తెలుగు కావ్యాలలో చితక్రళ
కళా జీవితమన్నది వాస్తవిక జీవితానికి పూర్తి దూరమైనది కాదు. దగ్గరగా ఉంటుంది. ప్రపంచంలో నేర్పు, ప్రతి కూర్పు కళగా చూస్తే సమస్తం సృజనాత్మకంగానే ఉంటుంది.
కళారూప సృష్టిలో బాహ్యరూపాలు వేరైన, కళాధర్మాలు మాత్రం ఒక్కటే. ఒకరు రాయిని శిల్పంగా మలుస్తారు. మరొకరు చిత్రాన్ని సృజిస్తారు. మరొకరు నాట్యం చేస్తారు. మరొకరు గానం చేస్తారు. కవి అయినపుడు భాష తన స్వాధీనంలో ఉంటుంది కాబట్టి కావ్యరూపంలో మన ముందుంచుతారు. అందుకే ప్లూటార్క్ అంటాడు ‘పెయింటింగ్ ఈజ్ మ్యూట్ పోయిట్రీ, పోయిట్రీ ఈజ్ స్పీకింగ్ పిక్చర్’.
ఒక దృశ్యాన్ని చూసి తదనుభూతిని పొందగలిగిన వారందరూ ఆ అనుభూతిని మరొకరి చేత భావింప చేసి, వారుపొందిన స్థితిని మరొకరు పొందేటట్లు చేయడమన్నది కత్తిమీద సాములాంటిది. ఇది కవులకు, కళాకారులకే సాధ్యమనవచ్చు. కవి అనుభవ భావాన్ని భాషలో చదివి మనం ఆనందించగలుగుతున్నాం. అందుకే ఇది కవిత్వ కళ. కవులు గీస్తున్న చిత్రాలు కావ్యాలు.
ప్రతిభావంతుడైన కవి సృష్టిలో ఏ వస్తువునైనా స్వీకరించి సుందర కవితా స్వరూపాన్ని సాక్షాత్కరింప చేయగలడు. మరి అలాంటి కవికి సుందరమైన ప్రకృతి, ఎదురుగా ఉంటే మరింత సుందర కావ్యాలను సృష్టించగలరు.
హృదయాన్ని తట్టిలేపినంత మాత్రాన అది ఉత్తమ కావ్యం కాదు. ఉత్తమ సంస్కృతిని కూడా పాఠకునికి ఇచ్చినపుడు అది ఉత్తమ కావ్యం కాగలదు. మేథ్యూ ఆర్నాల్డ్ ఈ విషయమై ప్రస్తావిస్తూ మానవునిలో కల పశుత్వ లక్షణాలు పోగొట్టి ఉత్తమునిగా చేయగలిగినదే ఉత్తమ సంస్కృతి అంటాడు.
భోజుడు చిత్రకారుని లక్షణాన్ని పేర్కొంటాడు.
నవేత్తి శాస్త్ర విత్కర్మ / న శాస్త్ర మపి కర్మవిత్/ యోవేత్తి ద్వయ మప్యేతత్/సహి చిత్ర కరోవర:’- శాస్త్రం తెలిసిన వారికి కర్మజ్ఞానం అరుదు. కర్మజ్ఞానం కలవానికి శాస్త్ర జ్ఞానం అరుదు. కర్మ, శాస్త్రం రెండింటిలోనూ సమాన ప్రజ్ఞకలవాడే ఉత్తమ చిత్రకారుడు అంటాడు.
కావ్యానికి ఆరు లక్షణాలు చెప్పబడ్డాయి. అవి వస్తువు, వాస్తవికత, ప్రకృతి నేపథ్యం, కళాత్మకత, తాత్త్వికత, లక్ష్యం వీటితో కవి ప్రతిభ చేత సృజన దృష్టి, మానవీయ భావనతో కావ్యం సంపూర్ణత పొందుతుంది.
భీష్మ పర్వం ప్రధమాశ్వాసం లోని పద్యంలో అర్జునుడు కురుక్షేత్రలో శ్రీకృష్ణుని విశ్వరూపం సందర్శించి ప్రకృతి యొక్క వివిధ తత్వాలు శ్రీకృష్ణునిలో చూసిన విషయాన్ని కవి వర్ణించిన విధము
”అంబు పవమాన సూర్యచంద్రాన లాది
వివిధ తత్త్వంబులును నవీ విశ్వలోక
సంప్రవర్తన కరుడవు శాశ్వతుండ
వచ్యుతుండవు పుండరీకాక్షనీవు”
సముద్రం అన్నది అత్యంత పురాతనమైనది. సృష్టిలోనూ సముద్రం మొదటిది. గ్రీకుల తాత్వికులు నీట తేలుతున్న గ్రహంగా భూమిని పేర్కొన్నారు. తెలుగులోనూ సముద్ర వర్ణన మొదటగా చెప్పబడుతుంది. ఆదికవి నన్నయ చెప్పిన ప్రకృతి వర్ణనలో, కడి వర్ణన మొదటిది.
కద్రూ వినతలు సాయంకాల విహారం చేస్తూ, సముద్ర ప్రాంతానికి వచ్చి, వారు దర్శించిన సముద్ర దృశ్యాన్ని మహాభారతం లోని ఆదిపర్వం, ద్వితీయాశ్వాసం లోని 27,28,29,30 పద్యాలలో చిత్రకారుని వలే చిత్రిస్తాడు నన్నయ.
ఆకాశం వైపు ఉవ్వెత్తుగా లేచే కడలి తరంగాలలోనూ, ఆ అలల తాకిడికి చలిస్తున్న తీరం, ఆపరిసరాల్లోని వనాలు, మనోహర దృశ్యాన్ని తన భాషా చమత్కృతితో చిత్రిస్తాడు. ఈ వర్ణనలలో నన్నయ మూడు విధాలు అనుసరించాడు. చిత్రకారుడు రేఖలతో రంగులతో చిత్రాన్ని చిత్రించినట్లుగా, పదాలతో దృశ్యచిత్రణ చేస్తాడు. ఇది మొదటి అంశం. ఇక రెండవ అంశంగా చెప్పబడేది ఇతర వస్తువులతో పోలిక చెప్పడం ఇందులో సాధారణ ఉపమాన శబ్దాలలోనే కాక, పోలిక లేని వస్తువులలో, సముద్రాన్ని వర్ణిస్తాడు. సముద్రం నాటక రంగం వలె ఘన రసపాత్ర శోభితమంటాడు. మూడవ అంశంగా సమయ కాలాల ద్వారా వర్ణించి చెప్పడం. సముద్రం రత్నగర్భ అని, అందులో బడబాగ్ని ఉన్నది అనడం. ఇలా నన్నయ కవి అయినా చిత్రకారునిలో పరకాయ ప్రవేశం చేసి దృశ్యాన్ని చిత్రించగలిగాడు.
నదిని స్త్రీతో పోలిక చెప్పారు. ”రసరేఖలు’ లోని ప్రకృతి చిత్రాలు అన్నవ్యాసంలో సంజీవదేవ్ గారంటారు భారతీయ చిత్రకళలో కేవలం దృశ్యచిత్రాలు కొన్ని దొరికి నప్పటికీ, కేవల దశ్య చిత్రణ వ్యాప్తి చెందలేదు. పర్వతాలను కలిపి మూర్తి కల్పన చేసిన మానవ వ్యక్తిగాను, అదే విధంగా ప్రవాహ రూపంలో నదిని స్త్రీ రూపంలో చిత్రించడం; అయినా భావ రూపాత్మకమైన భారతకళ యొక్క ఔన్నత్యానికి భంగం ఏమి వాటిల్లలేదు అంటారు.
దృశ్య చిత్రాన్ని కంకంటి పాపరాజు ”ఉత్తర రామాయణ’ కావ్యంలో గంగానది వర్ణనలు చేస్తూ
”చెంగటం గనెన్ లతాంగి శీతలా నిలాహతో
త్తుంగ భంగ తీరసంగ తుంగ నాగరంగ నా
రంగ రంగ దంబు జాంగ రంగ నృత్త చంగ సా
రంగ రంగ నంత రంగ మంత బొంగగాన్”
సీతాదేవి వాల్మీకి ఆశ్రమానికి వెళుతూ దారిలో గంగానదిని దర్శించిన దృశ్యాన్ని పాపరాజు వర్ణనలో గంగానది నీటివలె అలలతో లయలతో కదులుతూ నదీ ప్రవాహాన్నీ స్ఫురిస్తుంది.
గోదావరిని అడవి బాపిరాజు ఉగ్రకాళిగా చిత్రించారు. ఉప్పొంగి పోయింది గోదావరీతాను/ తెప్పన్న ఎగసింది గోదావరీ/ కొండల్లు ఉరకింది కోనల్లు నిండింది/ ఆకాశ గంగతో హస్తాలు కలిపింది” స్వాభావిక వర్ణనతో దృశ్యాన్ని చిత్రించారు బాపిరాజు.
పర్వతాలను కవులు మనోహరంగా వర్ణించారు. శ్రీశ్రీ ”మహాప్రపంచం” కవితలో సమాజ మార్పును, మానవ హృదయ సంక్షోభాన్ని చిత్రిస్తూ ”సింహాచలం కదిలింది/హిమాచలం కరిగింది/వింధ్యానగరం పగిలింది/ సింహాచలం హిమాచలం/వింధ్యాచలం సంధ్యాచలం/మహానగాలెగరుతున్నాయి/” ఇలా ఉంటుంది శ్రీశ్రీ దృశ్య చిత్రణ.
సూర్యోదయాన్ని వర్ణించిన మొదటి కవి నన్నెచోడుడు అంటారు టి.వి. నారాయణరెడ్డి, కుమార సంభవం, అష్టమాశ్వాసంలోని 184వ పద్యంలో సూర్యోదయానికి ముందు కోడి కూత వినిపిస్తుంది. దీన్ని దృశ్యమానం చేశారు.
తొలుకొని కుక్కుట రవములు
చెలగుడు దదనంతరంబ చెఱువుల నదులం
గొలకుల వనముల సత్యవి
రలమై బహు విహగని వహ రవములు సెలగెన్
ప్రకృతిని విపులీకరించి వర్ణించిన మొదటి కవి నన్నెచోడుడు.
ప్రాచీన కవులు చంద్రుని ఆకాశాన సముద్రంలో తేలిపోవు ఓడగాచిత్రించారు. దువ్వూరి రామిరెడ్డి వెన్నెలను జాజి తీవగా చిత్రించారు. తన ”ప్రణయాహ్వానము” నందు-
చదుల పందిట వెన్నెల జాజితీవ
చుక్కలను పూలు పూచి యో సుందరాంగి
ప్రణయ మోహన మైన యీ ప్రకృతి నెల్ల
సురభిళోచ్ఛ్వాస వీచుల సొగయ సూచు
అనాది నుండి అన్ని దేశాలలోనూ చిత్రకారుని ప్రతిభకు గీటురాయి స్త్రీ చిత్రం. కవుల భావనకు, చిత్రకారుల ఊహలకు అందని అపురూపం స్త్రీ. ప్రకృతిలోని అనేకానేక వస్తువులను సేకరించి బ్రహ్మదేవుడు స్త్రీ రూపాన్ని సృష్టించాడంటారు.
అదే విధంగా స్త్రీని శక్తి స్వరూపిణిగాను, సమరాంగణగానూ, చదువుల తల్లిగా, సంపదలిచ్చే సిరుల లక్ష్మిగానూ, వర్ణించి చెప్పారు. పూర్ణచంద్ర మనోరమ, సుందర హాస శోభితగా చిత్రించారు కవులు, చిత్రకారులు.
ఆధునికుల అభిప్రాయం ప్రకారం కళ అన్నది ఏదైనా కావచ్చు. అది పదిమందికి అర్థమవుతూ నలుగురికి మంచికి దోహదపడుతూ మనలో బలమైన భావోద్రేకాన్ని కలిగించే సృజన మాత్రమే కళగా చెప్పబడుతుంది.
ఇలా తెలుగు కావ్యాలలో అనేక మంది కవులు, చిత్రకారులు వలే వర్ణనలను భాషద్వారా పదచిత్రాలు, భావచిత్రాల ద్వారా అందించారు. సాహిత్యాన్ని వర్ణమయం చేశారు.

