నవచైతన్య దీప్తి సంక్రాంతి

నవచైతన్య దీప్తి సంక్రాంతి

  • 11/01/2015
  •  -సుధామ

కేవలం- మతంతో ముడిపడి కాకుండా ప్రకృతితో, పర్యావరణంతో ముడివడి సకల మానవాళీ సమాదరించదగిన అసలు సిసలు పండుగ సంక్రాంతి. సంక్రాంతికి ‘పెద్ద పండుగ’ అని వ్యవహారం. భోగి, సంక్రాంతి, కనుమ అని మూడు రోజులకు విస్తరించిన పర్వం కావడంవల్లనే ఇంత పెద్ద పండుగ మరొకటి లేదు అంటారు. నిత్యం కనబడే కర్మసాక్షి సూర్యుడు. సూర్యుడు అటు ఆధ్యాత్మికంగానూ, ఇటు వైజ్ఞానికంగానూ సకల చరాచర ప్రపంచంలో అస్తిత్వం కలిగి, గ్రహగతులకు, కాలచక్ర పరిభ్రమణకు మూలాధారమై నిత్య నూతన ప్రకృతిగా ఉదయాస్తమయాలతో ఉనికి, మనికి గలవాడు. ఖండఖండాంతరాలలో కూడా రీతులూ, రివాజులూ వేర్వేరయినా జన హృదయాలను దోచుకున్న ఆనందహేల సంక్రాంతి. రవి దక్షిణాయనం నుండి ఉత్తరాయణ పథ ప్రవేశం చేసే శుభ ముహూర్తం మకర సంక్రమణం. నవ జీవన సమ్యక్ క్రాంతి సంకేతంగా ‘సంక్రాంతి’ అంటున్నాం. ప్రాచీన కాలంలోనే ఖగోళ విజ్ఞానాన్ని మన భారతీయం అనితర సాధ్యంగా అందిపుచ్చుకుంది. గ్రహగతులు, గ్రహణాలు ఆయన క్రమం, ఋతువుల విశే్లషణం ప్రకృతిని అవలోఢనం చేసి అభివ్యక్తీకరించింది భారతీయులే. నిజానికి ఏడాదిలోని పనె్నండు నెలల్లోనూ సంక్రమణాలుంటాయి. సూర్యుడు ఏ రాశిలో ఉంటే ఆ సంక్రమణంగా పేర్కొంటాం. కర్కాటక రాశి ప్రవేశ సంక్రమణం దక్షిణాయనం కాగా మకర సంక్రమణం ఉత్తరాయణం. మకర రేఖ నుండి ఉత్తర దిశగా సూర్యుడు పయనించే పుణ్యకాలమే ఉత్తరాయణంగా, మకర సంక్రమణంగా, సంక్రాంతిగా సంభావించడం జరుగుతోంది. ఇదంతా ప్రకృతి పరిణామ మూలమే. తమో గుణ ప్రధానమైన మనిషి మనస్సును ఉజ్జ్వల భావ అంతర్లోకాల వైపు దృష్టిపెట్టమని వైజ్ఞానిక ఆధ్యాత్మిక సందేశం ఇచ్చే అసలు సిసలు ప్రకృతి పండుగ సంక్రాంతి. ఉత్తరాయణ మార్గం జ్యోతిర్మయం అనీ, దక్షిణాయణ మార్గం తమోమయం అనీ భగవద్గీత పేర్కొంటోంది. ఉత్తరాయణా గమనం అంటే సంకల్ప వికల్పాలు లేని అమనస్క యోగ సిద్ధి. అదే ఉత్తమగతి అని యోగశాస్త్ర నిర్వచనం. అమనస్క యోగ సిద్ధి పొందిన ఆత్మ ఉత్తరాపథంలో పయనించి, ‘స్వాదిష్ఠాన’మనే వైతరణి నదిని దాటి, ‘పింగళనాడి’ అనే మార్గంలో ముందుకు సాగి, ‘సోహం’ అనే విమానం ఎక్కి, సూర్య ద్వారంగా చెప్పబడే ‘సుషుమ్న’లో లీనమై, అనంతత్వాన్ని పొందుతుంది. ‘ఉత్తరాయణం’ అనే దానికి ఇంత అర్థం ఉంది. అందుకే ఉత్తరాయణ పుణ్యకాలంలో మరణించాలని, పరమాత్మను చేరగోఱే జీవాత్మ ఆరాటపడుతుందిట! దివి భువి కలిసిన పవిత్ర ప్రాంతం ఉత్తర దిశలోనే ఉందంటారు పెద్దలు. అంపశయ్య మీద వున్న భీష్ముడు ఉత్తరాయణం కోసం నిరీక్షించి ప్రాణాలు వదిలింది అందుకేనట! సంక్రాంతి పెద్ద పండుగే కాక, పెద్దల పండుగ అనీ ఎందుకంటారంటే- ఉత్తరాయణ పుణ్యకాలంలో పితృదేవతల ఆత్మలు సుషుమ్నా వికాసం కలిగి, విశ్వవ్యాప్తమైన ‘ఈథర్’ రూపంలో ఉంటాయని ఆర్య వాక్యం. ఆధ్యాత్మిక, వేదాంతపరమైన అంశాల కోణంలో కాక, వైజ్ఞానిక ఉపపత్తులతో చూడగోరే ఆధునికులైనా- ‘సంక్రాంతి’ వైశిష్ట్యాన్ని అంగీకరిస్తారు. ఉత్తరాయణమనే ఈ కాలంలో ఉత్తర దిక్కోణం నుండి ప్రభవించే సూర్య కిరణాలు ‘ఆల్ట్రా వయొలేట్ రేస్’ అనబడుతున్నాయి. ఈ కిరణాలకు సమస్త రోగనాశక శక్తి ఉంది. ‘ఉద్యాసద్యా మిత్రమః అహోరున్నుత్తరాం దినం హద్రోగం మమసూర్యాహరి మాణాంచ హరయ…’ అని సాగే వేద మంత్రం – ఉత్తర దిక్కోణం నుండి ఉదయిస్తున్న బాలభాస్కరుని కిరణాలు మా యొక్క బాహ్యాభంతర రోగాలను హరించుగాక, అన్న అర్థం వలనే! ఉత్తరాయణంలోనే బహిరాకాశంలో సూర్యుడితోబాటు, ‘అగస్త్యోదయం’ అనే నక్షత్ర సముదాయం వస్తుంది. ఈ నక్షత్ర కాంతిపుంజాలలోని రేడియో ధార్మిక శక్తితో, సూర్యశక్తి కలిసి, మన భూమి మీదున్న జల నిదులను, గాలినీ, నదీనదాలను నూతన జవసత్త్వాలతో నింపుతుంది. గత మాలిన్య రహితమై, నవ్య క్రాంతి పరిఢవిల్లుతుంది. ఈ భౌతిక ప్రక్రియ మన చర్మచక్షువులకు అందేది కాదు. కానీ ఆధునిక వైజ్ఞానిక ఉపకరణాలు ఈ మార్పును గుర్తిస్తున్నాయి. సంక్రాంతి అంటే ఇలా భౌతిక, ఆధ్యాత్మిక, యోగశాస్త్ర యుతమైన నవ్యతా పరిణామం. అందుకే చైత్రశుద్ధ పాడ్యమి కాక, సంక్రాంతియే నిజానికి కొత్త సంవత్సరంగా సంభావించదగిన విశిష్టమైన పండుగ. చలిని తరిమివేసి, రోగకారకాలైన క్రిమికీటకాల నాశనానికై వేసే మంటయే ‘్భగిమంట’. నిజానికి ఆవు పిడకలతో వేసే భోగిమంటయే ఆరోగ్యదాయకం. ఆవు పిడకలతో వేసే భోగిమంటతో వెలువడే పొగ, వేడి, ఆరోగ్య కారకాలని శాస్తజ్ఞ్రులు అంగీకరించిన విషయం. సంక్రాంతి పెద్ద పండుగ. దీని వేడుకలు అపారం. సంక్రమణం పర్వం పితృకార్యానికి శ్రేష్ఠం. కనుమరోజు గ్రామ దేవతలకు నివేదనలు చేస్తారు. పాడి పశువులతోబాటు ధాన్యలక్ష్మి పసిడి చిందులు వేస్తుంది. ఈ మూడు రోజులూ బొమ్మల కొలువులు పెట్టడం ఆచారం. సంక్రాంతి పర్వం ధాన్య లక్ష్మి పూజాపర్వం. ఎడ్ల పందాలు, కోడి పందాలు, ఆవుపేడతో కళ్లాపుజల్లి రంగవల్లులు అలంకరించడాలు, కేవలం సరదాతో కూడినవే కాదు, ఆచారం వెనుక వైజ్ఞానిక సూత్రం, పర్యావరణ పరిరక్షణం ఇమిడి వున్నాయి. ఇది భారతీయ దార్శనికుల విశిష్ఠత. సంక్రాంతి రోజుల శోభ వర్ణనాతీతం. జానపద కళారీతుల నిదర్శనాలుగా రంగవల్లులతో ముంగిల్లు, ధాన్యరాశి దరహాస చంద్రికలు, వైభవోపేత ఆలయాలు, గొబ్బిళ్లు, భోగిమంటలు, కోడి పందాలు, ఎడ్ల పందాలు, కొత్త అల్లుళ్ల సంబరాలు ఆబాలగోపాలం అష్టాదశ వర్ణాల వారూ జరుపుకునే పండుగ సంక్రాంతి. సంక్రాంతి గురించి కథలకూ కొరతేమీ లేదు. అపార దాన గుణ పరాయణుడైన బలి చక్రవర్తి, వామనుడికి మూడడుగులు దానం చేసి, పాతాళవాసి అయ్యాడు. అయితే తన సామ్రాజ్య వైభవాన్ని తిలకించడానికి ఏడాదికి ఒకసారి భూలోక దర్శనానికి ఆ మహావిష్ణువు అనుమతినిచ్చాడు. మహాదాత అయిన తమ చక్రవర్తి రాక సందర్భంగా ఏటేటా భూలోక పౌరులు రంగవల్లులతో, ధన ధాన్య, దాన కార్యాలతో చేసుకునే పండుగే సంక్రాంతి అంటారు. అలాగే మకర సంక్రాంతికి చేసే ‘పితృకల్పం’ మనిషికి పూర్వజన్మ స్మృతులతో ఉత్తమ పథగామిని చేయగలదని హరివంశంలో ప్రస్తావించబడింది. ముందే చెప్పినట్లు – ఈ పండుగ కొన్ని ప్రాంతాలకే పరిమితం అనుకోనక్కర్లేదు. పేర్లు, పద్ధతులు భిన్నమైనా, దేశదేశాల్లో మానవ నాగరికతలో వైవిధ్యభరితమై అలరారుతోంది ఈ ప్రకృతి పర్వం. ‘నామ్ ఫెస్టివల్’ అని ఈజిప్టులో ఈ సంక్రాంతి పండుగ ఉంది. నామ్ అంటే మకర రాశితో సాన్నిహిత్యంగల ఈజిప్టు వారి జల దేవత. ఈ సంక్రమణ సమయంలో నైలునది పొంగి, తమను సజీవులను చేస్తుందని వారి విశ్వాసం. జలదేవతారాధనం చేసిన నదికి ఫల పుష్పాలు సమర్పించి, వారు ఈ పండుగ సంబరాలు చేస్తారు. గ్రీకు దేశంలో మకర రాశి అనగా సగం చేప, సగం మేక ఆకారం వున్న జలదేవత. పైభాగం మేక, క్రింది భాగం చేప రూపున వుండే ఈ దేవత ఒక రాక్షసుని బారి నుండి రక్షించుకోవడానికి ఈ రూపం ధరించిందట. విచిత్ర రూపంగల ఈ జలదేవత ‘మకర రాశి’ అని గ్రీకుల విశ్వాసం. ఈ దేవతను వీరు ‘చౌకన్’ అంటారు. సంక్రమణ దినాన వారు ఈ దేవత ప్రీత్యర్థం ఉత్సవాలు, ఊరేగింపులు చేస్తారు. రోమ్‌లో ‘బేకన్’ పర్వంగా సంక్రాంతి చేస్తారు. సంతానార్థులు, అవివాహితులు మన్మధ పూజాపర్వంగా మన కాముని పున్నమ, వసంతోత్సవం రీతిలో కాలపురుషుడి ఆశీర్వాదంకై ఉత్సవం చేస్తారు. యూరప్‌లో మన భోగిమంట తరహాలో సంక్రాంతిని ‘అగ్ని ఉత్సవం’గా చేస్తారు. పెద్దపెద్ద మంటలు వేసి, అంతా నృత్యగానాలు చేస్తారు. మనం ఎలా పితృకార్య పర్వంగా సంభావిస్తామో, అలాగే స్వీడన్‌లో దీనిని అమర వీరుల సంస్మరణ దినంగా జరుపుతారు. ఖండఖండాంతరాలలోనూ మకర సంక్రమణ పండుగ – మనుష్యులు సర్వతోముఖాభివృద్ధి చెంది ఉత్తమ జీవన విలసితమైన ఉత్తరపథ మార్గులు కావాలనే సంకల్పంతోనే వివిధ రూపాలలో సంక్రాంతి పండుగ చేసుకుంటారు. ‘ఇది మా పండుగ కాదు’ అని మానవాళిలోని ఏ ఒక్కరూ అనుకోనవసరం లేని ప్రకృతి పర్వం సంక్రాంతి అని గ్రహించవలసిన విషయం. చపలచిత్తులైన మనుషుల్లో ధార్మిక ప్రవృత్తిని, దాన ధర్మాది సుగుణ సంపత్తిని, తమ పుట్టుకకు హేతువైన పితృ, మాతృగణం పట్ల కృతజ్ఞతాబద్ధతను పెంపొందింపచేయడానికి, సంక్రాంతి పర్వం సంకల్పించబడి నట్లుంటుంది. అలాగే పరిశ్రమోపజీవులైన మన పూర్వులు, తాము పండించుకున్న పంటలను, పెంపు చేసుకున్న పాడిని, సంతోషంతో పంచభూతాలకర్పించి, తామూ, తమపై ఆధారపడి జీవిస్తున్న వారూ, కలిసి చేసుకునే పర్వంగా రూపుదిద్దుకున్న పర్వం సంక్రాంతి. దక్షిణాయనపు జీవితపు క్లేశకాలం పరిసమాప్తి చెంది, దేవతలకు సైతం ప్రీతిపాత్రమైన ఉత్తరాయణ ఆగమనమైన సంక్రాంతి – నిజంగా సంతోషాల కాలం. పంటలు పండి, గాదుల నిండా ధాన్యం నిండి, ఆరోగ్యం ఐశ్వర్యం తాండవించే కాలం. ఉత్తరాయణంలో మార్గశిర మాసం మరీ శ్రేష్ఠమైనదిగా, మాసాలలో తాను మార్గశిర మాసాన్ని అని గీతాకారుడు చెప్పుకున్నాడు. ప్రకృతిలో విశేషమైన మార్పులు గోచరించే అభ్యుత్థాన కాలం ఇది. తొలకరిలో మొలకెత్తిన సజ్జ, జొన్న, నువ్వు, పెసర, కంది, సెనగ వంటి మెట్టపైర్లు, రాగి, వరి వంటి మాగాణి పంటలు, కార్తీక, మార్గశిర మాసాలకు పండి, భూమి పంట బరువుతో కళకళలాడుతూ, ఎటు చూసినా కాంతులీనుతూంటుంది. చేమంతి, బంతి నిండార పూలతో నేత్రపర్వంగా హేమంత కాంతులీనుతూంటాయి. జీవితం నవ్య భావోన్మీలనంగా ఉంటుంది. బ్రతుకంతా ఎలా వున్నా ‘మూడునాళ్ల ముచ్చట’ అన్న కారణం భోగి, సంక్రాంతి, కనుమల వైభోగ పర్వం వల్లనే. పంట రక్షణకై రాత్రిళ్లు కాపలాకాచి, వేసుకునే చలిమంటల జాగరూకత చిహ్నంగానే భోగిమంట వెలసిందని అనేవారున్నారు. రైతు బ్రతుకు ఆనంద రమణీయమయ్యే కాలం సంక్రాంతి. దేశానికి రైతు వెనె్నముక అయినట్లే. సకల పర్వాల ప్రకృతికి వెనె్నముక పండుగ, సంక్రాంతియే! ధనుర్మాసంలో ‘రంగడే దైవంగా – పొంగలే ప్రసాదం’గా స్వార్థం పరమార్థం రెండంచులుగా భాసిస్తాయి. కనుమ పండుగ పూర్తిగా కర్షక జీవిత సంబంధియే. పశు పూజ ప్రాధాన్యమానాడు. ‘పాల పొంగలి – పశువుల పొంగలి’ అనే నానుడి వచ్చింది అందుకే. పొంగలి ‘బలి’ చక్రవర్తి సంకేతంగా భావించేవారున్నారు. పొంగలిని దేవతలకు నైవేద్యం పెట్టాక, పొలానికి వెళ్లి పొంగలి మెతుకులు చల్లేవారు. ‘దీనినే ‘పొలి చల్లుట’ అనేవారు. అలా చేయడం వలన పంట పొల్లుపోక, గింజ రాలుబడి హెచ్చుతుందని, పంటలు సమృద్ధిగా పండుతాయని విశ్వాసం. ఎర్ర గుమ్మడికాయను దిష్టి తీసి పగలగొట్టేవారు. అది బలిపశువు శిరస్సుకి ప్రత్యామ్నాయం! అలా జీవహింసకూ దూరంగా వున్నారు. పశువుల సంబరంలో భాగమే గంగిరెద్దుల హంగులు డూడూడూడూ బసవన్నా డూడూడూడూ వెంకన్నా అయ్యగారికీ దండం పెట్టూ అమ్మగారికీ దండం పెట్టూ అని గంగిరెద్దుల వారు సన్నాయి మేళాల సవ్వడిలో అడుగగా, గంగిరెద్దులు తల ఆడించడం, వాని మూలాన భావి శుభాలను తెలియచెప్పడం, పశుగణం పట్ల గౌరవ బుద్ధికి తార్కాణాలు మరి! ప్రకృతికి, జానపదులకూ విడదీయలేని సంబంధం. అందుకే ప్రకృతిపర్వమైన సంక్రాంతిరోజుల్లో, ముఖ్యంగా పల్లెసీమల్లో జీరేనుగాళ్లు, గంగిరెద్దుల వాళ్లు, మలిపోని కాసులోళ్లు, బేరటోపిగాళ్లు, జంగమ దేవరలు, బారెమూరెండోళ్లు, శీర్లాశిల్పులు, హరిదాసులు అసంఖ్యాకంగా కనపడేవారు. పండుగ మూడు రోజులూ పనీపాటలకు సెలవిచ్చి, ఆనందించడమే ప్రధానంగా సంబరాలతో గడిపేవారు. సంక్రాంతి రోజు మన్నానికి అంటే పొలానికీ, గోవులకాయనూ పోరట! మన్నానికీ పోను మన్ననీ రోజూ నా వనె్నల వీరన్న బావా సంక్రాంతి పండుగా సరసరా వచ్చేరా సల్లంగా నేనైతే సూడాలోయి సంక్రాంతి వేళల్లో వెనె్నల సెంద్రున్ని సక్కగా ముద్దిడుచు మక్కువతో నుంటాను ఓ నా వనె్నల వీరన్న బావా.. అన్న జానపద గీతం – పల్లె పడుచులు తమతమ భర్తలతో సరస సల్లాపాల్లో మునిగి, సంక్రాంతి రోజుల్లో కాలక్షేపం చేస్తారని చెప్పకనే చెబుతోంది. క్రొత్తగా పండిన రాగులను కోడిపుంజులకు తినిపించి, సంక్రాంతి కనుమ వేళకు కోడిపందేలు ఆడేవారు. నా కోడి భీమన్నరా ఓహో నా కోడి హనుమన్నరా నా కోడి నీ కోడి ఏకమై కలబడితె సాకెండ్ల సిన్నదే సంకలే ఎగరేసి మ్రుక్కుపై వ్రేలిడి సక్కగా సూచురా అన్న గీతం రాయల కాలం నాటి నుంచి ప్రసిద్ధి. రాయల కాలంలో దివిటీల పట్టే చాకలి పిల్లయే సాకెండ్ల సిన్నది. సంక్రాంతి రోజు విరూపాక్ష స్వామి దేవాలయంలో, ప్రాంగణంలోనూ, మండప స్తంభశాలలోనూ, మూడు రోజులపాటు, వేయి వత్తులతో, అఖండ దీపాలను ఆరిపోనీక వెలిగించే వాడుక వుండేదట. అందుకు ఆ సిన్నది మూలకందంగా నిలిచేదట. ఉయ్యాలవాడ నివాసి, ధర్మదాత అయిన బుడ్డా వెంగళరెడ్డి – సంక్రాంతినాడు పండి, అప్పుడే తన ఇంటికి చేరిన ధాన్యరాశిలో – సగానికి పైగా దానంగా పంచిపెట్టేవాడట. బ్రాహ్మణులందరికీ గోదానం చేసేవాడట. ఇప్పటికీ మహాదాతగా వెంగళరెడ్డిని తలచేవారున్నారు. జానపద గీతాలూ వున్నాయి. ఇలా సంక్రాంతి పర్వం ప్రకృతితో, జనపదాలతో భౌతిక, ఆధ్యాత్మిక, వైజ్ఞానిక అంశాలతో పెనవేసుకున్న అసలు సిసలు పెద్ద పండుగ. ఒక విధంగా సంక్రాంతియే నవహర్షారంభం. నవ వత్సరారంభం! కీ.శే.బొమ్మకంటి శ్రీనివాసాచార్యులు గారన్నట్లు- చేరువైన సంక్రాంతి గూర్చిన తలంపు చాలుననె తోచు రమ్య దృశ్యములు వేలు హృదయమున పూలజల్లులై, ఇంద్రచాప శబల వర్ణమ్ములై, నవాశలను పెంచె! ఆశావహ అభ్యుదయ అభ్యుత్థాన మానవాళి సర్వం – సంక్రాంతి. అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు!! * ………. ** …………….** ……………… నీరు చల్లిన ముంగిట్లో -ప న్నీరు చల్లిన వాకిట్లో దారి పొడుగునా ముగ్గుల్లు! ము త్యాలు పోసినా ముగ్గుల్లు నారుపోసిన ముంగిట్లో గ నే్నరు పూచిన వాకిట్లో జారు జడలా కనె్నల్లూ – ఒ య్యారి నడలా కనె్నల్లూ – ఒ య్యారి నడలా జారు జడలా కనె్నలుంచినా గొబ్బిళ్లూ -కృష్ణశాస్ర్తీ ‘వేయి పాదముల్ మకర ప్రవిష్టము లయి తడబడుట లేక చక్కగా నడువు పూష అవ్యయమ్మైన యుత్తరాయణము వెలయ నవ్య మార్తాండకేళీ సనాథమగుచు’ -నాయని సుబ్బారావు చెలి చూపులు చలిమంటలుగా చెలి నవ్వులు తొలి పంటలుగా అరుదెంచెను నవసంక్రాంతి విరబూసెను చిరు చేమంతి ఈ ధాన్యపు రాసుల మాటున ఈ వాగుల వరదల చాటున ఏదో ఒక నవ చైతన్యం ఎదలో చిలికించును హర్షం పులకించిన తొలి సంక్రాంతివి దిగి వచ్చిన తీయని శాంతివి ఈ చలిలో నీ కౌగిలిలో ఇమిడిపోయె లోకాలన్నీ పాత సంప్రదాయపు గోడలు పడద్రోసెద వెలుతురు కోసం తరుణత్వం మెచ్చకపోతే తిరుగబడెద దేవుని మీద నవచేతన కాలంబనగా అవతరించినావే నీవు రవికరముల రాగిల్లెడు నీ నవహృదయం నాదైపోనీ -దాశరథి జీవితంలో కళాభిజ్ఞత చేర్చి కూర్చిన పాటగా కాలం మార్పు సూచించే సూర్యదేవుని కొత్త బాటగా అందంగా హాయిగా ఆనందానికి స్థాయిగా సాగిపోతుంది సంక్రాంతి! -కుందుర్తి ఆంజనేయులు

Unknown's avatar

About gdurgaprasad

Rtd Head Master 2-405 Sivalayam Street Vuyyuru Krishna District Andhra Pradesh 521165 INDIA Wiki : https://te.wikipedia.org/wiki/%E0%B0%97%E0%B0%AC%E0%B1%8D%E0%B0%AC%E0%B0%BF%E0%B0%9F_%E0%B0%A6%E0%B1%81%E0%B0%B0%E0%B1%8D%E0%B0%97%E0%B0%BE%E0%B0%AA%E0%B1%8D%E0%B0%B0%E0%B0%B8%E0%B0%BE%E0%B0%A6%E0%B1%8D
This entry was posted in వార్తా పత్రికలో and tagged . Bookmark the permalink.

Leave a comment

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.