|
‘‘పలు సున్నితమైన అంశాలను బొమ్మలాట(పప్పెట్రీ) ద్వారా మనసులకు హత్తుకు పోయేలా చెప్పొచ్చు. మేము ఇప్పటివరకు ఎన్నో సామాజికాంశాలను బొమ్మలాట ద్వారా ప్రజల్లోకి తీసుకొచ్చి చర్చించాం.ఈ మధ్య కాలంలో లైంగిక వేధింపులు, అసభ్యకర మాటలు, సంజ్ఞలు, స్పర్శ వంటి విషయాలను చేపట్టాం. అందులో భాగంగా కొన్ని పాఠశాలలు, కళాశాలల్లో అవగాహనా కార్యక్రమాలు చేపట్టాం. ఈ ప్రయాణంలో అర్థమైంది ఏమిటంటే ఆడవాళ్లపై జరిగే వేధింపులు, అత్యాచారాల వంటి వాటికి అడ్డుకట్ట వేసేందుకు ‘కాలనీ పోలీసింగ్’ అనేది బ్రహ్మాస్త్రం’’ అంటారు స్టెపార్క్ (స్ఫూర్తి థియేటర్ ఫర్ ఎడ్యుకేషనల్ పప్పెట్రీ, ఆర్ట్స్, క్రాఫ్ట్స్) ఫౌండేషన్ వ్యవస్థాపకురాలు పద్మిని రంగరాజన్.
రెండూ ఒకటి కాదు బొమ్మలాట, తోలుబొమ్మలాట ఒకటే అనుకుంటారు. కాని తెర వెనుక ఆడేది తోలు బొమ్మలాట. తెర ముందు ఆడేది బొమ్మలాట. నా బొమ్మల్ని మట్టి, వేస్ట్ కాగితాలు, థర్మకోల్ షీట్స్ వాడి తయారుచేస్తాను. ‘‘పప్పెట్రీ అనేది పిల్లలకే కాదు పెద్ద వాళ్లకీ వినోదాన్ని కలిగిస్తుందనడంలో ఎటువంటి సందేహం లేదు. చదువుకునే రోజుల నుంచీ పరిశోధన, బోధన – ఈ రెండు అంశాలంటే నాకు చాలా ఆసక్తి. కాని అనుకోకుండా ఈ రంగంలోకి వచ్చాను. 2003లో మా బాబు కోసమని కోతి బొమ్మ ఒకటి తయారుచేశాను. ఆ బొమ్మ గురించి స్కూల్లో టీచర్లకు చెప్పాడు. వాళ్లు నన్ను స్కూల్ పిల్లలకోసం మరిన్ని బొమ్మలు చేసిమ్మని అడిగారు. అలా అనుకోకుండా బొమ్మల ప్రపంచంలోకి వచ్చాను. ఆ తరువాత హైదరాబాద్‌లో ఉన్న రామకృష్ణమఠంలో ఇంగ్లీషు బోధించాను. అప్పుడు ఇంగ్లీషు గ్రామర్‌ని బొమ్మలు ఉపయోగించి నేర్పించేదాన్ని. ఇలా చెప్పడం వల్ల విద్యార్థులకి భాష పట్ల ఆసక్తి కలగడమే కాకుండా నేర్చుకున్న విషయాన్ని మర్చిపోకుండా ఉండేవారు. ఒక్క ఇంగ్లీషు భాషకే కాకుండా ఇతర భాషలు వేటినైనా బొమ్మలతో బోధించొచ్చు. అలాగే లెక్కలు, సైన్సులను సులువుగా అర్థమయ్యేలా చెప్పొచ్చు. విద్యాపరమైన అంశాలనే కాకుండా పలు సామాజింకాశాల పట్ల పిల్లలకు, పెద్దలకు అవగాహన కలిగించడంలో బొమ్మలు కీలక పాత్ర పోషిస్తాయి. సమాజంలో మహిళలపై జరుగుతున్న దారుణాలు అరికట్టేందకు బొమ్మల్ని టూల్‌గా చేసుకుని ముందుకెళ్తున్నాం. 2013 నిర్భయ ఘటన జరిగినప్పటి నుంచీ లైంగిక వేధింపుల గురించి కారక్రమాలు చేస్తున్నాం. వీటిలో బొమ్మల ద్వారానే ప్రేక్షకుల్ని ఆలోచింపచేస్తాం. బొమ్మలే ప్రేక్షకుల్ని ప్రశ్నలు అడుగుతాయి. మేము చేసే కార్యక్రమాలు తీర్పునిచ్చినట్టుగా కాకుండా ఎటువంటి చర్యలు చేపడితే బాగుంటుందో ప్రేక్షకులే ఆలోచించేలా రూపొందిస్తాం. ప్నశ్నల ద్వారా ఆలోచింపచేస్తాం… మా కార్యక్రమాలు ఎలా ఉంటాయో ఉదాహరణకు ఒకటి చెప్తాను. ఓ నలుగురు స్నేహితురాళ్లు కలిసి రవీంద్రభారతిలో మహాభారతం పప్పెట్రీషోకి వెళ్దామనుకుంటారు. అందరూ కలిసి ఆ షోకి వెళ్తారు. ఆ బొమ్మలాట ఆసక్తికరంగా సాగుతుంది. ద్రౌపది వస్ర్తాపహరణ ఘట్టం వరకు చూశాక నలుగురూ కలిసి ఇంటికి బయల్దేరతారు. బస్టాపులో బస్‌లకోసం ఎదురుచూస్తుంటారు. వెళ్లిన నలుగురిలో ముగ్గురికి వాళ్లు ఎక్కాల్సిన బస్సులు రావడంతో వెళ్లిపోతారు. తాను ఎక్కాల్సిన బస్ రాకపోవడంతో ఒక్క అమ్మాయే మిగిలిపోతుంది. వంటరిగా బస్టా్‌పలో ఉన్న ఆ అమ్మాయి అత్యాచారానికి గురవుతుంది. పోలీసులకు పిర్యాదు చేసేందుకు వెళ్తే పోలీసుల కఠినమైన ప్రవర్తన ఆ అమ్మాయికి మరింత బాధకలిగిస్తుంది. సమాజం ఆ కుటుంబాన్ని వెలివేసినట్టు చూడడంతో కుటుంబమంతా కలిసి చచ్చిపోవాలనుకుంటారు. సరిగ్గా అదే సమయంలో ఒక మహిళ వచ్చి ఈ కుటుంబానికి అండగా నిలబడి పరిస్థితుల్ని చక్కదిద్దే పని మొదలుపెడుతుంది. – ఇదీ కథ. పౌరాణిక అంశంలో నుంచి నేటి సమాజంలో నెలకొన్న పరిస్థితులకి తగ్గట్టుగా కథనాన్ని రూపొందించి బొమ్మలాట ద్వారా చూపిస్తాం. కాలనీ పోలీసింగ్‌తో క్రాస్ చెక్ వేధింపులు, అసభ్యకర చేష్టలు, మాటలు వంటి తదితర అంశాల గురించి పరిశోధిస్తున్నప్పుడు బోలెడు అంశాలు నా దృష్టికి వచ్చాయి. అయితే వాటిలో ఒక విషయం మాత్రం నన్ను బాగా ఆకట్టుకుంది. అదే ‘కాలనీ పోలీసింగ్’. ఊర్లో లేదా కాలనీల్లో కొత్త వ్యక్తులు వస్తే గుర్తుపట్టడం అక్కడే నివాసముండే వాళ్లకి కష్టమైన విషయం కాదు. అంతేకాక ఆ ప్రాంతంలో జులాయి చేష్టలు చేసే వాళ్లని కూడా గుర్తించొచ్చు. అందుకని కాలనీల్లో ఉండే వాళ్లే ఈ విషయాలపై దృష్టి పెట్టాలి. అప్పుడు ఇటువంటి విషయాలను నివారించగలగడం ఏమంత కష్టమైన పని కాదనేది నా అభిప్రాయం. ‘నా వరకు వస్తే అప్పుడు చూద్దాంలే’ అనే ధోరణి మంచిదికాదు. ఎందుకంటే తీరా మీ వరకూ వచ్చాక మీరేం చేయలేని పరిస్థితుల్లో ఉండొచ్చు. కాలనీ పోలీసింగ్ అనేది ఎంత బాగా పనిచేస్తుందో చెప్పేందుకు మీకో ఉదాహరణ చెప్తాను… మా పప్పెట్రీ టీంలో ఉండే ఇద్దరమ్మాయిలు వాళ్ల కాలనీకి రోజూ ఒకే బస్సులో వెళ్ళేవారు. ఒకరోజు పోకిరీలు ఆ అమ్మాయిల్ని బస్సులోనే వేధించడం మొదలుపెట్టారు. అది గమనించిన బస్సు డ్రైవరు, కండక్టరు, తోటి ప్రయాణికులు ఆ పోకిరీలకు బుద్ధి చెప్పారు. రోజూ చూసే ముఖాలు కావడం వల్ల ఇది సాధ్యమైంది. అందుకే కాలనీ పోలీసింగ్ మంచిదంటాను నేను. మనమూ మారాలి ప్రస్తుతం సమాజంలో నెలకొన్న ధోరణులు చూస్తుంటే ఆడపిల్లల్ని బయటికి పంపించాలంటేనే భయపడుతున్నారు. అఫ్‌కోర్సు కొందరు మగపిల్లలకీ కొన్ని ఇబ్బందులు తప్పడంలేదనుకోండి. ఈ పరిస్థితుల నుంచి బయటపడాలంటే పిల్లల మైండ్‌సెట్‌ను సరిచేసే ప్రయత్నం ఇంటినుంచే ప్రారంభం కావాలి. ఎందుకంటే ఆధునిక ప్రపంచంలో ఎన్నో అంశాలు పిల్లల్ని ఆకర్షిస్తుంటాయి. దానివల్లే తెలిసీ తెలియని వయసులో వాళ్లు పక్కదారులు పడుతుంటారు. మన సమాజంలో ముఖ్యంగా పిల్లల ముందు లైంగిక విషయాల గురించిన ప్రస్తావన తేవడానికి ఇష్టపడరు. కాని మారుతున్న సమాజంతో పాటు మనమూ మారాలి. తొమ్మిదో తరగతి చదువుతున్న కొడుకు లేదా కూతురు ‘ఐ యామ్ ఎట్రాక్టెడ్ టు హర్/హిమ్…’ అని చెప్పడమో, ప్రవర్తించడమో చేస్తే వాళ్లని కోపగించుకున్నా, తిట్టినా ఫలితం ఉండదు. ఆ వయసులో అనేక ఆకర్షణలు ఉంటాయి. అందులో ఇదీ ఒకటి. ‘ఆకర్షణ అనేది సహజం. ఇది చదువుకునే వయసు. బాగా చదువుకుని, ఉద్యోగంలో స్థిరపడితే ఆ తరువాత మిగతా విషయాల గురించి ఆలోచించొచ్చు’ అని సున్నితంగా చెప్పాలి. పిల్లలతో స్నేహంగా ఉంటూ వాళ్ల మనసుల్ని చదవగలిగితే ఆరోగ్యకరమైన సమాజాన్ని తప్పక నిర్మించొచ్చు. ఆ దిశగా మా వంతు ప్రయత్నం చేస్తున్నాం. జెండర్ సెన్సిటివిటీ కార్యక్రమాలు నిర్వహించేందుకు పలు మహిళా సంస్థలతో కలిసి పనిచేయాలనుకుంటున్నాం. ఈ విషయంలో ఇప్పటికే కొందర్ని సంప్రదించాం. మహిళలకు సంబంధించిన అంశాలతో పాటు పరిసరాలు, వ్యక్తిగత పరిశుభ్రత, పర్యావరణం, బాల్యవివాహాలు, భ్రూణహత్యలు, బాలకార్మికులు వంటి తదితర అంశాలను కూడా చేపడుతున్నాం.’’ స్ఫూర్తి సంస్థ ఫోను: 8985759361 నవ్యడెస్క్ ఫోటోలు: విజయ్ |

