|
‘పాండవ వనవాసం’
చరిత్ర
ఎన్టీఆర్ నటించిన పౌరాణికాలు పలు భాషల్లోకి అనువాదమై అక్కడ కూడా విజయఢంకా మోగించాయి. ‘పాండవ వనవాసం’ సినిమా బెంగాల్‌లో అనువాదమై అక్కడ శతదినోత్సవ వేడుకను జరుపుకోవడం విశేషం. 1965లో తెరకెక్కిన ఈ సినిమాకి రూ.పది లక్షల ఖర్చయింది. విడుదలైన 40 ఏళ్ళకు జీ టీవీ రూ. 50 లక్షలకు శాటిలైట్ హక్కులను సొంతం చేసుకుంది. అంటే పెట్టుబడిని మించి ఐదింతలు లాభం తెచ్చిపెట్టింది. ఈ రికార్డు ఇండియాలోనే మరెవ్వరికీ లేకపోవడం విశేషం.
మహానటుడు నందమూరి తారక రామారావు నటజీవితంలో ఎన్నో తరగని, చెరిగిపోని రికార్డులున్నాయి. వాటిలో కొన్నింటిని ఆయన 19వ వర్ధంతి సందర్భంగా ఓసారి గుర్తు చేసుకుందాం. ఎన్టీఆర్‌ను సూపర్‌స్టార్‌గా నిలిపిన ‘పాతాళభైరవి’(1951) నుండి ఆయన నటించిన పలు చిత్రాల ద్వారా చిత్ర సీమలో రికార్డులను నమోదు చేశారు. సరిగ్గా యాబై ఏళ్ళ క్రితం ఎన్టీఆర్ నెలకొల్పిన అరుదైన రికార్డ్‌ను ఈ ఐదు పదుల కాలంలో ఎవరూ అధిగమించలేకపోవడం గమనార్హం. ఇది కేవలం తెలుగునాడుకే సంబంధించిన విషయం కాదు. యావత్ భారతదేశంలోనూ ఎవరికీ సాధ్యపడని రికార్డ్‌ను ఆయన 50 ఏళ్ళ క్రితమే సునాయాసంగా సాధించారు. ఒక్క సినిమా చెయ్యడానికే మీనమేషాలు లెక్కిస్తున్నారు ఇప్పటి మన స్టార్ హీరోలు. అలాంటిది నంబర్‌వన్ హీరోగా ఉంటూ 1965లో 12 సినిమాల్లో నటించారు ఎన్టీఆర్. వాటిలో కొన్ని పౌరాణికాలు, కొన్ని జానపదాలు ఉండడం విశేషం. ఈ పన్నెండు సినిమాలు అర్ధశతదినోత్సవాలు జరుపుకోగా, ఎనిమిది సినిమాలు (నాదీ ఆడజన్మే, పాండవ వనవాసం, మంగమ్మ శపథం, తోడూ నీడ, దేవత, వీరాభిమన్యు, సి.ఐ.డి, ఆడబ్రతుకు) డైరెక్ట్‌గా శతదినోత్సవ వేడుకలు జరుపుకున్నాయి. ఆ ఏడాదే విడుదలైన ‘దొరికితే దొంగలు’ తెలుగువారికి తొలి సైంటిఫిక్ ఫిక్షన్ సినిమా. 92 రోజులు ఆడిందా సినిమా. ‘సత్యహరిశ్చంద్ర, ‘ప్రమీలార్జునీయం’, ‘విశాల హృదయాలు’ కూడా అర్ధశత దినోత్సవాలు జరుపుకోగా వీటికి ఒక్కవారం గ్యాప్‌లో విడుదలైన ‘నాదీ ఆడజన్మే’, ‘పాండవ వనవాసం’ ‘ఆడబ్రతుకు’ చిత్రాలు 25 వారాలు ప్రదర్శితం కాగా ‘వీరాభిమన్యు’ చిత్రం 156 రోజులు ఆడింది. ఏడాది కాలంలో ఆయన నటించిన డజను సినిమాలు ఈ విధంగా రికార్డు సృషించాయి. ఎన్టీఆర్ తర్వాత ఆయనకంటే మిన్నగా డజనుకు పైగా సినిమాల్లో నటించిన హీరోలున్నారు. కానీ ఏ ఒక్కరూ ఒకే ఏడాది ఎనిమిది సినిమాలు వంద రోజుల వేడుక జరుపుకోవడం అన్న రికార్డ్‌ను అధిగమించలేకపోయారు. యాబై ఏళ్ళుగా ఎన్టీఆర్ పేరిట ఈ రికార్డ్ నిలిచి ఉండడం తరిగిపోని, చెరిగిపోని ఎన్టీఆర్ రికార్డ్‌లకు ఓ నిదర్శనం. భవిష్యత్తులోనూ ఈ ఘనత చెక్కు చెదరక చరిత్ర పుటల్లో నిలిచే ఉంటుందని చెప్పొచ్చు.
చెక్కు చెదరని ఇమేజ్
ఎన్టీఆర్ రికార్డ్‌లానే ఇమేజ్ కూడా చెక్కు చెదరనిది. అందుకు మరో నిదర్శనం ఉంది. షమ్మీ కపూర్ హీరోగా తెరకెక్కిన ‘చైనా టౌన్’ సినిమాను 1969లో ‘భలే తమ్ముడు’గా రీమేక్ చేశారు. దాదాపు అదే తరహా కథాంశంతో 1978లో అమితాబ్ బచ్చన్ హీరోగా రూపొందిన ‘డాన్’ చిత్రాన్ని మరుసటి ఏడాది ఎన్టీఆర్‌తో తెలుగులో ‘యుగంధర్’గా నిర్మించారు, ఈ రెండు సినిమాలను తమిళంలో రీమేక్ చెయ్యగా ‘చైనా టౌన్’లో ఎమ్జీఆర్, డాన్ రీమేక్‌లో రజనీకాంత్ అభినయించడం గమనార్హం. అమితాబ్‌ని స్టార్‌గా నిలిపిన ‘జంజీర్’(1973) సినిమాను ఎన్టీఆర్ హీరోగా ‘నిప్పులాంటి మనిషి’ నిర్మిస్తే తెలుగులోనూ పెద్ద విజయం సాధించింది. ఆ సమయంలో ఎన్టీఆర్ వయసు 52 కాగా, అమితాబ్ వయసు 35 సంవత్సరాలే. అదే 52 ఏళ్ళకు అమితాబ్ క్యారెక్టర్ ఆర్టిస్ట్ రోల్స్‌కి దిగిపోయారు. ఎన్టీఆర్ చివరిదాకా నంబర్‌వన్ హీరోగా కొనసాగడం విశేషం. సాంకేతిక పరిజ్ఞానం అభివృద్ది చెంది ఈ రోజుల్లో ఓ సినిమా ఖండాంతరాలు వెళ్ళడం విశేషం కాదు. సరైన ప్రచార సౌకర్యం లేని ఆ రోజుల్లో ఎన్టీఆర్ సినిమాలు పరభాషల వారినీ ఆకర్షిస్తూ మెప్పించడం అసలైన ఘనత.
– కొమ్మినేని వెంకటేశ్వరరావు
|

