తెలియదేమో! ఆయన రాసింది జీవితంలో ఆచరించాడు. సామాజిక ఉద్యమాల్లో స్వయంగా పాల్గొన్నారు. తన ఇంట్లోని వారికి కులాంతర మతాంతర వివాహాలు చేసి కులమతాలు లేవని చాటిచెప్పారు. విశ్వవిద్యాలయాల్లో స్మశానాల్లాంటి నిఘంటువులు చూపి, వ్యాకరణాల సర్ప పరిష్వంగంలో విద్యార్థులను బంధించి, పాత భావాల పాతర్లో వేసి పాఠాలు బోధిస్తున్న బోధగురువుల బారినుండి విద్యార్థులను తప్పించారు. తన ఆధునిక భావజాలాన్ని వారిలో ఇంజెక్టుజేసి, వారిని అభ్యుదయ వాదులుగా మలిచారు. ఆధునిక సాహిత్యబోధనా పద్ధతులు ప్రవేశపెట్టారు. అకడమిక్‌ సిలబస్‌లో ఆధునిక సాహిత్యానికి పెద్దపీట వేశారు. అంతకుమించి శిష్యులను అమితంగా ప్రేమించారు. నిరాడంబరంగా జీవించారు. అంతే కాదు వారిలో తానొక చేతనా దీపమై, చైతన్యకెరటమై, అభ్యుదయ ఉద్వేగ తరంగమై ఎగసిపడ్డారు. ప్రగతిశీల భావనా తటాకమై విద్యార్థుల జీవితాలను పచ్చని సాహితీ క్షేత్రాలుగా పల్లవింప జేశారు. రాచపాళెం కేవలం విశ్వవిద్యాలయాలకే పరిమితం కాలేదు. ఆయన సామాజిక బాధ్యతతో అనేక సామాజిక, సాంస్కృతిక దళిత ఉద్యమాల్లో ప్రత్యక్షంగా పాల్గొన్నారు. అనంతపురం జిల్లాలో 400 మంది రైతులు ఆత్మహత్యలు చేసుకున్నప్పుడు రైతుల్లో ఆత్మవిశ్వాసాన్ని పెంచడానికి జిల్లా రచయితల సంఘం కవులు రచయితలతో కలిసి జిల్లా అంతటా పర్యటించి రైతుల్లో ఆత్మవిశ్వాసం నింపారు. ప్రభుత్వాల రైతు వ్యతిరేక విధానాలను దుయ్యబట్టారు.

జనవిజ్ఞాన వేదికద్వారా ప్రజల్లో శాస్త్రీయ విజ్ఞానాన్ని పెంపొందించడానికి కృషి చేశారు. దళిత ఉద్యమాలను బలపరిచారు. ఉద్యమకారులకు తన మద్దతును ప్రకటించారు. ఆయన మంచి వక్తకూడా. ప్రభుత్వ విధానాలను, మేధావులు, కుహనా సంఘసేవకుల అశాస్త్రీయ భావజాలాన్ని తూర్పారబడుతూ ఆయన ఉపన్యసిస్తుంటే సామాన్య ప్రజలు కూడా ఆసక్తితో ఆలకించేవారు. వాస్తవాలను కళ్లముందు నిలిపి, బొమ్మకట్టించి, నిజాలను మార్క్సిజం అద్దంలో చూపించి, ఆయా వర్గాలవారిని నొప్పించక ఒప్పించే విమర్శనాత్మక ధోరణి ఆయన ఉపన్యాసాల్లో ఉండేది.

ఆధునిక కవులపై శ్రీశ్రీ ప్రభావం ఉన్నట్టే అనంత కవులపై రాచపాళెం ప్రభావం ఉంది. అవధాన సీమలో జూపల్లి, ప్రేమ్‌చంద్‌ లాంటి అభ్యుదయ అంగార పుష్పాలు వికసించాయంటే అందుకు రాచపాళెం భావజాల ప్రభావమే కారణం అనడంలో ఎట్టి సందేహం లేదు. శిల్ప ప్రభావతిపై పరిశోధన చేసినా, గుర్రం జాషువాలాంటి కవులపై విమర్శాగ్రంథాలు వెలువరించినా సాహిత్యంపై సాధికారికంగా చర్చలాంటి పుస్తకాలు రాసినా, మన నవలలూ మన కథానికలూ లాంటి విమర్శనా గ్రంథాలు వెలువరించినా… కవులు ఉద్యమాల గురించి ఇంకా అనేకమంది సాహితీ వేత్తలపై వారి రచనలపై వ్యాసాలు రాసినా, ఫ్యాక్షనిజం వస్తువుగా కవిత్వం రాసినా అది ఆయనకే చెల్లుచుంది. సాహిత్యంలో పునర్‌ మూల్యాంకనం అన్నపదానికి ఉన్నవ మాలపల్లె, వట్టికోట ఆల్వారుస్వామి ప్రజల మనిషి, లాంటి నవలలపై, రాచపాళెం రాసిన వ్యాసాల వల్లనే ప్రాచుర్యం వచ్చిందంటే అతిశయోక్తి లేదు. కాళీపట్నం యజ్ఞం, కొలకలూరి ఊరబావి లాంటి కథలపై ఆయన రాసిన వ్యాసాలు సంచలనాత్మక విమర్శాకథనాలుగా భావించవచ్చు. ఇక సాహితీ విమర్శకునిగా రాచపాళెం ఎంత గుర్తింపును పొందారో వ్యక్తిత్వమున్న ఒక మంచి వ్యక్తిగా, మానవతామూర్తిగా ఆయన అంతే కీర్తి గడించారు. వ్యక్తిత్వం లేనివాడు ఎంత గొప్ప కవిత్వం రాసినా విమర్శరాసినా కథలూ నవలలు రాసినా అది శిల్పశోభితం, కీర్తిదాయకం, కావచ్చునేమోగాని సామాజికామోదం పొందదు, అయితే అటు గొప్ప వ్యక్తిత్వంతో పాటు నిఖార్సయిన విమర్శరాసినందుకు రాచపాళెంకు కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డుకు రావడం అందరికీ ఆనందదాయకం. ఆ అవార్డుకు నూటికి నూరుపాళ్లు ఆయన అర్హుడని సాహితీ వేత్తలు అభిప్రాయపడుతున్నారు. నా రాతలలో రాచపాళెం భావజాల ప్రభావముంది.

 

సాక్షి

andhraprabha –   Mon, 29 Dec 2014, IST

ఒకరు విహారి -జొన్నలగడ్డ సత్యనారాయణమూర్తిరెండోవారు శాలివాహన -త్రిపురారిభట్ల నారాయణమూర్తి

ఇద్దరూ ఎల్‌ఐసిలో పనిచేశారు. ఇద్దరూ కలిసి కథలు రాసి ప్రసిద్ధులయ్యారు. ఇద్దరూ కలిసి ”సాక్షి” అనే కవితా సంపుటి తీసుకువచ్చారు. అయితే ఎవరు ఏ కవిత రాశారో తెలీదు. ఎవరు రాసినా అది ”తిర్పతి వేంకటేయమే” అన్నట్టుగా వీరిద్దరూ రాశారు.

”అక్కడ. శాంతి కపోతాల్ని రాకాసిగద్దలు రక్కుతున్నాయి

అక్కడ న్యాయం ధర్మం తూటాలుగా తుపాకీ గొట్టాల్లో దట్టింపబడుతున్నాయి

అక్కడ పాలకుడు ఆవేశవశువై, పశువై, రాకాసియై వికట నాట్యం చేస్తున్నాడు.

అక్కడ భూతల నరకం సృష్టింపబడుతోంది

అక్కడ నరమేధం వడివడిగా సాగిపోతోంది”

అనే పంక్తులు చదవగానే ఏ దిగంబర కవో విప్లవకవో రాసి ఉంటాడను కొనేలా ఉన్నవి. విహారి శాలివాహనలవే. ”ఖండించడం, పండించడం కవికే చేతనవును. కవి చెడును ఖండిస్తాడు. మంచిని పండిస్తాడు. వీరి కవితల్లో నేను కాంతిమయ భవిష్యత్తు అడుగు జాడలు చూశాను. వీరికలాలు గళాలు జలపాత జలాలవలె చైతన్యవిద్యుత్తును ఉద్భవింపజేస్తున్నాయి.” అన్నారు దాశరథి, అప్పట్లో అభ్యుదయ కవుల్లో, కథకులలో కొందరు మధ్యతరగతి జీవులపై బాగా రచనలు చేశారు. ఈ జంట వచన కవులు కూడా ”మధ్యమ పురుషలో కథనం” అనీ కవి తను ఆంగ్లపదాలలో, వినూత్న శైలిలో రాశారు—

”ఇంక్రిమెంట్‌’కు ‘స్టాగ్నేషన్‌’ వచ్చింది నాకు తెలుసు నువ్‌ ఆడుతున్న రమ్మీలో నీకు ఎక్స్‌టెన్షన్‌ అందటం లేదు.

పదమూడో ముక్క పండటంలేదు

‘ప్రమోషన్‌’ కోర్టులపాలై పోయింది

నాకు తెలుసు

నువ్‌ చేస్తున్న ప్రయోగానికి

ఇదమిత్థమైన ‘ఫార్ములా’ లేదు”

చీట్లపేక గురించి జాషువా నుంచి చాలామంది కవితల్లో పేర్కొన్నారు. ‘నాకు తెలుసు’ అనేది పునరావృతం కావడం నొక్కి చెప్పే శిల్పం (తిలక్‌ నేను చూశాను నిజం.. గా లాగా) బడిపంతుళ్ళ జీవితాలు ఒకప్పుడు ”రూపాయి జీతం పన్నెండు రూపాయల ఖర్చు” లాగా ఉండేది. ఈ వస్తువు పై కవిత రాస్తూ

”జాతికి వెన్నెముక ఉపాధ్యాయుడు

మాట్లాడకుండా కాంపోజిషన్‌ వ్రాయి”

అని ముగించటం విశేషం. ఇలా అలనాడు వచన కవిత్వాన్ని ముందుకు తీసుకువెళ్ళే ప్రయత్నం చేశారు. విహారి శాలివాహనలు వినూత్నంగా ”పద చిత్రాలు” కవిత రాశారు. ఇది ఒక ప్రయోగం. ”నారు పోసిన వాడు నీరు పొయ్యకపోడు” అనే సామెతవుంది. దీన్ని ఆధారంగా చేసుకొని రాసిన కవిత ఇలా ప్రారంభమవుతుంది.—

”నువ్వు చెప్పేది నిన్నటి నీతికావచ్చు

సామెత కావచ్చు

కానీ

ఈనాటి నిజం మాత్రం కానేకాదు

తాతలనాడు పోసిన నీ నారుకు

ఇవ్వాళ నీరందటం కష్టం

ఇండియా -దటీజ్‌ భారత్‌లో

నీటిఎద్దటి లేని పట్నమూలేదు. పల్లెలేదు

క్యూలో కాళ్ళను చచ్చుపరచుకున్నా

అందిన నీరు నీ నారుకు అక్కరకురాదు”

మానవుడు చిరంజీవి అంటూ అక్రమాల చీకటిని చించుకొని వెలుగులోకి వస్తాడనీ ఈ కవులు ఆశించారు.

కాశ్మీర్‌లో గవర్నర్‌ పాలన అనివార్యం?

andhraprabha –   Fri, 9 Jan 2015, IST

కాశ్మీర్‌కి ప్రత్యేక ప్రతిపత్తిని కల్పించే రాజ్యాంగంలోని 370వ అధికరణాన్ని రద్దు చేయాలన్న డిమాండ్‌ని ప్రస్తుత పరిస్థితుల్లో ప్రస్తావించకుండా బిజెపి జాగ్రత్తపడినా, దానిపైనా,రాష్ట్రంలో అమలులో ఉన్న సైనికులకు ప్రత్యేకాధికారాలు కల్పించే చట్టం ఉపసంహరణపైనా బిజెపి మెత్తబడింది. అయితే ఢిల్లిd ఎన్నికల ప్రచారంలో ఇది బెడిసికొట్టవచ్చు

కనుక పీడీపీతో పొత్తు వాయిదావేయడమే బిజెపి ప్రస్తుత వ్యూహం అయివుండవచ్చు.

కాశ్మీర్‌లో సొంతంగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే సంఖ్యాబలం ఏ పార్టీకీ లేకపోవడం,సంకీర్ణ ప్రభుత్వాన్ని ఏర్పాటు యత్నాలు ఈసారి సంక్లిష్టంగా మారడంతో గవర్నర్‌ పాలనకు రాష్ట్ర గవర్నర్‌ ఎన్‌ఎన్‌ వొహ్రా కేంద్రానికి సిఫార్సు చేశారు. రాష్ట్రానికి సంకీర్ణ ప్రభుత్వం కొత్త కాకపోయినా, ఈసారి ఉత్పన్నమైన సంక్లిష్ట పరిస్థితి ఇంతకుముందు ఎన్నడూ కనీవినీ ఎరుగునిది. ప్రభుత్వం ఏర్పాటుకు గత నెల 24వ తేదీ నుంచి జరుగుతున్న కసరత్తు ఒక కొలిక్కి రాకపోవడం,ఆపద్ధర్మ ముఖ్యమంత్రిగా కొనసాగేందుకు ఒమర్‌ అబ్దుల్లా విముఖత వ్యక్తం చేయడంతో తప్పని పరిస్థితుల్లో గవర్నర్‌ సిఫార్సు చేశారు. రాజ్యాంగంలో నిర్దేశించిన గడువు ప్రకారం పార్టీలకు గడువు ఇవ్వడం తప్ప గవర్నర్‌ చేయగలిగిందేమీ లేదు. కేంద్రంలో అధికారంలో ఉన్న బిజెపి కూడా కాశ్మీర్‌ విషయంలో ఏమాత్రం తొందరపాటును ప్రదర్శించకుండా ఆచితూచి వ్యవహరిస్తోంది.పార్టీ ఫిరాయింపులను ప్రోత్సహించడం,ఇండిపెండెంట్లకు ఎరవేయడం వంటి చర్యలకు పాల్పడకుండా తమతో జత కట్టేందుకు ముందుకు వచ్చిన పీపుల్స్‌ డెమోక్రటిక్‌ పార్టీ(పీడీపీ)తోనే సంప్రదింపులు సుదీర్ఘంగా జరిపింది.ఈ సంప్రదింపుల్లో పీడీపీ కోరిన వరాల్లో చాలా మటుకు అంగీకరించినా ప్రభుత్వం ఏర్పాటుకు వీలు కాలేదంటే,పైకి చెప్పని కారణాలు ఇంకా ఏమైనా ఉన్నాయేమోనన్న అనుమానం కలగడం సహజమే.

ముఖ్యంగా,కాశ్మీర్‌కి ప్రత్యేక ప్రతిపత్తిని కల్పించే రాజ్యాంగంలోని 370వ అధికరణాన్ని రద్దు చేయాలన్న డిమాండ్‌ని ప్రస్తుత పరిస్థితుల్లో ప్రస్తావించకుండా బిజెపి జాగ్రత్తపడినా,దానిపైనా, రాష్ట్రంలో అమలులో ఉన్న సైనికులకు ప్రత్యేకాధికారాలు కల్పించే చట్టం ఉపసంహరణపైనా బిజెపి మెత్తబడింది. అయితే ఢిల్లిd ఎన్నికల ప్రచారంలో ఇది బెడిసికొట్టవచ్చు కనుక పీడీపీతో పొత్తు వాయిదావేయడమే బిజెపి ప్రస్తుత వ్యూహం అయివుండవచ్చు.

పీడీపీతో కలిసి సంకీర్ణ ప్రభుత్వం ఏర్పాటు విషయంలో బిజెపి వివాదాస్పద విషయాలను పక్కన పెట్టాలని నిర్ణయించినా ప్రయత్నాలు ఫలించలేదు. బీజేపీకీ,పీడీపీకి వచ్చిన సీట్ల తేడా మూడు మాత్రమే.బీజేపీకి 25 సీట్లు,పీడీపీకి 28 సీట్లు వచ్చాయి. అయినప్పటికీ,పీడీపీ సీనియర్‌నాయకుడు ముఫ్తీ మహ్మద్‌ సయీద్‌కి ముఖ్యమంత్రి పదవిని ఇచ్చేందుకు,కీలకమైన మంత్రి పదవులను ఆ పార్టీకి ఇచ్చేందుకు బిజెపి సిద్ధపడింది.కాశ్మీర్‌ లోయలో పీడీపీకి ఎక్కువ సీట్లు రావడం వెనుక వేర్పాటువాద సంఘాల సమాఖ్య అయిన హురియత్‌ కాన్ఫరెన్స్‌ మద్దతు ఆ పార్టీకి ఉందన్న విషయం బహిరంగ రహస్యమే.కనుక,పీడీపీ స్వతంత్రంగా నిర్ణయం తీసుకోలేదనీ,పైగా ఎప్పటికప్పుడు కొత్త షరతులు పెడుతుందని ఊహించడం కష్టమేమీ కాదు.గతంలో ఆ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు కరడుకట్టిన ఉగ్రవాదులను జైళ్ళ నుంచి విడుదల చేసింది.ముఫ్తీ మహ్మద్‌ సయీద్‌ ఉభయ కాశ్మీర్‌లకు ఉమ్మడి కరెన్సీ ఉండాలని డిమాండ్‌ చేసేవారు. ఆక్రమిత కాశ్మీర్‌కు బస్సు సర్వీసును ప్రవేశపెట్టడంలో ఆయన ఒత్తిడి ఉందన్న వార్తలు అప్పట్లోవచ్చాయి.సరిహద్దురాష్ట్రం కనుక కాశ్మీర్‌లో ప్రభుత్వం ఏర్పాటుకు పట్టువిడుపుల వైఖరిని ప్రదర్శించాలని అప్పటి యూపీఏ ప్రభుత్వం నిర్ణయించింది.అప్పట్లో పీడీపీ కన్నా కాంగ్రెస్‌కి ఎక్కువ సీట్లు వచ్చినా,ముఖ్యమంత్రి పదవిని వంతులవారీగా పంచుకునేందుకు అంగీకరించడమే కాకుండా,మొదటి అవకాశం ముఫ్తీకే ఇచ్చింది.ఇప్పుడు కూడా పీడీపీతో బిజెపి చర్చల్లో ఇలాంటి సర్దుబాట్ల ప్రతిపాదనలు వచ్చినట్టు,వాటిలో చాలా మటుకు బిజెపీ అంగీకరించినట్టు వార్తలు వచ్చాయి.పీడీపీ తరఫున ఆ పార్టీ అధ్యక్షురాలు మెహబూబా ముఫ్తీ,బిజెపి తరఫున ఆ పార్టీ రాష్ట్ర ఎన్నికల ఇన్‌చార్జి రాం మాధవ్‌లు అనేక దఫాలు చర్చలు జరిపారు.గవర్నర్‌ని తమ మద్దతుదారులైన ఎమ్మెల్యేలతో సహా కలుసుకున్నారు.వారు కోరిన గడువును గవర్నర్‌ ఇచ్చారు.ఆ గడువు లోగా ప్రభుత్వాన్ని వారు ఏర్పాటుచేయలేకపోయారు.మరో వంక ఆపద్ధర్మ ముఖ్యమంత్రి ఒమర్‌ వైదొలగేందుకు ఒత్తిడి తెచ్చారు.సరిహద్దుల్లో ఆవలి వైపు నుంచి పాక్‌ సైనికులు ఈనెల ఒకటవ తేదీ నుంచి నిరవధికంగా కాల్పులు జరుపుతున్న నేపధ్యంలో రాష్ట్రంలో పటిష్టమైన, శాశ్వతమైన ప్రభుత్వం అధికారంలో ఉండాల్సిన అవసరంఎంతైనా ఉంది,ఈ విషయాన్ని కూడా ఒమర్‌ అబ్దుల్లా గవర్నర్‌తో తాను జరిపిన చర్చల్లో ప్రధానంగా ప్రస్తావించినట్టు చెప్పారు.

అంతేకాక, ప్రస్తుత అసెంబ్లిd కాలపరిమితి ఈనెల 19వ తేదీతో ముగియనున్నందున ఆలోగా కొత్త ప్రభుత్వం ఏర్పడాల్సి ఉంది. పీడీపీ,బీజేపీల మధ్య ఈలోగా పొత్తు కుదిరే అవకాశాలు కనిపించకపోవడం వల్ల గవర్నర్‌ పాలనకు వొహ్రా సిఫార్సు చేసి ఉండవచ్చు.రెండు పార్టీలు మద్దతు ఇచ్చేందుకు ముందుకు వచ్చినప్పటికీ సంకీర్ణ ప్రభుత్వాన్ని ఎందుకు ఏర్పాటు చేయలేకపోయారో ప్రజలకు తెలియజేయాల్సిన బాధ్యత ప్రభుత్వం ఏర్పాటుకు చొరవ చూపిన పార్టీపై ఉందంటూ పీడీపీని పరోక్షంగా ఒమర్‌ ఎత్తిపొడిచారు.పీడీపీతో వ్యవహారం తొందరగా తేలదని కూడా ఆయన పరోక్షంగా ఎద్దేవా చేశారు.

పీడీపీ,నేషనల్‌ కాన్ఫరెన్స్‌ల మధ్య రాజకీయ వైరం సంగతి అలా ఉంచితే,రాష్ట్రంలో సుస్థిరమైన ప్రభుత్వం ఏర్పడాల్సిన అవసరం ఉన్న మాట నిజమే.పాక్‌ కవ్వింపు కాల్పుల వ్యవహారం అటుంచి,రాష్ట్రంలో వరద బాధిత ప్రాంతాల్లో సహాయ కార్యక్రమాల కొనసాగింపు కోసం పటిష్టమైన ప్రభుత్వం ఏర్పడాలి.ఎన్నికల ప్రచారం సందర్భంగా ఈ పార్టీలు ఇదే అంశాన్ని ప్రస్తావిస్తూ ప్రజలకు పదేపదే విజ్ఞప్తి చేశాయి.వరద ప్రాంతాల్లో సహాయ కార్యక్రమాలు గవర్నర్‌ పాలనలో అమలు జరపగడమూ వాంఛనీయం కాదు.ప్రజాప్రభుత్వం ఆధ్వర్యంలోనే అవి అమలు జరిగినప్పుడే, బాధితుల గోడు పట్టించుకున్నట్టు అవుతుంది.ఈ నేపధ్యం నుంచిచూస్తే,గవర్నర్‌ సిఫార్సు చేసింది రాష్ట్రపతికే అయినప్పటికీ,కేంద్రాన్ని సంప్రదించకుండా ఆయన నిర్ణయం తీసుకోరు కనుక,కేంద్రం ఎటువంటి వైఖరి తీసుకుంటుందోనన్న ఉత్కంఠ కొనసాగుతోంది.ఈ విషయమై కేంద్రం రేపోమాపో నిర్ణయం తీసుకోవచ్చు.

Unknown's avatar

About gdurgaprasad

Rtd Head Master 2-405 Sivalayam Street Vuyyuru Krishna District Andhra Pradesh 521165 INDIA Wiki : https://te.wikipedia.org/wiki/%E0%B0%97%E0%B0%AC%E0%B1%8D%E0%B0%AC%E0%B0%BF%E0%B0%9F_%E0%B0%A6%E0%B1%81%E0%B0%B0%E0%B1%8D%E0%B0%97%E0%B0%BE%E0%B0%AA%E0%B1%8D%E0%B0%B0%E0%B0%B8%E0%B0%BE%E0%B0%A6%E0%B1%8D
This entry was posted in వార్తా పత్రికలో and tagged . Bookmark the permalink.

Leave a comment

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.