|
‘‘పరిపూర్ణమైన సంగీత దర్శకులు కె.వి.మహదేవన్‌గారు. అన్ని రకాల పాటలకూ సమర్థవంతంగా స్వరాలు సమకూర్చగలిగే సత్తా ఆయన సొంతం. బాణీలు కట్టడమే కాదు నేపథ్య సంగీతాన్ని అందించడంలోనూ దిట్ట’’ అని అంటున్నారు కె.విశ్వనాథ్. ‘ప్రైవేటు మాస్టార్’ నుంచి వీరిద్దరి కాంబినేషన్‌లో సినిమాలు వచ్చాయి. ‘స్వాతికిరణం’ వరకు ఆ బంధం సాగింది. నేడు కె.వి.మహదేవన్ జయంతి. ఈ సందర్భంగా ఆయనతో ఉన్న అనుబంధాన్ని ఒకసారి గుర్తుచేసుకున్నారు కె.విశ్వనాథ్.
‘‘నన్ను విశ్వం అని పిలిచేవారు. నేను ‘మామా’ అనేవాడిని. నాకే కాదు ఆయన అందరికీ మామ. యూనివర్శల్ మామ. ‘మూగమనసులు’ సినిమాకు ఆదుర్తి సుబ్బారావుగారి దగ్గర నేను సెకండ్ యూనిట్ ఇన్‌చార్జిగా ఉన్నప్పటి నుంచి మహదేవన్ గారితో పరిచయం ఉంది. ఆ చిత్ర సంగీత చర్చలు హైదరాబాద్‌లోని తాజ్‌మహల్ హోటల్లో జరిగాయి. నేను దర్శకుడిని అయ్యాక మామతో కలిసి చేసిన తొలి సినిమా ‘ప్రైవేటు మాస్టార్’. అంతకు ముందే పరిచయం ఉండటంతో ‘కొత్త’ అనే భావన ఇద్దరిలోనూ లేదు. మేమిద్దరం కలిసి పనిచేసిన సినిమాల సంగీత చర్చలన్నీ సినిమా ఆఫీసుల్లోనే జరిగేవి. పాటల కోసం బయటికెళ్లి చర్చించే అలవాటు లేదు.’’ పవిత్రమైన దేవాలయం ‘‘మహదేవన్‌గారితో సంగీత చర్చలు చాలా పవిత్రంగా సాగేవి. చీకులు, బ్రాంది, సిగరెట్ పొగ, బయటి మాటలు… ఇలాంటి వాటికి దూరంగా ఉండేది వాతావరణం. అరచేయి వెడల్పు జరీ సేలం పంచె, సిల్కులాల్చీ (చొక్కా చేతులు రెండూ మడిచేవారు) నుదుటి నిండా చందనంతో చాలా పవిత్రంగా వచ్చేవారాయన. పుహళేంది, లిరిక్ రైటర్, డైరక్టర్, అప్పటికి అందుబాటులో ఉంటే నిర్మాత, తబలా వాయించే మైఖేల్ అక్కడ తప్పక ఉండేవాళ్లం. ఉదయం 10 గంటలకు మొదలుపెడితే మధ్యాహ్నం ఒంటిగంటదాకా, సాయంత్రం నాలుగు నుంచి ఏడుదాకా సాగేవి చర్చలు. రాత్రుళ్లు పనిచేయడమనే మాటకు తావే లేదు.’’ మహానుభావుడు ‘‘రచయితకు స్వతంత్రతనిచ్చి ముందు సందర్భానికి తగ్గట్టు పాట రాయమనేవారు. తెలుగు కాస్త అర్థమయ్యేది. అయినా నేను పక్కనుంచి ఓ సారి ఆ పాటకు అర్థం చెప్పేవాడిని. దానికి తగ్గట్టు ట్యూన్ కట్టేవారు. ‘పత్రికల్లో వచ్చిన ఎడిటోరియల్‌ని ఇచ్చినా మామ ట్యూన్ కట్టగలరు’ అని అందరూ గొప్పగా, ఒకింత ఆశ్చర్యంగా చెప్పుకునేవారు. రచయిత రాసిన పాటకి ట్యూన్ చేయడమనే ప్రక్రియకు ఒకరంగా ఆద్యుడు ఆయనే. నాకన్నా వయసులో చాలా పెద్దవారు. అందుకే ట్యూను కట్టాక ఏదైనా అభ్యంతరం చెప్పాల్సి వస్తే ‘బాణీ ఏదోలా ఉంది. మీ స్టాంపు లేదు మామా’ అనేవాడిని. ‘ఏం దీనికేమైంద’ని అడిగేవారు కాదు. ‘ఫర్లేదు. రేపు మరలా కూర్చుని చేద్దాం’ అనే చెప్పేవారు. ఎదుటివారికి నచ్చకపోతే వారికి సర్దిచెప్పి ‘మమ’ అనిపించాలనే ప్రయత్నం ఆయన ఎప్పుడూ చేయలేదు. నిరంకుశత్వం అనే మాటకు అక్కడ తావు ఉండేది కాదు. ఎవరికీ ఈగో ఉండదు. ఒక్కమాటలో చెప్పాలంటే ‘వెన్ హి ఈజ్ ఆన్ జాబ్, హి ఈజ్ రియల్లీ ఆన్ జాబ్’. అంతటి మహానుభావుడు.’’ గురువాయూరప్ప.. ‘‘ఎన్ అప్ప గురువాయూరప్ప అనడం ఆయనకి అలవాటు. ఆనందం వచ్చినా, ఆశ్చర్యం అనిపించినా అనేమాట అదొక్కటే. మేం కలిసి చేసిన సినిమాల్లో ‘శంకరాభరణం’ గురించి ఎప్పుడూ చెబుతుండేవారు. నా విజయాన్ని బాగా ఆస్వాదించేవారు. స్వతహాగా మలయాళీ అయినా ‘శంకరాభరణం’ మలయాళంలో విడుదలైనప్పుడు తెలుగు పాటలనే అక్కడా వినిపించారు. తెలుగు పాటల్లో ఉన్న సంస్కృతం వల్ల మలయాళీయులకు కూడా అర్థమవుతుందని ఆయన భావన. అందుకే కేవలం డైలాగులను మాత్రం అనువదించుకున్నారు. ఇటీవల తమిళంలో ఆ సినిమాకు సంబంధించిన ఆడియో విడుదలైంది. బాణీలు పాతవే. అయితే తమిళ పదాలతో పాటలు రాసుకున్నారు.’’ ఆత్మీయంగా.. ‘‘నేను, మామ కలిసి పనిచేసినప్పుడు ఎలాంటి భేషజాలకు తావుండేది కాదు. నేనేదో పెద్ద దర్శకుడినని, ఆయనేదో పెద్ద సంగీత దర్శకుడనే భావన కనిపించేది కాదు. ఇవాళ పెద్ద హిట్లుగా అనిపించే ‘శంకరాభరణం’, ‘సిరివెన్నెల’, ‘స్వాతికిరణం’లాంటి పాటలను కూడా మేము కర్తవ్యనిర్వహణలో భాగంగా త్రికరణశుద్ధిగా చేశామంతే. అదేదో రికార్డులకోసం తపించి చేసిన పని కాదు. మా కాంబినేషన్‌లో వచ్చిన ప్రతి పాటా మాకు ఆత్మసంతృప్తి కలిగిన తర్వాతే సినిమాల్లోకి వచ్చిందనేది వాస్తవం.’’ వాళ్లు ఆశ్చర్యపోయేవారు ‘‘మహదేవన్‌గారి మరో ప్రత్యేకత ఏంటంటే రీ-రికార్డింగ్. ఏకసమయంలో ఒక రీలుకు రీ-రికార్డింగ్ చేసేవారు. ముందుగా ఏ బిట్ ఎన్ని సెకన్లుందో నోట్ చేసుకునేవారు. దేనికి ఏ వాయిద్యం అయితే బావుంటుందో నోట్ చేసుకునేవారు. ఒకటీరెండు సార్లు రిహార్సల్ చేసి నేపథ్యాన్ని అందించేసేవారంతే. అదే బాలీవుడ్‌లో అయితే ప్రతి బిట్‌కూ ప్రత్యేకంగా రీ-రికార్డింగ్ చేసేవారు. మామ రీ-రికార్డింగ్ చేసే విధానం చూసి బాలీవుడ్ వర్గాలు సైతం ఆశ్చర్యపోయాయంటే అతిశయోక్తి కాదు. ఒక్కసారి రీల్‌ను చూస్తే దర్శకుడి కన్నా గొప్పగా గుర్తుపెట్టుకోవడంలో ఆయన దిట్ట.’’ నాలుగు రోజులు ‘‘ఢిల్లీలో అవార్డు అందుకోవడానికి వెళ్లినప్పుడు ఆయనతో కలిసి ప్రయాణం చేశాను. నేను, మహదేవన్‌గారు, ఆయన భార్య, ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం దంపతులు, వాణిజయరాం కలిసే ఢిల్లీ వెళ్లాం. అప్పడు ఓ నాలుగు రోజులు ఆయనతో గడిపే అవకాశం వచ్చింది. ఎవరికి ఎంత మర్యాద ఇవ్వాలో తెలిసిన వ్యక్తి. ఆయన తెలుగువాడు కాదంటే నమ్మడం కష్టమే. ‘మూగమనసులు’లో పాటలు వింటుంటే అచ్చమైన తెలుగు వ్యక్తి స్వరాలు సమకూర్చినట్టు అనిపిస్తుంది. అంతటి ప్రతిభామూర్తి.’’ మహదేవన్‌గారిలాంటి వ్యక్తి ఒకసారి పరిచయమైతే ఆయన్ని వదులుకోవడం చాలా కష్టం. కె.వి.మహదేవన్, పుహళేంది కాంబినేషన్‌లో అద్భుతమైన సంగీతం వచ్చేది. ఒక్క మాటలో చెప్పాలంటే ఆ చేతివేళ్ల మీద సరస్వతి పలికి తీరేదంతే. అంతటి పరిపూర్ణులు వాళ్లు. ‘స్వాతికిరణం’ సంగీత చర్చల్లోనే ఆయన్ని ఆఖరి సారి కలిశాను. ఆ తర్వాత ఆయన పోయారన్న చెడువార్త వినాల్సి వచ్చింది.’’ చల్లా భాగ్యలక్ష్మి |

