మానవ సంబంధాల మాధుర్యం ఇలా..
- -పాలంకి సత్యనారాయణ
- 10/01/2015
రెల్లు
– బి.పి.కరుణాకర్
వెల: రూ.80/-
పుటలు: 128;
మనోప్రియ
ప్రచురణలు
ప్రతులకు: అన్ని ప్రముఖ
పుస్తక కేంద్రాలలో
జీవితాన్ని తేలికగా, ఆనందంగా, నవ్వుతూ తీసుకునే మనస్తత్వం గల బండారు కరుణాకరప్రసాద్ రచించిన ‘రెల్లు’ కథల పుస్తకం పాఠకుల ముందుకు వచ్చింది. ఈ పుస్తకంలో ఇరవైఒక్క కథలున్నాయి. విశాలాక్షి, ఆంధ్రజ్యోతి, తేజ వారపత్రిక, సాహితీ స్రవంతి, వార్త, ప్రజాశక్తి ఆదివారం అనుబంధం, సాక్షి ఫన్ డే, నవ్య, విపుల, చిత్ర, ఆంధ్రప్రభ తదితర పత్రికలలో ప్రచురింపబడ్డాయి.
ఒక అమ్మాయిని ఇద్దరు అబ్బాయిలు ప్రేమించడం ఇతివృత్తంగా అనేక కథలు వచ్చాయి. తాజా ప్రియుడితో ఉన్నపుడు మాజీ ప్రియుడు ఎదురైతే ఇబ్బందికరమైన పరిస్థితే. వారిద్దరు స్నేహితులన్న సంగతి తెలియని కథానాయికకి ఎదురైన అనుభవం తెలుసుకోడానికి ‘హార్ట్‌గేలరీ’ కథ చదవాలి.
ఆఫీసులో సహోద్యోగి గంగాధర్‌తో ప్రేమలోపడిన తర్వాత, అతను పెళ్లై పిల్లలుకలవాడన్న సంగతి తెలుసుకుని, సంబంధం తెంచుకుంటుంది కథానాయిక. అదే ఆఫీసులో రామానుజాన్ని పెళ్లిచేసుకుని పిల్లవాడికి తల్లి అవుతుంది. దురదృష్టవశాత్తూ కొడుకు చనిపోవడమేకాకుండా రామానుజం చెప్పాపెట్టకుండా ఎటో వెళిపోతాడు. ఈ పరిణామాలకి గంగాధర్ కారణమని భావించిన కథానాయిక శ్రీమతి గంగాధర్‌కి అన్ని విషయాలు చెప్పి పగ తీర్చుకున్నాననుకుంటుంది. చెప్పాల్సిన వ్యక్తి, చెప్పిన వ్యక్తి ఒకరు కాదన్న కొసమెరుపుతో ‘ఎదురునీడ’ కథ ముగుస్తుంది.
బోగస్ రేషన్‌కార్డుల సమస్య ప్రభుత్వాలకు, రాజకీయ పార్టీలకు ఇబ్బందికరమైనదే! ఏరివేత కార్యక్రమం ద్వారా ఓట్లు నష్టపోతామన్న భయం ఏలికలకుండడం సహజం. ఉన్న కుటుంబాలకన్నా ఎక్కువ రేషన్ కార్డులు ఇవ్వాల్సిరావడం ఆడిట్‌లో ప్రభుత్వానికి అక్షింతలు పడడం మనకు తెలిసినదే! రేషన్‌కార్డుల ఏరివేత పర్యవేక్షక అధికారి, లచ్చుమమ్మని కార్డులో రాయించిన పేర్లతో ఎంతమంది లేరో చెప్పమంటారు. లచ్చుమమ్మ ఇచ్చినది తప్పుడు సమాచారం అన్న సంగతి అధికారికి ఎలా తెలిసింది? అన్న విషయం ‘ఏరివేత’ కథ ఇతివృత్తం. ఆఖరివాక్యం ఉత్కంఠ భరితంగా ఉంది.
రత్తయ్య, భార్య పోయిన తర్వాత కొడుకు, కోడలు ఇంట్లో ఉండడానికి ప్రయత్నించి, ఉండలేక ఒంటరి జీవితానికే అలవాటుపడతాడు. రిక్షా తొక్కి జీవితం కొనసాగిస్తూంటాడు. ఆ ఊళ్లో రామిరెడ్డి తోటకి, రాత్రి ఎనిమిది దాటితే విటుల తాకిడి ఎక్కువ వుంటుంది. రత్తయ్య ఆ తోటలో ‘సావిత్రి’ని వెతుక్కుంటూ ఉంటాడు. అక్కడ ఉన్న వారెవరూ సరైన చిరునామా చెప్పరు. ఇక ప్రయత్నం విరమించి వెళిపోదామనుకుంటున్నపుడు, రిక్షా చెయిను ఊడిపోతుంది. చెయిను సరిచేసి ఎదురుకుండా ఉన్న పాకవైపు చూసేసరికి ‘సావిత్రి’ కనబడుతుంది. సావిత్రి, రత్తయ్యతో అన్న మాట ఎందుకు దుఃఖం కలిగించిందో ‘కన్నీటి నురుగు’ కథలో తెలుస్తుంది.
ఆకలిని తట్టుకోడం సులభసాధ్యం కాదు. ప్రేమించినవారి ఆకలిని తీర్చడంకోసం తన ఆకలిని మరిచిపోయే వ్యక్తిచుట్టూ తిరిగిన కథ ‘దోసెడు ఆకలి’ కథానాయకుడి కారు ట్రాఫిక్ పద్మవ్యూహంలో చిక్కుకుని ఉంటుంది. భాగ్యనగరంలో రోడ్డు దాటడానికి ఆగిన కార్ల మధ్యనుంచే వెళ్లాలి. కథానాయకుడు- ఓ పాదచారి రోడ్డు దాటే ప్రయత్నాన్ని గమనిస్తూంటాడు. తన కారుని ముందుకెళ్లనివ్వకుండా దాటే ప్రయత్నం చేసిన పాదచారిని ఢీకొడతాడు. దెబ్బతగిలినా పట్టించుకోకుండా- ‘అయ్యా ఈ కవర్లో ఉన్న అన్నం మా ఇంట్లో ఇవ్వండి నేను కారు కింద పడ్డట్టు చెప్పద్దు’ అన్న పాదచారి అభ్యర్థన చదువరుల హృదయాలను ద్రవింపచేస్తుంది. భార్యాభర్తల మధ్య రహస్యాలు ఉండకూడదనుకున్న పద్మారావు, సుధ తమ పెళ్లికి ముందు ప్రేమించినవారి గురించి వివరాలు చెప్పుకుంటారు. పద్మారావులో అనుమాన బీజం పడి మహావృక్షమవుతుంది. మాజీ ప్రియుడింటికి వెళ్ళిందన్న సంగతి తెలుసుకున్న పద్మారావు, సుధ శీలాన్ని శంకిస్తాడు. వెళ్లిన కారణం తెలిసిన తర్వాత పద్మారావు ‘ఎంత నీచంగా ఆలోచించాను’ అనుకోడానికి దారితీసిన పరిస్థితి ఇతివృత్తంగా రాయబడిన కథ ‘కలికి కడలి.’ మిగతా కథలుకూడా నిజజీవితంలో జరిగినట్టుగా అనిపిస్తాయి. మారిపోతున్న మానవ సంబంధాలని నిశితంగా గమనించిన రచయిత, ఏకపక్షంగాకాక విశాల దృక్పథంతో రాసిన కథలు పాఠకాదరణకు పాత్రమవుతాయనడానికి సందేహించనక్కరలేదు.

