భజన చేసే విధము తెలియండీ…
- – భాస్కర్. యు.
- 19/01/2015
ఇటీవలికాలంలో- జంటనగరాల్లో జరుగుతున్న పుస్తకావిష్కరణల జాతర చూస్తుంటే ఆశ్చర్యమేస్తోంది. రోజురోజుకు వీటి జోరు పెరుగుతోంది. ప్రచారం పిచ్చి పరాకాష్టకు చేరుకొంటోంది. కవుల దగ్గర ఇంత డబ్బుందా? అనే ఆలోచన కలవరపెడుతోంది.
ఇవాళ పుస్తక ముద్రణతోపాటు ఆవిష్కరణ సభ, ఆ తర్వాత జరిగే సభానంతర కార్యక్రమం ఖర్చు దాదాపు యాభై వేల రూపాయలకు చేరిపోయిందనడం సత్యదూరం కాదు. కవిగాని, రచయితగాని ఈ మాత్రం ఖర్చును భరించడం సామాన్యంగానే మారింది. నగరంలోని అధిక శాతం రచయితలు బాగా చదువుకున్నవారు, మంచి ఉద్యోగాలు చేస్తున్నవారే కావటాన వారికిది లెక్కకాదు.
ఆవిష్కరణ సభ జరిగి పుస్తకం బయటికొస్తుంది. ఇక అది మహాగ్రంథంగా, రచయిత మహాకవిగా గుర్తింపు పొందాలి. నిస్సందేహంగా ఆ ప్రయత్నం కూడా జరుగుతుంది. సమీక్షకులు అస్మదీయులే కదా! ఇదంతా సజావుగా జరిపించడానికి, జరగడానికి సాయంత్రాలున్నాయి. కూర్చోవడాలు, లేవడాలున్నాయి. అనుకూలమైన అడ్డాలున్నాయి.
రకరకాల కవిత్వాలు. అనేక గ్రూపులుగా సాహితీమిత్రులు. సంప్రదాయ అభ్యుదయ, విప్లవ, మైనారిటీ, స్ర్తివాద, దళితవాద ధోరణులు. వీటికితోడు స్థిరపడిన ‘రెక్కలు’ ‘నానీ’ ప్రక్రియలు. అంతరంగాల్లో ఎవరూ ఎవరినీ ఖాతరుచేయరు. ఎవరికివారే గొప్ప. వీరంతా గొప్ప నటులు కూడా. అందరూ అన్ని సభలకు హాజరవుతారు. రచయితను వాటేసుకుంటారు. శుభాకాంక్షలు తెలియజేస్తారు. సుహృద్భావం ప్రకటిస్తారు. ఎలాగో వక్తల రెండు గంటలపాటు ఊకదంపుడు ఉపన్యాసాలను భరిస్తారు. సభానంతర కార్యక్రమం ముగిశాక మళ్లీ ఆ కవిని గాని, అతని పుస్తకాన్ని గాని తలచుకుంటే ఒట్టు. ఇది వారికి తెలిసిన మర్యాద.
ఇక వక్తల గురించి- అన్ని సభలనూ వీరే అలంకరిస్తుంటారు. వీరు వివిధ రంగాలవారై ఉంటారు. నిజానికి వీరికీ, మాట్లాడవలసిన అంశానికి సంబంధమే వుండదు. ఎవరికి తెలిసింది వారు వాగేస్తారు. తాత బోడినెత్తికీ, నానమ్మ మోకాలి చిప్పకూ ముడివేస్తుంటారు. కవిగారిని ఏ మేరకు మునగ చెట్టెక్కించాలో అంతవరకూ ఎక్కిస్తారు. మహాకవి లక్షణాలన్నీ ఆయనలోనే ఉన్నాయంటారు. ఇలా ప్రతిరోజూ ఏదో ఒక వేదికను ఎక్కుతూనే వుంటారు. కానీ మర్నాడు నిన్నటి కవినిగాని, అతని కవిత్వాన్నిగాని మాటమాత్రంగానైనా ఎక్కడా ప్రస్తావించరు. అది వారి హోదాకు చిన్నతనం అనుకుంటారు.
ఇక సమీక్షకుల వంతు వస్తుంది. వ్యాసకర్తలు నడుము బిగిస్తారు. వీళ్లు పుస్తకాన్ని చేలోపడ్డ ఆబోతు అక్కడక్కడా గడ్డిపరకలను కొరికినట్టు కొన్ని పేజీలు తిప్పుతారు. అలాగే ముందుమాటల్లోని కొన్ని వాక్యాలను, వెనుక మాటల్లోని మరికొన్ని వాక్యాలను తెలివిగా వాడుకుంటూ అక్కడక్కడ ప్రాచీన కవుల ప్రస్తావనలు, లేక ఆధునిక కవుల కొటేషన్స్‌ని ఉటంకిస్తుంటారు. నిజానికి తాము ఏమి చెప్పదలచుకున్నారో, వారికి ఏమి అర్థమైందోగానీ చెప్పరు. ముక్కును చూపడానికి చేతితో తలను చుట్టి హైరానా పడతారు. ఏదీ సూటిగా ఉండదు. మరికొందరైతే తాము ఫలానా పత్రికలో రాసిన సమీక్షవల్లే ఫలానా కవికి అవార్డు వరించిందని గొప్పలు చెప్పుకుంటూ వుంటారు.
ఆ తర్వాత ఇంటర్వ్యూలు. ఇటీవలి కాలంలో ఇంటర్‌వ్యూల జోరు బాగా పెరిగింది. వ్యక్తి ఎవరు? ఏ కోణంలో ప్రసిద్ధుడు అనేది ముఖ్యం కాదు. ఇంటర్వ్యూలు జరుపుతుంటారు. సొల్లు రాతలతో పేజీలు నింపిపడేస్తారు. పత్రిక కొన్న పాపానికి పాఠకులు దాన్ని ఒక శాపంగా భరిస్తుంటారు. అంతటితో ఇది ఆగదు. ఇలాంటి ఇంటర్వ్యూలనీ కలిపి ఒక పుస్తకం మార్కెట్లోకి వస్తుంది. ఇంటర్వ్యూలు చేసేవారికి ఇదొక ఆటవిడుపు. పబ్బం గడిచిపోతూ వుంటుంది.
ఫైనల్‌గా పీఠికాధిపతుల గురించి- వీరిది చాలా పెద్ద లెక్క. ఒకవైపు కవిని పిండేస్తూ మరోవైపు తమ పాపులారిటీని పెంచుకుంటారు. ఒకే ఒక్క పుస్తకంతో దేశానే్నలేయాలని భావించే అమాయకులను వీరు చేరదీస్తుంటారు. విషయానికి అందని పీఠికలు రాస్తారు. పుస్తకాలు బయటికి వస్తాయి. కవుల స్వస్థలాల్లో ఆవిష్కరణోత్సవాలు. పీఠికాధిపతికి ప్రముఖ స్థానం. ఆయన రాజధాని నుండి రావాలి. రాను పోను ప్రయాణ ఖర్చులు. హోటల్ ఖర్చులు. ఇవన్నీ కవి భరిస్తాడు లేదా అతని మిత్ర బృందం భరిస్తుంది. సభలో కవిగారి కవిత్వం సంగతేమోగాని పీఠాధిపతిని మాత్రం నెత్తిన పెట్టుకొని ఊరేగిస్తారు. రాత్రికి తీర్థప్రసాదాలతో కార్యక్రమం దిగ్విజయంగా ముగుస్తుంది.
ఇక అవార్డులు- ఇదంతా ఓ మాయ. సెలక్షన్ కట్టుదిట్టంగా జరుగుతుందన్న భ్రమ కలిగిస్తారు. చివరకు ఏ ఆశ్రీతుడికో కట్టబెడతారు. ఏ మాత్రం నిజాయితీ లేని ఏడుపు. మళ్లీ అవార్డు ప్రదానోత్సవ సభ. మళ్లీ హడావుడి, హంగామా. పూర్వకవులకు, ఇవాల్టి కవులకు ఉన్న తేడా ఏమిటంటే, పూర్వకవులు ఎంత వెంపర్లాడినా పాపులారిటీ దొరికేది కాదు. వారిని వారి కవిత్వమే నిలబెట్టాలి. ఇవాళ కవులను త్రిశంకుస్వర్గంలో నిలపడానికి అనేక మార్గాలేర్పడ్డాయి. సాహిత్యం, సాహిత్య సభలు, సాయంత్రాలు కాలక్షేపం చేయడానికి వేదికలయ్యాయి.
సామర్థ్యం లేని కవి పొగను పోగేస్తాడు. ఆ పొగను బొమ్మగా విగ్రహంగా, చివరకు స్వర్ణశిల్పంగా భ్రమింపజేయడానికి అనేకమంది మాయగాళ్లున్నారు. కాని చివరకు అది పొగలాగే జారిపోతుంది. కవీ వుండడు, వాడిచుట్టూ చేరిన భజన బృందం మిగలదు. నిజమైన సాహిత్య ప్రేమికులకు మాత్రం చేదు అనుభవాలు కలుగుతాయి.

