జీవన సంఘర్షణకు ప్రతీకలు.. ‘రంజని కథలు’
- -మానాపురం రాజా చంద్రశేఖర్
- 10/01/2015
బహుమతి కథ-2
వెల: రూ.120/-
చీఫ్ ఎడిటర్: చీకోలు సుందరయ్య
ప్రతులకు: విశాలాంధ్ర బుక్‌హౌస్,
హైదరాబాద్ మరియు అన్ని బ్రాంచీలు
నవోదయ బుక్‌హౌస్, హైదరాబాద్
ప్రజాశక్తి బుక్‌హౌస్, హైదరాబాద్
తెలుగు బుక్‌హౌస్,హైదరాబాద్-27
కథలు వర్తమాన సమాజానికి దర్పణం పడతాయి. వీటిలో వ్యక్తమయ్యే పలు రకాల కోణాలు సహజత్వానికి దగ్గరగా నిలుస్తాయి. అలా ఊపిరి పోసుకున్నవే సంఘర్షణాత్మక జీవితాలకు ప్రతీకగా రూపుకడతాయి. ఇలాంటి ఇతివృత్తాలకు జీవం పోసిన కథల సంకలనమే ‘బహుమతి కథ-2’. ఇందులో 17 కథలుదాకా ఉన్నాయి. వీటిలో ఒక్కొక్కటీ ఒక్కొక్క సందర్భాన్ని విడమర్చి విశే్లషించి చెబుతాయి. ఇవన్నీ 2013 సంవత్సరంలో రంజని బహుమతిని పొందినవే. కథావస్తువు ఎంపిక దగ్గర్నుండి శైలిలో శిల్పంలో సరళత్వంలో ఒకదానితో మరొకటి పోటీపడినట్టు కనిపిస్తాయి. వీటి ప్రత్యేకత కారణంగా విలక్షణంగా వైవిధ్యపూరితంగా రాసిన చెయ్యి తిరిగిన తనం తారసపడుతుంది. ఇందులో రాసికంటే వాసికే అధిక ప్రాధాన్యమివ్వడం రూపుకడుతుంది. ఈ నేపథ్య మూలాలను అక్షరాలతో తడిమి, మనసు కళ్ళతో ఒడిసిపట్టుకోవాలంటే లోతైన దృష్టితో అధ్యయనం చెయ్యాలి.
టీవీ ఛానెల్స్‌లో ప్రసారమవుతున్న పాటల పోటీలలో ఓడిపోయిన సెలబ్రెటీల మానసిక పరిస్థితి ఎలా ఉంటుందో తెలియజెప్పేదే ఈ ‘ఎగిరిపోతే… ఎంత బాగుంటుందీ’ కథ. పిల్లల పట్ల వ్యాపారదృష్టి కలిగిన తల్లిదండ్రులు అవినాశ్ లాంటివాళ్ళను ఎలా బలిపశువులను చేసి ఆడిస్తున్నారో.. ఎంత చిత్రవధకు గురిచేస్తున్నారో వివరిస్తుంది. చాలా ఆర్ద్రపూరితంగా సాగి మనసుని హత్తుకుంటుంది. మనుషులను ఆలోచింపజేస్తుంది. దీని రచయిత రామదుర్గం మధుసూదనరావు. ‘మార్జినోళ్ళు’ కథలో పి.శ్రీనివాస్‌గౌడ్‌ది ఒక ప్రత్యేకమైన నిర్మాణశైలి కనిపిస్తుంది. చిరకాలంగా రైల్వే మార్జినులో పాకలేసుకుని బతుకుతున్న మార్జినోళ్ళకి నాయకుడు లాంటి కోటేశంటే గొప్ప భరోసా. ప్రభుత్వ భూమిని ఖాళీచేసి వెళ్ళాల్సిందిగా నోటీసులు పంపితే, స్వామినాయుడి ప్రైవేటు స్థలంలో తిరిగి అంతా పాకలు వేసుకుంటారు. ఇంతలో గూండాల దాడి జరిగి.. విషయం పత్రికలకీ మీడియాకీ చేరిపోతుంది. ఈ వాస్తవాన్ని ముందే పసిగట్టిన కోటేశు ముందుచూపుకి, వ్యవహార శైలికి నిలువెత్తు దర్పణం ఈ కథ. ఇది తిరుగుబాటుతనంలోని భిన్నత్వంలోని ఏకత్వం ఆవశ్యకతను నొక్కిచెబుతుంది.
ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయుడిగా పదవీ విరమణచేసిన వ్యక్తి- కొడుకూ కోడలు దగ్గరికెళ్లి కాలం వెళ్ళదీసినా.. సొంత వూరు, ఇంటిపై వున్న మమకారం తిరిగి అతణ్ణి వెనక్కి తెస్తుంది. పార్కులో పరిచయమైన కుర్రాడితో స్నేహంలోపడి, వాళ్ళమ్మ చనిపోగానే తనింట్లోకి తెచ్చిపెట్టుకొని.. విద్యాబుద్ధులు నేర్పించి.. చాలామందికి విద్యాదానం చేసిన ఓ వ్యక్తి కథ ‘తోడొకరుండిన’. రంగనాథ రామచంద్రరావు రాసిన ఈ కథ- మనసుని కదిలించి, మనిషిలోని కర్తవ్య బాధ్యతను తట్టి లేపుతుంది. ‘జ్ఞాపకం’ కథలో రాచమళ్ల ఉపేందర్ కథనం చివర్లో మెలికతో మలుపుతిప్పిస్తుంది. క్రైం విభాగంలో ఇనె్వస్ట్‌గేషన్ ఆఫీసర్‌గా పనిచేస్తున్న శివుడుకి బాల్యమిత్రుడు పరమేశం ఫోన్‌చేసి, తన అవసరంకోసం రమ్మనమని ప్రాధేయపడతాడు. సొంత ఊరిలోకి అడుగుపెడుతూనే.. మిత్రుడు కుటుంబాన్ని పరామర్శించి, కష్టనష్టాలు తెలుసుకుంటాడు. అమ్మకంకోసం వచ్చిన ఇంటిలో- గతంలో గొడవపడి వెళ్ళిపోయిన తండ్రి.. ఓ వింత నల్లటాకారంలో వచ్చి, బెదరగొట్టి, బేరాన్ని చెడగొడతాడు. శివుడి ద్వారా జ్ఞానోదయం పొంది, అతనికిచ్చిన సొమ్ముతో వ్యాపారంచేసి, కొడుకు పెళ్ళికి పిలవడానికి రావడంతో కథ ముగుస్తుంది. స్నేహ పరిమళం ఇందులో తొంగిచూస్తుంది.
‘నీకూ నాకూ ఒక వేకప్ కాల్’ కథలో వయసుమళ్ళిన ఓ కేంద్ర ప్రభుత్వ మాజీ ఉద్యోగి ‘మానవతా ప్రవాహ’ అనే స్వచ్ఛంద సేవాదళ సంస్థవాళ్లు స్వాతంత్య్ర దినోత్సవ సందర్భంగా ఏర్పాటుచేసిన స్పెషల్ క్లీనింగ్ డ్రైవ్‌లో పాల్గొంటాడు. ఆ సందర్భంలో ‘సుగంధి ఆస్పత్రి’లో తారసపడిన దృశ్యానికి చలించిపోయి.. ఓ ముగ్గురు మిత్రుల సహకారంతో ఓ రాత్రి కాపువేస్తాడు. తుపాకీతో బెదిరించి అక్కడ జరుగుతున్న దురాగతాన్ని ప్రజోపయోగ వ్యాజ్యంలో ఎదుర్కొంటాడు. కోర్టు కేసుల ఆధారంతో ఆర్థికశాఖ ద్వారా గ్రాంట్లు మంజూరుచేయించి, అనాధ వృద్ధుల తరపున సాధించిన విజయం ఈ కథకు స్ఫూర్తి. దీనిని చూసి వేరేచోట వున్న, కుమారులు అడిగిన ప్రశ్నలకు తగిన రీతిలో జవాబిచ్చి, కథను చాలా అర్థవంతంగా ముగిస్తారు రచయిత పాండ్రంకి సుబ్రమణి. అవసరానుగుణంగా వ్యవహరించే మనుషుల తీరూ.. దూరమైపోతున్న మానవ సంబంధాల విలువలకు అద్దంపట్టే కథ ‘మెమరీ కార్డు’. దీనిని రచయిత్రి అల్లూరి గౌరీలక్ష్మి చాలా హృద్యంగా చిత్రించారు. ‘్ధనమూలమిదం జగత్’ కథలో మూర్తి ఒక రచయిత. అతని రచనలంటే గిట్టని భార్య- ‘ఇంటర్‌నెట్ క్యాష్ ఇన్‌కమ్’ వివరాలతోకూడిన వెబ్ పత్రికను చూపించి అతన్ని ప్రోత్సహిస్తుంది. అలా మొదలైన అనేకరకాల కంపెనీల ప్రకటనలు ఇతరుల ఈ-మెయిల్‌కి పంపిస్తూ.. డాలర్ల చెక్కుల్ని, అందుకుని, భార్య పిల్లల మెప్పును పొందుతాడు. పది లక్షలదాకా సంపాదిస్తాడు. ఒక రచయిత తన ఇష్టాయిష్టాల్ని, రచనలోని సృజనాత్మకతని ఎలా చంపుకొని బలవంతంమీద ధన సంపాదనాపరుడిగా మారిపోతాడో రచయిత కె.బి.కృష్ణ ఈ కథలో విడమర్చి చెబుతాడు.
ఒక చిన్న సినిమా తియ్యగల ఇతివృత్తాన్ని ‘సారా’జ్యం కథలో రచయిత రామదుర్గం మధుసూదనరావు జొప్పించారు. ఊర్లో సారాబట్టీలు తయారుచెయ్యడం మొదలుకొని… దాన్ని తిరిగి ఒళ్లుగుల్ల చేసుకునే సంజన్న లాంటోళ్ళు… ఈరేసప్పలాంటి వ్యాపారికి పోలీసు- వైద్యుల లంచగొండితనాన్ని ఎరగావేసి, లాకప్ డెత్‌లో చనిపోయిన సంజన్న చావుని సారాచావుగా మలచడంతో.. అతని పెళ్ళాం పిల్లలు ఏకాకులుగా మిగిలిపోతారు. దీనితోపాటు గవర్నమెంట్ ఆస్పత్రి అవినీతిని, టీవీ రిపోర్టర్ల సహజప్రవృత్తిని ఎండగడుతూ చక్కని కథగా మలిచారు రచయిత. ఇలాంటిదే- డా.ఎం.సుగుణరావు రాసిన ‘అంతరంగం అట్టడుగున’ కథ ఓ ముగ్గురు వ్యక్తుల కథ. సతీష్ ఓ కార్డియాలజిస్ట్. తన తండ్రి చావుకి కారకుడైన తాడిపర్తి జమీందారు చెంగల్రాయుడుని పథకం ప్రకారం చంపాలనుకుని.. అనుకోని పరిస్థితుల్లో అతను గుండెనొప్పితో మెలికలు తిరిగిపోతుంటే- తానే స్వయంగా ట్రీట్‌మెంట్‌చేసి, టాబ్లెట్లిచ్చి రక్షిస్తాడు. మధ్యలో ఓ సర్దారు కూతురికి హార్ట్‌హోల్ ప్రాబ్లెం. దాని ఆపరేషన్‌కోసం వాళ్ళ ప్రయాణం. చివర్లో తాతకి మంచిని బోధించి వదిలేస్తాడు సతీష్. ఇదీ స్థూలంగా కథ. చాలా సున్నితంగా అర్థవంతంగా సాగిపోతూ మానవతా దృక్పథంతో సందేశాత్మకంగా మిగిలిపోతుంది. సంపాదన మత్తులో పడిపోయి విద్యాధికుడైనప్పటికీ… ఒక్కగానొక్క కూతురు వౌనికను నిర్లక్ష్యం కారణంగా పోగొట్టుకున్న వైనం మంత్రవాది మహేశ్వర్ కథ ‘వౌనాక్షరాలు’లో కనిపిస్తుంది. వౌనికతో అనేక కారణాల సాకుతో గడిపినట్టు గడిపి- ఇతరులు జరిపే పైశాచిక చేష్టలు ఈ కథలో రూపుకడతాయి. చివరికి తనపై జరుగుతున్న ఈ ఆగడాలను తల్లికి చెప్పుకున్నా, పెద్దగా ప్రయోజనం కనిపించలేదు వౌనికకి. అందుకే భాస్కర్రావు అనే పెద్దమనిషి తనను శారీరకంగా మానభంగం చెయ్యడంతో ఆత్మహత్య చేసుకుంటుంది. రవీంద్ర- ప్రమీలల ఏకైక కూతురు వౌనిక. చివరికి ఆమె పేరున పిల్లల సంక్షేమంకోసం సేవలందించే కార్యక్రమానికి శ్రీకారం చుట్టడంతో ఈ కథ ముగుస్తుంది. పిల్లల జీవితాలపై తగిన శ్రద్ధతీసుకోకపోతే దాని పర్యవసాన పరిస్థితులు దీనిలో మన కళ్ళకి కట్టిస్తారు.
ఇలా మంచి శిల్పనిర్మాణాన్ని ప్రదర్శించిన ఈ కథలన్నీ జీవితపు లోతులను అనే్వషిస్తూ వాటికి పరిష్కారమార్గాలను కనుక్కునే ప్రయత్నం చేస్తాయి. ఆధునిక సమాజానికి విలువైన సమాచారాన్ని అందిస్తాయి. వీటిలో చాలా పాత్రలు నిత్యం మన కళ్ళముందు తిరుగాడుతున్నవే. అందుకే వీటిలో ఆ బలమూ, ఆర్ద్రత, ఆవేశమూ శక్తియుక్తులుగా ప్రదర్శితమవుతాయి. ఇవి చిరకాలం నిలబడాల్సిన కథలు. భవిష్యత్తును నిలదీసే కథలు. చాలా మంచి ప్రయత్నంచేసి వడబోసిన కథలు కాబట్టే అందరికీ ఆదర్శప్రాయంగా మిగిలాయి. ఈ కృషి వెనుక రంజని చూపించిన ఆసక్తిని, అభిమానాన్ని, మనస్ఫూర్తిగా అభినందించాల్సిందే!

