ఆ అక్షరాలు… రుధిరాశ్రుస్వేద మిశ్రమాలు
- – ఎన్. బద్రి, 9154421505
- 12/01/2015
టంచన్‌గా నెలజీతం జేబులో వేసుకునే ఉద్యోగ కవులే మనకు ఎక్కువగా కనిపిస్తారు. అందులో కొందరు కేవలం సత్తాలేని చలామణీ కవులు. మరికొందరు సామాజిక, ఆర్థిక హోదాలను అనుభవిస్తున్న పాండిత్వ కవులు. ఇంకొందరు కష్టాల నేపథ్యంలోంచి ఎదిగి స్థిరపడి గతాన్ని నెమరువేసుకునే కవులు. మనసా వాచానే కాకుండా కర్మనా నమ్మిన బాటను, నచ్చిన మాటను ధైర్యంగా ప్రతిఫలింపజేసే కవులు మాత్రం తక్కువగానే ఉన్నారు. వారే కాలాతీత కావ్య స్రష్టలుగా మిగిలిపోతారు. అభిమానుల గుండెల్లో ఆత్మీయ స్థాయిని అందుకుంటారు. అందుకే అలిశెట్టి ప్రభాకర్ అంటే ఇంత అలజడి. ఆయన కవిత్వంలో ఓ విద్యార్థి, ఓ శ్రామికుడు. ఓ అబల తమను తాము చూసుకుంటారు. అలిశెట్టిది కేవలం కంటితో చూసిన అవగాహనా కవిత్వం కాదు. అది అనుభవ సారం. కఠోర జీవన మధనంలోంచి చిలికిన ఘర్మజలాల వెల్లువ. ఆ కవిత్వమంతా రక్తాక్షరాలే. అభాగినుల వెచ్చని అశ్రుధారలే. శ్రామికుడి ఆరని చెమట బిందువులే.
కష్టజీవి గురించి రాయడానికి ఆ కష్టాన్ని రుచి చూశాడు. అందుకే ‘నను / తొలిచే / బాధల ఉలియే / నను మలిచే / కవితా శిల్పం’ అన్నాడు. సమిష్టి బాధల / సుదీర్ఘ శ్వాసే / ఒక ఊరేగింపు’ అని అన్నాడు. ఆకలి గురించి రాయాలంటే ఆకలీ తెలియాల్సిందే. ఆకలిగొన్న వానిపట్ల సానుభూతితో రాసే కవిత్వం ఆకలి కవిత్వమే కాదు. ఆకలి తెలిసిన కవి మాత్రమే – ‘అందంగా / తోకాడించే / కుక్కపిల్లలాటిది / కాదు / కుట్టిన / ఎర్రతేలు / మంటలాంటిది ఆకలి’ అనగలడు. మానవ జాతి చరిత్ర యావత్తూ సామాన్యుడి రోదనామయమేనని నమ్మిన కవి అలిశెట్టి. అందుకే ‘చరిత్రకు రక్తపాతమే ఉపోద్ఘాతం / చిరత్రకు చెమట బొట్టే ఆధారం / చరిత్రకు ఆకలి ప్రేరణ’ అని ఏ రాణీ ప్రేమ పురాణం చరిత్రసారం కాదన్న శ్రీశ్రీకి తోడయ్యాడు. పోరుబాటను అమితంగా ప్రేమించిన కవి అలిశెట్టి. తన కవిత్వాన్ని అదే మార్గాన నడిపిన ధీశాలి. ‘అనంతాకాశ క్షేత్రంలో / అక్షరాన్ని / సూర్యబింబంగా నాటగలిగిన వాణ్ణి / ఒక పోరాట కెరటాన్ని / యుద్ధనౌకగా / తీర్చిదిద్దలేనా’నని ధీమా వ్యక్తం చేస్తాడు. తన కలమూ కుంచె పీడితుల పక్షాన నిలవాలని కాంక్షించి – ‘అసలు నువ్వెప్పుడన్నా / నా ఆలోచన ఆయుధాగారం / తెరిసి చూసైనా / లక్షలాది పీడితుల పిడికళ్ళే / నా అక్షరాలని’ మాట నిలబెట్టుకున్నాడు. విద్యాధికుడు కాని ప్రభాకర్ కవిత్వంలోని ఆర్థికశాస్త్రం అబ్బుర పరుస్తుంది. ఇంత లోతైన ఆలోచన ఎలా తట్టిందో ఆయన జీవన సరళికే తెలుసు. ప్రభుత్వాలు గొప్పగా చెప్పుకునే ‘పారిశ్రామికీకరణ’ను ‘కమిలిపోయిన / కార్మికుడి దేహమీద వాలి / యంత్రాల / ఇనుపగోళ్లతో / రక్కెయ్యడమే’నని ఏకి పారేశాడు. ఆర్థిక శాస్త్రంలో శ్రమ విలువ తేల్చడం మామూలుగా ఓ బ్రహ్మపదార్థం. రెండు ముక్కల్లో ప్రభాకర్ ‘అన్నం మెతుకునీ / ఆగర్భ శ్రీమంతున్నీ / వేరు చేస్తే / అసలు / శ్రమ విలువేదో / తేలిపోదూ’ అని విప్పిచెప్పాడు. సామ్రాజ్యవాద లక్షణాలను పాతికేళ్లముందే పసిగట్టిన, చదువు పట్టాలముందు పసిపిల్లవాడు అలిశెట్టి. సులభ శైలిలో పిడుగుల్లాంటి విషయాల్ని పేల్చి చెప్పాడు. ‘ఏ దేశం శిరసు మీద / మోపిన / పాదాలైనా / హోదాలైనా / సామ్రాజ్యవాదాలే’. ఇంకేముంది మనలనేలుతున్న ప్రభుత్వాలు కీలుబొమ్మలని కొత్తగా చెప్పడానికి. అనుమానం ఏమైనా ఉంటే ఇదీ చదవండి – ‘దాహం దాహంగా / డాలర్ నాలుక చాచిన / బహుళ జాతి కుక్కా / దేశం దేశమంతా / వాగ్దానాల ఊళ పెడుతున్న / అరాజకీయాల నక్కా / రెండూ బహు ప్రమాదకరమైనవి…’ అంటూ ప్రపంచంలోని దొంగలంతా ఒక్కటయ్యారని హెచ్చరించాడు. శ్రామిక పక్షపాతి అయిన ప్రభాకర్ కవిత్వం నిండా చెమట వాసన సచాలిస్తుంది. రక్త వర్షం చెమట నదిగా రూపాంతరం చెందడం దర్శిస్తాడు. ‘నల్ల రేగడి నేలమీద నాగళ్ళ లిపిని’ చదువుతాడు. ‘కణకణ మండే కండరాల ఎరుపు నూకను – గొంటాడు. అందుకే ‘పాలరాతి బొమ్మయినా / పార్లమెంటు భవనమైనా / వాడు చుడుతేనే శ్రీకారం / వాడు కడితేనే ఆకారం’ శ్రామికుడిని తలనెత్తుకుంటాడు. బతికిన 39 ఏళ్ళలో 20 ఏళ్లకు పైగా జీవితాన్ని కవిత్వానికే కేటాయించాడు. తన కవితలు వెలుగు విరజిమ్మేందుకు తన ఆస్తిని, ఆరోగ్యాన్ని ధారపోశాడు. చివరి రోజుల్లో, ఆర్థిక ఇబ్బందుల్లో సైతం ‘మున్సిపాలిటీ వాళ్ళెత్తని చెత్తలా / నెత్తిమీద జుత్తు పెరిగిపోతే / నన్ను నేను పోల్చుకుంటానో లేదోనని / అద్దంలో చూసుకొని / అచ్చు అలిశెట్టి ప్రభాకర్‌నే అనిపించి / సంతృప్తిగా నవ్వుకుంటాను’ అని తనపైనే సెటైర్లు వేసుకున్నాడు. కష్టజీవికి ఇరువైపులా నిలబడే వాడే కవి అనుకుంటే ఆ కవి అలిశెట్టి ప్రభాకర్.

