|
మకర సంక్రాంతి చాలా పెద్ద పండగ. మన పెద్దలు పండగలను చాలా గొప్పగా ఆచరిస్తారు. ఆ పండగలలో అంతరార్ధం ఉంది. అంతేగాని రకరకాల పిండివంటలు చేసుకుని తినడానికి కాదు. ‘పండుగ’ అనే శబ్దం కాలక్రమంగా పండగ అయింది. ‘పండా ఆత్మ విషయ బుద్ధిః’ అని శ్రీ శంకరులు చెప్పారు. ఆత్మ విషయమైన బుద్ధియే పండా. ‘గ’ అంటే పొందడం. అది దేనివలన పొందబడుతుందో అదే పండగ. ఆత్మ ఙ్ఞానాన్ని పొందడమే మన పండగల ముఖ్య లక్ష్యం.
ఇంకొక దృష్టితో చూస్తే సంక్రాంతి పండగ అనేది ప్రకృతిలో కలిగే మార్పును సూచించేది. సూర్యుడు ధనురాశి నుంచి మకర రాశిలోకి ప్రవేశించే శుభదినం. సంక్రాంతి పర్వదినంనాడే ఉత్తరాయణం ప్రారంభమవుతుంది. ఉత్తరాయణంలో చనిపోయిన వారికి ఉత్తమ జన్మగాని, ఉత్తమ లోకాలుకానీ లభిస్తాయి అని పురాణం. భీష్మాచార్యులు అంపశయ్యపై ఉత్తరాయణం కోసం ఎదురుచూస్తూ ఆ పుణ్యకాలంలోనే బ్రహ్మైక్యమైనట్లు మహాభారతం చెబుతుంది. వేదాల్లో, పురాణాల్లో సూర్యుడిని భగవంతుడిగా ఆరాధించాలని చూపాయి. భారతీయులు ఉదయం, మధ్యాహ్నం, సాయంకాలం ఆర్ఘ్యం వదిలి సూర్యుడిని ఆరాధిస్తారు. సూర్యుడే లేకపోతే ఎవరికీ అన్నం, నీరు లేదు కదా? కాబట్టి సూర్యుడు సకల జీవులకు ప్రాణదాత. అందుకే సూర్యుడని సూర్యనారాయణుడని ఆరాధిస్తున్నాం. ‘భా’ అంటే ప్రకాశం లేక సూర్యుడు. ‘రతం’ అంటే క్రీడ. సూర్యపాసనలో క్రీడించే దేశం కాబట్టి మనది భారతదేశం. ఈ సూర్యోపాసనయే క్రమంగా ఆత్మోపాసనకు ఆత్మక్రీడకు దారితీస్తుంది. దక్షిణాయనం కంటే ఉత్తరాయణం శ్రేష్టం. ఎందుకంటే దేవతలకు దక్షిణాయణం రాత్రి. ఉత్తరాయణం పగలు. సామాన్యంగా శుభకార్యాలను ఉత్తరాయణంలో ప్రారంభిస్తారు. దక్షిణాయణం దేవతలకు రాత్రి కాబట్టి వాళ్లు నిద్రపోతూ ఉంటారు. ఉత్తరాయణంలో మేల్కొని ఉంటారు. కాబట్టి మనం చేసిన శుభ కర్మలు, యఙ్ఞయాగాదులు, వ్రతాలు, వివాహాలు, ఉపనయనాలను దేవతలు చూస్తారు. వారి అనుగ్రహం, ఆశీస్సుల వల్ల మన కార్యాలు సఫలమవుతాయని శాస్త్రాలు చెబుతున్నాయి. కాబట్టి ఉత్తరాయణం శ్రేష్ఠకాలం. దీని ప్రారంభదినం కాబట్టి సంక్రాంతి పర్వదినాన్ని వైభవంగా జరుపుకుంటున్నాం. అంతేకాకుండా గీతలో (8- 25,24) దక్షిణాయన మార్గాన్ని భగవంతుడిలా ఉపదేశించాడు. ధూమోరాత్రిః తథాకృష్ణః షణ్మాసా దక్షిణాయనమ్‌ఃతత్ర చాస్ద్రమసం జ్యోతిర్యోగీపాప్య నివర్తతేః. ధూమం, రాత్రి, కృష్ణపక్షం, ఆరునెలలు గల దక్షిణాయనం – ఈ మార్గంలో వెళ్లిన జీవుడు స్వర్గంలో పుణ్యఫలాన్ని అనుభవించి మరల జన్మ ఎత్తుతాడు. కానీ అగ్నిర్జ్యోతిరహః శుక్లః షణ్యాసా ఉత్తరాయణమ్‌ః తత్రప్రయాతాగచ్ఛన్తి బ్రహ్మ బ్రహ్మవిదోజనాః! అనగా అగ్ని, జ్యోతి, పగలు, శుక్లపక్షం ఆరునెలలు గల ఉత్తరాయణం. ఇలాంటి అర్చిరాదిమార్గంలో బ్రహ్మలోకం చేరుకున్నవాడు బ్రహ్మమును పొందుతాడని భావం. ఈ ఉత్తరాయణ మార్గంలో పయనించినవాడు బ్రహ్మలోకంలో బ్రహ్మతో ఉపదిష్టుడై క్రమముకిని పొందగలడు. కాబట్టి ఈ మార్గమే శ్రేష్ఠం. భీష్ముడు లోకసంగ్రహబుద్ధితో ఉత్తరాయణం శ్రేష్ఠమైన మార్గమని చూపించడానికై ఉత్తరాయణం కోసం ఎదురుచూశాడు. కానీ ఙ్ఞాని ఎప్పుడైనా చనిపోవచ్చు. అతడు దేశకాలాతీతుడు కదా! ఇక్కడ ఉత్తరాయణం చనిపోయిన తర్వాత జీవులు వెళ్లే ఇతర మార్గాలకు ఉపలక్షణంగా ఉంది. జీవులు శరీరం వదిలాక వారు పాపాత్ములైతే అధోమార్గంలో – పాయువు, ఉపస్థలం ద్వారా ప్రాణం వదిలి అథోలోకాలను, నీచ జన్మలను పొందుతున్నారు. పుణ్యకర్మలు చేసినవారు అర్చిరాది మార్గం ద్వారా బ్రహ్మలోకానికి (వైకుంఠానికి, కైలాసానికి) వెళ్లి అక్కడ బ్రహ్మతో ఉపదేశం పొంది క్రమముక్తిని పొందుతారు. ఇక బ్రహ్మైకమార్గంలో అంటే నేతినేతిమార్గంలో (ఇది ఒక మార్గం కాదు, విచార విధానం మాత్రమే) పయనించినవారు ఇక్కడే, ఇప్పుడే స్వరూపంలో ఉండిపోతారు. వీరే జీవన్ముక్తులు. ఉత్తరాయణం అంటే ఉన్నతోన్నతంగా (సాధనమార్గంలో సాగిపోయి) స్వరూపనిష్ఠ పొందటం. ఇదే సంక్రాంతి. క్రాంతి అంటే మార్పు. సం అంటే సమ్యక్ అంటే గొప్ప క్రాంతియే సంక్రాంతి. మన పాపాలు, ఈర్ష్య, అసూయ, అవిద్య, వివిధ వికల్పాలు, జన్మజన్మాంతరాల నుంచి మన హృదయంలో తిష్ఠ వేసినాయి. కర్మ, ఉపాసన, ఆత్మవిచారం అనే సాధనాలను అనుష్టించి వాటిని తరిమి మహాక్రాంతిని కలుగజేసి మన జీవితంలో మహాశాంతిని నెలకొల్పడం మన విధి. ఇదే సంక్రాంతి. పండుగ మొదటిరోజు భోగి. తెల్లవారుఝామున భోగిమంటలు వేస్తారు. ఈర్ష్య, ద్వేషం, వికల్పాలు మొదలైనవాటిని ఙ్ఞానాఙ్ఞిలో దగ్ధం చేయటం ముముక్షువు కర్తవ్యం. ఙ్ఞానాఙ్ఞి సర్వకర్మాణి భస్మసాత్కురుతేర్జున అని కదా గీత. రెండో దినం సంక్రాంతి. ఆనాడు త్రివేణీసంగమంలో స్నానం చేయడం విధి. గీతయే గంగ. ఉపనిషత్తే సరస్వతి. బ్రహ్మసూత్రాలే యమున. ఈ ప్రస్థాతత్రయ బోధవాహినిలో స్నానం చేయటమే త్రివేణిసంగమస్నానం. ఆడపిల్లలు ఆనాడు ఆవు పేడతో గొబ్బెమ్మలు చేసి ముగ్గుల మధ్య అందంగా అమరుస్తారు. గంగిరెద్దుల మేళతాళాలు, గుమ్మడి, నువ్వులు, సజ్జల దానం, పిండివంటలు బెల్లం, నువ్వులు కలిపిన చిమ్మిలిని బంధుమిత్రులకు పంచుతారు. నాల్గోరోజు ముక్కనుమ. ఆరోజు సీ్త్రలు బంకమట్టితో గౌరీదేవి విగ్రహం చేసి పూజించి, ఊరేగించి, నదిలో కలపటం – ఇదంతా మూర్తి పూజ, దానం, గోపూజ, భగవర్తణం, వ్రతం మొదలైన ప్రవృత్తిధర్మాన్ని తెలుపుతుంది. సంక్రాంతినాడు వేలమంది భక్తులు శబరిమలై వెళ్లి పద్దెనిమిది మెట్లెక్కి అయ్యప్పస్వామిని దర్శించుకుని వెనుదిరిగి వచ్చేవేళ వెనక్కితిరిగి చూడకుండా కిందికి దిగివస్తారు. తర్వాత సాయంత్రం ఆకాశంలో కనిపించే జ్యోతిని చూస్తారు. శరీరం ఒకటి, ఙ్ఞానేంద్రియాలు ఐదు. మనసు, బుద్ధి, చిత్తం, అహంకారం, ప్రాణం, దేశం, కాలం – ఈ పదునెనిమిది తత్వాలే సోపానాలు. వీటిని అవస్థలో వినుదిరగకుండా అంటే నేరుగా నిలవటమే పదునెనిమిది మెట్లు దాటి పోవటంలో జ్యోతిని దర్శించుకోవడంలోగల ఆంతర్యం. ఇదే సంక్రాంతిలోని నివృత్తిధర్మ రహస్యం! |


