సంక్రాంతి జ్ఞాపకాల్లో -ఆంధ్రజ్యోతి

సంక్రాంతి… ఓ జ్ఞాపకం

జ్ఞాపకాల్లో జీవించేవారికి జరామరణాలు ఉండవు.
దీపావళికి చలి దివ్వెల దగ్గరకు వస్తుంది. సంక్రాంతికి చంకల్లోకి వస్తుంది. శివరాత్రికి శివశివా అని పోతుందనేది అమ్మ. ఆ మాట నిజం. సంక్రాంతి రోజులు కావడంతో చలి బాగా ఉంది. చేతుల్ని గుండెల చుట్టూబిగించుకుని నడుస్తున్నాడతను. స్వెట్టర్‌ వేసుకున్నాడు. మఫ్లర్‌ చుట్టుకున్నాడు. అయినా చలి వణికించేస్తోంది. సిగరెట్‌ తాగితే బాగుణ్ణనిపించింది. రాత్రి పన్నెండు దాటింది, సిగరెట్లు ఇప్పుడెక్కడ దొరుకుతాయి? సినిమా థియెటర్ల దగ్గర దొరుకుతాయి. అటుగా నడిచాడతను. తెల్లారితే బోగి. త్వరగా మంటలు వేస్తే బాగుణ్ణు. వెచ్చగా కాచుకోవచ్చనిపించింది. 
‘‘అత్తారింటికా? అలా పరిగెడుతున్నావు?’’

‘‘అవును గురూ! అదృష్టం బాగుంది, పాసింజర్‌ లేటట! వస్తాను.’’ ఎవరో ఎవరినో అడిగితే, ఆ ఎవరో ఎవరికో సమాధానం చెప్పి, పరుగుదీస్తున్నాడు. పరిగెడుతున్న ఆ వ్యక్తిని చూసి, అతనికీ పరిగెత్తాలనిపించింది. పరుగుదీశాడు. కొద్దిదూరం పరిగెత్తాడో లేదో అలసిపోయాడు. ఆగిపోయాడు. గబగబా శ్వాసించసాగాడు. ఒళ్ళంతా వేడెక్కినట్టనిపించింది. తల మీది మఫ్లర్‌ను తొలగించాడు. తేరుకున్నాడు కాస్సేపటికి. అప్పుడు అనుకున్నాడు.
అనుమానం లేదు! తను ముసలివాడే! 
గత నెల డిసెంబర్‌ పద్నాలుగు వరకూ ముసలితనం, ముసలివాడు అన్న మాటల్ని పెద్దగా పట్టించుకోలేదతను. వాటి ఊసేలేదు. డిసెంబర్‌ పద్నాలుగు, ఆఫీసులో పని చేసుకుంటున్నాడు. హెచ్‌.ఆర్‌. దగ్గర నుంచి ఓ లెటర్‌ వచ్చింది. తెరిచి చూశాడు. నేటితో మీకు అరవై ఏళ్ళు నిండుకున్నాయి. మీరు రిటైరయ్యారంటూ…ఏదేదో ఉంది అందులో. దిగ్ర్భాంతి చెందాడు. లెటర్ని మడచి జేబులో పెట్టుకున్నాడు. బాత్‌రూంలోకి పరుగుదీశాడు. అక్కడ అద్దంలో తన ముఖాన్ని ఆత్రంగా చూసుకున్నాడు. ఈ ముఖానికి అప్పుడే అరవై ఏళ్ళా అనుకున్నాడు. ముఖాన్ని ప్రేమగా నిమురుకున్నాడు. చేతికి ఎలాంటి ముడతలూ తగల్లేదుగాని, ఎందుకో బాధనిపించింది. సాయంత్రం ఇంటికి చేరుకున్నాడు. ఆలోచిస్తూ కూర్చున్నాడు.
‘‘ఇవాళ్టికి సరిగ్గా నెలరోజులుంది సంక్రాంతి.’’ వినవచ్చింది. కిటికీ దగ్గరగా నిలబడి ఆడవాళ్ళు మాట్లాడుకుంటున్నారు.
కాలం కరిగిపోతోంది. అప్పుడే తనకి అరవై ఏళ్ళు. మిగిలేది కొద్దికాలమే! ఈ కాలాన్ని సద్వియోగం చేసుకోవాలి. అంటే… జ్ఞాపకాలని ఒడిసి పట్టుకోవాలి. గుర్తుపెట్టుకోవాలి. రేపు అవే తనని రక్షిస్తాయి అనుకున్నాడతను. పరుగుదీశాడు. అయిదువందల కిలోమీటర్ల దూరంలో గల పుట్టి పెరిగిన ఊరికి చేరుకున్నాడు. అక్కడ అమ్మలేదు, నాన్నలేడు, ఎప్పుడో పోయారు. అన్నదమ్ములూ, అక్కచెల్లెళ్ళు కూడా లేరు. చెదరిపోయారంతా. మరి ఎవరికోసం, ఎందుకోసం అంటే గుప్పెడు జ్ఞాపకాలకోసం, పట్టెడు అనుభూతులకోసం పరిగెత్తుకుని వచ్చాడు. చిన్న హోటల్లో దిగాడు. దిగి, ఇదిగో ఇలా రోడ్డున పడ్డాడు.
థియెటర్ల దగ్గరకు చేరుకున్నాడతను. పాన్‌షాప్‌లో సిగరెట్‌ అడిగి తీసుకున్నాడు. ముట్టించేందుకు ప్రయత్నిస్తుంటే…
‘‘బోగిమంట అప్పుడే ఏసీశారేట్రా? ఒంటి గంట కూడా కాలేదు.’’
‘‘చలి బాబాయ్‌! తట్టుకోలేకపోతున్నాం.’’

అంతెత్తున లేస్తూ ఎర్రగా కనిపించింది మంట. పాన్‌షాప్‌కి వెనుకగా వేశారు. అతనటుగా నడిచాడు. కాచుకుని వెచ్చనయ్యాడు. సిగరెట్‌ ముట్టించాడు. గుండెనిండుగా పొగపీల్చి, వదిలాడు. ముక్కులోంచి వచ్చింది పొగ. ఉక్కిరిబిక్కిరి అయ్యాడు. దగ్గు వచ్చింది. గట్టిగా దగ్గాడు. కళ్ళంట నీళ్ళొచ్చాయి. ఆ నీళ్ళలో సుభద్ర అస్పష్టంగా కనిపించింది. గుర్తు వచ్చిందామె.
ఇంటర్‌ ఫస్టియర్‌ చదువుతున్నాడు తను. దొంగతనంగా సిగరెట్లు కాల్చడం అలవాటైంది. అలాగే సుభద్రను చాటుగా ముద్దు అడగడం కూడా అలవాటు చేసుకున్నాడు. సుభద్ర తన క్లాస్‌మేటే! ఇద్దరూ ‘ప్రేమించుకుంటున్నాం’ అనుకుంటున్న రోజులవి. ప్రేమంటే ముద్దులూ, కౌగిలింతలనుకున్నారు. బోగిరోజు ముద్దు కావాలన్నాడతను. లంగా ఓణీకొత్తబట్టల్లో కావాలన్నాడు. ముందు ఒప్పుకోలేదు, బత్రిమలాడగా…ఆడగా సరేనంది సుభద్ర. సెలవులు కదా, కాలేజీ వెనుకనున్న గుబురుల్లో కలుసుకుందామంది. కలుసుకున్నారిద్దరూ. ముద్దు పెట్టుకోడానికి ముందు ధైర్యం కోసం సిగరెట్‌ తాగాడు. ఆతృత. తెలియని ఒత్తిడి. పొగ గుండెల్ని ఎగదన్నింది. ముక్కులోంచి బయటికి వచ్చింది. ఒకటే దగ్గు. కళ్ళంట గిర్రున నీళ్ళు తిరిగాయి. పెద్దగా దగ్గాడు.
‘‘ఎవరక్కడ? ఎవరదీ?’’ కేకేసుకుంటూ, చేత్రికర్రను నేలకు కొడుతూ వాచ్‌మాన్‌ పరిగెత్తుకొస్తోంటే, భయంతో గోడదూకి పారిపోయింది సుభద్ర. అలా పారిపోయిన సుభద్ర ఏదీ? ఎక్కడ? ఎవరికి తెలుసు?
తెల్లారిపోయింది. హోటల్‌కి చేరుకున్నాడతను. తలంటుపోసుకున్నాడు. కొత్తబట్టలు వేసుకున్నాడు. టిఫిన్‌ చేసి, ఊరికి అటు వెళ్దామా? ఇటు వెళ్దామా? అని ఆలోచనలో పడ్డాడు. అటు వెళ్తే కోడిపందాలు ఆడవచ్చు. ఇటు అయితే లాటరీ, పేకాటలూ ఆడుకోవచ్చు. కోడిపందాలు తర్వాత, ముందు పేకాడుదాం అనుకున్నాడతను. ఇటుగా నడిచాడు. కొబ్బరితోటలో గుంపులు గుంపులుగా పేకాడుతున్నారంతా. పిల్లలు లాటరీలు ఆడుతున్నారు.
‘‘పెద్దబజార్‌! చిన్నబజార్‌! లక్కీసెవెన్‌’’ అరుస్తున్నారు. 
అతను లక్కీ సెవెన్‌ మీద వందరూపాయలు కట్టాడు. ఓడిపోయాడు. నవ్వుకుని ఆనందించాడు. ఓడిపోవడం ఇంత ఆనందంగా ఉంటుందని ఇప్పుడిప్పుడే తెలుస్తోందతనికి. ఆ ఆనందం కోసం అతను వెయ్యి రూపాయలు వరకూ ఓడిపోయి వెను తిరిగాడు. రాత్రి నిద్రలేదేమో! నిద్ర ముంచుకొచ్చింది. భోజనం చేసి పడుకున్నాడు. లేచేసరికి సాయంత్రం అయింది. ఫస్ట్‌షో సినిమా వేళయిందంటే థియెటర్‌కి పరిగెత్తాడు. పెద్దహీరో సినిమా. దిగువ తరగతి టిక్కెట్లకోసం కొట్టుకుంటున్నారక్కడ. బాల్కనీ టిక్కెట్ల కౌంటర్‌ దగ్గర పెద్దగా జనం లేరు. అయినా అక్కడ టిక్కెట్టు తీసుకోవడం అతనికి ఇష్టం లేదు. దిగువతరగతి టిక్కెట్టే కావాలి. చూస్తే అభిమానులతోనే, అభిమానుల మధ్యనే సినిమా చూడాలి. ఆ థ్రిల్లే వేరు. వయసు మరచి కౌంటర్‌లోకి దూసుకుపోయాడు. ముందు వెనుకలయ్యాడు. కిందు మీదులయ్యాడు. గింజులాడాడు. ఆఖరికి టిక్కెట్టు సాధించాడు. చేతిలోని టిక్కెట్టును ఆనందంగా చూసుకుంటూ, చిరిగిన షర్టును పట్టించుకోలేదతను. సినిమా బాగా లేదు. కాని, అభిమానుల కేరింతలు బాగున్నాయి. ఈలలూ, చప్పట్లూ బాగున్నాయి. ఇంటర్వెల్‌లో సోడా తాగుతోంటే, పద్మనాభం దగ్గరగా వచ్చాడు. కళ్ళల్లో కళ్ళు పెట్టి చూశాడు.
‘‘నువ్వు మా కృష్ణమూర్తివి కదూ? హైదరాబాద్‌లో ఉంటున్నావు కదూ?’’ అడిగాడు. తను పద్మనాభాన్ని గుర్తుపట్టాడుగాని, వాడు తనని గుర్తుపట్టలేదు. అనుమానంతో చూస్తున్నాడు.
‘‘రారా! ఈయన కృష్ణమూర్తేంటి? వాడేంటీ? వాడి హోదా ఏంటీ? ఇలా చిరిగిన షర్టూ, నేలక్లాసు టిక్కెట్టూ…’’ అంటూ పద్మనాభాన్ని లాక్కుపోయాడు వాళ్ళ బావమరిది. వెళ్ళిపోతున్న వాళ్ళని చూసి సన్నగా నవ్వుకున్నాడతను. పద్మనాభం ఇంటర్లో ఎలా ఉన్నాడో ఇప్పుడూ అలాగే ఉన్నాడు. కాకపోతే బొజ్జ పెంచేశాడు. జుత్తు పూర్తిగా నెరసిపోయింది. తనలా రంగు వేసుకోవడం లేదనుకున్నాడతను.
సంక్రాంతి. సరికొత్త దుస్తులు వేసుకున్నాడు మళ్ళీ. రామాలయానికి వెళ్ళాడు. చిన్పప్పుడు అదే రాముడు బొమ్మ చాలా పెద్దదిగా అనిపించేది, ఇప్పుడదే బొమ్మ చిన్నదిగా అనిపిస్తే, ఏదోలా అయిపోయాడు. పులిహోర ప్రసాదం అందుకుని స్తంభాన్ని ఆనుకుని కూర్చున్నాడు. కళ్ళు మూసుకున్నాడు. అప్పట్లో పండగపూటా అమ్మా, తనూ వచ్చేవారు ఆలయానికి. ఇలాగే ప్రసాదం తీసుకునేవారు. అమ్మ స్తంభాన్ని ఆనుకుని కూర్చుంటే, తానేమో స్తంభం చుట్టూ పరిగెడుతూ తిరిగేవాడు. అది గుర్తు రావడం ఆలస్యం, ప్రసాదాన్ని పిడికెట బిగించి, స్తంభం చుట్టూ పరుగుదీశాడతను.
‘‘ఏంటండీ చిన్నపిల్లాడిలా?’’ నవ్వాడు పూజారి. సిగ్గుపడ్డాడతను. సంక్రాంతి పూటా పెరుగుగారెలు తినాలనేది అమ్మ. వెళ్ళి హోటల్లో మూడు ప్లేట్లు పెరుగుగారెలే తిన్నాడు. భోజనం చెయ్యలేదు. అమ్మ గుర్తు రావడంతో ఊరిలో ఇల్లు గుర్తు వచ్చింది. అమ్మేశారప్పట్లో. పుట్టి పెరిగిన ఇల్లు చూడాలనిపించింది. నడిచాడటు. ఊరు వదలిపెట్టి, నలభై ఏళ్ళయింది. సినిమా ధియోటర్లలోనూ, దుకాణాల్లోనూ మార్పు వచ్చిందిగాని, వీధుల్లోనూ, అక్కడి ఇళ్ళల్లోనూ ఎలాంటి మార్పూ లేదు. పైగా శిథిలమైపోతున్నాయి. శిథిలమవ్వడం మార్పు కాదుకదా? అనుకున్నాడతను. నాలుగైదు వీధులు తిరిగాడు. అయిదారు మలుపులు తిరిగాడు. ఇంటికి చేరుకున్నాడు. అప్పట్లో పెంకుటిల్లు. కొన్నవాళ్ళు దాన్ని డాబా చేశారు. నిలబడి చూస్తోంటే, తనని గమనించిన, ఆ ఇంటాయన-
‘‘రండి, లోపలికి వచ్చి చూడండి.’’ అన్నాడు.
‘‘మీకు మా బావమరిది చెప్పినట్టున్నాడు, ఇల్లు అమ్మకానికి పెట్టాను. పిల్లలిద్దరూ అమెరికాలో సెటిలయ్యారు. మా ఆవిడపోయి మూడేళ్ళయ్యింది. ఒంటరిగా నేనిక్కడ ఉండడం పద్ధతి కాదంటున్నారు పిల్లలు, అక్కడికి రమ్మని ఒకటే గోల. వెళ్ళిపోదామనుకుంటున్నాను, ఇల్లు చూడండి.’’
ఇల్లు కొనుగోలు చేసేందుకు వచ్చాననుకుంటున్నాడు. అనుకోనీ, అవకాశం దొరికిందని ఇంట్లోకి ప్రవేశించాడతను. చూడసాగాడు. అంతా అయోమయంగా ఉంది. అప్పట్లో పెద్దహాలు ఉండేది. హాల్లో వాలుకుర్చీలో నాన్న కూర్చుని ఉత్తరరామాయణం పారాయణం చేసేవారు. రామాయణం పారాయణం చేస్తే వర్షాలు కురుస్తాయనేవారు. కురిశాయో లేదో గుర్తు లేదుగాని, నాన్న చదివిన వాక్యాలూ, వర్ణనలూ బాగా గుర్తున్నాయి. వాటిని గుర్తు చేసుకుంటూ నడుస్తున్నాడతను. అటు చావిడిని అలాగే ఉంచారు. చావిడిలో నేలలో పాతినరోలు అలాగే ఉంది. వాడుతున్నట్టు లేరు. మట్టికూరుకుపోయి నల్లగా ఉందది. కూర్చున్నాడక్కడ. దగ్గరగా ఉన్న కర్ర ముక్క అందుకున్నాడు. దానితో పొడిచి పొడిచి రోటిలోని మట్టిని పెళ్ళగించసాగాడు. రోటిని తవ్వుతోంటే ఎగిరి వచ్చి పడిందో నాణెం. వాలులోకి అది పరుగుదీస్తోంటే అందుకుని చూశాడు. 1975నాటి రూపాయినాణెం. అక్క కూతురికి బోగిపళ్ళుపోసినప్పటి నాణెం. పళ్ళతోపాటు నాణెలు కలిపి పోశారిక్కడే! అప్పట్లో దొరకలేదు పిల్లలకి. ఇప్పుడు దొరికిందనుకున్నాడు. రూపాయినాణెన్ని తేరిపారజూస్తూంటే ఇంటాయన వచ్చాడు. అతన్నీ, రోటి నుంచి తవ్వి తీసిన మట్టినీ, అతని చేతిలోని నాణె న్నీ చూసి భయాందోళనలు చెందాడు.
‘‘ఏంటిది? ఏం చేస్తున్నారు మీరు? అసలు ఎవరు మీరు? లేవండి, లేవండిక్కణ్ణుంచి. నడవండి, బయటకు నడవండి.’’ కసిరాడు. అతను రూపాయినాణెన్ని పట్టుకుని పరుగులాంటి నడకతో ఇంటి బయటికి వచ్చాడు. మలుపు తిరిగి, తప్పించుకున్నాడక్కణ్ణుంచి. రాత్రంతా ఆ
నాణెన్ని చూస్తూ గడిపేశాడు. 
తెల్లారింది. కనుము. ఒళ్ళంతా నొప్పులనిపించాయి. జ్వరం వచ్చినట్టనిపించింది. హోటల్‌ ఖాళీ చేసి వెళ్ళిపోదామనిపించింది. ఆ మాటే అంటే…హోటల్‌ కుర్రాడు నవ్వాడు. అన్నాడిలా.
‘‘కనుముపూటా కాకికూడా బయల్దేరదు సార్‌! రేపెళ్ళండి.’’ అన్నాడు. ఉండిపోయాడతను. సాయంత్రం రూంలో ఉండలేక బయటపడ్డాడు. పశువులన్నీ పచ్చని ముఖాలతో, బొట్లతో చూడముచ్చటనిపించాయి. పరిగెత్తుకుని వెళ్ళి, వాటిని చేత్తో నిమిరి వచ్చాడు. రోడ్డు మీద రథం ముగ్గు వేస్తున్నారు అమ్మాయిలు. చూసుకోలేదు, తొక్కబోయాడు.
‘‘చూసుకుని నడవండిసార్‌.’’ హెచ్చరించారు.
‘‘సారీ’’ చెప్పాడతను. 

చేతులు వెనక్కి కట్టుకుని, గతంలోకీ, భవిష్యత్తులోకీ తొంగి చూస్తూ నడవసాగాడు. జ్ఞాపకాల చిరుగంటలు గుండెల్లో మోగుతోంటే, వాటికి అనుగుణంగా చిందేయాలనిపించింది. వేశాడతను, సిగ్గుపడలేదు.
Unknown's avatar

About gdurgaprasad

Rtd Head Master 2-405 Sivalayam Street Vuyyuru Krishna District Andhra Pradesh 521165 INDIA Wiki : https://te.wikipedia.org/wiki/%E0%B0%97%E0%B0%AC%E0%B1%8D%E0%B0%AC%E0%B0%BF%E0%B0%9F_%E0%B0%A6%E0%B1%81%E0%B0%B0%E0%B1%8D%E0%B0%97%E0%B0%BE%E0%B0%AA%E0%B1%8D%E0%B0%B0%E0%B0%B8%E0%B0%BE%E0%B0%A6%E0%B1%8D
This entry was posted in వార్తా పత్రికలో and tagged . Bookmark the permalink.

Leave a comment

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.