ఆంగ్లంలో ఆదిశంకరుల కవితా వైభవం
- -కె.బి.గోపాలం
- 17/01/2015

సౌందర్య లహరి
(శంకర భగవత్పాదుల
రచనకు ఆంగ్లంలో
అనువాదం, వ్యాఖ్యానం)
డా.లంక శివరామప్రసాద్,
పేజీలు: 140,
వెల: రూ.250/-
ప్రతులు అన్ని పుస్తకాల అంగళ్లలో
ఆదిశంకరుల రచనలు, వ్యాఖ్యానాలు, భక్తులకు, అనురక్తులకు మార్గదర్శకాలు. ఒక్క సౌందర్య లహరికే సంస్కృతంలోనే 35కు పైబడి విస్తృత వ్యాఖ్యానాలున్నాయి. కొన్ని రచనలను గురించి ఎంత చర్చించినా కొత్త అర్థాలు పుడుతూనే ఉంటాయి.
శంకరులు వారణాసిలో ఉండగా, సకాయముగ కైలాసానికి, శివసేవార్థము వెళ్లిరట. అక్కడ గోడ మీద ఈ రచన ఉందట. శంకరులు 41 శ్లోకాలు చదివేలోగా గణపతి మిగతావాటిని తుడిపివేసినాడట. ఇది మానవ మాత్రులకు అందగూడని రచనయని భావమట. కథ సంగతి ఎట్లున్నా సౌందర్య లహరిలో 100 శ్లోకాలున్నాయి. 41 శ్లోకాలు, గహనమయిన మంత్ర, యంత్ర విషయాలను చెపుతాయి. కడమలి అమ్మవారి సౌందర్యమును రకరకాలుగ వర్ణించి చెప్పినవి. అన్నింటిలోనూ ఆదిశంకరుల శైలి కొట్టవచ్చినట్టు కనబడుతుంది. ప్రాచీన పండితులు కూడ ఇదే మాట అన్నట్లు తెలియవస్తుంది.
సౌందర్య లహరి శ్లోకాలను అంత సులభంగా అర్థంచేసుకోవడం కుదరదేమో! ఇందులోని 17వ శ్లోకాన్ని పారాయణం చేస్తే, జ్ఞానం కలుగుతుందట. 33వ శ్లోకంతో లక్ష్మి అనుగ్రహిస్తుందట. ఫలితాల సంగతి పక్కనబెట్టి కేవలం రచన, అలంకారం, పదగుంఫనం లాంటి లక్షణాలను ఆస్వాదించేందుకు కూడ ఈ రచనను చదవవచ్చును. శంకరుల సంస్కృతము సాటి లేనిది!
వృత్తిపరంగా అనుభవ వైద్యులు శివరామప్రసాద్‌గారు, సౌందర్యలహరీ శ్లోకాలకు ప్రతిపదార్థము, అనువాదములతోబాటు కొంతపాటి వ్యాఖ్యానాన్ని కూడా జతచేసి, ఇంగ్లీషులో అందించారు. నాగరి లిపిలో శ్లోకం, తరువాత తెలుగు అక్షరాలలో అదే శ్లోకం, ఇంగ్లీషు అక్షరాలలో శ్లోకం, ఆ తరువాత ఇంగ్లీషు కవితా రూపం, ప్రతిపదార్థాలు ఇచ్చారు. బాగుంది. అక్కడే శ్లోకం యొక్క భావార్థాన్నికూడా నాలుగు పంక్తులలో యిచ్చిఉంటే మరింత బాగుండేది. పేజీకి ఒకటిగా శ్లోకాలను ఏర్పాటుచేశారు. ఇచ్చిన వ్యాఖ్యానం అదనపు సంగతులను చెప్పింది.
పుస్తకం ముందు, వెనుక మరెన్నో ఆసక్తికరమైన అంశాలను పొందుపరిచారు. అక్కడే పాఠకులకు సంస్కృతంతో పరిచయం చేయించే ప్రయత్నం చేశారు. నవరత్నాలను గురించి, ఆదిశంకరుల గురించి, మరెన్నో అంశాల గురించి ఇచ్చిన అంశాలు ఆసక్తికరంగా ఉన్నాయి.
కవర్ పేజీల మీద/ లోపల ప్రఖ్యాత కార్టూనిస్ట్ జయదేవ్‌గారి రేఖాచిత్రాలు ఈ బుక్‌లోని స్పెషల్ అట్రాక్షన్స్. జయదేవ్‌గారు ఇటువంటి చిత్రాలు యింతకుముందు ఎక్కడా వేసినట్టులేదు. ఇది ఇంగ్లీషు పుస్తకం! గుర్తుంచుకోవాలి.

